ఈ మధ్య Sally Rooney “Normal People” గురించి పత్రికల్లో జరుగుతున్న హంగామా చూసి ఆ పుస్తకం చదువుదామని ప్రయత్నించి పట్టుమని పది పేజీలు కూడా చదవలేకపోయాను. ఆవిడ శైలి నాకు రుచించలేదు. ఒకవేళ నేనేమన్నా మిస్ అవుతున్నానా అనుకునేలోగా ఫాబెర్ స్టోరీస్ సిరీస్ లో భాగంగా ప్రచురించిన శాలీ రూనీ కథ “మిస్టర్ శాలరీ” కనిపించింది. కథ పూర్తి చేశాక ఫాబెర్ వారికి నా విలువైన సమయం వృథాపోనివ్వనందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఫాబర్ పబ్లిషింగ్ సంస్థ 19 వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఫాబర్ స్టోరీస్‘ పేరిట తమ రచయితలు రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి కథలను ఎంపిక చేసి చిన్న చిన్న పుస్తకాల రూపంలో ప్రచురించింది. నవలికకూ,కథకూ మధ్యస్థంగా తక్కువ నిడివి కలిగి ఉండే ఈ కథల్ని చదవడం చాలా తేలిక. ఈ కాలంలో పఠనాభిరుచి ఉన్నా కూడా చదవడానికి తగిన సమయం వెచ్చించలేని సాహితీప్రియుల కోసం పెద్ద పెద్ద నవలలు చదవడానికి తీరిక లేని సమయాల్లో చదువుకోడానికి వీలుగా ఏర్చి కూర్చిన కథలివి.
ఆ మధ్య Ottessa Moshfegh రచన “My year of rest and relaxation” అనే సుమారు మూడొందల పేజీల ‘non-stop nonsense‘ ఓపిగ్గా చదివి నా సహనానికి నేనే భుజం తట్టుకున్నాను. Moshfegh తరహాలో అదే కోవకి చెందిన మరో రచయిత్రి ఈ శాలీ రూనీ. శైలి విషయంలో వీళ్ళిద్దరూ అచ్చంగా అక్క చెల్లెళ్ళే..వీళ్ళిద్దరి శైలిలో చాలా సారూప్యతలున్నాయి. వీళ్ళిద్దరూ సారహీనమైన కథావస్తువును పట్టుకుని కథనాన్ని మాత్రం సారవంతంగా రక్తికట్టిస్తారు. చెప్పే విషయం గొప్పది కాకపోయినా వీరిద్దరూ కథ చెప్పే విధానం మాత్రం అద్భుతంగా ఉంటుంది. వీరిద్దరికీ భాషపై మంచి పట్టుంది కానీ వీరి కథల్లో హేతువాదం,తార్కికత వంటి పరిణితి చెందిన అంశాలు మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు..అయినా అందరూ కథల్ని హేతువాదం,తర్కం కోసం మాత్రమే చదవరు కదా ! అందుకే వీళ్ళ రచనల్ని పూర్తిగా తీసిపారెయ్యడానికి వీల్లేదు..ఎందుకంటే ఒక్కోసారి భావానికి పదీ భాషాసౌందర్యానికి తొంభై మార్కులూ ఇస్తూ కూడా మనం కథలు చదువుతాం మరి. త్రాసులో వేసినప్పుడు ఈ రెండు అంశాలూ సమపాళ్ళలో తూగినప్పుడు పుట్టే కథ నిస్సందేహంగా ఒక మంచి కథ అవుతుంది,కానీ ఇప్పుడది అప్రస్తుతం.
ఈ ఇద్దరి శైలిలో కనిపించే మరో సారూప్యత వీరి కథల్లో కనిపించే నిరాశావాదం. ఇరవయ్యేళ్ళ వయసు యువతుల్లో కూడా గూడుకట్టుకున్న నిరాశానిస్పృహల్నీ,గమ్యం తెలీకుండా గాలివాటుకి కొట్టుకుపోయే తత్వాన్నీ వీళ్ళు అద్భుతంగా చిత్రిస్తారు. It was in my nature to absorb large volumes of information during times of distress, like I could master the distress through intellectual dominance అంటుంది ఈ కథలో Sukie అనే అమ్మాయి..బహుశా ఈ సమకాలీన రచయిత్రుల కథలు ఆధునిక యువత మనస్థితికి అద్దంపడుతున్నాయేమోననిపిస్తుంది..ఈ కథలో సూకీ కాన్సర్ వైద్యం జరుగుతున్న తండ్రి ఫ్రాంక్ ను కలవడానికి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వస్తుంది. తల్లి మరణానంతరం సూకీకి 19 ఏళ్ళ వయసులో చదువుకునే నిమిత్తం బంధువు నేథన్ (Nathan-34) తో కలిసి అతని ఫ్లాట్ లో కొంతకాలం జీవిస్తుంది.
ఇద్దరి మధ్యనా ఉన్న వయోభేదం,బంధుత్వం వారిద్దరి మధ్యా చిగురించిన ఒక అనిర్వచనీయమైన బంధానికి అడ్డంకి కావు. ఇద్దరి మధ్యా ఏ శారీరక సంబంధం లేకపోయినా We were predictable to each other, like two halves of the same brain అంటూ ఒక సందర్భంలో తమ సంబంధాన్ని నిర్వచిస్తుంది సూకీ నేథన్,సూకీ ల మధ్యనున్న ‘ఎమోషన్‘ ని చివరివరకూ పట్టుసడలనివ్వరు రూనీ. ఒక వ్యక్తిగా,ఒక సోషల్ ఆనిమల్ గా మనిషి అంతరంగానికీ, సామజికపరమైన కట్టుబాట్లకీ మధ్య జరిగే ఘర్షణ ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది..యుక్తవయసులో కళ్ళాల్లేని గుఱ్ఱంలాంటి మనసుకీ,పరిణితి చెందిన వయసులో జనించే వివేచనా,విచక్షణలకీ మధ్య జరిగే నిరంతర సంఘర్షణ ఈ కథలో సూకీ,నేథన్ ఇద్దరు పాత్రల ద్వారా వర్ణించే ప్రయత్నం చేశారు రూనీ. మరి వారిద్దరి సంబంధం చివరికే మలుపు తీసుకుందనేది మిగతా కథ. I had read that infant animals formed attachments to inappropriate things sometimes, like falcons falling in love with their human breeders, or pandas with zookeepers, things like that.అని సూకీ అంటున్నప్పుడు ఎందుకో లమ్హే సినిమాలో శ్రీదేవి కళ్ళముందు మెదిలింది.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు:
Death was, of course, the most ordinary thing that could happen, at some level I knew that. Still, I had stood there waiting to see the body in the river, ignoring the real living bodies all around me, as if death was more of a miracle than life was. I was a cold customer. It was too cold to think of things all the way through.
*
Add comment