తీతువు పిట్ట పాట

“ఏయ్‌! రాణీ ఇటికలు అయ్యిపోనాయి ఇంకో గమేళాతో ఇయ్యి” అన్నాడు పరంజా మీద కూర్చున్న సతీష్‌, ‘‘అంత తొందరేంటి ఇస్తున్నాగా” అంటూ చిరాగ్గా చూసింది రాణి. నలుగురు మేస్త్రీలు, నలుగురు హెల్పర్ల్ తో సుబ్బారాయుడు గారి ఇల్లు  కట్టుబడి చురుకుగా సాగుతోంది.

మిట్ట మధ్యాహ్నం అవుతోంది. మార్చి నెల ఎండ చుర్రుమంటోంది. వేప చెట్టుమీద వున్న గోరువంకలు  కిచకిచ మంటున్నాయి. సతీష్‌ సెల్‌ ఫోన్‌ లోంచి ‘‘బంగారు కోడిపెట్ట… వచ్చెనండి.. హెపాప, హేపాప…” పాట వస్తోంది. పని నడుస్తోంది. రాణి సాయంత్రం అందరూ వెళ్ళిపోయేదాకా ఆగి ‘‘సతీష్‌ ఈ విషయం విను, నిన్న నా మొగుడు ఫుల్‌గా తాగి వచ్చి, నన్ను చితకబాదాడు. ఇదిగో చూడు నా చేతుల మీద, వీపు మీద” అంటూ గాయాలు చూపించింది. ‘‘నేను భరించలేకపోతున్నాను. ఎక్కడికైనా పారిపోదామని వుంది. పిల్లేమో స్కూల్ కు పోతోంది. నాకు ఊపిరాడడం లేదు”. అని కన్నీరు పెట్టుకొంది. ‘‘అయ్యో!’’ అని సతీష్‌ సానుభూతి చూపించాడు. ‘‘మరి మీ పేటలో ఎవరైనా పెద్దలకు చెప్పలేకపోయావా! అన్నాడు. అన్నీ అయ్యిపోయాయి, వాళ్లూ చెప్పిచూసారు. అతను ఎదురు దెబ్బలాడాడు. మీలో ఎవరైనా తాగనోళ్ళున్నారా! అని అరిచాడు. ఇంక ఆళ్ళేం చేస్తారు? నన్నుకొడుతుంటే పిల్ల ఏడ్చిందని, దాన్ని కూడా బాదాడు” చెబుతూ తను ఎక్కిఎక్కి ఏడ్చింది. సతీష్‌ అయోమయంలో పడ్డాడు. ‘‘ఊరుకో “ అని ఆమె భుజంపై చేయేసి సముదాయించాడు.

యేస్తేరు రాణి సరిపడా ఎత్తు, చామన ఛాయ కంటే పిసరంత రంగు తక్కువ, కొంచెం ముక్కు తప్పడైనా ఏదో తెలియని అందం వుంది. ఒంటిలో చలాకీతనం వుంది. సాటి ఆడోళ్ళందరూ మామూలప్పుడు మిరపకాయ ముచ్చికు ఒల వడానికి, చేప, రొయ్యల  చెర్వుల లో వల లాగడానికి కొన్ని రోజులు  వరి వ్యవసాయానికి కూడా పోతుంటారు. తను మాత్రం ఇళ్ళకట్టుబడి పనికిపోతోంది. అప్పుడప్పుడూ మేస్త్రీ ఎగ్గొట్టినపుడు తాపీ పని చేయడానికి కూడా వెనకాడలేదు. రాణి చిన్నప్పటినుంచీ చురుకైన పిల్ల. ఎనిమిదోక్లాసు వరకూ చదివింది.

ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది. ముత్యాల్లాటి అక్షరాలు  రాసేది, ఇంగ్లీషు కూడా కూడబుక్కొని చదవగలిగేది. పాటల పోటీలో సినిమా పాటు బాగా పాడేది. “గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది, చెట్టుకొమ్మన పిట్టుంది… పిట్టమనసులో ఏముంది?..’’ తను పాడే పాటలో ఈ పాట అందరికీ ఫేవరెట్‌ సాంగ్‌. జనగణమన, వందేమాతరం దేశభక్తి గీతాలు  స్కూల్లో తను పాడాల్సిందే.

పూల పరిమళం, తుమ్మెదలకు తెలిసిపోయింది. ఊళ్లో చదువు ఎక్కని పోకిరి కుర్రాళ్ళు పందికోడు వంతెన దగ్గర కాపుకాసి, విజిల్స్‌ ఏస్తున్నారు. టెన్త్‌ క్లాసులో ముదర కుర్రాళ్లు అదును చూసి కన్ను కొడుతున్నారు. ఈ సమస్య అప్పుడప్పుడూపెరిగి  గొడవలైపొయ్యాయి. ఇక మేం కాపలా కాయలేమని చదువు మానిపించేసారు వాళ్ళ అమ్మానాన్న. నెమ్మదిగా తాపీ పనికి హ్పెల్పర్‌గా పని ప్రారంభించింది రాణి. ఇక్కడ కూడా సమస్యలోచ్చేవి.

ఓ రోజు గవర్నమెంటు ఉచితంగా ఇచ్చిన ఇళ్ళ స్థలాలకు ప్రెసిడెంటుగారు ఇరవై వేలు  వసూలు  చేస్తుంటే ఎందుకివ్వాలని ఎదిరించింది. పై వాళ్ళకు పిటిషన్‌ పెట్టింది కూడా. దానితో తన పేరు ఊళ్ళో మారుమ్రోగిపోయింది. ఇప్పుడు రాణి కేసి అందరూ భయంగా దొంగ చూపులు  చూస్తున్నారు.

దావీదు రొయ్యల చెర్వు దగ్గర కరెంట్‌ బోర్డు, ఏరియేటర్స్‌ రిపేరు చేసేవాడు. మంచిగా సంపాదన వుందని,  రాణికి అతనిచ్చి పెళ్లిచేసారు. అప్పుడప్పుడూ కుర్రోళ్ళతో పార్టీకు వెళ్ళేవాడు. ఇప్పుడు రోజూవారీ త్రాగుడు ప్రారంభించాడు. ఒకోసారి తాగి స్పృహ లేకుండా పడుండేవాడు. రాత్రిళ్ళు జనరేటర్ల రిపేర్లకు వెళ్ళలేకపోయేవాడు. దీనితో రైతులు  పిలవడం మానేసారు. కొన్ని రోజులు షేర్‌ ఆటో నడిపాడు. కొంత కాలానికి పగలే మందు త్రాగడం ప్రారంభించాడు. ఇక ఎప్పుడూ మనిషి ఊగుతూ, తూగుతూ వుండేవాడు. మైకంలో ఆటోతో ఎవరో ముసలోడ్ని గుద్దితే, కేసొచ్చింది. కొన్ని రోజులు  జైలుకు వెళ్ళొచ్చాడు. ఆటో అప్పులు  వెంటాడాయి. ఇక పనికి వెళ్ళడం రాణికి తప్పలేదు. తను సంపాదించేది అప్పు వడ్డీకు సరిపోయేది. తాగుడుకు డబ్బు ఇమ్మని పీడించేవాడు.

ఇంకా యవ్వనం వుండగానే కష్టాలు  తారాస్థాయికి చేరుకున్నాయి. దేవతలు, దెయ్యాలు  కలసి, జుట్టు విరబోసుకొని కరాళనృత్యం చేస్తున్నారు. సైతాను వికటాట్టహాసాన్ని జీసస్‌ దీనంగా చూస్తున్నాడు. తేనె కలిపిన చిక్కటి గుమ్మపాలను త్రాగి, ‘‘బ్రేవ్‌” అని తేన్చి సుఖాసీనుడై ‘‘కర్మఫం అనుభవించక తప్పదు నాయనా!’’ అంటున్నాడు స్వామీజీ టీవీలో.

“కల ఇదని నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే… పసితనపు మనోరథం, వెన్నెల  నీడై పోయేనులే. బ్రతుకింతేనులే…’’ ఘంటశాల  పాట మధురంగా విషాదంగా సెల్‌ఫోన్‌లోంచి వస్తోంది. ‘‘ఛెత్‌!’’ అని సతీష్‌ వెంటనే ఫోనులో పాట మార్చేసాడు. ఉలిక్కిపడింది రాణి. ‘‘ఏంటి పగటి కల కంటున్నావా!’’ అన్నాడు సతీష్‌. ‘‘ఎక్కడి కల?  అంతా చీకటే కనిపిస్తాంది!’’ అంది దిగాలుగా ముఖంపెట్టి. ‘‘సరేగానీ, గణపవరంలో మహేష్‌బాబు సినిమా వచ్చింది చూద్దామా!’’ అన్నాడు. ‘‘ఏం సినిమాలో… పిల్ల స్కూల్‌ నుంచి వచ్చేస్తుంది”. అంది ఎటోచూస్తూ.

సతీష్‌, వాళ్ళ అమ్మ కలిసి ఓ పది సంవత్సరాల  క్రితమే అత్తిలి దగ్గర ఓ గ్రామం నుంచి ఈ వూరు వచ్చేసారు. వీళ్లది పైవర్ణం. వాళ్ళ అమ్మగారు పనికి పోలేదు. సతీష్‌ చిన్నప్పడే  సిమ్మెంటు పనిలో హ్పెల్పర్‌గా చేరిపోయాడు. ఇప్పుడు మేస్త్రీగా ఎదిగాడు. ఏ అవక్షణాలు  ఇంకా అంటుకోలేదు. సీనియర్‌లు  తాగుబోతులై సైడై పోయినపుడు, ఇతనికి ప్రమోషన్‌లు  వచ్చాయి. యెదుటి వాళ్ళను గేలి చేయడం, తూల నాడటం అవాటు లేదు. యేస్తేరు రాణి దీనగాధ జాలిగా ముఖంపెట్టి వినేవాడు. అప్పుడప్పుడూ ఆమెకు డబ్బు బదులిచ్చేవాడు. మిగిలిన డబ్బు చిట్టీలు  కట్టి ప్రోగు చేస్తున్నాడు. చిరంజీవి పాటలు  సెల్‌ఫోన్‌లో వింటూ పనిచేయడమే హాబీ. రాణి బాధలు వింటూ, తనకు ఏమైనా సహాయం చేయాలని ఆరాటపడేవాడు. ఓ రోజు ధైర్యం చేసి ‘‘రాణీ నీ తాగుబోతు మొగుణ్ణి వదిలేసి వచ్చేయి, నేను పెళ్లి చేసుకుంటాను. నీ కూతుర్నికూడా జాగర్తగా చూసుకొంటాను” అనేసాడు. రాణి కళ్లు పెద్దవి చేసి ఏంటీ ఏళాకోళం ఆడుతున్నావా! అంది నవ్వుతూ! ‘‘లేదు రాణి నిజంగా వొట్టేసి చెబుతున్నా!’’ అని తన చేతిలో చెయ్యేసి చెప్పాడు. తన చెయ్యి నెమ్మదిగా వెనక్కు లాక్కుంటూ ‘‘నవ్వు పైవర్ణం వోడివి, నాకంటే చిన్నోడివి, నాకు పెళ్ళయ్యింది, అయినా  నా దరిద్రాన్ని నీకంటించడం దేనికి? ఈ జన్మకు ఇలాపోనియ్‌!’’ అంది రాణి దీనంగా. చీకటి పడుతోంది. కాకులు  పోలాల నుంచి వచ్చి, చెట్లపైవాలి గోల చేస్తున్నాయి. ముక్తసరిగా ‘‘నే వెళతా!’’ అని వెళ్లిపోయింది రాణి. సతీష్‌ దిగాలుగా తన ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు.

ఊరు ఊరుకొంటుందా! బోళ్ళన్ని గుసగుసలు. ఈ వార్తలు  నెమ్మదిగా సతీష్‌ అమ్మకు చేరాయి. సున్నితంగా కొడుకును మందలించింది. ‘‘అలాంటిది ఏమీ లేదు, ఆమె మంచి పిల్ల  అన్నాడు. ‘‘కింది జాతి వాళ్ళు మనల్ని బుట్టలో పడేసి, డబ్బు గుంజుతారు జాగ్రత్త” అంది వాళ్ళమ్మ. మౌనంగా వుండిపోయాడు సతీష్‌.

ఇలా కాదని మేనమామకు ఫోన్‌ చేసి విషయం చెప్పేసింది. అతను పరుగేసుకుని వచ్చేసాడు. తన కూతురు ఇంకా పెద్దమనిషి కూడా కాలేదు. అయినా సమస్య గట్టుదాటకూడదనే ఉద్దేశ్యంతో పెళ్ళి కుదిర్చేసుకున్నాడు, నెల్లో  పెళ్ళయిపోయాక, వాళ్ళందరూ అత్తిలి వెళ్లిపోయారు.

రాణి కళ్ళల్లో హుషారు సగం తగ్గిపోయింది. చీకటిపడుతున్న వేళ తీతువు  పిట్ట ఆకాశంలో కిందనుంచి ఎగురుతూ అరుచుకుంటూ వెళ్ళిపోయింది. రాణీకి భయమేసింది. వాళ్ళ అమ్మమ్మ చెబుతుండేది. తీతువు పిట్ట అరుపు కీడును తెచ్చిపెడుతుందని.

ఊళ్ళో తిరనాళ్ళు ప్రారంభం అయ్యాయి. పగలంతా భక్తి పాటలు,  సాయంత్రం నుంచీ కైపెక్కించే పిచ్చి సినిమా పాటలతో ఊరంతా హోరెక్కిపోతోంది. పైగా రథయాత్రకూడా… తన పనై, ఇంటికి వెళ్ళే సమయానికి మొగుడు దావీదు ఇంటిలో కల తిరుగుతున్నాడు. తను కనిపించగానే ‘‘ఓ అయిదువందలియ్యి” అన్నాడు. “ఒక్కపైసా లేదు. షావుకారు నుంచి సరుకు అరువు తెచ్చా!”అంది రాణి. ఇంకేముంది జుట్టుపట్టుకొని ‘ఫెడీ’ ‘ఫెడీ’ మని చేత్తో కొట్టాడు. ఎల్లి మేస్త్రీని అడుక్కురా! ఉట్టి చేతుతో వచ్చావో ఈయాల  నీ దినం అయిపోనట్టే! అంటూ బయటకు గెంటాడు. రాణికి వేరేదారి లేదు, కళ్ళమ్మటా నీళ్ళు కుక్కుకొంటూ పెద్ద మేస్త్రి దగ్గరకు వెళ్ళింది. మంగళవారం కదా డబ్బులిచ్చేది,  ఇప్పుడు కాదు అన్నాడు. కాళ్ళమీద పడి ఓ వంద రూపాయు తీసుకొని భయం భయంగా ఇంటికొచ్చింది.

వంద కాయితం చూసి చిర్రెత్తుకొచ్చింది దావీదుకు. ‘‘ఈ ఏళ నీ పనైపోయింది, ఎవడో చిన్న మేస్త్రీతో కులుకుతున్నావటగా, మొగుడు నీకు లోకువైపోయాడే”, అంటూ జుట్టు పట్టుకు కొడుతున్నాడు. తను ఒక్క తోపు తోసింది, ఎనక్కు పడ్డాడు. ఇంకా కోపంతో, కత్తిపీటను తెచ్చి రాణీమీదకు ఉరికాడు. తను ప్రక్కకు తప్పుకొని అతన్ని ముందుకు తోసింది. దావీదు నేల మీద పడ్డ కత్తిపీటమీద బోర్లా పడ్డాడు. కత్తి మెడకు బలంగా కోసుకొని రక్తం చిమ్మింది. బయట రథం ఊరేగింపు పేట ప్రక్కనుంచి వెళుతోంది. డప్పు మోత, మరో ప్రక్క మైకు గోల, ఎంత అరిచినా పలికే దిక్కేలేదు. కొద్దిసేపటికి కోలు కొని, భర్త శవాన్ని గోళెం దగ్గరకు లాగింది. నలుగురి సాయంతో ఆ సాయంత్రమే అంత్యక్రియలు  జరిగిపోయాయి.

నాలుగు రోజులకు  పండగ చప్పబడిన తరువాత మరల  గుసగుసలు ‘‘రాణీ మొగుణ్ని చంపేసిందని”. ఇప్పుడు రాణీ అంటే జనాలకు భయం పట్టుకొంది. మౌనంగా పనికి వెళుతోంది రాణి. చెట్టూ, పుట్టా, ఊరు తనను గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక కొద్ది రోజులు  కూడా వుండలేక కూతుర్ని తీసుకొని గూడెం వెళ్ళిపోయింది. అక్కడ తెలుసున్న వాళ్ళద్వారా వేరే చోట పనికి కుదిరిపోయింది.

ఓ రోజు వాళ్ళూరికి చెందిన వెంకటేశ్వర్రాజుగారు బజారులో కనిపించారు. “రాణి, ఇక్కడేంచేస్తున్నావు?” అని అడిగారు. ఓసారి ఆయనగారి చేపల  చెర్వు దగ్గర షెడ్‌ కట్టినప్పుడు పరిచయం. కథంతావిని నువ్వు పనిమంతురాలివి, ఇక్కడ  కొత్తబస్టాండు వెనకాల  కాలనీలో నేను కొత్త ఇల్లు కడుతున్నాను. నువ్వు మేస్త్రీగా వుండు” అన్నాడు. ఆనందంగా ఒప్పేసుకొంది రాణి.

ఓ నాలుగు సంవత్సరాలు  గడిచాయి. ఇప్పుడు రాణీ ఓ పాత స్కూటర్‌ కొంది. పంజాబీ డ్రస్‌ వేసుకొంది. పిల్ల ను ట్యూషన్‌ దగ్గర ఉదయాన్నే దింపేసి, తను పనికి వెళ్లిపోయేది. మరల రాత్రి కలిసి భోజనం చేసే దగ్గరే వాళ్ళ కయిక, ఇద్దరికీ క్షణం తీరిక లేదు.

ఓ సారి కూతురు అడిగింది కదా అని తాపేశ్వరం కాజాల కోసం రైల్వేస్టేషన్‌ దగ్గర వున్న పెదకాపు స్వీట్‌ షాపుకు వెళ్ళింది. అక్కడ సతీష్‌ కనిపించాడు. ఇద్దరి మొఖాలు  ఓసారి వెలిగిపోయాయి. ఎలా వున్నావు రాణీ! అని ఆమె చేయి  పట్టుకొన్నాడు. తను మోహమాటంగా నాలుగు సెకన్లు ఆగి చేయి  విడిపించుకొంది. ఇద్దరూ దూరంగా వెళ్ళి స్టేషన్‌ పార్కింగ్‌లోవున్న బెంచీపై కూర్చున్నారు. ‘‘నువ్వెలాగున్నావ్‌” అని అడిగింది రాణి. అతనికి ఇద్దరు మొగ పిల్లలు. అందరూ తిరుపతి వెళ్ళడం కోసం స్టేషన్‌కు వచ్చారట. ఇంకా టైముందని స్వీట్స్‌ కోసం ఇలా బయటకు వచ్చాడట. అతని వంక జాలిగా చూస్తూ ‘‘ఎప్పుడూ నువ్వే గుర్తుకొస్తుంటావ్‌. మీ ఆవిడ అదృష్టవంతురాలు” అంది రాణి. సతీష్‌ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ముద్దుపెట్టుకున్నాడు. ‘‘రాణీ నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను ఇప్పటికీ రెడీ” అన్నాడు నెమ్మదిగా. అతని చెయ్యి కొంచెం వొణుకుతోంది. రాణి మరల చేతిని నెమ్మదిగా విడిపించుకొంది. ‘‘నా మొగుడున్నప్పుడు నువ్వు ఒంటరి, ఇప్పుడు నేను ఒంటరిని. నీకు పెళ్ళ అయ్యిపోయింది. ప్చ్‌! మతం వేరు, కుం వేరు, మరి ప్రేమ ఎందుకు పుడుతుందో!’’ అంది రాణి దూరంగా చూస్తూ… ‘‘నువ్వు మంచోడివి, నీ జీవితం బాగా సాగాలి! ఇంత దూరం వచ్చాకా, ఉన్న బంధాలు  తెంపుకొని కొత్త వాటిని ఎతుక్కోవడం ఎందుకో సరిగా అనిపించటాలేదు” అంది నిరాశగా. ఇంతలో రైల్వే ఎనౌన్స్‌మెంటు వచ్చింది. సతీష్‌ లేచి నుంచుని ఫోన్‌లో ఏదో మాట్లాడుతూ “రైల్‌ టైమ్‌ అయ్యింది” అంటూ అదో రకంగా చూసి వెళ్ళి పోయాడు. కొద్దిసేపు అటువైపే చూస్తూ వుండిపోయింది.

సతీష్‌ భార్య పిల్లలతో హడావిడిగా రైలెక్కేసాడు. చిన్నోడు సతీష్‌ చంక దిగలేదు. ‘‘ఆడు ఇందాకట్నించి నువ్వు కనిపించలేదని ఒకటే ఏడుపు” అంది ఆళ్ళావిడ. ఈళ్ళందరినీ వదిలేసి రాణీని చేసుకుంటానని ఎలా అనగలిగాడో తలచుకుంటే భయం వేసింది. ఆమె ఎంత సున్నితంగా ఆపిందో తలచుకొని నిట్టూర్చాడు. రాణి ఎంత గొప్పది… ఆమె ఒక దేవతలాగా అనిపించింది. కళ్ళలో నీళ్ళుతిరిగాయి. మనస్సులో ఓ నమస్కారం చేసుకొన్నాడు.

కాలం గడిచిపోతోంది. రాణీ మేస్త్రీగా స్థిరపడింది. బాగానే సంపాదిస్తోంది. క్షణం తీరికలేదు. ఎప్పుడైనా చీకటి పడేవేళల్లో తాను కడుతున్న బిల్డింగ్‌పై ఒంటరిగా కూర్చుని చాలాసేపు సంధ్యవంక చూస్తూ వుండిపోయేది.

ఈ రోజు అలాగే కూర్చుని వుండగా తీతువు పిట్ట పైన ఆకాశంలో అరుచుకుంటూ వెళ్ళిపోయింది. తనకు ఓ క్షణం భయం వేసింది. చాలా రోజుకు మరల ఈ కూత వినపడింది. ఇంతలో కూతురు ఫోన్‌, ఆదుర్దాగా ఫోన్‌ ఎత్తి ‘‘ఏమైందమ్మా” అని అడిగింది నెమ్మదిగా. ‘‘అమ్మా ఈ రోజే హెడ్మాస్టారుగారు ఫోన్‌ చేసారు. నాకు నూజువీడులో వున్న ట్రిపుల్‌ ఐటిలో సీటొచ్చింది. రేపే వెళ్లి జాయిన్‌ అవ్వాలని అన్నారు. మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. ఇన్నాళ్ళూ తన కూతురు పడిన కష్టం ఫలించింది. ఇప్పుడు తనకు తీతువు పిట్ట కూత, మధురమైన పాటలాగా వినిపించింది.

*

కూనపరాజు కుమార్‌

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు