తెర మీద ఎంతకాలం ఈ విద్వేషం?!

 ‘కొబ్బరిబొండాంలో స్ట్రా వేసుకొని తాగితే తల దించుకున్నట్టు.. అలా చేస్తే నా దేశమే తల దించుకున్నట్టు. అదే స్ట్రా లేకుండా తాగితే తలెత్తుకొని తాగినట్టు.. అప్పుడు నా దేశమే తలెత్తుకున్నట్టు!’

‘వినాయక చవితికి, దీపావళికి ఓ.. పొల్యూషన్ అని తెగ గగ్గోలు పెడతారు కదా. చక్కగా మట్టి వినాయకుణ్ని ప్రతిష్ఠించొచ్చు కదా అంటారు. సరే మీ బక్రీద్‌కు కూడా చక్కగా మట్టి మేకను బలి ఇవ్వొచ్చు కదా?’

ఇలాంటి వింత విచిత్ర పోకడల మలినాలు ఆ ఛప్పన్ ఈంచ్ ఛాతి ఆధ్వర్యంలో కొనసాగే బిజెపి ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీల నుంచి విచ్చలవిడిగా వస్తుంటాయి. నక్కకు నాగలోకానికి ముడిపెట్టేసి రాసే ఇలాంటి ‘రచ్చ’యితలు ఆ యూనివర్సిటీలో పెక్కు. కొబ్బరిబొండాంలో స్ట్రా లేకుండా తాగితే దేశమే తలెత్తుకున్నట్టు, కాలుష్యానికి, జంతుబలికి లింకులు పెట్టి రాసేయడం ఈ బుర్ర ఎక్కువ మతోన్మాద మూకలకే చెల్లింది.

‘అన్నా.. అక్కా ఏం రాశావన్నా. నిజాన్ని కళ్లకు కట్టావ్. జైశ్రీరాం’ అని కింద కామెంట్లు చేసి, షేర్లు చేసే బ్యాచ్ ఉంటుంది. ఇలాంటి వాట్సాప్ మేతావులు పండిస్తున్న కథలతో ఈమధ్య సినిమాలు వరుస పెట్టి వస్తున్నాయి. ఎన్నికలు వస్తే ‘మేము ప్రజలకు ఈ సంక్షేమాలు అందిస్తాం, ఆస్పత్రులు, విద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాం’ అని అస్సలు అనకుండా వాళ్లు తీసిన అబద్ధపు సినిమాలనే ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ‘ఆ సినిమాలో చూశారా.. ముస్లింలు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు?’ అని నేతలు నాలుక మడతపెట్టి మరీ వాగేస్తుంటారు. అంటే ఆ సినిమాలో చెప్పిందంతా నిజం, మీరంతా అదే నిజమని నమ్మాలని నొక్కి వక్కాణిస్తుంటారు.

నేటి భారతం ఛప్పన్ ఈంచ్ ఛాతీ భారతం అయింది. ఈ భారతంలో సృజనాత్మకత విద్వేషాన్ని విరజిమ్ముతోంది. వారి పథకంలో భాగంగా అర మెదడు వాట్సాప్ మేతావులను పోగుచేసి ‘కథలు అల్లండయ్యా.. కథల్లో విద్వేషం పొంగిపొర్లాలి. అబద్ధాలను బాగా దట్టించండి’ అని ఆర్డర్లు పాస్ చేస్తారు. ఇంకే… చక్కగా విద్వేషాలతో సినిమాలు తీసేస్తున్నారు.

ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా డోంట్ కేర్. వాళ్లకు బోలెడంత డబ్బులు ఇస్తున్నారు. ‘సినిమా రంగంలో జీవితమంతా కష్టపడ్డా రానంత మనీ వచ్చేస్తుంటే.. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న 60 వేల పైచిలుకు ముస్లింల త్యాగాల గురించి మనకెందుకు? వాళ్లు లెక్కలేనంత డబ్బు ఇచ్చేస్తున్నారు.. స్వయంగా ప్రధాని సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.. ఇంకేం కావాలి? సినిమా సూపర్ హిట్టు, కాసుల పంట! విషాన్ని విరజిమ్మేద్దాం.. లైఫ్‌లో బాగా సెట్ అయిపోతాం..’ అనుకునే కరువు కళా రక్కసులు ఎక్కువయ్యారు. అందుకే ఇస్లామోఫోబియాతో బాధపడుతున్న వాళ్ల పాళి విషపు రాతలు రాస్తుంటుంది.

కళాకారులకు కులమతాల తారతమ్యాలు లేనేలేవు అన్న సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి విలువలకు పాతరేసి కళారంగానికి కూడా ఆ కంపును అంటిస్తున్న గొప్ప ఖ్యాతిని చౌకీదారుడు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అవున్లే ప్రపంచం మెచ్చే మన లౌకిక దేశాన్నే మత రాజ్యంగా మార్చాలని చూస్తున్న వాళ్లకు కళారంగాన్ని భ్రష్ఠుపట్టించడం ఓ లెక్కా?

ది కశ్మీర్ ఫైల్స్, కేరళా స్టోరీ, 72 హురేం, రజాకార్, బస్తర్ ది నక్సల్, జెఎన్‌యూ.., ఇలా చెప్పుకుంటూ పోతే అబద్ధపు సినిమాల లిస్టు చాలానే ఉంటుంది. వీటినిండా ముస్లింల మీద అకారణ ద్వేషమే కనిపిస్తుంది. కశ్మీర్ పండిట్ల లెక్క అబద్ధం, కేరళ స్టోరీలో వాస్తవంలో ముగ్గురు అమ్మాయిలైతే 32 వేల అమ్మాయిలు ఐసిస్‌లో చేరారని లెక్క తప్పి మరీ చెప్పారు. ఇలా విద్వేషంతో నిండి వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా తప్పుడు లెక్కలే, పచ్చి అబద్ధాలే, రోత పుట్టించే రాతలే! వాటి గురించి నిగ్గుతేల్చేసరికే దేశంలో మరోటి ఏదో ఇష్యూ తెర మీదకు వచ్చేసి జనాల మైండ్లను డైవర్ట్ చేసేస్తుంటుంది. చూశారా ప్రజల మైండ్లను సినిమాలతో, సోషల్ మీడియాతో, మీడియాతో ఎంత చక్కగా డైవర్ట్ చెయ్యొచ్చో కదా?

అలా ఇప్పుడు ఇలాంటి సినిమాలతోనే కొత్త చరిత్రను లిఖించి ముస్లింల మీద విషాన్ని విపరీతంగా కక్కేస్తున్నారు. నిజమైన చరిత్ర అంటే పుస్తకాల్లో నిక్షిమై ఉంది. కానీ ఈ కొత్త వక్ర చరిత్రను రీళ్ళలో దట్టిస్తున్నారు. ఎందుకంటే అవి అబద్ధాలు కాబట్టి. దేనికైనా అంతుడొచ్చు.  కానీ వీళ్ల విద్వేషానికి అంతులేకుండా పోతోంది?

గత పదేళ్ల నుంచి ముస్లింల మీద విపరీతమైన విద్వేషాన్ని వెళ్లగక్కుతున్న కషాయ పార్టీ ఇలాంటి అబద్ధపు సినిమాలతో యువతను పెడదారి పట్టిస్తోంది. వాళ్ల మెదళ్లలో ముస్లింల మీద అకారణ ద్వేషాన్ని నింపుతోంది.

నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు అనడానికి ఈ సినిమాలు ఉదాహరణ. జర్మన్ రాజ్యాంగాన్ని మార్చడానికి హిట్లర్ తన సొంత పార్లమెంట్ భవనానికి నిప్పెట్టినట్టు, పుతిన్ తన సొంత పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమైనట్టు.. వాళ్ల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆందోళన్ జీవి మాత్రం అందుకు భిన్నంగా దేశ లౌకికత్వానికి నిప్పు పెట్టే దిశలో సినిమాల పాచికలు వేస్తున్నాడు.

ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే.. గుజరాత్ కాండ దిశలో వచ్చిన ‘ది మోడీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని దేశంలో ఎందుకు నిలిపివేసినట్టో? ‘విద్వేషాన్ని కక్కుతాం కానీ మా కోరలు ఎందుకు చూపిస్తాం?’ అన్న తీరులో దాన్ని బ్యాన్ చెయ్యడం తెలిసిందే.

ఈ పదేళ్లలో అవతార పురుషుల వారు వెలగబెట్టిన సుపరిపాలనా తీరు మీద లెక్కకు మించి, పర్ఫెక్ట్ లెక్కలతో ఎన్నో సినిమాలు తియ్యొచ్చు. ఇందుకు కావాల్సింది ఆ వాట్సాప్, ఐటీ సెల్ విష నాగులు కాదు. నిజాయితీ గల కళాకారులు. గోద్రా ఫైల్స్, పుల్వామా ఫైల్స్, ఆర్టికల్ 370 బ్యాక్ స్టోరీ, కర్ణాటక పొలిటికల్ ఫైల్స్, మణిపూర్ ఫైల్స్, ఆసిఫా ఫైల్స్, నోట్ బంధీ ఫైల్స్, రైతు చట్టాల ఫైల్స్, ది బీఫ్ ఎక్స్‌పోర్ట్ స్టోరీ, ఎలక్టోరల్ బాండ్స్ 420, హత్రాస్ ఫైల్స్, ధరల దోపిడీ ఫైల్స్, హార్స్ ట్రేడింగ్ ఫైల్స్, మాయమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ?, దోస్తు మేరా దోస్త్, నీట్ ఫైల్స్, 15 లాక్స్ ఎక్కడ?, ప్రైవేటీకరణ ఫైల్స్…, ఇలా ఎన్నో యాప్టెడ్ పేర్లతో సినిమాలు తియ్యొచ్చు. ఈ కథల్లో ఎక్కడా చిన్న అబద్ధం కూడా లేకుండా ఉన్నది ఉన్నట్టు నిజాలను కళ్లకు కట్టొచ్చు. వీటిని గనుక తీస్తే ఛప్పన్ ఈంచ్ ఛాతీ వారు వాటిని ఎన్నికల్లో మైకులు పగిలిపోయేలా ప్రచారం చెయ్యాలని చాలామంది కోరుకుంటున్నారు.

మరోపక్క ఈ విద్వేషానికి అంతులేదు అన్నట్టు యూట్యూబ్‌, సోషల్ మీడియా, మీడియాలో పలు ఛానెళ్లవారు కూడా వారి విషపు కోరలను పదును పెట్టుకుని విషం చిమ్ముతున్నారు. విద్వేషం ఇలా ఎన్నో రూపాల్లో నిత్యం బుసలు కొడుతూనే ఉంది. కట్టు కథలతో వ్యాఖ్యానాలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రాక్షసానందాన్ని కూడగట్టుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా ముస్లిం సమాజం మాత్రం ఎప్పటిలానే చాలా సహనంగా ఉంటోంది. తమ మీద ప్రతిరోజూ, ప్రతీ క్షణం మతోన్మాదులు ఎంతగా బురద జల్లినా, ఎన్ని అగచాట్లు పెట్టినా, తిట్టినా, కొట్టినా, అసహ్యించుకుంటున్నా, అక్రమ కేసులతో జైళ్లపాలు చేసినా, దోచుకున్నా, చివరికి చంపుతున్నా, విద్వేషపు సినిమాలు తీస్తున్నా…, మౌనంగా సహిస్తున్నారు.

‘అంతులేని విద్వేషమా ఇక శాంతించు!’ అని ఆ కనపడని అల్లాను దువా వేడుకుంటున్నారు.

                          *

హుమాయున్ సంఘీర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు