మనిషిని నిరంతరం ముందుకు నడిపించేది రేపటి మీద ఉండే ఆశ అని నా నమ్మకం. ఈరోజు ఉండే సందేహాలు,కష్టాలు,అనిశ్చిత రేపు ఉండవు అనే ఆశతో ఈ క్షణాన్ని గడిపేస్తూ ఉంటాము.. కానీ ఈరోజు గడిస్తే కానీ రేపటి గురించి చెప్పలేము. ఒక సినిమా పాటలో “రేపేటవునో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా” అన్నట్టు ,రేపటి కోసం ఎదురుచూడాలి. ఈ నిరీక్షణలో కొన్ని సార్లు విజయం దొరకొచ్చు.. కొన్ని సార్లు కేవలం నిరీక్షణలోనే ఉండిపోవచ్చు కూడా.. ఇలా మనకి తెలియని ఒక ఘర్షణలో ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే నాగేంద్ర కాశి గారు రాసిన “ నల్ల వంతెన” కథల పుస్తకం చదవాల్సిందే.
ఈ పుస్తకంలో మొత్తం 12 కథలు ఉన్నాయి. కథలు అన్ని కూడా గోదావరి పరివాహక ప్రాంతం ముఖ్యంగా కోనసీమ ఆధారంగా ఉంటాయి. సాధారణంగా గోదావరి ప్రాంత కథలు అనగానే అక్కడి పచ్చటి పొలాలు, గోదావరి నది గురించిన కథలే ఎక్కువగా చదివిన నేను, ఈ పుస్తకం కాస్త భిన్నంగా అక్కడి వాతావరణం మీద కాకుండా అక్కడి మనుషులు, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలు, రాజకీయాలు, అణిచివేతలను తన ప్రధాన కథాంశంగా తీసుకున్నారు నాగేంద్ర గారు.
కోనసీమ ప్రాంతంలో దుబాయికి వెళ్లేవాళ్ళ సంఖ్య ఎక్కువ. వారిలో ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలా వలస వెళ్ళడానికి కారణాలు, వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాల గురించి “కువైటు అబ్బులు”, “ఎండు ఖర్జూరం”కథల ద్వారా తెలుస్తాయి,తన కుటుంబం పంతం వల్ల మారిపోయిన జీవితాలు గురించి “నీలాటి ముసురు”, “సత్యవేణి” కథల ద్వారా చూడచ్చు. పుట్టి, పెరిగిన ఇల్లును విడిచి వెళ్లలేకపోయిన నారాయుడు గురించి “మట్టి దిబ్బలు” కథ చెప్తుంది. ఈ మధ్య వచ్చిన “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా మూల కథైనా “నల్ల వంతెన” .. ఇలా గోదావరి చుట్టూ ఉండే ప్రతి జీవితం గురించి ఈ కథలలో మనం చదవచ్చు..ప్రేమ గురించి, ప్రేమించడం గురించి ఎంతుందో.. ప్రేమ వైఫల్యం, బాధ కూడా అంతే ఉంది. ఒకే కథలో అన్ని భావోద్వేగాలను పాత్రల ద్వారా మనకు చూపిస్తారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నాగేంద్ర గారి One -liners & ఉపమానాలు గురించి. “ప్రేమ కన్నా ఆకర్షణే గొప్పది“, “జబ్బు కన్నా తమ్ముడంటే భయం. అతని దగ్గర డబ్బు ఉంది”, “ఒకటో తారీఖు అవసరాన్ని గుర్తుచేసింది కానీ ప్రేమను కాదు“ లాంటి ఎన్నో వాక్యాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. అవి ఒక్క నిమిషం కథ నుంచి బయటకి వచ్చి మనల్ని ఆలోచింపచేస్తాయి.
పాత్రలు ఎంత సహజంగా ఉన్నా కూడా కథలో కొన్ని సన్నివేశాలు చాలా cinematic గా అనిపించాయి. అలానే ప్రతీ కథ కూడా ఒకే భావోద్వేగంతో ముగించడం వల్ల , చాల కథలను నేను ముందే ఊహించగలిగాను. కోనసీమ ప్రాంత యాస పదాలు కొన్ని పాత్రల ద్వారా పలికించినా , కొందరు మాములుగానే మాట్లాడుతారు. అలా కాకుండా వీలైనంత ఎక్కువ పాత్రలు మాట్లాడి ఉంటే కథలు మరింత స్థానికతతో రాణించేవని నా అభిప్రాయం. అయితే ఈ కథలను Binge reading కాకుండా రోజుకో కథ చదివితే మంచి అనుభూతినే ఇస్తుందని అనుకుంటున్నాను.
గోదావరి ప్రాంత కథలు కోసం వెతికే వాళ్ళ కోసం ఈ “నల్ల వంతెన” ఒక మంచి కానుక!
ఈ పుస్తకం Amazon.in లో దొరుకుతుంది. పుస్తక ధర : ₹197/-
దయచేసి పుస్తకాలను కొని చదవండి..!
అమెజాన్ లింక్ : https://amzn.to/45JU57B
Add comment