తెలుగు కవిత్వంలో తెలంగాణ వాటా ఎంత?

డిసెల రాళ్ళు (2009) నానీల కవిత్వంతో తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టి ‘ఉద్ధరాసి పూల చెట్టు'( 2016) తో మొదటి వచన కవిత్వ సంపుటి వెలువరించి, ‘మిణుగురు పూలు’ (2018) పేరుతో బడి పిల్లల కవిత్వాన్ని అచ్చేసి,  ప్రస్తుతం ‘నల్లకొడిసె వన్నెకాడు'( 2024) రెండవ వచన కవిత్వ సంపుటితో తెలుగు కవిత్వ యవనికపై చెరగని ముద్రవేసిన సిసలు ప్రాంతీయ కవి నాగిళ్ల రమేశ్. అసలు ప్రాంతీయతే అంతర్జాతీయత.
*
తెలుగు కవిత్వంలో తెలంగాణ వాటా ఎంత?  తెలంగాణ కవిత్వంలో దళిత జీవిత చిత్రణ ఏ మేరకు ఉంటుంది? దళిత జీవిత సౌందర్యం, పలుకుబడి, నుడికారపు నడత కవిత్వ పరంగా ఎంత మేరకు పరుచుకుని ఉంది? ఇత్యాది విషయాలు నాగిళ్ళ రమేశ్ కవిత్వంలోని ఒక పార్శ్వపు వస్తువు. దళిత జీవితపు ఈస్తటిక్స్ ను కవిత్వం చేసేందుకు, కవికి ఉన్న అర్హత, వ్యక్తిగత జీవితపు కాన్వాస్ ఎంత ? ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు తన కవిత్వపు లోతుల్లోని అంతస్సారం బోధపడుతది. అల్కగ రాసేంత ఒడుపు సంపాదించిన అమాయకత్వపు గడిసోడు. మూలాలను మరిచిపోని ఆధునిక కాలపు ఆదిమకవి. తన మూలాలను పట్టించే ‘కన్నీటి పద్యమొకటి’ ఆలింగనం చేసుకుందాం.
*
కన్నీటి పద్యమొకటి
~
తొక్కునూరుకొని
కొన్ని పల్లి పల్కులను తీసి బుక్క నింపి
పొద్దు పోయిందని తినకనే
సద్ది అందుకొని కైకిలికి వోయిన అవ్వ
మమతల పద్యం
ఎగిలివారంగవోయి
పొద్దూకే జాముల
చేన్ల నుంచి రాంగనే
బుర బుర పండిన
మామిడిపండును నోటికందించిన
నాయన బాధ్యతల పద్యం
తమ్ముళ్లు చిన్నోల్లని
కోమట్లకు వాకిలి నూకి
వయిలు కొనిచ్చిన అక్క
గారాల పద్యము
వాడు కొంచెమేతిని
మా అన్నకుండాల్నని
ఉట్టిమీద మక్క గట్క, చింతపండు కారంను
నాకై దాసిన తమ్ముడు
ఆత్మీయ పద్యం
పద్యమంటే పద్యం గాదు
గీపాటి ఎండల్ల
ఇల్లును ఎల్లదీయాల్నని
నపరింత చెమటొడిపి
రాసుకున్న కన్నీటి పద్యము
*
కవితలో అవ్వ, నాయన, అక్క, తమ్ముడు మొదలైన పాత్రలు కనిపిస్తాయి. అంతర్లీనంగా, సూఛాయగా తెరవెనుక పాత్రలా కవి తచ్చాడుతుంటడు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసి తమ బతుకులు ఎల్లదీత్తందుకు ఎంత కాయ కష్టం జేత్తున్నరో.. వారి మధ్య ఉన్న మమతానురాగాలు, ప్రేమలు, ఆత్మీయతలు ఎ‌సువంటివో ఎరుక పరిచే జీవితానుభవాలు ఇందులో పరుచుకొని ఉన్నాయి. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పల్లె జీవితపు ఆనవాళ్లు మాత్రమే కాదు.. మొత్తం తెలంగాణ గ్రామీణ జీవితానికి ఒక ప్రతీక వంటిది. ఒగలు పని జేస్తే ఇంటిల్లు రాజులందరూ మారాజుగ కూసోని తినే సంస్కృతి కాదు. నపరింత చెమట ఒడిపితే తప్ప మెతుకు ముఖం చూడలేని బతుకు పోరాట గాథ ఇది.
కవి రాసుకున్న నెత్తుటి కావ్యానికి నపరింత చెమటొడిపి రాసుకున్న కన్నీటి పద్యంలో కైకిలికి పోయిన అవ్వ మమతల పద్యమయితది. చాలీచాలని జీవితంలో, తినీ తినని బతుకుల్లోంచి ఆరాట పోరాట గాథల్లోంచి అవ్వ దేశ ఆర్థిక ముఖచిత్రమయితది. తోడుగా ఎగిలివారంగ వోయి పొద్దుకే జాముల ఇల్లు చేరే నాయన అవ్వకు జత గూడి బాధ్యతల పద్యమైతడు.  బడికి పోవాల్సిన అక్క చాకిరీ చేస్తూ తమ్ముళ్ల నాలుకలపై అక్షరాలు దిద్ది గారాల పద్యమైతది. తన బాల్యాన్ని, చదువును తమ్ముళ్ళలో చూసుకుని మురిసిపోతూ తదాత్యం చెందుతది. తోడబుట్టినోడి కడుపు తడిమే తమ్ముడు, అన్న కోసం  దాపెట్టి ఆత్మీయ పద్యమయితడు. ఎవని పొట్టతిప్పల వాడు చూసుకునే రోజుల్ల; ఎవన్ది నిండితే వాని దరిద్రమే బాత్తదని తలిచే సమాజంల ఆరివారం గల్ల తమ్ముడు ఎదురైతడు. బతుకుల ముంచి తీసిన కలం రాసే రాతలు ఇవి.
*
తెలంగాణ నుడికారపు సొగసులు, పలుకుబడుల పాయిరం గుండె తడిని అద్దిపోతది. తొక్కు, బుక్క, సద్ది, కైకిలి, ఎగిలి వారంగ, బురబుర, వయిలు, ఉట్టి, మక్క గట్క, నపరింత మొదలైన పదాలు మన సంస్కృతిని, భాషను, ఆహార వ్యవహారాలను తెలుపుతూనే అవ్వ బుక్కనిండ పోసిన పల్లి పలుకుల లెక్క కమ్మగా తాకి లోపలి జీవుడిని తట్టి లేపుతయి. కవితలు అల్కగ రాసుడు ఎనక ఎంతగ కొట్టుకుపోయిన గొట్టు జీవితముందో ఎరుకలోకి వత్తది. తెలంగాణ గర్వించదగిన కవి నాగిళ్ళ రమేశ్.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నా నాగిళ్ళన్నను సక్కగా సుపిచ్చినవే సద్దగడుకల గడ్డపేరుగు కలుపుకటాగినట్టుంటది నాగిళ్ళన్నను సదువుతంటే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు