నేను రాసిన ఈ వ్యాసాన్ని కేవలం చరిత్ర కోణం నుండే చదవాలి అని మనవి చేస్తున్నాను.
భారత స్వాతంత్ర ఉద్యమం నుండి రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు క్రియాశీలకంగా ముందుండి ఉద్యమాలను నడిపించారు. ఈ రాష్ట్రం అనేక ఉద్యమాలకు జన్మనిచ్చింది. ప్రాణాలను పణంగా పెట్టి వారి హక్కుల కోసం, రాష్ట్ర అస్తిత్వం కోసం ఎటువంటి పోరాటానికైనా వెనకాడలేదు. అందుకు నిండు నిదర్శనం మొన్న జరిగిన గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం అని కూడా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రతి ఉద్యమ కీలకమైనది.
దౌర్జన్యం, దోపిడీ, ఆధిపత్యం, వివక్ష, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, హక్కుల కోసం, ఆధిపత్య పోరు, అణచివేత, రాష్ట్ర ప్రయోజనల కోసం, రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణ కోసం ఇక్కడి కులం,మతం,ప్రాంతం అనే బేధం లేకుండా ఇక్కడి ప్రజలు చైతన్యంతో ముందుకు కదిలి, కోట్లాది చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను సృష్టించారు. అది చెరగని, చెరపని చరిత్ర. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా నడిపిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
ఈ మధ్య కాలంలో ఈ ఉద్యమాలను కొన్ని శక్తులు మన చరిత్ర పుటల్లో చొరబడి చీడ పురుగుల్లా వారికి అనుకూలంగా మలచుకొని, చెరిపివేసే దిశగా సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్ సంస్థాన విలీన ఉద్యమంలో అమరులైన వారి ఉద్యమ త్యాగాలను, ప్రాథమిక కారణాలను, సిద్ధాంతాలను, లక్ష్యాలను, ఆశయాలను మరిచి, ఎటువంటి గౌరవం లేకుండా కేవలం మతాలకోసం జరిగినట్లు, ప్రతీదీ మత కోణంలో బీజేపీ సరికొత్త, సోషల్ మీడియా సాంకేతిక సర్వప్రయత్నాలతో బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఆ ప్రయత్నాలు చాప కింద నీరులా పారుతున్నాయి. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు చరిత్రలో లేని వారు చరిత్రని వక్రీకరించడమే కాకుండా, తిరిగి రాస్తూ మతాలకు అతీతంగా జరిగిన ఉద్యమాలను హిందూ ముస్లిం మతాల సంఘర్షణగా విషప్రచారం పని కట్టుగా బీజేపీ చేస్తుంది.
మతం పేరిట చరిత్రను ఆపాదించడంలో భాగంగానే ఈ నెల సెప్టెంబర్ 17 దినాన్ని “ హైదరాబాద్ విమోచన దినోత్సవం – 1948 ” అని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర దినాన్ని కూడా అంత ఘనంగా ప్రచారం చేయడం నేనే కాదు తెలంగాణ సమాజం కూడా ఎరుగదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో వారికి మత కోణంకానీ, హిందూ-ముస్లిం మధ్య జరిగిన ఉద్యమం కాదు కాబట్టి, అది రెండు రాష్ట్రాల మధ్య, రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన ఉద్యమం అని తెలంగాణ ప్రజానీకానికి తెలుసు కాబట్టి వక్రీకరణకు ఆస్కారం లేకుండా పోయింది. అయినా సమయం దొరికినప్పుడల్లా పార్లమెంటులో మన దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విషం చిమ్ముతూనే ఉంటాడు.
సెప్టెంబర్ 17 విషయానికి వస్తే, చరిత్రను పరిశీలనగా తిరగేస్తే అప్పుడు జరిగిన నేడు భాయ్ భాయ్ అని పిలుచుకునే హిందూ- ముస్లిల మధ్యలో జరిగిన ఘర్షణ కాదు అనడానికి చరిత్ర లో చాలా ఆధారాలు సాక్షాలు ఉన్నాయి. దాన్ని నిరూపించుకునే ప్రయత్నం నేను చెయ్యడం లేదు కానీ అబద్ధాన్ని నిజం అని నమ్మించే విషం చిమ్ముతున్న విష సర్పాల కోరలను అణచివేసే ప్రయత్నం అని చెప్పొచ్చు.
నిజాం పాలనలో రజాకార్లు వారికి అనుగుణంగా పనిచేస్తున్న జమీందార్లు, పటేళ్లు, పట్వారీలు, దొరలతో కలిసి తెలంగాణ ప్రాంతం ఊర్ల పై పడి ప్రజలపై విపరీతమైన పన్ను వసూలు చెయ్యడం, ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించడం, పండించిన పంటలను దోచుకోవడం, భూములను ఆక్రమించి, స్వాధీనం చేసుకోవడం వంటి అరాచకత్వం పాలన కొనసాగింది. ప్రజల్లో భారీ ఎత్తున తిరుగుబాటు మొదలైంది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పిల్ల జల్ల అన్ని వర్గాల ప్రజలను సమకూర్చి, చైతన్య పరిచి జరుగుతున్న రాచరికత్వంపై గెరిల్లా పోరాటాన్ని “భూమి కోసం భుక్తి కోసం” అనే నినాదంతో రజాకార్లు చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని 1946లో ప్రారంభమై 1951 సంవత్సరాల వరకు కొనసాగింది.
అదే సమయంలో భారత దేశానికి స్వతంత్రం రావడం, తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరు ఉధృతం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా వార్త వ్యాప్తి చెందింది. నెలకొన్న ఉధృత వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి. కమ్యూనిస్టులు, తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాటాన్ని కొనిసాగిస్తున్న సమయంలోనే ఆపరేషన్ పోలో జరగడం మూలన రజాకార్లను ఎదిరించడానికి ప్రజల బలం తోడు అయ్యింది. అది నేను అన్న మాటలు కాదు ఒక ఇంటర్వ్యూలో రావి నారాయణ రెడ్డి గారు ఇలా అన్నారు :
“ 1948లో పోలీస్ యాక్షన్ జరిగింది. అప్పుడూ మన పోలీస్ యాక్షన్ జరిగినా జరగక పోయిన వాళ్ళు బలహీన పడ్డారు. ప్రజల యొక్క బలం బ్రహ్మాండంగా పెరిగిపోయింది అది వరకే. ఎక్కడ కూడా వల్ల యొక్క ప్రతిఘటన సరిగా లేదు. అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది. పోలీస్ యాక్షన్ జరగకున్నా నిజాంని కతం చేసేవాళ్లమే. ”
హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. హైదరాబాద్ విలీనం అనేది అంత సులభం అయిన చర్య కాదు. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్ లో విలీనం చెయ్యడానికి నిరాకరించడం వలన ఆపరేషన్ పోలో ద్వారా భారత ప్రభుత్వం, సైనిక బలగాలు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి జరిపిన ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ అని కూడా అంటారు.
నిజాం స్వయంగా యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి, ప్రధానంగా రజాకార్ల పై జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానంలో కొన్ని రాజకీయ, వ్యూహాత్మక కారణాల వలన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను అరెస్ట్ చేయలేదు.
హైదరాబాద్ రాష్ట్రంలో అశాంతి, నిజాం అనుచరుల తిరుగుబాటుకి దారి తీయకుండా ఉండేందుకు, పాలన సజావుగా సాగడం కోసం ఆయన సహకారం అవసరమైంది కాబట్టి, భారత ప్రభుత్వం నిజాం సహకారం కోరుతూ, అలాగే మాజీ పాలకుడిగా గౌరవం చూపించాలన్న ఉద్దేశంతో, ఆయనను శిక్షించకుండా ప్రతిష్టమైన హోదా – రాజప్రముఖ్ (1948-1956) పదవిని ఇచ్చారు. ఈ విధానం హింసా ఘటనలు లేకుండా, హైదరాబాద్‌ను భారతదేశంలో అధికారికంగా విలీనం చేయడంలో సహాయపడింది. ఈ విధంగా ఆపరేషన్ పోలో విజయవంతం అవ్వడం. రజాకార్ నాయకుడు కాశిం రజ్వీ దేశాన్ని వదిలి పారిపోయాడు. రజాకార్ల దళం కుప్పకూలి పోయాయి . ఆపరేషన్ పోలోని నడిపి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17న అసఫ్ జాహి నిజాంని నుండి అధికారికంగా స్వాధీనం చేసుకుంది.
“నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి సాధించుకున్న విజయాలు : వెట్టిచాకిరి రద్దు అవ్వటం, 10 లక్షల ఎకరాల భూమిపంపకం చేయడం, గ్రామాలలో ప్యూడల్ దోపిడీ రద్దు అవ్వటం, గ్రామాలలో ప్రజాతంత్ర పాలన మొదలు అవ్వటం. వీటిని నాశనం చెయ్యుటకు కేంద్రంలో అధికారాన్ని చేబట్టిన బూర్జువావర్గం తెలంగాణ ప్రజలపై మూడు సంవత్సరాలు యుద్ధం ప్రకటించింది. తెలంగాణను ఒక నిర్బంధ శిబిరంగా మార్చి ప్రజలకు అంతులేని కష్టాలను కలిగించిందిజ్.” అని (తెలంగాణ సాయుధ పోరాటం – నా అనుభవాలు) అని నల్ల నరసింహులు గారు పొందుపరిచారు. ఇలా నేటి తరానికి తెలియని ఎన్నో ఇతర విషయాలను, అంశాలను వారు ఆ పుస్తకంలో ప్రస్తావించారు. అదే విధంగా అనేకమంది ప్రముఖులు, రచయితలు, మేధావులు, ఉద్యమ నాయకులు కూడా వారి అనుభవాలను అనేక పుస్తకాల రూపంలో పంచుకున్నారు. చరిత్రని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న వారు, బీజేపీ దుష్ప్రచారం ముసుగులో ఉండి నిజమైన చరిత్ర అని గుడ్డిగా నమ్మి ఉద్వేగాలకు లోనవుతున్న వారు చరిత్రని క్షుణ్ణంగా చదివి జరిగిన సంఘటలను పరిశీలనగా చదివినపుడు అర్థం అవుతుంది. చరిత్ర బ్రతుకుతుంది.
బీజేపీ వక్రీకరిస్తున్న చరిత్ర
ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుండి హైదరాబాద్ విలీన ప్రక్రియ హిందూ- ముస్లిం ప్రస్థానం లేకుండానే ఉద్యమంగా మొదలు అయ్యింది. తెలంగాణ ప్రజలు దౌరజన్యానికి గురి అయ్యారు. అందులో అన్ని వర్గాల వారు, మతాల వారు కూడా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మట్టి మనుషులు అందరూ ఉన్నారు. కేవలం హిందూ మతానికి విరుద్ధంగా మొదలు అయిన యుద్ధం అనడానికి ఆస్కారం లేదు. చరిత్ర కారులు, ఉద్యమ కారులు ఆమోదించని చర్య.
- సోషల్ మీడియా ఆయుధంగా చేసుకొని చరిత్రను వక్రీకరించి, జోరుగా ప్రచారం చేస్తూ నేటి యువతను తప్పు దారి పట్టిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ తో, సినిమా రంగంలో ఉన్నవారిని వాడుకొని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను నమ్మించి విధంగా బలంగా తీసుకెళుతున్నారు. అది ఎప్పటికైనా ప్రమాదమే.
- కమ్యూనిస్టుల నడిపిన ఉద్యమాన్ని చెరిపివెయ్యాలి. కమ్యూనిస్టులు జరిపిన పోరాటాలను ప్రజలకు, ముందు తరాలకు దూరంగానే ఉంచే ప్రయత్నం. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి అమరవీరుడి పేర్లును ప్రస్తావించకపోవడం. అలా చేస్తే వీరి అబద్ధాలకు పట్టు పోతుంది కాబట్టి అలాంటి నిష్పక్ష పతంగ వ్యవహరించారు.
- వీర బైరన్ పల్లి జరిగిన హింసాకాండలో అశువులు బాసినా కమ్యూనిస్టు విప్లవ వీరుల అమరుల త్యాగాలను పిండ ప్రదానాలు చెయ్యడం RSS బీజేపీ ప్రతి ఏటా సంచలనం సృష్టించి, వారి త్యాగాలను వీరు రాజకీయ లబ్ధి కోసం హిందూ ముస్లిం ఉద్యమంగా లేని కొత్త చరిత్రను పరిచయం చేస్తున్నారు. సిద్ధాంతాల బేధాలు ఉన్న కానీ అవకాశం కోసం వాటిని లెక్కజేయకుండా వారి త్యాగాలను వీరి బుట్టలోకి వేసుకుంటుంది.
- సర్దార్ వల్లభభాయి పటేల్ గారి నేతృత్వంలో శాంతియుతంగా పాలన మార్పిడిని విమోచన దినోత్సవంగా నేటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం. ఉద్యమ కారుల త్యాగాలను అవమానించే విధంగా బీజేపీ అదించిన చరిత్రని అధికారిక మీడియా కథనాల్లో, ప్రభుత్వ వెబ్ సైట్లో ప్రసారం చెయ్యడం ద్వారా ప్రజల్లో ముస్లిం ప్రజానీకం పై ద్వేషం కలిగే తట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. పటేల్ గారి హయాంలో జరిగిన ఆపరేషన్ పోలో భారత్ లో విలీనం కోసం కాకుండా మత ప్రాధికన జరిగిన ఆపరేషన్ లాగా చూపిస్తున్నారు.
- పటేల్ గారి చేసిన ప్రతి కృషిని ఇదే రకంగా, బలంగా ప్రజలోకి తీసుకెళ్లాలి ముఖ్యంగా 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య తర్వాత, 1948 ఫిబ్రవరి 4 న RSS పై నిషేధం విధించారు. తరువాత RSS లిఖిత పూర్వకంగా రాజ్యాంగం స్వీకరించి, సాంస్కృతిక సంస్థగానే కొనసాగుతామని హామీ ఇచ్చిన తర్వాత, పటేల్ గారు గృహమంత్రిగా 1949 జూలైలో నిషేధాన్ని ఎత్తివేశారు.
హైదరాబాద్ భారత యూనియన్ విలీనం పై అనేక రకాలుగా చర్చలు, కథనాలు, పుస్తకాలు, కొన్ని దశాబ్దాల వరకు ఉద్యమకారులు, ప్రజలు ఎంతో అంత వారి జ్ఞాపకాలను , అనుభవాలను పుస్తకాల రూపంలో భద్ర పరిచినారు, పరిశోధన గ్రంథాలు వచ్చినప్పటికీ కూడా ఇటీవలే కాలంలో జరిగినంత విధంగా వక్రీకరణ జరగలేదు, నిజమైన చరిత్ర కనుమరుగు వెనక కొన్ని ముఖ్యమైన కారణాలు :
- తెలుగు మాట్లాడే రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్ర ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆంధ్ర ఆధిపత్య కారణంగా ఆ నాడు నడిపిన ఉద్యమ చరిత్ర చాలా భాగంగా మరుగున పడింది. అది కూడా ఒక కారణం తెలంగాణా సాయుధ పోరాటం కనుమరుగు కావడానికి.
- 2019 నుండి ఆపరేషన్ పోలో వెలుగులోకి వచ్చింది. దానికి రాజకీయ కారణాలు అనే చెప్పవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మునిసిపాల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి కొంత ఆశలు కలిగించాయి. అదే ఇప్పుడు బీజేపీ కి ఆయుధంగా మరి వారికి అనుకూలంగా మార్చుకుని దారులు వెతుక్కొని వక్రీకరిస్తున్నారు.
- గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ ఈ విలీన దినాన్ని రాజకీయం చెయ్యడమే కాకుండా, ఇతరులు దాన్ని బహిరంగంగా ఆగింకరించమని బలవంతం చేయడంలో విజయం సాధించింది.
- 2014 -2023 మధ్యలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న ఉద్యమాల చరిత్రను భద్రపరిచే విషయంలో విఫలం అవ్వడం, వాటి గురించి మౌనం వహించడం వల్ల బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారింది.
- బీజేపీ సంకల్పించిన రాజకీయ వ్యూహంకి భిన్నంగా బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవం పాటించడం ప్రారభించింది.
- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తీవ్రంగా ప్రజా పాలన దినోత్సవం అని పిలుస్తుంది.
- ఆలస్యంగా అమలైన విధానాల వల్లే బీజేపీ చరిత్ర వక్రీకరించడానికి కారణమైంది.
- బీజేపీ చాలా లోతుగా అధ్యయనం చేసి, లేని పోనీ కథనాలతో ప్రజల్లోకి వెళ్లి, విషాన్ని నురిపోస్తూ, కలసి కట్టుగా బ్రతుకుతున్న హిందూ ముస్లిం ఇతర మతాల మధ్య చిచ్చుపెడుతోంది. దొరికిన దారిని వదలకుండా అనువనున రాజకీయ లబ్ధి కోసం, రాబోయే రోజుల్లో గెలవడానికి చరిత్ర ను ఆధారం చేసుకొని, వారికి అనుకూలంగా రాసుకొని వక్రీకరించి, వ్యూహాలను రచిస్తుంది. దానికి నిదర్శనం రజాకార్ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ వంటి సినిమాలు 2024 లోకసభ ఎన్నికల ముందు నిర్మించి విడుదల అవ్వటం.
- రజాకార్ చిత్రానికి అవార్డ్స్ ఇచ్చి ప్రజా ప్రభుత్వాల అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగానే బీజేపీ వక్రీకరణ విధి విధానాలను వత్తాసు పలుకుతోంది.
- హరిహర వీరమల్లు సినిమా లాంటివి హైదరాబాదు కథనాల చుట్టూ తిరుగుతున్నాయి. ముస్లింని విలన్ గా చూపించే ప్రయత్నం సినిమాలు, సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ ద్వారా జోరుగా కొనసాగుతుంది.
- ఇప్పుడు అంతా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం. మనం ఎలాంటి సమాచారాన్ని డేటా బేస్ లో పొందు పరిస్తే దాని గురించి వెతుకుతున్న వారికి పొందు పరిచిన సమాచారం ఆధారంగానే సమాధానాలు వస్తాయి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుష్ప్రయోజనాలకోసం ఉపయోగించడం లో బీజేపీ ప్రభుత్వం దిట్ట. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, జరిగిన సంఘటనాలు, చరిత్రను మార్చి, వారికి అనుకూలంగా రాసుకొని కథనాలుగా, చిత్రాలుగా, రాసుకోవడం వాటిని ప్రామాణిక సమాచారం కింద పొందు పరచడం ద్వారా నిజమైన చరిత్ర కనుమరుగు అయింది. కొన్ని చోట్ల వెతుకుతున్న సమాచారానికి భిన్నంగా సమాధానాలు రావడం. రాబోయే తరం అధ్యయనం అంత సులువు గా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పు దారి పాటించే విధానం మరియు అసలైన చరిత్రనే తప్పు అని చూపించే ప్రయత్నం చాలా జరుగుతాయి. ఇది ఒక నియంత్రణనే. అవి పుస్తక పఠనం లో చేర్చి వాటిని చరిత్రలో జరిగిన సంఘటనకు భిన్నంగా చిత్రించబడుతాయి.
- మొన్నటి మొన్న తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం జరిగిన గో బ్యాక్ మార్వాడీ ఉద్యమాన్ని కూడా హిందూ మతం పై జరుగుతున్న ఉద్యమంలాగా చూపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు దేనికి కోసం ఎందుకోసం పోరాటం చేస్తున్నారు అనే విషయం పైన అవగాహన కలిగిన వారు కాబట్టి బీజేపీ ప్రయత్నాలను తిప్పి కొట్టాకలిగారు.
- భారత దేశ స్వాతంత్ర అనంతరం ఇతర సంస్థానాలు కూడా భారత యూనియన్ లో చేరటానికి నిరాకరించాయి వాటి పైన బీజేపీ మౌనం వహిస్తుంది. ముస్లిం రూట్స్ దొరకందుకు మరియు అధికారం చేయిజిక్కించుకునే వరకే, ఎనికల్లో గెలవడం వరకే ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తారు.
- భాష, సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలను వీరే రక్షిస్తున్నట్లు ప్రజలను మభ్య పెట్టి, భయభ్రాంతులకు గురిచేసే అధికార దాహం, రాజకీయ లబ్ధి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పుట్టకంటే ముందు నుండి ఉన్న వాటిని, ప్రజల జీవన విధానాల్లో ఉన్నాయి. వీరు ఎలా కాపాడగలరు. ప్రజలు ఉన్నంతకాలం ఉంటాయి.
- జ్యోతిభా ఫూలే 2025 సినిమాలో అనేక సన్నివేశాలను తొలగించమని, మార్పులను సూచించిన సెన్సార్ బోర్డు రజాకార్ వంటి చిత్రాలను ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చెయ్యకపోవడం ఇదంతా కలిసి కట్టుగా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
- భారత దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో కూడా వక్రీకరణ జరుగుతుంది అనడానికి ఈ సంవస్తారం జరిగిన స్వాతంత్ర దినోత్సవం ఎర్ర కోటపై మన దేశ ప్రధాని భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో లేని RSS ని కొనియాడ కీర్తించిన సందేశం.
తెలంగాణలో, హైదరాబాదు సంస్థానంలో జరిగిన ఉద్యమాలను మత మధ్య జరిగిన ఉద్యమాలుగా చిత్రించాలి అని చేస్తున్న ప్రయత్నాలను చరితకారులు, తెలంగాణా మేధావులు, సాహితి కారులు, ఉద్యమ కారులు రాబోయే కాలంలో తెలంగాణలో అల్లర్లు సృష్టించే విధంగా జరుగుతున్న ఇలాంటి కుట్రలను ఇప్పుడే అడ్డుకట్ట వెయ్యాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి. ప్రజల అస్తిత్వ అయిన తెలంగాణ అస్తిత్వం కనుమరుగు కాకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
ప్రతి ఉద్యమం వెనక ఒక అణచివేత, ఆధిపత్య ధోరణి, నిరంకుశత్వం మొదలైన అప్రజాస్వామిక శక్తులు ఉంటాయి. అప్రజాస్వామిక విధానాలుతో ప్రజల మధ్య, మతాల కులాల మధ్య ఘర్షణలను అబద్ధని నిజం అనే మూసుకులో ప్రచారం సాగుతున్న వంటి రాజకీయాలను అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై, ప్రజల పైన ఉందని మర్చిపోవద్దు.
ఎటువంటి ప్రజా ఉద్యమంలో లేని వారు ఉద్యమ చరిత్రను తిరగ రాయడంలో ఉనంత కాలం అదీ నిజమైన చరిత్రగానే చలామణి అవుతుంది. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.
బాబాసాహెబా అంబేద్కర్ అన్నట్లు “ చరిత్రను మరచిపోయిన వారు చరిత్రను సృష్టించలేరు ” తెలంగాణ ప్రజలు చరిత్ర అధ్యయనంలో కీలక పాత్ర పోషించాలి. ఐక్యతతో ముందుకు వెళ్తూ ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు పరిస్థితులు చేజారకంటే ముందు మేల్కొని ముందడుగు వెయ్యాలి. విషసర్పాలు కోరలతో విషం చిమ్ముతూ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ప్రజలను చీలుస్తున్నాయి. చరిత్రను తిరగరాస్తున్నాయి. చరిత్రను రక్షిస్తే అస్తిత్వ కోసం, ఉనికి కోసం, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం జరిగిన పోరాటల స్ఫూర్తిని ముందు తరం వారికి పరిచయం చేసినట్లే అవుతుంది. ఇటువంటి విద్వేష పూరిత వాతావరణాన్ని చూడటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు.
*
Add comment