శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద కావ్యాన్ని తెలుగులోనే రాశాడు.
‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజునిగా, కన్నడ రాజ్యరమారమణగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు సమాధానమిచ్చాడు. భాషల గొప్పదనం గురించిన చర్చకాదు కానీ, ఉర్దూ భాష, ఉర్దూ కవిత్వం కూడా అటువంటిదే. అసలు నాగరికతలో మనుషులు సాటి మనుషులతో భావాలని పంచుకోవడానికే భాషలు పుట్టాయి. ఒక అర్ధంలో మనుషులని కలిపేవే భాషలు.
‘ఉర్దూ జిసే కహతే హైఁ తెహజీబ్ కా చష్మా హై
వో షక్స్ ముహజ్జిబ్ హై జిస్ కో యే జుబా ఆయీ’
‘ఉర్దూ అని పిలిచే భాష సంస్కృతికి నాగరికతకు చూపు లాంటిది
ఈ భాష తెలిసిన మనిషి సంస్కృతి గురించి తెలిసిన మనిషి’ అని కవి రవీష్ సిద్దిఖి అంటాడు
కవిత్వం భాషతో ముడిపడిన విషయం. మరి భాష సంస్కృతితోనూ, భౌగోళికత తోటీ ముడిపడివున్న విషయం. సంస్కృతి అనగానే దానికి అనివార్యంగా రాజకీయం జత అవుతుంది. ఉర్దూ ఒక భాష కదా.. సంస్కృతికి కంటిచూపు వంటిదని కవులు చెప్పుకున్న ఉర్దూ భాషనీ, దాని అస్తిత్వాన్నీ రాజకీయ విద్వేషపు అంధత్వం గుర్తించ నిరాకరిస్తున్న సమయం ఇది. కొద్ది రోజుల క్రితమే ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక రాజకీయ వేత్త, ఉర్దూ భాష మూర్ఖులు, మూఢులు, సంకుచిత ఉన్మాదులు, ఛాందస వాదుల (కఠ్ముల్లాల) భాష అని శాసనసభలోనే మాట్లాడాడు. రాజకీయవేత్త కూడా అయిన ఒక కవి ఆ మాటలకి ఇలా జవాబు చెప్పాడు.
‘ఏ భాష మీద ప్రేమ రాం ప్రసాద్ ని ‘బిస్మిల్‘ గా మార్చిందో, ఏ భాష మీద ప్రేమ రఘుపతి సహాయ్ ని ‘ఫిరాఖ్ గోరఖ్ పురీ‘ గా మార్చిందో ఆ భాష ఉర్దూ భాష.
బ్రజ్ నారాయణ్ ని ‘చక్ బస్త్‘ గా మార్చిన భాష,, పండిట్ హరిచంద్ ని ‘అఖ్తర్‘ గా మార్చిన భాష,, సంపూర్ణ సింగ్ కాల్రా ని ‘గుల్జార్‘ గా మార్చిన భాష, అది ఉర్దూ భాష.
ఏ భాషలో భగత్ సింగ్ ఉత్తరాలు రాశాడో, ఏ భాషని గాంధీజీ స్వయంగా హిందుస్తానీ భాష అని చెప్పేవాడో, నెహ్రూ, పటేల్ లు ఏ భాషని అభిమానించే వారో ఆ భాష ఉర్దూ భాష.
ఏ భాష ‘ఇంక్విలాబ్ జిందాబాద్‘ నినాదాన్ని అందించిందో, ఏ భాష ‘జై హింద్‘ నినాదాన్ని అందించిందో, ఏ భాష ప్రేమ గీతాలని, తిరుగుబాటు విప్లవ గీతాలని అందించిందో ఆ భాషని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘మూఢుల, మతోన్మాదుల భాష‘ అని మాట్లాడుతున్నాడు.
ఎవరైనా అతనికి చెప్పండి, ఉర్దూ భాష మూఢుల, మతోన్మాదుల భాష కాదని, అది కవీ, రచయితా ‘ఆనంద్ నారాయణ్ ముల్లా‘ మాట్లాడిన భాష అని.
‘ముల్లా‘ బనా దియా హై ఇసే భీ మహాజ్ ఏ జంగ్
ఏక్ సుల్హ్ కా పయాం థీ ఉర్దూ జుబాన్ కభీ
యుద్ధ భూమి తనని కూడా ముల్లా గా మార్చివేసింది
ఉర్దూ భాష ఒకనాడు శాంతి సందేశమై ఉండింది అని లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కవీ, రచయితా ఆనంద్ నారాయణ్ ముల్లా రాసిన కవిత పంక్తులని ఆ కవి గుర్తు చేశాడు.
ఉర్దూకు వ్యతిరేకంగా, అది ఛాందస వాదుల (కఠ్ముల్లాల) భాషయని 4 నిముషాల 9 సెకండ్ల పాటు చేసిన ఆ ముఖ్యమంత్రి ఉపన్యాసంలోనే తొమ్మిది ఉర్దూ పదాలు దొర్లడంలో విచిత్రం ఏమీ లేదు, అది యాదృచ్చికమైనది కూడా కాదు. అది మనం మాట్లాడే భాషలో భాగమైన ఉర్దూ విశిష్టతని తెలియజేస్తుంది.
ఎందుకంటే, ఉర్దూ పరాయి భాష కాదు, విదేశీ భాష కాదు. ఈ దేశపు భాష, ఈ మట్టి రంగులని పులుముకుని, పూల పరిమళాన్ని హత్తుకుని వికసించిన భాష ఉర్దూ. ఇక్కడి గొంతులలో గీతమై విలసిల్లుతున్న భాష. భారతదేశ చరిత్ర గురించిన కనీస పరిజ్ఞానం ఉన్నా అర్ధమయ్యే విషయం ఇది. అజ్ఞానం, దురహంకారం, ద్వేషం ఒకదానితో ఒకటి పోటీ పడి, కలగలిసిపోయిన అంధ దృక్పథంతో అందలమెక్కిన పాలకులనుంచి ఇంగితాన్ని ఆశించలేము కదా. అందుకే ఉర్దూ భాష గురించి, ఉర్దూ కవిత్వం గురించీ మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది.
ప్రపంచ వ్యాపితంగా ఒక భాషని మాట్లాడే జనాల సంఖ్య రీత్యా చూస్తే పదవ స్థానంలో, 23 కోట్ల మంది మాట్లాడుతున్న భాష ఉర్దూ భాష. భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు లో అధికారికంగా గుర్తించిన 22 భాషలలో ఒక భాష ఉర్దూ భాష. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలలో 2011 నాటి లెక్కల ప్రకారం చూసినా హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, గుజరాతీ భాషల తర్వాత ఆరవ స్థానంలో ఉన్న భాష ఉర్దూ భాష.
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ (ఇవాళ మీరట్ డివిజన్), పాత ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతంలో పన్నెండవ శతాబ్ద కాలంలో ఉర్దూ భాష రూపుదిద్దుకోవడం మొదలైంది. ‘ఉర్దూ’ పేరుకి మూలాలు టర్కిష్ భాషలో ఉన్నాయి. టర్కిష్ భాషలో ‘సైనిక శిబిరం’ (క్యాంప్) గా వ్యవహరించే మాటనుండి పుట్టుకొచ్చిన పదం ఇది. సైనిక శిబిరాలలోని టర్కీ సిపాయిలు, పరిసర ప్రాంతాలలోని ప్రజల మధ్య సంపర్కం, సంభాషణలు, వ్యవహారాలనుండి ఆవిర్భవించి, వివిధ ప్రాంతాలలో అభివృద్ధి అయిన భాషని హిందీ, హిందుస్తానీ, హిందవీ, దెహల్వీ, లాహోరీ, రేఖ్తా, లష్కరీ అని వేరువేరు పేర్లతో పిలిచేవారు. ఢిల్లీ, లక్నో, దక్కన్ ప్రాంతాలు కేంద్రాలుగా వివిధ దశలలో అభివృద్ధి చెందిన ఈ భాషని ఉర్దూ పేరుతో వ్యవహరించడం 18వ శతాబ్దంలోనే మొదలయింది. ఒక్కమాటలో క్లుప్తంగా చెప్పుకోవాలంటే, భారతదేశంలో వైవిధ్యతతో కూడిన బహుళ సంస్కృతికి నిఖార్సైన నిదర్శనంగా రూపుదిద్దుకున్న భాష ఉర్దూ అని మనం నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు. తెలుగుపైన ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావాన్ని గురించి 1968లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన కె గోపాలకృష్ణారావు గారి పుస్తకాన్ని చూడవచ్చు (దీనిని తెలంగాణ సాహిత్య అకాడెమీ 2019లో పునర్ముద్రించింది). అలాగే ఉర్దూ పైన ఇతర భారతీయభాషల ప్రభావాన్ని కూడా విస్తారంగా చూడవచ్చు.
సాహిత్యం వైపు నుంచి చూస్తే ఫారసీ ప్రభావంతో, ఉర్దూ భాషలో మనకి అందివచ్చిన కవితా రూపం గజల్. ఇది భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ఉర్దూ కవిత్వం, గజల్ సంప్రదాయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దక్కన్ ప్రాంతపు శైలి, గజల్ భాషల సంప్రదాయం ఉత్తరాదికి బట్వాడా అయిందని పరిశీలకులు చెబుతారు. గుజరాత్ లో పుట్టి, దక్కన్ లో స్థిరపడిన మొహమ్మద్ వలీ కవిత్వమే ఢిల్లీ ప్రాంతంలో కవిత్వాన్ని విస్తృతంగా ప్రభావితం చేసింది. ఉర్దూ సాహిత్యంలో మొహమ్మద్ వలీ చారిత్రక ప్రాధాన్యత విస్మరించలేనిదని పరిశీలకులు చెబుతారు. ఫారసీ ఆధిక్యత, ప్రభావాలని అధిగమించి దక్కన్ ప్రాంతంలో వాడుకలోని మాటలను, భాషను కవిత్వంలోకి ప్రవేశపెట్టడంతో ఉర్దూ కవిత్వం కొత్త సొబగులని అందుకుని ఢిల్లీలో ఉర్దూ గజళ్ళపైనా అది తనదైన ముద్రని వేసింది. పండితుడు, సాహిత్యకారుడు అయిన అబ్దుల్ హలీం షరార్ మాటలలో చెప్పుకోవాలంటే, ‘ఉర్దూ భాష మూలాలు పుట్టుక ఢిల్లీలో ఉంటే, ఉర్దూ కవిత్వం మూలాలు పుట్టుక మాత్రం దక్కన్ ప్రాంతంలో ఉన్నాయి.’ గజల్ సంప్రదాయంతో ఉర్దూ సాహిత్యంలో లైలా మజ్ను, షీరీన్, ఫర్హాద్, షమా, పర్వానా (దీపం, శలభం), గుల్ (పూలు), బుల్ బుల్, సాఖీ వంటి ప్రతీకలు వచ్చి చేరాయి. దేశ చరిత్రలో, సాహిత్య చరిత్రలో కీలకమైన మార్పులకి ముఖ్యమైన ఘట్టాన్ని మనం 1857 సిపాయిల తిరుగుబాటు అనంతర కాలంలో (19వ శతాబ్దపు ద్వితీయార్ధ భాగంలో) గమనించవచ్చు. అలీఘర్ కేంద్రంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటి నాయకులు ముందుకు తెచ్చిన సామాజిక, రాజకీయ సంస్కరణతో పాటు, అల్తాఫ్ హుసేన్ హాలీ వంటి వారు ఉర్దూ సాహిత్యంలో ఆధునికతకు పాదు వేశారు. కవిత్వం జీవితానికి దూరమైన వాస్తవాన్ని గుర్తించి, కవిత్వాన్ని జీవన యదార్థాలతో మమేకం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన వాడు అల్తాఫ్ హుసేన్ హాలీ. ‘ప్రియురాలు, ప్రేమల ఆనందాలు, వైభవోజ్వలదినాలకి సంబంధించినవి. ఆ కాలం ఇప్పుడు గతించిపోయింది, ఆ ఆనందపు రాత్రులు గడిచిపోయాయి. వేకువ పొద్దు పొడిచింది. ఇది కళింగడ, బిహాగ్ రాగాలను ఆలపించే సమయం కాదు, ఇది జోగియా రాగాన్ని ఆలపించాల్సిన సమయం‘ అని హాలీ అంటాడు. వివరాలలోకి ఇప్పుడు పోలేము కానీ, గురజాడ అడుగుజాడలలో, తెలుగు సాహిత్య పరిణామంలో ఆధునికతతో వీటిని పోల్చి చూస్తే అది ఒక ఆసక్తికరమైన పరిశీలన అవుతుంది.
ఆ తర్వాత ఉర్దూ సాహిత్యంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అభ్యదయ రచయితల సంఘం) ఆవిర్భావం, సాహిత్య ఉద్యమాన్ని ఒక ఉజ్వల ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఉర్దూ సాహిత్యంలో అభ్యుదయ రచయితలు తీసుకొచ్చిన మార్పులు, ఆ సామాజిక, సాంస్కృతిక నేపథ్యంలో లేవనెత్తిన సాహిత్య/ రాజకీయ చర్చలు, ప్రశ్నలు ఇప్పటికీ విలువైనవి. ఆ సాహిత్య ఉద్యమంలో ఉత్థాన, పతనాలని, విజయాలు, వైఫల్యాలని బేరీజు వేసుకోవాల్సి ఉంది. భాషల మధ్య సంపర్కం, విభిన్న సంస్కృతుల కలయిక భాషనీ, సాహిత్యాన్నీ ప్రభావితం చేస్తాయి. ఉర్దూ భాషని ఇతర భారతీయ భాషలు ప్రభావితం చేసినట్లే, తెలుగు భాష మీదా, సాహిత్యం మీదా ఉర్దూ భాష, సాహిత్యాలు వేసిన ప్రభావాన్ని మనం గుర్తించవచ్చు. విద్వేషపు పునాదుల మీద సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విభజనకి మతాన్ని, భాషని పనిముట్టుగా వాడుకుంటున్న సందర్భంలో ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
వలసవాదం, దేశ విభజన గాయాలు, మతతత్త్వం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఉర్దూ భాషని పరాయి భాషగా, ఒక మతానికి చెందిన భాషగా చిత్రించే ప్రయత్నాలు ఈనాటివి కావు. హిందీ, ఉర్దూ భాషల మధ్య విభజన వలస పాలన లోనే ప్రారంభమైందని పరిశీలకులు అంటారు. ఈ రెండు భాషలకి ఏ లిపిని వాడాలనే ప్రశ్న పంతొమ్మిదవ శతాబ్దంలోనే వివాదంగా మారి, మత రూపం తీసుకుంది.
బ్రిటిష్ వలస పాలకులు దీనిని మత, రాజకీయ సమస్యగా మార్చివేశారు. జాన్ గిల్ క్రిస్ట్ ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో 1800 సంవత్సరంలో స్థాపించిన ఫోర్ట్ విలియం కాలేజీ ఈ విభజనకి కేంద్రంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. దీనితో కొన్ని పాఠాలని ఉర్దూ వచనం (పర్షియన్ లిపి) లోనూ , కొన్ని పాఠాలని హిందీ వచనం (దేవనాగరి లిపి) లోనూ విద్యార్థులు చదువుకునేవారు. 1875 లో వ్యాకరణ గ్రంథాన్ని రాసిన రాజా శివప్రసాద్, వ్యవహారికంగా మాట్లాడే భాషగా చూస్తే, హిందీ, ఉర్దూ భాషలమధ్య తేడా లేదని అంటాడు.
ఆయన ఇలా రాశాడు, ‘ఉత్తర భారతదేశంలో జనం మాట్లాడుకునే భాషకి వ్యాకరణం తయారు చేయాలని డాక్టర్ గిల్ క్రిస్ట్ కాలంలో ప్రత్యేకంగా నియమించిన మౌల్వీలు, పండిట్లు రెండు రకాల వ్యాకరణాలని రూపొందించడంతోనే అది అసంబద్ధంగా తయారయ్యింది. వ్యావహారిక భాషకి పాఠశాల స్థాయిలో ఒకే వ్యాకరణ గ్రంథాన్ని రూపొందించడానికి బదులుగా ఒకదానితో ఒకటి పొసగని రెండు విభిన్నమైన పాఠ్య పుస్తకాలు తయారుకావడం దీనితో వచ్చిన దుష్ఫలితం. మహమ్మదీయులకీ, కాయస్థ పిల్లలకీ ఒక పుస్తకం, బ్రాహ్మణులకీ, బనియాలకీ మరొక పుస్తకం రూపొందడమే దీనివల్ల కలిగిన దుష్ఫలితం.’ వలసపాలన అనంతరం దేశవిభజన, ఆ తర్వాతి పరిణామాలతో ఈ విభజన మరింతగా విస్తరించడం ఒక విషాదం.1969 గాలిబ్ శత వర్ధంతి ఉత్సవాల సందర్భంగా సాహిర్ లూధియాన్వీ కవిత ఈ విషాదానికి అడ్డం పడుతుంది,
జిన్ షహరోం మేఁ గూంజీ థీ గాలిబ్ కీ నవా బరసోం
ఉన్ షహరోం మేఁ అబ్ ఉర్దూ బే నామ్ ఓ నిశాన్ ఠహరీ
ఆజాదీ ఎ కామిల్ కా ఐలాన్ హువా జిస్ దిన్
మాతూబ్ జుబా ఠహరీ గద్దార్ జుబా ఠహరీ
గాలిబ్ గళం అనేక సంవత్సరాలు ప్రతిధ్వనించిన నగరాలలో
ఉర్దూ భాషకి ఇప్పుడు ఆనవాళ్లే లేకుండా పోయాయి
స్వాతంత్య్రాన్ని ప్రకటించిన రోజు తర్వాత
అది శాపగ్రస్త మైన భాషగా మారింది, దేశద్రోహుల భాషగా ముద్రవేశారు
దాశరథి గాలిబ్ గీతాల అనువాదాన్ని చదువుకుని, ఆ గీతాలని బాపు బొమ్మలతో అలంకరించుకున్న నేపథ్యం మనది. అజంతా, ఎల్లోరా గుహల పైన అద్భుతమైన అజరామరమైన కవిత్వాన్ని రాసిన కవి సికందర్ అలీ వాజిద్ దక్కన్ సంప్రదాయం మనది. గుబార్ సామ్నే హై, కారవాన్ నజర్ నహీఁ ఆతీ (ఊరేగింపు వదిలిన దుమారం కళ్ళముందు కనిపిస్తున్నది కానీ బిడారు కనిపించడం లేదు) అని ఎల్లోరా గుహల సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించాడు సికందర్ అలీ వాజిద్. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పారశీ భాషల పాండిత్యంతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకున్న నేల మనది. మీర్ తఖీ మీర్, గాలిబ్, ఇక్బాల్ , ఫైజ్ అహ్మద్ ఫైజ్, కైఫీ అజ్మీ, అహ్మద్ ఫరాజ్, జోష్ మలీహాబాదీ, మజాజ్ లఖ్నవీ, సాహిర్ లూధియాన్వీ, కిశ్వర్ నాహీద్, మఖ్దూం మొహియుద్దీన్, జావేద్ అఖ్తర్, గుల్జార్ వంటి ఎందరెందరో కవులని తెలుగులో పరిచయం చేసుకున్న నేపథ్యం మనది. మహాకవి ఇఖ్బాల్ జీవిత విశేషాలని సవివరంగా తెలియజేసి, కావ్యాలని తెలుగులోకి అద్భుతంగా అనువదించుకున్న నేల మనది (అల్లామా ఇఖ్బాల్ షిక్వా, జవాబ్ ఎ షిక్వా ఎమ్ ఏ రహ్మాన్, ఇఖ్బాల్ అకాడెమీ హైదరాబాద్ ప్రచురణలు, 2010). మఖ్దూం కవిత్వాన్ని తలచుకుంటూనే ఉన్నాం (మఖ్దూం కవిత్వాన్ని 1960లలో తెలుగులో అనువదించిన విశాలాంధ్ర ప్రచురణలు, ఇంకా షాయరె తెలంగాణ, మఖ్దూం మొహియుద్దీన్ జీవితం – కవిత్వం, వాహెద్, నవ తెలంగాణ ప్రచురణలు 2017).
ఈ కృషి మునుపటితో పోల్చితే ఇప్పుడు మందగించిందని చెప్పుకోవచ్చు. అయినా, ఉర్దూ భాష మీద ఆసక్తితో దానిని నేర్చుకుని ఉర్దూ సాహిత్యాన్ని అనువదించుకుంటూన్న కృషి కొనసాగుతూనే ఉంది. ఈ కృషి ఇంకా బలంగా కొనసాగవలసి ఉంది. ఇది ఎవరి కోసమో కాదు, మన సాహితీ, సాంస్కృతిక వారసత్వాన్ని సంపద్వంతం చేసుకోవడానికి చేయాల్సిన కృషి.
ఉర్దూ కవిత్వం గురించి ఈ ప్రస్తావనలో మూడు అంశాలని ముఖ్యంగా చెప్పుకోవాలి,
- ఉర్దూ భారతీయ భాష, భారతదేశ సాంస్కృతిక వారసత్వంనుంచి విడదీయలేని భాగం
- ఉర్దూ సాహిత్యం, ఇతర సాహిత్యాల లాగానే ఈ దేశంలో, ప్రపంచంలో వచ్చిన సామాజిక, రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయింది. ఆ పరిణామాలపై తనదైన ప్రభావం వేసింది. దక్కన్ సాహిత్యానికి ఇందులో విశిష్టత ఉంది.
- ఉర్దూ సాహిత్యంలో అభ్యుదయ సాహిత్య ఉద్యమం ఒక ఉజ్వల ఘట్టం, అది భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది.
ఈ మూడు అంశాలని చెప్పుకుంటూ, ముగించే ముందు, భిన్నమైన సందర్భంలోనే అయినా , ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని మనం ఇప్పుడు అన్వయించుకోవచ్చు,
హమ్ కె ఠహరే అజ్నబీ ఇత్నీ మదారాతోం కే బాద్
ఫిర్ సే బనేంగే ఆశ్నా కిత్నీ ములాకాతోం కే బాద్
కబ్ నజర్ ఆయేంగే బే దాగ్ సబ్జే కీ బహార్
ఖూన్ కే ధబ్బే ధులేంగే కిత్నీ బరసాతోం కే బాద్
ఎన్నిసార్లు కలిసినా మనం అపరిచితులుగానే మిగిలిపోయాం
ఆత్మీయ పరిచయం కోసం ఇంకా ఎన్ని సార్లు కలవాల్సి ఉందో
వడలిపోని హరిత వసంతాలు ఎప్పటికి కనిపిస్తాయో
ఈ నెత్తుటి మరకలని కడిగివేయడానికి ఇంకా ఎన్ని వర్షాలు కురవాల్సి వుందో
ఆ హరిత వసంతాల దృశ్యం కోసం, ఆత్మీయ పరిచయం కోసం, కరచాలనాల కోసం కృషి కొనసాగాల్సి ఉంది. భాషకి మతాన్ని ఆపాదించి విద్వేషంతో విడదీసే ప్రయత్నాలు ముమ్మరమైనప్పుడు ప్రేమను పెంపొందించే భాష కావాలి. ఉర్దూ కన్నా ప్రేమను వ్యక్తీకరించే భాష మరొకటి ఉన్నదా?
*
Add comment