తెలుగు వాళ్ళ మధ్య ఎం. ఎన్. రాయ్

మార్చి 21  ఎం.ఎన్.రాయ్  పుట్టిన తేది

 ఎం.ఎన్.రాయ్ జీవితం చాలా విచిత్రంగా వుంటుంది. ఆయన చివరి దశలో 15 సంవత్సరాలపాటు తెలుగు వారికి సన్నిహితుడయ్యాడు.

పురాణాలను వడియాలవలె నమిలిన పురోహిత కుటుంబంలో 8వ సంతానంగా పుట్టిన రాయ్ బెంగాల్ వాడు. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు నరేంద్రనాథ్. యుక్తవయస్సులో బెంగాల్ విప్లవవాదిగా జతీన్ ముఖర్జీ నాయకత్వాన బ్రిటీష్ పాలకులను దేశం నుండి తరిమి వేసే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్యమంలో జర్మనీవారు సహాయపడతామనగా, ఆయుధాలు, ధనం సేకరించడానికి జావా, సుమిత్ర, ఇండోచైనా, కోరియా, జపాన్, చైనాలు వెళ్ళవలసి వచ్చింది. అనేక మారుపేర్లతో ఆ దేశాలలో జర్మన్ రాయబారి కార్యాలయం వారిని కలిశాడు రాయ్. తొలి దశలో కొంత ధనం యివ్వగా, బెంగాల్ వచ్చి, తన గురువు జతీన్ కు అప్పగించి వెళ్ళాడు. కాని, అసలు కావలసింది ఆయుధాలు. మళ్ళీ పయనించి జర్మనీ వారిని కలియగా, ఆయుధాలకు జర్మనీ రమ్మన్నారు. ఆ ప్రయత్నంలో జపాన్ మీదుగా ముందు అమెరికా పశ్చిమతీరంలో అడుగుపెట్టాడు.

కాని బ్రిటిష్ పోలీసులు వెంటాడుతూనే పోయారు. 1916లో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన రాయ్, అక్కడ ఉన్న స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఇండియా నుండి వెంట తెచ్చిన పరిచయ లేఖను, యూనివర్సిటీ ఇంగ్లీషు శాఖలో వున్న ధనగోపాల్ కు ఇచ్చాడు. అతడి సలహాపై నరేంద్రనాథ్ పేరు మార్చి, మానవేంద్రగా తలెత్తాడు. అక్కడ ఇంగ్లీషు గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఎవిలిన్ ను పరిచయం చేయగా, వారిరువురు యిష్టపడి వివాహం చేసుకున్నారు. ఇది 1917 నాటి కథ. కాని బ్రిటీష్ పోలీస్ రాయ్ ను వదలలేదు. వారిని తప్పించుకోడానికి న్యూయార్క్ వెళ్ళి, కొలంబియా యూనివర్సిటీలో వున్న లాలాలజపతి రాయ్ ను కలిశారు. అతడు కొంత సహాయపడ్డాడు. బ్రిటీష్ పోలీసులు ఒకనాడు  రాయ్ ను అరెస్టు చేసి, విచారించి తాత్కాలికంగా విడిచి పెట్టారు.

రాయ్ దంపతులు రాత్రికి రాత్రి రైలులో అమెరికా సరిహద్దు వరకు వెళ్ళి మెక్సికోలో అడుగు పెట్టారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు యిచ్చిన పరిచయ లేఖ రాయ్ కు తోడ్పడింది. మెక్సికోలో శ్పానిష్ నేర్చి, పత్రికలకు రాస్తూ, అప్పుడే తలెత్తుతున్న సోషలిస్టు కమ్యూనిస్టు భావాలను రాయ్ స్వీకరించాడు. అచిరకాలంలో మెక్సికోలో ప్రముఖుడుగా తలెత్తి, అధ్యక్షుణ్ణి ఆకర్షించి, మాస్కో వెలుపల తొలి కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. లెనిన్ ఆశ్చర్యపడి రష్యాకు ఆహ్వానించగా బరోడిన్ సహాయంతో యూరోప్ మీదుగా రాయ్ దంపతులు మాస్కో చేరుకున్నారు. 1918 నాటి మాట.

రష్యాలో అగ్రస్థాయి నాయకుల స్థాయికి ఎదిగి తాష్కెంట్ నుండి తొలిసారిగా భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించాడు. ఇండియాకు సాహిత్యం పంపుతూ సలహాలు ఇస్తూ నడిపాడు. యూరోప్ నుండి పత్రికలు నిర్వహించి, ఇండియాకు పంపాడు.

జర్మనీకి, ఫ్రాన్స్ స్విట్జర్లాండ్, నెదర్లాండ్ లో రాయ్ మేథావులను కలిశాడు. 1929లో 15 సంవత్సరాల ప్రవాస జీవితానికి స్వస్తి పలికి ఇండియా వచ్చాడు. మహమూద్ అనే పేరుతో కరాచీ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొని, ప్రముఖులను కలిశాడు. బ్రిటీష్ పోలీసులు వెన్నాడుతూ, బొంబాయిలో ఒకరాత్రి రాయ్ ను అరెస్టు చేసి, కోర్టు ద్వారా ఆరేళ్ళు జైలుపాలు చేశారు. జైలులో విపరీతంగా రచనలు చేసి సోషలిస్టులతో కాంగ్రెస్ వారితో సంప్రదింపులు జరిపాడు. బయటకు వచ్చిన తరువాత నెహ్రూ ఆహ్వానంపై ఆనంద్ భవన్ లో వుండి, కాంగ్రెస్ లో చేరి, వామపక్ష భావాలు ప్రచారం చేశాడు. గాంధీ ఆయన్ను దూరంగా పెట్టాడు. బోసు జర్మనీ వెళ్ళడానికి తలపెట్టినప్పుడు, వద్దని తన అనుభవరీత్యా సలహాయిచ్చాడు.

తరువాత రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టి 1947లో పార్టీ రద్దు చేసి, ఉద్యమం కొనసాగించాడు.

1938 నుండీ 1954లో చనిపోయే వరకూ రాయ్ ఆంధ్రలో అనేక పర్యాయాలు పర్యటించి, మేథావులను, రచయితలను ఆకర్షించాడు. ఆంధ్రలో రాయ్ తొలుత అడుగుపెట్టినప్పుడు 1938లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఆకర్షితుడై అనుచరుడయ్యాడు. విశ్వనాథ డైరీలలో ఆవిషయం రాసుకున్నాడు.

ఆంధ్రలో రాయ్ సన్నిహిత అనుచరులుగా మిత్రులుగా మారిన వ్యక్తుల్ని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1938-54 మధ్య జరిగిన పరిణామం యిది. గమనించండి వారిపేర్లు –

అబ్బూరి రామకృష్ణారావు, ములుకుట్ల వెంకటశాస్త్రి, అత్తలూరి నరసింహారావు, పాలగుమ్మి పద్మరాజు, డి.వి. నరసరాజు, వి.ఎస్. అవధాని (బ్రిటీష్ కౌన్సిల్ ఆఫీసు మద్రాసు) తాతా దేవకనందన్, పెమ్మరాజు వెంకట రావు, ఆవుల సాంబశిరావు, కల్లూరి బసవేశ్వరరావు, జి.వి.కృష్ణారావు, ఆవుల గోపాల కృష్ణమూర్తి, మల్లాది రామమూర్తి, సుబ్బమ్మ, కోగంటి రాధాకృష్ణమూర్తి, జాస్తి జగన్నాథం, కోగంటి సుబ్రహ్మణ్యం, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం, సి.హెచ్. రాజారెడ్డి, పావులూరి కృష్ణచౌదరి, గుత్తికొండ నరహరి, బండారు వందనం, కొల్లా సుబ్బారావు, కొసరాజు సాంబశివరావు, ఆలపాటి రవీంద్రనాథ్, ముసునూరి నారాయణ, ఎ.వి.మోహన్, జంపాల శ్యామసుందరావు, లావు అంకమ్మ, గూడవల్లి రాంబ్రహ్మం, నార్ల వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి శివలింగయ్య, పువ్వాడ నాగేశ్వరరావు.

తెలుగులో రాయ్ ప్రభావంతో కొన్ని పత్రికలు వెలువడ్డాయి. రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, హేతువాది, ప్రసారిత, చార్వాక.

రాయ్ రచనలు ఇన్నయ్య నరిశెట్టి అనువదించగా తెలుగు అకడామి ప్రచురించింది. కొన్నింటిని తెలుగు యూనివర్సిటి వెలువరించింది.

నేడు రాయ్ ప్రభావం అంతగా కనిపించదు. లైబ్రరీలకు పరిమితమైన రచనలు ఆకర్షితంగా నిలిచాయి.

    *

 

నరిసెట్టి ఇన్నయ్య

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇన్నయ్య గారు,
    M.N. Roy ని పాఠకుల ద్రుష్టికి తెచ్హినందుకు మీకు క్రుతజ్ఞ్యతలు. అయితె, వారి వలనె ఆ చరిత్ర్యత్మక సమయం లో ఒక 10-15 మంది బెంగాలీ వారు Cuba లో నివసించి, ఆ తరువాత ఆ దేసపు ఆశ్రయం పొంది అక్కడే settle అయి వున్నరు అని ఓక స్నేహితుదు చెప్పగా తెలుసుకున్నాను. ఈ వార్త నిజమే అని ధ్రువీకరించవచ్చ్హు. మీ research లో ఈ topic తగిలిందా? If so, could you write something about them?

  • Good to know about great people like M.N.Roy.. Present generation do not have time to know about these people and they are like hidden treasure of Indian political history!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు