1
అమృత భారతం
ఈ పొద్దు
సూర్యబింబం
బలంగా దూసుకొచ్చి తగిలిన రాయి
గాజు పలకలో చేసిన రంధ్రం
ముక్కలుగా విస్తరించిన చందాన ఉంది.
నిన్న గ్రంధ చోరీ ప్రయత్నం
మొన్న శిలువ ఇండ్ల ధ్వంసం
అడపాదడపా చంద్రవంకల ఖండన
తూట్లుపడ్డ
నా అఖండ భారత గాలిపటం
సాయంత్రమైనా
ఇంకా
రక్తం స్రవిస్తూనే ఉంది.
—
2
సహజాతం
నది
సముద్రంలో
చేరుతున్న అనంత దృశ్యం
మనది
మనదనుకున్న దేహం
మట్టిలో కలుస్తున్న
అనూహ్య సదృశం.
అద్భుతం!
మట్టి మట్టిలో కలవడం
నది నదిలో కలవడమంత
సహజాతి సహజం.
ఐనా…
—
3
అంతరాలు
ఎవరి జీవితమూ
తెరిచిన పుస్తకం కాదు.
ఎన్నేళ్ళు కలిసి నడిచినా
వాళ్ళు అపరిచయస్తుల్లానే …
ఒకళ్ళకొకరు అన్నీ చెప్పుకున్నారనుకొన్నా
ఏళ్ళు గడిచేక్రమంలో
ఇంకా తెలియని సంగతులెన్నో తెలిసివస్తాయి.
కలిసి బతికినంతమాత్రాన
వాళ్ళ ఆలోచనలు అన్ని విషయాల్లో
కలుస్తాయన్న ధీమా లేదు.
ఒకే చోట జీవిస్తున్నా
కొలవలేనంత దూరమేర్పడడమెందుకు?
ఒకే కంచంలో తింటున్నా
ఎవరి రుచి వారిదే కదా!
ఏవేవో చెప్పాలని ఉంటుంది
చెప్పేలోగా మాటలు దొరకవు
అది ఆలోచనలకూ మాటలకూ మధ్య
సమన్వయ లోపమా?
మనసును విప్పగలిగే
భాషలేమితనమా?
పుస్తకం తెరిచినట్లే ఉండొచ్చు
తెరిచిన పుస్తకమైనా
ఒక చివర కుట్టే ఉంటుంది
మూసి ఉండడంకూడా
తెరిచిన పుస్తకం నైజమే!
—
4
కుక్క కాటుకు…
తరుమరుడు
వదిలిన చెప్పులను
కుక్క తీసుకెళ్లినప్పుడు
అర్జునుడు తెలియక
పాంచాలి వద్దకు వెళ్లడంవల్ల
వారికేం పోయె
తారుమారై
కుక్కకు తగిలిన
శాపాస్త్రమ్ము తప్ప!
పాపం!
విశాల్
కొనుక్కున్న కొత్త చెప్పులపై
విరుచుకుపడి
ఒకసారి కాదు కదా
వారంలోనే రెండు జతల్ని
చింపిన విస్తరిలా చేసిన
ఈ కుక్కకుగానీ
కుక్కను ప్రేమించే
విశాల్ కు గానీ
ఏమి దెబ్బ
నా జేబుకు పడ్డ
పెద్ద బొక్క తప్ప!
*
మంచి కవిత్వాన్ని ఆస్వాదించాము Sir!