తెలిసిన జీవితాలే కథలు!

“ఇల్లింత పండ్లు” కథల సంపుటికి వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం 2024 అందుకున్న సందర్భంగా-

నా కథల్లో సామాన్యంగా నిత్యం మనం చూసిన పాత్రలే ఉంటాయి.  ఇల్లింతపండ్లు పేరుతో ఒక్క కథ కూడా ఉండదు. ఆ కథల్లోని ఫ్లేవర్ ఆ పళ్ల రుచిని తలపిస్తుందని ఆ పేరు ఎంచుకున్నాను. తెలిసిన జీవితాలను కథలుగా మలచడం అంటే ఇష్టంగా మారింది. అలా కథ మీద అమితమైన ప్రేమ పెరిగింది.

పుస్తకంలోని మొదటి కథ ‘ప్రేమ’. భార్య ఎప్పుడూ భర్తను, పిల్లలను, ఇంటిని అదే పనిగా ప్రేమిస్తుంది. తన గురించి తాను ఏమాత్రం పట్టించుకోదు. ఈ క్రమంలో తననితాను ప్రేమించుకోవడాన్ని పూర్తిగా విస్మరించి కుటుంబం కోసం అహర్నిశలు పరితపిస్తుంటుంది. అలాంటి ఇల్లాలు తననితాను ప్రేమించుకుంటే అదెంత బాగుంటుందో కదూ. అదే క్రమంలో ఆ ప్రేమ భర్త, పిల్లల నుంచి కూడా లభిస్తే ఆమె ఎంత ఆనందంగా ఉంటుందో కదూ. అలాంటి ప్రేమానురాగాలను గురించి చెప్పే కథ ‘ప్రేమ’.

        రెండో కథ ‘అనైతికం’. పల్లెలు వదిలి పట్నం వచ్చి ఇక్కడ అద్దె ఇళ్లలో ఉంటూ పడే పాట్లను చూపెడుతుంది ఈ కథ. ఇల్లు గలవాళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని భూస్వాముల దురాగతాలను తలపిస్తుంటారు. చాలా అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటివారి మీద నిరసనగా అద్దెకుండేవారి ఆశయం సిటీలో సొంతిల్లును నిర్మించుకోవడం అని చెప్పే కథ ఈ ‘అనైతికం’. సిటీలో అద్దె కొంపల అరాచకాలను విస్మరిస్తూ ఒక సగటు జీవి సొంతిల్లు కట్టుకోగలడా అనే ఎరుకను కలిగిస్తుందీ కథ?

        ఆ తర్వాతి కథ ‘బుటునా’. మూగ జీవాల మీద ప్రేమను ఎక్స్ట్రీమ్ లెవల్లో చూపిస్తుంది ‘బుటునా’ కథ. తన బాల్యంలో ఉన్న బర్రె మీద ప్రేమతో దాని పేరు మీదే పాల వ్యాపారం చేసే అతను ఎదిగిన తీరును, పశువుతో పాటు అమ్మ మీద ప్రేమను దర్శిస్తుంది ఈ కథ. అలాగే ‘ఇక నేను స్థిరపడిపోయాను’ అని అనుకోకుండా కొత్త పనులు చేస్తే కొత్త ఉత్సాహం వస్తుంది, జీవితం మరింత రసవత్తరంగా ఉంటుందని కూడా చెబుతుంది. మూగజీవాలపై ప్రేమను ఆలంబనగా తీసుకొని ఎదిగిన తీరును కళ్లకు కట్టే కథ.

          ఇక ‘జయమాలిని’ కథ విషయానికి వస్తే ట్రాన్స్‌జెండర్స్ కూడా ఈ సమాజంలో ఒక భాగం అని ఇంకా ఈ ఆధునిక సమాజం స్వీకరించలేదు. వాళ్లను మనుషులుగా స్వీకరించడానికి ఈ కంప్యూటర్ యుగం పోయి ఇంకా ఏ యుగం రావాలి అనేది ట్రాన్స్‌జెండర్స్‌కు లక్ష డాలర్ల క్వశ్చన్? ఆ తీరును నిలదీస్తుంది ‘జయమాలిని’ కథ.

        సంకలనంలో ఐదో కథ ‘ఆత్మకథ’. సినిమా రంగంలో అప్ కమింగ్ రైటర్స్ రాస్తున్న కథలు ఏ విధంగా తిరస్కరణకు గురవుతున్నాయో, అలా తస్కరణకు గురైన తన కథ గురించి కథానాయకుడి ఆత్మ పడే క్షోభే ‘ఆత్మకథ’ కథ. సినిమా రంగానికి కోటి కలలతో వచ్చి అవి తీరకుండానే అర్థాంతరంగా తనువు చాలిస్తున్న ఎందరో ఆశాజీవుల అంతర్మథనం ఈ కథ.

సృజనాత్మక చౌర్యంపై ఒక ఆత్మ ఘోష!

‘ఇబ్లీస్’ కథ చాలా ప్రత్యేకమైన, సున్నితమైన కథ. కులం కాదు, మతం కాదు మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చాటిచెప్పే కథ ‘ఇబ్లీస్’. సంస్కృతి పేరిట జరుగుతున్న అతిని, ఆ అతిని రాజకీయాల్లో కొన్ని పార్టీలు ఎలా వాడుకుంటున్నాయో చెప్పే కథ. పార్టీలకు మనం ఎప్పుడైతే పావులుగా మారుతామో అప్పుడే మన అంతం ప్రారంభం అవుతుందని వివరిస్తుంది. లాజిక్‌కు అందని మతమెప్పుడూ మానవత్వాన్నే టార్గెట్ చేస్తుందనే కథ.

‘కోపిన్ బియ్యం’ కథలో ఎంతెత్తుకు ఎదిగినా నేలచూపులు పోనిచ్చుకోని తల్లి అంతరంగాన్ని ఎరిగిన కొడుకు తల్లి కోసం ఏం చేశాడో చెప్పే కథ. ఎన్ని కోట్లు సంపాదించినా కొందరు తమ అస్థిత్వాన్ని ఎంతమాత్రమూ మార్చుకోరు. అలాంటి తల్లికోసం ఒక కొడుకు తన రుచిని, అభిరుచిని ఎలా మార్చుకున్నాడో చాలా ఉదాత్తంగా చెబుతూనే మన మూలాలకు జీవం పోస్తూ ఎదగాలని అని చెప్పే కథ.

‘గుండెగది’ కథలో సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ ఇప్పుడున్న పరిస్థితులను మరింతగా  దిగజార్చిందా? పెద్దలను పట్టించుకోని ఈతరం నుంచి దొరకని స్వాంతన పెద్దలకు ఆ స్మార్ట్ ఫోన్ అందిస్తోందా? అంటే అవుననే చెప్పక తప్పని స్థితి! ఎందుకంటే ఈతరం వాళ్లకు ఫోనే ప్రపంచం అయినప్పుడు ఆతరం వారికి కూడా అదే ఫోన్ ఆలంబనగా మారిందని, టెక్నాలజీని తమవైపు మళ్లించుకొని వయసును మరిచిపోవచ్చని చెప్పే కథ.

‘చమ్కీ’ కథలో మతం ఆడపిల్లను ఎలా వంచించాలో చూస్తుంది. మతం ఎప్పుడూ ఆడవాళ్లనే టార్గెట్ చేస్తుంది. అది తెలియని అతివలు ఎక్కువగా మతాచారాలను ఫాలో అవుతూ బలిపశువులుగా మారుతుంటారు. అలాంటి ఆడపిల్లల జీవితానికి ప్రేమ, చదువు ఎలాంటి ఆలంబన ఇచ్చిందో, మతం మహిళకు వేసే సంకెళ్లు, ఆంక్షలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పే కథ.

‘చింత’ కథ కామెడీగా సాగే కథ. సాధారణంగా మనం చింత పులుపును ఎక్కువగా అదే శాపంగా భావించిన భర్త ఆ చింత పులుపుపై చేసిన నిరసనే ‘చింత’ కథ. సరదాగా ఉంటుంది, ఆలోచింపజేస్తుంది. పులుపుతో మిమ్మల్ని పులకరింపజేస్తుంది.

సంకలనంలో పదకొండవ కథ ‘దినార్ గాయం’. బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లి తమ యవ్వనాన్నంతా ధారపోస్తారు. కడకు జీవితంలో మాధుర్యాన్ని వెతుక్కునే నిస్సహాయ జీవితాలు. అప్పులు తీరాలని, పేదరికాన్ని సాగనంపాలని, అందరిలా తాము కూడా ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవాలని గల్ఫ్ దేశాలకు ఆశల రెక్కలు కట్టుకొని వెళ్తారు. కానీ తిరిగి వచ్చేసరికి జీవితాన్ని ఎంత కోల్పోయారో? ఎంత నష్టపోయారో? తెలిపే కథ ‘దినార్ గాయం’.

‘దేవ్లా నాయక్’ కథ ఈ పుస్తకానికే ప్రత్యేకమైన కథ అని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ సీనియర్ రచయిత పి.చంద్రశేఖర అజాద్ గారు తెలిపారు. నేచురల్‌గా కొందరుంటారు. పుట్టుకతోనే వారిలో ఆకట్టుకునే ఒక టాలెంట్ ఉంటుంది. అత్యంత సహజంగా ఉంటూ తమ ఆటపాటలతో ఆకట్టుకుంటారు. అలాంటివారి బాడీ లాంగ్వేజ్‌ను కాపీ కొట్టి కొందరు నటులుగా రాణిస్తుంటారు. కానీ తమను ఇన్‌స్పైర్ చేసినవారిని నిర్దాక్షిణ్ణంగా మరిచిపోయి, కనీస సహాయం కూడా చెయ్యని ప్రమాదంపై పేటెంట్ హక్కులు ఉండాలని, క్యారెక్టర్లను కాపీ కొట్టేసి తమ క్యారెక్టర్ కోల్పోతే ఎలా అని చెప్పే కథ.

‘నమిత’ కథలో ప్రేమ పేరిట మగాడు మృగాడిగా మారుతున్న వైనం ఎప్పటికి నశిస్తుంది అని ప్రశ్నిస్తుంది? మడ్డు కత్తులతో దాడులు, యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలు.., ఎంతకాలం ఇలా? ఎందరు బలవ్వాలి? వాడికి దక్కనిది ఇంకొకరికి దక్కొద్దు అనే పురుషహంకారం ఎప్పటికి తుదముడుతుంది? తనపై జరిగిన యాసిడ్ దాడిపై ఓ లేడీ ఎలా రివేంజ్ తీర్చుకుందో చెప్పే కథ.

పుస్తకంలో చివరి కథ ‘దిద్దుబాటు’. అంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు. వారి మధ్య సమానత్వం ఉంటుంది. అప్పుడు ఏవేవో మాటలు ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ కాలక్రమంలో వారివారి ఆర్థక స్థితులు మారిపోతాయి. ఇంకా ఏవో మనస్పర్థలు వాటిల్లుతాయి. దీంతో వారి మనస్థత్వాలు మారతాయి, ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోతారు. పెద్దలు చేసిన పొరపాటును పిల్లలు ఎలా సరిదిద్దారు అని చెప్పే కథ.

*

హుమాయున్ సంఘీర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు