తీరుబాటుగా ఉన్న మనుషులు నాకిష్టం: అజయ్ ప్రసాద్

ఏ పేరుతొ రాసినా నేను రాస్తున్నాను అనికాకుండా కొన్నిసార్లు నా ఉనికిని రద్దు చేసుకోవడం బాగుంటుంది. ఇది కేవలం రాసేవారికే కాదు చదివేవారికి కూడా  అవసరమే.

దీనికి ఇంటర్వ్యూ అనేంత ఫార్మల్ పేరు తగిలించలేను. మిత్రుడి పుస్తకం వచ్చిన సందర్భంగా నాలుగు ప్రశ్నలు అడిగితే బావుంటుంది కదా అనిపించింది. ఇదొకటి చెప్పాలి కదా, అజయ్ ప్రసాద్ కథల సంపుటి లోయ మొన్నే విశాలాంధ్ర ద్వారా ప్రచురితమైంది. ప్రశ్నలను ముఖాముఖి అడగాలా, రాతపూర్వకంగానా అని ఆలోచించాను. ముందైతే ప్రశ్నల కాగితం చేతికిచ్చాను. తను రాసివ్వడానికే ఇష్టపడ్డాడు. ప్రశ్నలకు వచ్చిన జవాబుల్ని బట్టి మళ్లీ కొన్ని ఉప ప్రశ్నలు వేయాల్సి వచ్చింది. ఆ వచ్చిన సమాధానాల్ని కూడా కలుపుకున్నాక వచ్చిన తుదిరూపం ఇది.

పుస్తకం రావడం ఏమైనా జీవితపు సార్థకత క్షణమా?

సార్థకత అంటూ ఏమీ లేదు. పరిస్థితి అలా కలిసి వచ్చింది. నాకు కొంత సంతృప్తినిచ్చిన కథలని కలిపి పుస్తకం వేసాను.

కొత్తగా రాస్తున్నవాళ్లు కూడా టపాటపా పుస్తకాలు తెస్తున్నప్పుడు, ఎప్పుడో రాయడం మొదలుపెట్టినవాడివి నీకు ఎందుకింత ఆలస్యమైంది?

కథలు రాయటమే విలువ. పుస్తకం ఏమంత ముఖ్యం కాదు. అదెలానూ వస్తుంది. రాకపోయినా కొంపమునిగేదేమీ లేదు. ఇతరులతో పోటీ కానీ పోలిక గానీ ఏమీ లేదు. నేను కథలు రాయడమే చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను. అప్పటికి కథలు రాస్తున్న హేమాహేమీలు నా ఈడు వాళ్లే. కథలు రాసేది మనుషులు కాదు ఎవరో దేవలోకంలో ఉండే మహానుభావులు అనుకుని చాలాకాలం రాయకుండా ఉండటం ఒక కారణమైతే, ఒక చోట నిలువనీయని జీవితపు ఒడిదుడుకులు మరొక కారణం. రాయవలసినన్ని కథలు రాయలేకపోయానే అని కొన్నిసార్లు అనిపిస్తుంది.

నీ మొదటి కథ అచ్చయిన జ్ఞాపకాలు గుర్తున్నాయా?

 నిజానికి నా మొదటి కథ నా శ్రీమతి జెన్నీ భారతి పేరుతో విపులలో అచ్చయింది. కథ రాసినట్లు, దానిని పత్రికకు పంపినట్లు ఎవరికీ తెలీదు. నేను కూడా మరచిపోయాను. ఒకరోజు ఆఫీస్ డిస్పాచ్ క్లర్క్ హడావుడిగా వచ్చి నీకేదో పోస్ట్ వచ్చిందంటూ కవరు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. తీసి చూస్తే విపుల. అందులో కథ. చాలా సంతోషం కలిగింది. మనమూ కథ రాయొచ్చు అని నమ్మకం కలిగింది. ఒకరిద్దరు స్నేహితులకు తప్ప కథలు రాసినట్లు ఎవరికీ చెప్పలేదు. ఇంట్లోకూడా తెలీదు.

 సాధారణంగా తొలినాళ్లలో మన పేరును అచ్చులో చూసుకోవడం అనే మురిపెం ఉంటుంది కదా, మరి   కథకు కలంపేరు ఎందుకు పెట్టుకున్నావు?

మొదట్లో మారుపేర్లతో కొన్ని కథలు రాసాను. అవన్నీ సీరియస్ కథలు కావు. ఏదో సరదాగా రాసినవి. అవి  అచ్చయ్యాక మనం కూడా కథలు రాయచ్చు అనిపించింది. Perception మారుతూ ఉన్నప్పుడు కథలు రాయడంలో ఉన్నకష్టం తెలిసింది. కథలు రాసేవిధం కూడా క్రమంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కొన్నిసార్లు రాసేటప్పుడు మారుపేరుతో  మొదలుపెడతాను. కానీ అది నా మీద ఏ ప్రభావం పడకుండా ఉండేందుకు మాత్రమే.

నీ పేరుతో రాస్తే నీ కథ మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటావు?

ఏ పేరుతొ రాసినా నేను రాస్తున్నాను అనికాకుండా కొన్నిసార్లు నా ఉనికిని రద్దు చేసుకోవడం బాగుంటుంది. ఇది కేవలం రాసేవారికే కాదు చదివేవారికి కూడా  అవసరమే. మనకి ఇష్టమైన కవి, కథకుడి కథ మారుపేరుతో వస్తే దాన్నిచదివి మనం గుర్తించగలమా. ఏదెలా ఉన్నా చివరికి ఎవరు ఏ పేరుతో రాస్తున్నారు అనేదానికన్నా కథ మనం అనుకున్నట్లుగా వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం అనుకుంటాను.

 నువ్వు పేరు పెట్టుకుని రాసిన కథ వచ్చినప్పటి సంగతులేమైనా? ఇంట్లోవాళ్ల స్పందన లాంటివి…

ఆదివారం ఆంధ్ర జ్యోతిలో వచ్చిన మరుభూమి కథనే నా మొదటి కథగా చెప్తాను. అప్పుడు ఒకరిద్దరు తప్ప ఇప్పటి రచయితలెవరూ పరిచయంలేదు. నేను కథలు రాస్తానని నా కాలేజీ ఫ్రెండ్స్ కు తెలిసింది అప్పుడే. ఆ ఆదివారం మాఅన్నయ్య కథ పడిందని ఫోను చేసాడు. ఆరోజు ఇంటికి వెళ్లాను. కథని మా నాన్నగారు చదివారు. బాగుందో లేదో చెప్పలేదు. వచ్చేటప్పుడు మాత్రం ఇంటిపేరు పెట్టపోయావా అన్నారు అంతే. నా ఫ్రెండ్స్ చాలామందికి ఆ కథ అంటేనేఇష్టం. వాళ్ళ బలవంతం మేరకే  ఈ పుస్తకంలో ఆ కథని చేర్చాల్సి వచ్చింది.

మరి మీ నాన్న పెట్టుకొమ్మన్నట్టుగా ఇంటిపేరు ఎందుకు కలుపుకోలేదు?

అప్పుడు అంత conscious ఏమీలేదు. ఉన్నా పట్టింపులేదు.  ఇదంతా ఆలోచించలేదు. ఆ తరవాత మా నాన్న కూడా ఆ విషయాన్ని మళ్ళీ అడగలేదు.  ఇక పట్టించుకోలేదు. అంతేకాక నా పేరు అనడానికి వినడానికి నాకెందుకో ఆడ్ గా అనిపిస్తుంది. అసలు రచయితల మధ్య నా పేరు ఆడ్  గా అనిపిస్తుంది. ఏ రవిచంద్రో, రామయ్యో, భూమయ్యో ఉంటే బాగుండుననుకుంటాను అప్పుడప్పుడూ. ఇక ఇంటి పేరు లేదనే ఆలోచన ఎందుకుంటుంది.

ఇదేంటయ్యా బాబూ, నీ పేరే మంచి స్టైలుగా ఉందని నేను కుళ్లుకుంటా ఉంటే…

సరే, నువ్వు రాసిన అన్ని కథలూ పుస్తకంలోకి రాలేదని అర్థమైంది. కథల్ని ఎంచుకోవడంలోగానీ, లేదా నీ కథల్ని నీవే వడగట్టుకోవడంలోగానీ పాటించిన ప్రమాణం ఏమిటి?

నిజమే. రాసినవన్నీ ఇందులో లేవు. మీమాంస, జాగరణ, మృగశిర లాంటి కథలతోపాటు తొలిరోజుల్లో రాసిన జాతక కథ, మరుభూమి వంటి కథల్ని కూడా ఇందులో చేర్చాను. ఇక వడగట్టుకోవడం సంగతంటావా.. కథలు ఎంత తొందరగా పుడతాయో, ఎంత తొందరగా రాయడం మొదలుపెడతానో అంట ఆలస్యంగా పూర్తిచేస్తాను. కథ బయటకి వచ్చాక దానిసంగతి ఎలా ఉన్నా నాలోపల కూడా అది కాలపరీక్షకు నిలవాలి. కథ ఏక కాలంలో ఒక జీవిత శకలం అదే సందర్భంలో అదొక కళారూపం. ఇకపోతే పూర్తి కల్పనతో రాసిన ముఖాముఖం, గాలిపొరలు వంటివి ఇంకొన్ని రాసాక భవిష్యత్తులో అటువంటి కథలతో మరొక పుస్తకం తెద్దామని ఒక ఆలోచన ఉంది. చూద్దాం.. రాస్తే గీస్తే..

నీ రాతకు సంబంధించి నాకు రెండు దశలున్నాయనిపించింది. ఒకటి, ఒక సిద్ధాంతం ఆలంబనగా రాయడం; రెండోది, సిద్ధాంతాన్ని కాదని జీవితం లేదా, నీదైన స్పెసిఫిక్ జీవితం ఊతంగా రాయడం. అసలు ఆసిద్ధాంతం వైపు మరలడానికీ, తిరిగి రావడానికీ నిన్ను ప్రేరేపించిన కారణాలేమిటి?

నువ్వు చెప్పింది నిజమే. మొదట్లో సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకుని చాలా చెత్త రాసాను. మా ఇంట్లో కొంత వామపక్ష భావజాలం ఉండేది. అప్పట్లో బయట సాహిత్యంలో కూడా అదే తరహా సాహిత్యం రాజ్యమేలుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువనుకో. కొంతకాలం తరవాత రాసినవాటిని చూసుకుని ఇది నేను కాదుకదా అనిపించింది. రాసినవి పేలవంగా అనిపించాయి. నాది కాని దాన్ని తలకెత్తుకోవడం నచ్చలేదు. నిజానికి సిద్ధాంతాలకు అతీతంగా కథలు రాయడానికి కావలసినన్ని అనుభవాలు అప్పటికే ఉన్నాయి. ఒక సంవత్సరంలో పరస్పర విరుద్ధమైన భావజాలంతో రాసిన కథలు కూడా ఉన్నాయి. నాలో ఈ ద్వంద్వాన్ని అర్థం చేసుకున్న తరువాత నేను సిద్ధాంతాల వైపు వెళ్లడం మానేసాను.

అజయ్ ప్రసాద్ కథల్ని చదివితే నాకు తట్టిన మొదటి పదం, దిగులు. అది మరీ దుఃఖం కాదు, ఏడుపు కాదు, కేవలం దిగులు. ఏంటి నీకొచ్చిన బాధ? నీతోటి, లోకంతోటి?

నా కథల్లో కొంత దిగులు ఉంటుందని కొందరంటారు. ఇప్పుడు కథల్ని ఒకచోట చేరిస్తే నువ్వు చెప్పిన ఆ దిగులు నిజంగానే కనిపిస్తుందేమో. చిన్నతనం నుంచి ఎక్కువమందితో కలిసేవాణ్ని కాదు. ఒక్కణ్ణే తిరిగేవాడిని. ఇంట్లోవాళ్ళు సిగ్గుమొహమాటం అనుకునేవాళ్లు. మొదటినుంచి నేను సంఘజీవిని కాను. ఇప్పుడు చాలా నయం. ఇంతకుముందు ఇదీ లేదు. మనుషుల వాదోపవాదాలు, వాళ్ళ లెక్కలు, రాజకీయాలు, వాళ్ళ కార్యకలాపాలు ఇవేమీ నాకు ఆసక్తి కలిగించలేదు. అనునిత్యం హైరానా పడుతూ మనుషులు చేసే హడావుడి నాకు ఎక్కదు. నిర్మానుష్యమైన వీధులు, ఖాళీగా ఉన్న గదులు, తీరుబాటుగా ఉన్న మనుషులే నాకిష్టం. అందులో ఏదో సౌందర్యం కనిపిస్తుంది. ఏదీ ఆలోచించకుండా ఉండటంలో ఏదో ఆనందం ఉంటుంది. వదిలిపెట్టి వచ్చిన ఇళ్ళు, ఊళ్లు, పెరిగిన పరిసరాలమీద బెంగ, మనుషుల నిత్యకార్యాకలాపాల్లో నిరాసక్తత నా కథల్లో కనిపించి మీకందరికీ అదొక దిగులుగా కనిపించి ఉండొచ్చు. నా అంతరాత్మ అలానే బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉందేమో. లోకంతో వచ్చిన పేచీ ఏమీ లేదు. నాతో నాకున్న బాధ ఇదే. నా స్వభావమంతే.

నీ మానసికావరణం మీద ప్రభావం చూపిన చిన్నప్పటి సంగతులు, ఘటనలు ఏవైనా?

బాల్యం లేనిదే నేను లేను.  నా కథలు లేవు. అలానే రెండు ఊర్లు లేనిదే నేనులేను. ఒకటి గుంటూరు జిల్లా మాచర్ల, రెండోది ప్రకాశం జిల్లా అద్దంకి. నేను చూసిన, పెరిగిన ప్రదేశాలు ఇప్పుడు లేవు. నేను బతికినరోజులన్నీ ఊరిబయట బంజరు భూముల్లోనూ, రాళ్ళూరప్పల్లోనూ, పంటపొలాల్లోను తిరిగినవే. ఎవరూ తోడు లేకుండా ఒక్కణ్ణే రికామీగా తిరగటం. కొన్నిసార్లు రైతులతోనూ, పశువులు కాసేవాళ్ళతో, పిట్టలు కొట్టే వాళ్ళతో..  గుళ్ళకమ్మ నది ఒడ్డున బట్టలు ఉతుక్కునే వాళ్ళ, చాకలి వాళ్ళ మాటలు వింటూ, ఇసుకలో పడుకుని ఆకాశంవంక చూస్తూ..  మోకాలెత్తు ప్రవహించే చల్లటి నీళ్లలో గుండ్రటి గులకరాళ్ళమీద నగ్నంగా వెల్లకిలా పడుకుని ఒడ్డున చెలమల్లో నీళ్లు బిందెల్లోకెత్తుకుని పోయే అందమైన స్త్రీలను చూస్తూ ..  నదికి ఒకవైపు శ్మశానంలో ఎవరినైనా పూడ్చిపెడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళకాళ్ల మధ్య సందు చేసుకుని గుంతలో వేసిన శవాన్ని తదేకంగా చూస్తూ.. అర్థరాత్రి చీకట్లో అలల చప్పుడు వింటూ…పెట్రోమాక్స్ లైట్లతో కుందేళ్ళను వేటాడేవాళ్ళను చూస్తూ..  ఇదంతా గుళ్ళకమ్మ నదితో పెనవేసుకున్న బాల్యం. ఇది అందమైనది, ఇది చూడదగ్గది అని అప్పటి మనసుకు లేదు. అదంతా అలా గడిచింది.

పాఠకుడు నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటావు? జాతక కథ రాసిన అజయ్ గానా, నిర్లయ రాసిన అజయ్ గానా?

నిర్లయ రాసిన అజయ్ గానే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాను. నేను రాసిన కథల్లో జాతక కథ రెండోదో మూడోదో అవుతుంది. బౌద్ధం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. బౌద్ధానికి ఒక ప్రత్యేక భాష ఉందని చెప్పడానికి ఆరోజుల్లో ఆ కథ రాసాను. అదొక ప్రయత్నం. భావజాల పరంగా అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. బౌద్ధం  భౌతికవాదమా కాదా అన్నది వేరే చర్చ. బౌద్ధం మనిషి స్వీయ అన్వేషణకి ఎప్పుడూ దారి తీసే ఉంచింది. ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు బయట వీధుల్లో తిరిగే పోలీసు పెట్రోలింగ్ జీపు సైరన్ విన్న తరవాత ఆ కథ రాయాలనిపించింది.

ఆ జీపు సైరన్ నీలో దేన్ని కదలించింది?

లిప్త కాలంపాటు భయం అనేదాన్ని గురించి ఆలోచించాను. నాకు పెద్దగా భావజాలం ఏమీ తెలీదు.లేదు కూడా.   ఆ సైరన్ ఎవరి కోసం ఉద్దేశించినా నాకు మాత్రం ఇంకా దేనికో హెచ్చరికలా ధ్వనించింది. రాసేముందు ఎక్కువ విషయాలు ఆలోచించలేదు.

నువ్వు డిజ్ఓన్ చేసుకునే కథలేమైనా ఉన్నాయా?

చాలా ఉన్నాయి. వాటిని తలుచుకుంటే సిగ్గు కలుగుతుంది, ఎలా రాసానా అని. అవన్నీ తొలిరోజుల్లో రాసినవి.

రాయడం అంటే ఏంటి నీకు?

నామటుకు నాకు ప్రతిదీ ఆశ్చర్యంగా అనిపించే ప్రయాణం. తెలియని కొత్త ప్రదేశంలో తిరగడం, కొన్నిసార్లు అదొక పూనకం. మరికొన్ని సార్లు అది ధ్యానం. నిజజీవితంలో జరిగిన సంఘటనని కథగా తీసుకుంటే అదొక పరకాయ ప్రవేశం.రాస్తున్నది కల్పన అయితే కొత్త లోకాన్ని సృష్టిస్తూ అందులో సంచరించడం.. ఇవన్నీ నేను అనుభవించాను.

ఎలా రాస్తావు? మానసిక, భౌతిక వివరాలు...

ప్రయాణంలోనో మగత నిద్రలోనో కథలు తడతాయి. కొన్ని తెల్లవారు జామునో, కొన్నిసార్లు ఆఫీసు పనిఒత్తిడిలో ఉన్నప్పుడో స్ఫురిస్తుంటాయి. అలా అని కల్పనలే కాదు. కొన్ని నిజజీవితంలో చూసిన సంఘటనలని కూడా కథలుగారాసాను. ఆమె నీడ, మీమాంస వంటి కథలు స్వయంగా చూసిన సంఘటనలే. కథ కాగితం మీద మొదలుపెట్టాక పూర్తయ్యేంతవరకూ బయటికి రావడం ఉండదు. పూర్తిచేసిన కథల్లోకి మళ్ళీ వెళ్లడం నాకు చచ్చేంత కష్టం. కనీసం ప్రూఫ్ రీడింగ్ కూడా చూడబుద్ధి కాదు.

ఎందుకా వెగటు?

ఎందుకో తెలీదు. అది నాకున్న complex. ఒక లోకంలో తిరిగీ తిరిగీ మళ్ళీ దాంట్లోకి  వెళ్లలేక కావచ్చు.

రష్యన్ సాహిత్యంతో నీకు ప్రత్యేక అనుబంధం ఉంది కదా! రచయితగా నిలబెట్టడంలోగానీ నీ విస్తృతిలోగానీ రష్యన్ సాహిత్యం పాత్రేమిటి?

చాలా కథలు తెలిసీతెలియని వయసులో చదివాను. ఆరోజుల్లో వాటి గొప్పతనం, ఆయా రచయితల ప్రత్యేకత అప్పుడే మాత్రం తెలీదు. చెహోవ్ రాసిన ద బెట్ కథ అనువాదాన్ని విపులలో పదమూడేళ్ల వయసులో చదివాను. అప్పుడురచయితా పేరుకూడా తెలీదు. అదలా గుర్తుండిపోయింది.  చాలా సంవత్సరాల తరవాత దాన్ని ఇంగ్లీషులో చదువుతూ అది చెహోవ్ రాసినదని తెలిసి ఆశ్చర్యపోయాను. మా మూడో అన్నయ్య (హరి ప్రసాద్) ఇరవై ఏళ్ల వయసులో రష్యన్ లిటరేచర్ చదవటానికి అప్పటి సోవియట్ యూనియన్ వెళ్ళాడు. అక్కడే యుక్రేనియన్ అమ్మాయిని పెళ్ళిచేసుకుని స్థిరపడ్డాడు. సోవియట్ పతనం తరవాత అనేక కష్టాలుపడి ఇండియా వచ్చి EFLU లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూఇక్కడే చనిపోయాడు. వాడు సోవియట్ యూనియన్ లో ఉన్నప్పుడు రష్యన్ కరెన్సీ, USSR స్టాంపులు పోస్టులో పంపేవాడు. అందమైన పెయింటింగ్స్,  పుస్తకాలు, పోస్టుకార్డు సైజు పుష్కిన్ కలర్ పోట్రైట్స్ చాలా పంపించాడు. పుష్కిన్ రచనల అనువాదం ఎందుకు అసాధ్యమో, చేహొవ్, టాల్ స్టాయ్ వంటి పేర్లను ఎలా పలకాలో చెప్పేవాడు. చెహోవ్ ని  చేహొవ్ అంటే బాగానే అనిపించింది కానీ టాల్ స్టాయ్ ని తొలుస్తోయ్ అంటే నాకు కూడా నీలానే ఇబ్బంది అనిపించింది. రష్యన్ సాహిత్యం పాఠకుడిగా నా ఆకలి తీర్చింది. సాహిత్యాన్ని జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడింది. నా అన్వేషణకి అది చాలు అనిపించింది. రష్యన్ రచయితలు టాల్ స్టాయ్ ని, చేహొవ్, దోస్తవోస్కి ని ఇష్టపడినట్లుగానే ఫ్రెంచిరచయితలు మపాసాని, బాల్జాక్ ని, అలెన్ పో ని ఇష్టపడతాను. తెలుగులో రాదుగ పుస్తకాల వలన గోర్కీ, చేహొవ్, తాల్ స్టాయ్ మనకు తెలిసారు  కానీ మపాసా, బాల్జాక్ లాంటి ఫ్రెంచ్ రచయితలను మనకు దగ్గర చేయడానికి మంచిఅనువాదాలు లేవు. మపాసా కథలకి ఇప్పటికీ తెలుగులో మంచి అనువాద పుస్తకం లేదు. అదొక లోటు.

ఇప్పుడున్న మపాసా తెలుగు అనువాదాలతో నీ  పేచీ ఏమిటి?

ధనికొండ హనుమంతరావు, మహీధర జగన్మోహనరావు అనువాదాలవి గ్రాంథికం. ఎవరికైనా చదవడానికి ఇబ్బంది. మరొకాయన మపాసా కథల్లోని పాత్రలకు ఎల్లయ్య పుల్లయ్య అని పేర్లు పెట్టాడు. అది నాకు నచ్చలేదు.  ఒకరిద్దరు తమకు నచ్చిన రొమాన్సు కథలను ఎన్నుకుని తమ సొంత కవిత్వం జోడించి అనువాదం చేసారు. దానివలన మపాసా  సిసలైన విలక్షణత తెలుగులోకి రాకుండా పోయింది. ఆమాటకొస్తే చేహొవ్ కథలు కూడా రావలసినన్ని అనువాదాలు రాలేదు. Ward No.6 లాంటి కథకు తెలుగులో అనువాదం ఇప్పట్లో ఊహించలేను. అలానే దోస్తవోస్కి కథలు నవలలు కూడా. అసలు కొన్నిసార్లు అనువాదం కూడా అనవసరం అనిపిస్తుంది.

నాకు తెలిసి నువ్వు మంచి చదువరివి. ఒక దశ తర్వాత, దశ ఏమిటనేది నేను కచ్చితంగా చెప్పలేను కానీ చదవడం మీద కూడా ఒకరోజు విరక్తి వస్తుందని నాకనిపిస్తుంది. కానీ నీకు అలాంటిదేమీ వచ్చినట్టు లేదే?చదవడంలో నీకున్న ఆనందం ఏమిటి? మొదటికీ, ఇప్పటికీ  చదివేతీరు ఏమైనా మారిందా?

నువ్వనుకున్నంత పెద్ద చదువరిని కానుగాని ఎక్కువ పుస్తకాలు హైస్కూలులో ఉన్నప్పుడు, కాలేజీ రోజుల్లో చదివాను. పలానా చదవమని అప్పుడు ఎవరూ చెప్పలేదు. మా అద్దంకి లైబ్రరీలో నిక్కర్లు వేసుకుని చెట్లకింద, పాతబల్లలమీద కూర్చుని చదువుకున్నది ఎక్కువ. ఇప్పుడన్నా కాస్తంత బలవంతంగా చదవాలి కాబట్టి చదువుతామేమోకాని అప్పుడంతా unconscious గా చదివిందే. అదలా జరిగిపోయింది. బషీర్, కర్తార్ సింగ్ దుగ్గల్, ఫకీర్ మోహన సేనాపతి,వాసుదేవన్ నాయర్, పొట్టెక్కాట్, శివశంకర్ పిళ్ళై, మంటో లాంటి రచయితల కథలన్నీ వాళ్ళ పేర్లు చూసుకోకుండా చదివాను. కొన్ని కథలు గుర్తున్నాయి కానీ వాటి పేర్లు రచయితల పేర్లు గుర్తులేవు. అదలా జరిగిపోయింది. అప్పటి నాఒంటరితనం వలన ఒనగూడిన వరం అది. చదవడంలో నాకున్న ఆనందమల్లా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే. రచయితల దృష్టి తెలుసుకోవడమే. అదొక వ్యసనమేకానీ విరక్తి లేదు. అదంతా ఎంపికను బట్టి ఉంటుంది. ఇప్పుడుఎంపిక చేసుకోడానికీ, సేకరించడానికీ తీరికా ఓపికా లేవు కానీ చదివే తీరు మాత్రం మారలేదు.

*

 

 

పూడూరి రాజి రెడ్డి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును తీరుబాటుగా వున్న జీవితాలు. మనుసులు — జీవితముకూడ అందంగా కాకపోయినా ప్రశాంతంగా వుంటుంది ఎవ్వరితో పరిచయమక్కర్లేని ఏకాంతము ఇంకా బాగుంటుంది–

  • ఇద్దరు అంతర్ముఖులు చర్చించుకోవడం , బాహ్య ప్రపంచం గురించి అభిప్రాయాలు చెప్పడం నాకు నచ్చింది. అజయ్ ప్రసాద్ గారి రష్యన్ సాహిత్య అనుబంధం , పూర్వం మార్క్సిస్టు నేపథ్యం కొత్త సంగతులు.
    సిద్ధాంత నేపథ్యంలో రాసినంత మాత్రాన చెత్త ఎలా అవుతుంది ప్రసాద్ గారూ…?
    ఒక రచన బయటికొచ్చాక…. రచయిత కెంత హక్కు ఉందో పాఠకుడికీ అంతే హక్కు ఉంటుంది.
    మీలో వచ్చిన మార్పు ఒక పరిణామం….
    అంతే తప్ప గతం చెత్త కాదని నా అభిప్రాయం.

    మొత్తానికి మంచి చర్చ పెట్టిన రాజిరెడ్డి అన్నకు థాంక్యూ.

  • ఓ ఇద్దరు రచయితలు, అనగనగా రచనల నుంచి దేనికో తొంగిచూస్తున్న తీరు
    ఓ రెండు అంతరాత్మల పరిశోధనగా ఉంది.
    ఓ జత ధన్యవాదాలు పూడూర్కి
    ఓ ఒక కృతజ్ఞతలు అజయ్కి

  • బాగుంది ఇంటర్వ్యూ మరీ ఫార్మల్ గా లేదు అయినా అన్ని విషయాలు చర్చించి నట్లు బాగుంది.అభినందనలు

  • అలా ఇష్టాగోష్ఠిగానే ఎన్నో విషయాలు రౌండప్ చేసిన ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • అజయ్ రాజిరెడ్డి
    తీరిక గ కథల తో
    మాట్లాడు కోవడం
    సరైన మాట దొరకలేదు కానీ
    బావుంది.

  • మంచి ఇంటర్వ్యూ..అజయ్ కథల లోయలోకి దిగడానికి ఈ ప్రశ్న జవాబులు సరైన మెట్లు…

  • మంచి కథల పుస్తకానికి మరింత మంచి పరిచయం. రెండూ బాగున్నాయి.

  • ఈ డిస్కషన్ బాగుంది. చాలా నచ్చింది. Thank you

  • “ఏ పేరుతొ రాసినా నేను రాస్తున్నాను అనికాకుండా కొన్నిసార్లు నా ఉనికిని రద్దు చేసుకోవడం బాగుంటుంది. ఇది కేవలం రాసేవారికే కాదు చదివేవారికి కూడా అవసరమే. మనకి ఇష్టమైన కవి, కథకుడి కథ మారుపేరుతో వస్తే దాన్నిచదివి మనం గుర్తించగలమా. ఏదెలా ఉన్నా చివరికి ఎవరు ఏ పేరుతో రాస్తున్నారు అనేదానికన్నా కథ మనం అనుకున్నట్లుగా వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం అనుకుంటాను.”

    అజయ్ ప్రసాద్ గారి పై వాక్యాలకు చప్పట్లు. ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు