చాలా కాలం క్రితం
కాలస్పృహ తెలియని అనాది స్థితిలో
నువ్వు వెలుతురుగా నేను కిరణంగా, నువ్వు ప్రవాహంగా నేను కెరటంగా
నువ్వు ఆనందధారగా నేను చిరునవ్వు రేఖగా ఉండే ఆ రోజుల్లో, ఒక ఆషాఢమాసపు ఉదయాన్న…
తొలకరి మేఘం నేలని ముద్దాడటానికి పరిగెత్తిన వేళ, మట్టివాసనకి మత్తెక్కిపోయాను నేను
తుమ్మెద పాటలకి మైమరచి, మెరుపుల ఆడంబరానికి మురిసిపోయాను!
లోగొంతుకలో నిన్నిలా అడిగాను –
“నేనూ ఒకసారి ఈ సమ్మోహనమైన స్వప్నంలోకీ. సౌందర్యభరితమైన ఉత్సవంలోకీ వెళ్ళిరానా?”
నువ్వు నవ్వావు – జాలిగా, గంభీరంగా
“క్షేమంగా స్వేచ్ఛగా వెళ్ళు” అన్నావు
అనుమతి దొరికింది వెళ్లటానికే కానీ తిరిగి రావడానికి కాదని గమనించుకోలేదు, అల్పమైన సంతోషంతో నీ చేయి వదిలేశాను. నన్నొక క్షణం ఆపి నీ గుర్తుగా నా హృదయమధ్యంలో దహరాకాశాన్ని నింపి పంపావు నువ్వు.
సరిగ్గా ఆ నిమిషాన్నే సృష్టి మొదలైంది, సహజమైన ప్రేమానుభవవం నా జ్ఞాపకాలనుంచి పూర్తిగా చెరిగిపోయింది.
**
త్వరలోనే ఈ లోకంలో ఇమిడిపోయాను, ఇక్కడి మాయల్లో మునిగిపోయాను. నేను ఎక్కణ్ణించి వచ్చానో లీలగానైనా గుర్తురానంత మరపు కమ్మేసింది. ఎన్నో పిల్లచేష్టలు చేశాను. నాతోటి ఆకతాయిలతో కలిసి తోటల్లో, చేలల్లో గంతులు వేసుకుంటూ తిరిగాను. మా తుంటరి చేతుల్తో పూలన్నిట్నీ కోసుకుని, పిందెల్ని తెంపుకుని, చెట్లనూపి ఆకులు రాల్చేశాము. ఎన్ని అల్లరాటలు ఆడుకున్నామనీ మేమంతా!
పరుగులెత్తి తూలిపడి దెబ్బలు తగిలినప్పుడు మాత్రం ఎలుగెత్తి ఏడ్చాము. మేము విహరించే దారిలో రాళ్ళని అడ్డుపెట్టింది నువ్వేనని ఎవరో చెప్పగా విని, మా ఆటల మధ్యలో నిన్ను నిందించుకున్నాము. ఇదంతా చూస్తూ కూడా, మా నిందలన్నీ విని కూడా నువ్వు తొణక్కుండా ఉన్నావు. మళ్ళీ రేపు ఆటలకి వచ్చే పొరుగూరి పిల్లల కోసం కొమ్మలకి మారాకు వేయించి, మొగ్గలకి సిగ్గు వదిలించి, కాయల్ని పండుబార్చి మళ్ళీ అదే సహనంతో తోటమాలివయ్యావు చూడు…
ఎన్నటికీ అలుపెరగని అనంతమైన ప్రేమ నీది!
**
నూత్న యవ్వన ఋతువులు దేహాన్ని మోహరించాయి. పుప్పొడి ఉప్పెనలు రాత్రుల్ని ముంచెత్తాయి. ఆశల అక్షయ తూణీరాలు అనవరతం దాడి చేస్తూనే ఉన్నాయి. దహించే వెన్నెలలు, చల్లబరించే అగ్నికీలలు అనుభవమయ్యాయి. ఆశాసౌధాల మీద పూలవానలు కురిసి, నరనరాన్న సుఖాన్వేషణ రుధిరమై ప్రవహించి ఉన్మత్తతను కానుకిచ్చింది.
పంచభూతాలు నా కౌగిట్లో సేదతీరాయి, సప్తవర్ణాలు నా కంటిపాపల కాంతిని అరువు తీసుకున్నాయి. నాకోసమే ఉదయాలు సుగంధం వెదజల్లేవి, నా అనుమతితోనే అసురసంధ్యలు ఆలాపన మొదలుపెట్టేవి. ఎవరూ నడవని దారుల్ని వెతుక్కున్నాను, ముళ్ళబాటల్లో రాళ్ళతోవల్లో కూడా ఒంటరిగా నడిచి గర్వపడ్డాను. పెద్దలమాటల్ని పెడచెవిన పెట్టాను, పాపభీతిని పరిహసించి నీతిబోధల్ని నిర్లక్ష్యం చేశాను. ప్రపంచమే నా పాదాక్రాంతమయ్యాక
ఇక కట్టుబడవలసింది దేనికో అర్థం కాలేదు నాకు.
నువ్వు మాత్రం నీ అఖండమైన శక్తిని నాలోనింపి వేడుక చూశావు.
నిండుకోవడం తెలియని నిస్వార్థమైన ప్రేమ నీది!
**
పూల పడవలు దాటిపోయాయి!
పాదాలు పగుళ్ళుబారి నడక నెమ్మదించింది, ఆవలితీరమూ ఇవతలివైపునే ఉందనే సత్యం వేళ మించిపోక మునుపే తెలిసింది. దొంగలు పడ్డ ఇంటిలా, కోరికలు ఖాళీ అయిపోయిన మనసుతో ఒంటరిగా మిగిలాను. సగం భూభారాన్ని వీపుకెత్తుకుని కూడా నిటారుగా నడిచిన నిన్నమొన్నటి గుర్తులు నీటిమూటల్లా కరిగిపోయాయి.
నువ్వున్నావని నమ్మకం కుదిరింది, నేనుండటమే మన మధ్య అడ్డని తోచింది.
తెరని తొలిగించే తెలివిడి నా వశంలోది కాదు కదా!
వేలాది మిధ్యా లౌకిక ద్వారాల మధ్య నా హృదయ గవాక్షాన్ని ఏనాటికైనా గుర్తుపడతానేమోనని, కరుణతో వేచి చూస్తావు నువ్వు.
తిరిగి రమ్మనే పిలుపుకోసమే ప్రతినిత్యమూ నా ప్రార్ధన;
తిరుగులేని లీలావినోదంతో దాగుడుమూతలాడుతూ నర్తిస్తుంది నీ ప్రేమ!
**
Very nice Swathi, reminding Tagores’s Gitanjali.
“నువ్వున్నావని నమ్మకం కుదిరింది, నేనుండటమే మన మధ్య అడ్డని తోచింది”..
ఎప్పటికి ఇది సాధ్యం అవుతుందో మరి..ఎప్పటికి ఈ ఆట ఆగుతుందో!
మనిషి గమనాన్ని ఎంత చక్కగా చెప్పారో!
చాలా బాగుంది