తెలంగాణ గీతంలో భాష ఎవరిది? భావం ఎవరిది??

తెలంగాణ గీతంగా అందెశ్రీ రచించిన ‘‘జయజయహే తెలంగాణ” ప్రస్తుతం అనేక వాదవివాదాలకు దారి తీసింది. ఈ పాటను అందెశ్రీ పప్పు నారాయణాచార్య నుండి కొన్ని లైన్లు స్వీకరించాడని, లేదు ‘‘జయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి” అని దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయం నుండి తీసుకున్నారని మరికొన్ని వాదనలు ఉన్నాయి. ఇవన్నీ సరేగని తెలంగాణ ఆత్మగౌరవాన్ని పలికించే తెలంగాణ భాషలో ఈ పాటను రచించకపోవడం చాలా విషాదకరం. తీవ్ర అభ్యంతరకరం.

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఉద్యోగాల నినాదం మీద పురుడు పోసుకున్నప్పటికీ, అంతకు మించిన ఆత్మగౌరవ కాంక్ష అందులో దాగి ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతిని, భాషను చాలా కాలం పాటు పాలకులు అవహేళన చేశారన్నది కాదనలేని సత్యం. ఇక తెలంగాణ సాహిత్యాన్ని కూడా చాలా వరకు విస్మరణకు, నిర్లక్ష్యానికి గురి చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం పురుడు పోసుకున్నది. 1952లోనే తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతూ రావెల వెంటక రామారావు తెలంగాణ మాతృగీతాన్ని రచించాడు. అట్లా తెలంగాణ అంటే కేవలం అభివృద్ధి పరమైన అన్యాయాల గురించే కాక, భాషా సంస్కృతులకు జరుగుతున్న నిర్లక్ష్యాలను ఎప్పటికప్పుడూ నిలదీస్తూ వచ్చింది ఉద్యమం. తెలంగాణ భాషను అటు పాఠ్య పుస్తకాల్లోగానీ, ఇటు దినపత్రికల్లోగానీ కనీస చోటుకు ఆస్కారం లేకుండా చేశారు. ఇది అనుకోకుండా జరిగిందేమీ కాదు. ఇక ఉద్దేశ్యపూరితంగా తెలంగాణ భాషను అవహేళనలు చేసేందుకు సినిమాల్లో సైతం కమెడీయన్​లకు, విలన్​లకు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. మరి అంత అన్యాయానికి వివక్షతకు తెలంగాణ భాష గురైందనే విషయాన్ని తెలంగాణ కవులు, రచయితలు, విమర్శకులు గడిచిన మూడు దశాబ్దాలుగా చర్చకు పెట్టారు. భాషాశాస్త్రవేత్తలు ఆచార్య రవ్వా శ్రీహరి, నలిమెల భాస్కర్​ వంటి వారు తెలంగాణ భాషకు పట్టం కట్టేందుకు ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిఫలించేలా తెలంగాణ భాషలో రాష్ర్ట గీతం ఉండాలి. మరి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’గీతంలో ఇలాంటి సోయి మచ్చుకైనా కనిపించదు. పూర్తిగా వాడుకలో లేని మృతభాషలో సంస్కృత పదజాలంతో ఆధిపత్య స్వభావాన్ని ఈ గీతం కలిగి ఉన్నది. పండితుల మెప్పుకోసం, పండితుల కోసమే రాసినట్టుగా ఉండడం విడ్డూరం.

‘‘కళల మంజీరాలు…శారత స్వరనాదాలు

పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ…”వంటి పద ప్రయోగాలు ఈ రాష్ర్ట గీతంలో పదపదాన కనిపిస్తాయి. నిజానికి ఇది పద్యకవుల భాష. అది పండితులదే తప్ప, పామరులది కాదు. శంకరంబాడి సుందరాచార్యులు రచించిన మా తెలుగు తల్లి గీతంలో ఇలాంటి పద ఆడంబరాలు మచ్చుకైనా కానరావు.

‘‘గలగలా గోదారి తరలిపోతుంటేను

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

…….

నీ ఆటలే ఆడేము, నీ పాటలే పాడేము”అంటూ సుందరాచార్యులు సుందరంగా అచ్చ తెలుగు పదాలతో ఆనాడు పాట రాశారు. మరి ఈ కాలాన అందెశ్రీ మాత్రం ఎవ్వరూ వాడని భాషలో పాట రాయడం దేనికి సంకేతం? తెలంగాణ భాషకు అన్యాయం జరిగిన విషయం ఆయనకు తెలియదనుకోవాలా? లేక బ్రాహ్మణ పండితుల మెప్పుకోసం అర్రులు చాచడమా? తిరోగమన సంప్రదాయ కంపుకు ఎందుకంత బానిస కావడం? తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో దళితుల ఇంట పుట్టిన కవికి, అక్కడి నుడికారం తెలియకుండా ఎలా ఉంటుంది. మరి ఎందుకని అందెశ్రీ ఈ రకమైన కొద్దిమంది భాషను ఎత్తుకొని నూటికి తొంభైమందిగా ఉన్న వారికి దీనిని దూరం చేసినట్టు?

‘‘శ్రమయాగం, శారద స్వరనాదాలు, ఒడలు పులకరించడం’’వంటి పదాల ప్రయోగాలు తెలంగాణ మట్టి మనుషులకు ఏ మేరకు అర్థమవుతాయో అందెశ్రీకే తెలియాలి. పైగా ‘‘గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు’’అని మొదట ఉన్నదాన్ని మార్చి ప్రస్తుతం ‘‘గోలుకొండ భాగ్యనగరి వెలుగు’’అని ఎవరి మెప్పుకోసం మార్చినట్టు? అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల్ని తొలుస్తున్నాయి.

ఇక ఈ గీతంలోని భావం విషయానికొస్తే… పాటలో సగానికి పైగా ఆధిపత్య భావజాలాలకు కేంద్రంగా నిలిచిన రాజ్యవ్యవస్థలను, వ్యక్తులను కొనియాడడం మరింత ఆశ్చర్యకరం. కాకతీయ, శాతవాహన రాజులను గురించి కీర్తించాడు ఈ కవి. వారి గొప్పతానాన్ని కీర్తించడమంటే ఆ రాజుల మీద తిరగబడిన సామాన్యులను అవమానించడమే అవుతుంది. ఇక సంస్కృత కవుల మీద గంపెడు ప్రేమను గుప్పించాడు ఈ కవి. సామాజిక స్పృహను వదిలిన అనేకమంది కవులు నాటి రాజుల మెప్పుకోసం, తోటి పండితుల ప్రశంసల కోసం, గండపెండారాల కోసమే రచనలు చేశారనేది పచ్చినిజం. మరి ఆ కవులను, వారి రచనలను కీర్తించడంలో అందెశ్రీకి ఏ దృక్పథం ఉన్నట్టు? ఆనాటి కవుల వలెనే ఈ కవి కూడా ఎవరినో మెప్పించడానికే రాసినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సమాజంలో సమానత్వం తమ వంతుగా త్యాగాలు చేసిన దున్నా ఈద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, ఏపూరి హనమద్దాసు వంటి కవులను పట్టించుకోలేదు. అలాగే ప్రజల కోసం ప్రాణమిచ్చిన అనేక మంది ప్రజా నాయకులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వీరులను స్మరించనేలేదు. ఇక దళిత జాతి ఉద్ధరణ కోసం పని చేసిన భాగ్యరెడ్డి వర్మవంటి వారికి ఈ గీతంలో చోటు దక్కనేలేదు. అంటే అందెశ్రీగారి లక్ష్యం సామాన్యులు కాదు. కేవలం పిడికెడు మంది అగ్రవర్ణపండితులను మెప్పించే లక్ష్యంతోటే ఈ గీతాన్ని రచించాడనేది ఈ విధంగా స్పష్టమవుతున్నది.

రాష్ర్ట గీతంలోనే కాదు అందెశ్రీ పలు పాటల్లో ఇదే రకమైన పద్యకవుల శైలి కనిపిస్తది. సమాజం ఆధునికంగా పోస్ట్​ మాడర్నిజం దశకు చేరుకున్నా సరే, అందెశ్రీ మాత్రం ఇంకా మృతభాషలోనే రచనలు చేస్తూ బ్రాహ్మణీయ మనువాద భావజాలంలో మునిగి తేలుతూ పులకరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ పాటల ఒరవడిలో గద్దర్​ నుండి నేటి వరకు ఉన్న వందలాదిమంది పాటకవుల్లో ఈ రకమైన తిరోగమన చైతన్యం మనం ఒక్క అందెశ్రీలో మాత్రమే చూడగలం. అందుకు కారణం ఆయన ఎక్కడో దారి తప్పడనేది ఇప్పుడు తెలుగు సమాజంలో ఎంతోమంది నాలాంటి వారి ఆవేదన.

*

పసునూరి రవీందర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలంగాణా రాష్ట్ర గీతాంగా డిక్లేర్ చేసినపుడు రాని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకోస్తున్నాయో మాకు అర్ధం కావట్లేదు. కేవలం కీరవాణి మ్యూజిక్ చేసాడనేనా. లేదా వేరే ఏమైనా ఉందా…ఏదేమైనా ప్రాంతీయ విద్వేషాలు ఇంకా రెచ్చగొట్టడం మంచిది కాదు. మీరంతా మర్చిపోయిన కవి చింతల యాదగిరి అన్నకు మా గుంటూరు లో నార్త్ అమెరికా తెలుగు సంఘం వారిచే పురష్కారం ఇచ్చి గౌరవించడం జరిగింది.
    కళకి కవిత్వానికి, పాటకి, భావనకి ప్రాంతీయ తత్వం అంటగట్టొద్దు…

  • ఉద్యమ సమయంలో జయజయహే తెలంగాణ ఉర్రూత లూగించినప్పుడు ఎవరూ సాహిత్య లోతుపాతులు చర్చించలేదు. అదే రాష్ర్ట గీతం అని అనధికారికంగా పాఠ శాలల్లో పాడారు. తెలంగాణ భాష లేదు. భాష యాస పై నేడు గొడవ. బాణీ పై ప్రాంతీయ చిచ్చు. వచనమా గద్యమా పద్యమా అనేది ప్రకటించే రోజు నాటికి మొదలైంది.
    ఇచ్చట సాహిత్యంపై , అందెశ్రీ వ్యక్తిత్వం పై చర్చ అనవసరం. ఆ సాహిత్యం ప్రజలకు చేరువైందా లేదా అనేదే ప్రధానం . పాట రచయితకు బాణీ ఎంచుకునే స్వేచ్చ వుండాలి.
    శ్రీశ్రీ సాహిత్యానికి , ఆయన వ్యక్తిగత జీవితానికి లంకె పెట్టిన నేటి కుర్రకారును చూస్తే జాలి వేస్తుంది. అలాగే నేటి రాష్ర్ట గీతంపై రభస కూడదు. గాయాలను మాన్పుకునే దిశగా కదలాల్సిన తరుణం. తొమ్మిదేళ్ళు పాట సాహిత్యం గురించి ఎవరూ ఏమనలేదు. ఒకరి శైలిని మరొకరు విమర్శించటం కూడదు. పాటపై వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయవచ్చు కానీ దాన్ని తెలంగాణ సమాజం మొత్తం తూలనాడాలనే విధంగా వుండకూడదు.
    రావెళ్ళ మొదటితరం ఉద్యమం కి ప్రేరణ. మలి విడత ఉద్యమంలో అందెశ్రీ గీతం ఊపు నిచ్చింది. బహుజన గొంతులు రచయితలు సాయుధ పోరాట వీరుల స్మరణ ఈ గీతంలో లేవని పసునూరి రవీందర్ గారు ఆవేదన వెలిబుచ్చారు. ఒక గీతం వ్రాసేటప్పుడు రచయిత మనసులో నుండి జాలువారే జలపాతంలోని అక్షరాలు భావాలను మనకనుకూలంగా లేవని పాటే బాగా లేదని విమర్శించ కూడదు.
    ఈ చర్చ తొమ్మిదేళ్లు జరగకుండా కేవలం కీరవాణి సంగీతం అందించే ప్రక్రియ మొదలయ్యిన తర్వాత బయల్దేరటం ద్వారా నిజాయితీ లేదనిపిస్తుంది.
    బ్రాహ్మణీయ మనువాద భావజాలం అందెశ్రీ లో కీరవాణి ప్రవేశం తర్వాతే చూసారా?! ఒకవేళ ముందే చూస్తే తొమ్మిదేళ్ళ నుండి జనం లోకి తీసుకెళ్లగలిగే ప్రయత్నం ఎందుకు చేయలేదు. రాజులను నవాబులను పొగిడిన విషయం ఈ రోజే పాట వెలువడినట్లు ఆదరాబాదరాగా రాష్ర్ట గీతం గా ఆమోదించినట్లు రభస ఎటువైపు దారి తీస్తుంది. గడీ ల్లో బానిసత్వం చూసాం కానీ తెలంగాణ సమాజం కులాలు మతాలు వేరైనా బంధువులు కాకపోయినా వరుసల తో పిలుచుకుంటున్నాం. అదే ఒరవడి సాగాలి. ఏదైనా ప్రజాస్వామిక చర్చ ఆహ్వానించ దగినది

  • బ్రాహ్మణ భావజాలమే అన్న….ష పండితులను మెప్పిస్తే ఇక సామాన్యుల సంగతి వదిలేశాడు. బహుజన వీరులు ప్రస్తావన తన గానంలో లేకపోవడం చరిత్ర ఎప్పుడు క్షమించదు అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం గా లేదు తెలంగాణ గీతం చాటున బ్రాహ్మణ భావజాలాన్ని పొగిడేట్లుగా ఉంది… మీ విశ్లేషణకు అభినందన ధన్యవాదాలు

  • చాలా కరెక్ట్ గా చెప్పారు.నాకున్న కొద్దిపాటి పరిశీలనలో అందెశ్రీ ఎన్నడూ దళితుడుగా identify కాలేదు.అలా కావడం అతనికి యిష్టం కూడా లేదు.అలా చాలా
    సందర్భాల్లో.బహిరంగంగా ప్రకటించారు.పుట్టుక రీత్యా ఆయన దళితుడు కావొచ్చు.కానీ అతని భావజాలం బ్రాహ్మణీయ,మనువాద భావజాలం.దళిత సు
    గ్రీవుడు అంటే యిలాంటి వారే.

  • అందెశ్రీ గారు సంస్కృతపదాడంబరంతో గీతరచన చేయటం మీద మీకు అభ్యంతరం ఉంటే తేటతెలుగులో చేయవలసినది అని నిరసన తెలియజేయవచ్చును. తప్పులేదు. కాని సంస్కృతాన్ని మృతభాష అని వెక్కిరించటమూ మధ్యలో బ్రాహ్మణులను వెక్కిరించటమూ అవసరమా?

    సంస్కృతం ఒక మృతభాష అని వెక్కిరించే ఈమేధావిగారు తన వ్యాసంలో ఉన్న సంస్కృతమూలం కల పదాలను ఒక మారు లెక్కించి చూచుకోవటం మంచిది.

    ఏదో అమాయకబాలుడి ఆవువ్యాసంలో లాగా బ్రాహ్మణులనూ మనువునూ సందుచూసుకొని ఆడిపోసుకున్నంత మాత్రాన అభ్యుదయవాదులం ఐపోతున్నాం అనుకొనే వాళ్ళకు ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో ఆ దేవుడికి తెలియాలి!

    అన్నట్లు, తెలంగాణా భాషలో తెలంగాణాగీతం లేదని ఆక్షేపించే ఈవ్యాసాన్ని ఎందుచేత తెలంగాణాభాషలో వ్రాయలేదో అని తప్పకుండా అడుగవలసిందే కదా?

  • అద్భుతమైన విశ్లేషణ అన్న… చాలా బాగా రాసిన్రు…👌👌👌

  • గత ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నది..
    అప్పుడు వాగ్గేయకారుడిగా పేరొందిన గోరటి వెంకన్న చేత
    రాయించి ఉంటే బావుండేది..
    అది చేయలేదు కాబట్టి అందెశ్రీ పాటను అప్పుడే రికార్డు చేయించి ఉండాల్సింది.. మార్పులు చేర్పులు చేయించి..
    తెలుగు లో సంస్కృతం ప్రభావం అపారం..
    అలాగే తెలంగాణ లో గ్రాంథిక భాష వాడుక కూడా అధికమే.
    అలా చూడాలేమో పాటను..
    భాగ్యరెడ్డి వర్మవంటిమీరన్న మార్పులు చేయించి ఉంటే బావుండేది
    అగ్రవర్ణ పండితుల మెప్పు కోసం రాశారనటం సమంజసం కాదు

  • “లంకె బిందె” అందె..!! శ్రీ కి,
    “కళ కల గళ గర్వం” అందె..!! శ్రీ కి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు