ఊరు, వాన, చెరువు, మట్టి పరిమళం, వెన్నెల రాత్రులు, చందమామలోని రాట్నం వడికే ముసలవ్వ, చల్లని చెట్ల నీడ, చిన్ననాటి మిత్రులు, ఆట పాటలు, కౌమారదశలోని ప్రియురాలు, అమాయకత్వంతో వెలిగిపోయే కళ్ళు, పంట కాలువలు, బొండుమల్లె పూలు, మోదుగుపూలు, పండుగలు, మబ్బులను తాకుతూ గొలుసులు గొలుసులుగా సాగిపోయే కొంగలు… అన్నీ కలిస్తే అందమైన బాల్యం. జ్ఞాపకాల దొంతర,.. ఒకానొక నోస్టాల్జియా… ఎన్నేళ్ళైనా, మనమెంత ఎత్తుకెదిగినా ఈ అనుభూతులన్నీ గుండె గదుల్లో పదిలంగా ఉంటాయి. చూస్తుండగానే ఋతువులు మారినట్లు, తెలియకుండానే పిడికిట్లోని నీళ్ళు జారిపోయినట్లు, ఏదో గారడి చేసినట్లు బంగారు బాల్యం కరిగిపోతుంది. కాని ఎప్పుడైనా పుట్టిన ఊరికి పోయినపుడో, చిన్ననాటి చెలికాడు ఎదురుపడ్డప్పుడో ఆ మధురానుభూతులన్నీ మనసు వాకిట్లో ‘తామరపూలు’ విచ్చుకున్నట్లు విచ్చుకుంటాయి.
తామర పూలు కథ ఇక్కడ చదవండి!
కథకుడి ఇంటి ముందర రెండు చింత చెట్లు. నర్సయ్య అనే మిత్రుడితో కలిసి కథకుడు ఎప్పుడూ ఆ చింత చెట్ల కిందే ఆడుకునేవాడు. ఈ చింత చెట్లకు రవ్వంత దూరంలో బొడ్డు మల్లె చెట్టు. ఆ బొడ్డు మల్లెల్ని ఏరుకోవడానికి అప్పుడప్పుడు సీత వచ్చేది. నర్సయ్య మల్లె చెట్టు ఊపుతుంటే వానలా రాలి పడుతున్న బొడ్డు మల్లెల్ని కథకుడు సీతతో కలిసి ఏరేవాడు. మల్లెపూలతో వడి నిండితే సీత సంబరపడేది. బొడ్డు మల్లె కాడ తెంపి నోట్లో పెట్టుకొని ఊదే వాళ్ళు. ఆ వింతైన ధ్వనికి సీత ముత్యాలు రాలినట్లు కిలకిలా నవ్వేది. గుడి స్తంబం మీద కూర్చుని ఏరుకున్న మల్లెలతో బారెడు మాల అల్లేది. మాల అల్లుతున్నప్పుడు వింతగా కదిలే ఆమె చేతి వేళ్ళను చూస్తూ, ఆమె మోమును చూస్తూ కథకుడు ఆమె పాదాల వద్ద కూర్చునేవాడు.
వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండేవి కావు. గంతులేస్తూ వానలోనే తడిసి ముద్దయ్యేవాళ్ళు. అపుడపుడు చెరువు కట్ట ఎక్కేవాళ్ళు. “చెరువు కట్ట ఎక్కి చూస్తే చెరువులో నీళ్ళు కనిపించేవి కావు. చెరువు నిండా పరుచుకున్న పచ్చని తామర ఆకులు. వాటి మీద ముత్యాల్లా మెరిసి ఆటలాడే నీటి బిందువులు. రెండాకులకు ఒక పూవు చొప్పున విచ్చుకున్న తామరలు. వాటి మీద ఎగిరే నల్లని తుమ్మెదలు. అబ్బో! అదొక మహాద్భుత దృశ్యం.”
పొద్దున్న విచ్చుకున్న తామరలు సాయంత్రం కల్లా ముఖం వేలాడేసేవి. అలా ఎందుకని వాళ్ళ నాయనమ్మను అడిగాడు. “ఎండకేమో” అన్నది ఆమె. తామరలకు ఎండ తగల కుండా నానా ప్రయత్నాలు చేశారు. ఏవీ ఫలించలేదు. “వెర్రి వెధవా! తామరలు ఎండకు వాడవు. విచ్చుకుంటవి. సూర్యుడు క్రుంగితే ముడుచుకుంటవి” అన్నారు వాళ్ళ నాన్నగారు.
“వర్షాకాలం దాటిపోయింది. ఎండాకాలం వచ్చింది. చెరువు సాంతం ఎండిపోయింది. ఆ తామరలు… ఆ అందం అంతా అంతరించింది. చెరువు కట్టకు వెళ్లినప్పుడల్లా బీటలు వారిన చెరువును చూస్తే ఏడుపు వచ్చేది. వానా కాలం వస్తది. ‘చెరువు నిండుతది. తామరలు పూస్తయి.’ అనేవాడు నర్సయ్య. వానాకాలం కోసం ఎదిరి చూపులు.. ఎదిరి చూపులు.. ఎదిరి చూపులు.. మృగశిర వస్తే వర్షం వస్తుందన్నారు. మృగశిర రానే వచ్చింది… వాన పడుతుంది. చెరువు నిండుతుంది. తామరలు తంపరలుగా పూస్తాయని ఆశ… కాని మబ్బులు రాలేదు. వాన కురవలేదు. ఆశ ఫలించలేదు.” వాన రావాలంటే ఏం చేయాలి? రోకలి బండకు కప్ప తల్లిని కట్టి ఇంటింటికి తిరిగి దేవుని గుళ్ళో నీళ్ళు పోశారు. అయినా వాన రాలేదు. “వాన కురుస్తదా? చెరువు నిండుతదా? తామరలు పూస్తయా?” వాన కురవాలని గ్రామ దేవతకు బోనాలు తీశారు. ముస్లింలంతా కలిసి ఎండిన చెరువులో మూకుమ్మడిగా నమాజు చేశారు. అయినా వాన పడలేదు.
ఒకనాడు సీత వచ్చింది. “సీతా వాన పడదా? చెరువు నిండదా? తామరలు పూయవా?” అనడిగాడు కథకుడు. “రేపు చెరువులో విరాట పర్వం పురాణం చెప్పుతరట. వాన వస్తది. చెరువు నిండుతది. తామరలు పూస్తయి అన్నది. ఆమె మాటల్లో అంతులేని విశ్వాసం దర్శనం ఇచ్చింది.”
వాన కోసం ఇంత తపించినా చివరాఖరికి వాన వచ్చిందా? చెరువు నిండిందా? తామరలు పూశాయా? ప్రకృతి పులకరించిందా? సీత, కథకుడు చెట్టాపట్టాలేసుకొని ఎగిరి గంతులు వేశారా? తెలియాలంటే కథ చదవాల్సిందే.
సకాలంలో వర్షం పడాలి. చెరువు నిండాలి. పంటలు పండాలి. ప్రకృతి పులకరించాలి. మనిషి జీవితంలో వసంతం పూయాలి అనే ఒక సాధారణ వస్తువును గొప్ప కథగా మలిచాడు కథకుడు. వర్షాన్ని నెపంగా తీసుకొని బాల్యపు మాధుర్యతను, గ్రామ సౌందర్యాన్ని, పల్లె సంస్కృతుని, నీటి కరువును సజీవ దృశ్య కావ్యంలా చిత్రించాడు. అంతే కాదు చెరువులో నీళ్ళు, తారమరలు కల్సిపోయినంత గొప్పగా గ్రామంలోని హిందూ, ముస్లిం సంస్కృతిని చూపెట్టడం కథకుడి దార్శనికతను పట్టి చూపుతుంది.
చెరువు మీద నీడ పడటం కోసం చెరువు కట్ట మీద అన్నీ చెట్లు నాటాలి, చెరువు మీద ఎండ పడకుండా చెరువు నిండా గొడుగులు పట్టాలి. ఆకాశం వంగిన చోటుకు వెళ్లి రావాలి. చెట్టెక్కి సూర్యుడిని పట్టుకోవాలి లాంటి పిల్లల ఊహల్ని కథలో ఎంతో అందంగా వాడుకున్నాడు. ఇది రచయిత యొక్క కథ రాయడంలోని సాధికారికతను పట్టి చూపుతుంది.
వర్షం అనగానే మనకు రైతులే గుర్తుకు వస్తారు. కాని పిల్లలు కూడా వర్షం కోసం ఎంతో ఎదురుచూస్తారని, వాన కోసం వాళ్ళు కూడా దేవుడిని వేడుకుంటారని, వర్షం చుట్టూ వాళ్లకు కూడా ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు ఉంటాయని ఈ కథలో చదువుతుంటే ముచ్చటేస్తుంది.
సమస్త మానవాళి జీవికను కొత్త చైతన్యంతో నింపే వర్షంలాంటి గొప్ప వస్తువును పిల్లల కోణంలో నడిపించడంలోనే కాదు దాన్ని అద్భుతమైన కథగా మలిచిన తీరులో శిల్ప రమ్యత తొంగిచూస్తుంది. శిల్పం పాత్ర చిత్రణలోనో, వస్తువులోనో, సంభాషణల్లోనో, రాసే టెక్నిక్ లోనో ఉండదు. కథంతా పరచుకొని ఉంటుంది. అనేదానికి ఈ కథ ఒక అక్షర సాక్ష్యం. చిన్నచిన్న వాక్యాలతోనే కథ నడిపించడంలో కూడా శిల్ప చమత్కారం దాగి ఉంది. కథలో ప్రధాన పాత్రలు మూడే. కథకుడితో పాటు అతని స్నేహితురాలు సీత, మరో స్నేహితుడు నర్సయ్య. కాని వర్షం, తామరపూలు కూడా పాత్రలే అనిపిస్తాయి. కథా సంవిధానం, సంభాషణలు పాఠకుడిని ఆకట్టుకుంటాయి. తెలంగాణ కథ ఎదిగిన ఎత్తులకు ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ.
వర్షం కోసం నిరీక్షించే తెలంగాణా ప్రజల ఆరాటాన్ని, చెరువు చుట్టూ అల్లుకున్న తెలంగాణ ప్రజల జీవితాన్ని, తామరపూల పరిమళాన్ని, సౌందర్యాన్ని మన మనసు అనుభూతించేలా చేసిన కథకుడు ప్రసిద్ధ తెలంగాణ రచయిత డా. దాశరథి కృష్ణమాచార్య సోదరుడు దాశరథి రంగాచార్య.
అన్నయ్య కృష్ణమాచార్యతో పాటు రంగాచార్య కూడా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడు. 1928 ఆగష్టు 24న మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన రంగాచార్య తాను నమ్మిన సిద్ధాంతానికి అక్షర రూపంగా చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపథం, అమృతంగమయ, పావని, మాయాజలతారు, రానున్నది ఏది నిజం నవలల్ని, ‘నల్లనాగు’ అనే కథా సంకలనాన్ని రచించాడు.
మానస కవిత, జనరంగం, భారత సూక్తం అనేవి రంగాచార్య కవితా సంపుటాలు. ‘జీవనయానం’ ఆత్మకథ. శబ్దశ్వాస, శతాబ్ది, అక్షర మందాకిని, వేదం జీవన నాదం వ్యాస సంకలనాలతో పాటు శ్రీమద్రామానుజాచార్యులు, బుద్ధుని కథ, మహాత్ముడు అనే జీవిత చరిత్రల్ని రచించాడు. శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం, నాలుగు వేదాలను సరళ వచనంలోని అనువాదం చేశాడు.
ఇవేగాక ఉమ్రావ్ జాన్ అదా, రణరంగం, దేవుని పేరిట, ఇక్బాల్ కవితలు, అనువాద కథలు, ఉర్దూ మదిర అనేవి రంగాచార్య మరిన్ని అనువాద రచనలు. తెలంగాణ జన జీవితాన్ని ఎంతో సజీవంగా చిత్రించిన రంగాచార్యను ఎన్నో అవార్డులు వరించాయి. కాని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు వరించక పోవడం శోచనీయం. 8 జూన్ 2015న మరణించాడు. ‘తామరపూలు’ కథ 1969లో రచింపబడింది.
*
చక్కటి సమీక్ష. కథను పూర్తిగా సమీక్ష చేసి అటు తరువాత రచయితను గురించి వివరించడం. అదీ ఒక లబ్ద ప్రతిష్టుడైన దాశరధి రంగాచార్య గురించి మొదట చెప్పి ఉంటే పాఠకుల యొక్క అభిప్రాయం పై ప్రభావం ఉంటుంది. ఆ విషయాన్ని సమీక్షకులు దృష్టి అనుకున్నారు కావచ్చు బహుశా.
కథలో ఉన్నటువంటి చక్కని విషయాలను వస్తు పరంగా శైలి పరంగా శిల్ప పరంగా చక్కగా విశ్లేషించారు. అప్పుడప్పుడు ఇలాంటి సీనియర్ రచయితల కథలను కూడా సమీక్ష తోపాటు అందిస్తే పాఠకులకు మరియు వర్ధమాన రచయితలకు ఉపయుక్తంగా ఉంటుంది.
తెలంగాణలో గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన దాశరథి రంగాచార్య గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకపోవడం శోచనీయం.
సమీక్షకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు . సారంగకు కృతజ్ఞతలు.
Wonderful
తామరలు రెండు హిందూ ముస్లిం జీవన సంస్కృతికి దర్పణం ముని, ఆ సంస్కృతీ సంప్రదాయాలు ఎండిపోకుండా పల్లె ప్రజల ఆరాటాన్ని వెల్దండి శ్రీధర్ సముచిత రీతిలో సమీక్షించి వివరించారు.