తిమ్మాపురం బాలకృష్ణా రెడ్డి స్మారక ద్వితీయ సాహిత్య పోటీ విజేతలు

వృత్తిరీత్యా న్యాయవాది, సామాజిక స్ఫూర్తిదాయి, ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్యాభిమాని, ప్రగతిశీల వాది అయిన  కీ|| శే|| శ్రీ తిమ్మాపురం బాలకృష్ణా రెడ్డి స్మారకార్థం, విజయవంతంగా నిర్వహించిన ద్వితీయ సాహిత్య (నవలలు) పోటీకి అనూహ్యమైన స్పందన లభించింది. ఇందుకు సహకరించిన ఔత్సాహికులైన రచయితలు మొదలుకుని పేరు ప్రఖ్యాతులు గాంచిన రచయితలు అందరికి మా మనః పూర్వక ధన్యవాదాలు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుండి మొత్తం 40 నవలలు పోటీ కోసం పరిశీలనకు వచ్చాయి. ఈ నవలలు అన్నింటిని క్షుణ్ణంగా చదివి, వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, తమ అభిప్రాయాన్ని తెలిపిన న్యాయనిర్ణేతలందరికి మా కృతజ్ఞతలు.

ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అమెరికా వరకు అన్ని రంగాలలో ఉన్న (డాక్టర్లు, ఇంజినీర్లు, బ్యాంకర్లు, గృహిణులు) రచనా విశ్లేషకులు పోటీకి వచ్చిన నవలలను చదివి మొదటి రౌండ్ లో వడబోసిన తరువాత, మిగిలిన  6 నవలలను చివరి రౌండ్లో సారంగ యాజమాన్యం, బాలకృష్ణారెడ్డి తిమ్మాపురం సాహితీ కమిటీ సభ్యులు కూలంకషంగా చర్చించి, “కోనేటిగడ్డ”, “ఊరంత మనిషి” అనే రెండు నవలలను ఎన్నుకున్నారు.

ఈ పోటీ ప్రారంభంలో నిర్ణయించిన విధంగా రెండు ఉత్తమ నవలలను ఎంపికచేసి మొత్తం రూ. 40,000 /- ల బహుమతిని సమానంగా ఇద్దరు రచయితలకు ప్రకటిస్తున్నాము. విజేతలైన ఇద్దరు రచయితలు – “కోనేటిగడ్డ” నవలా రచయిత డాక్టర్ మూల రవికుమార్ గారికి, “ఊరంత మనిషి” నవలా రచయిత శ్రీ సుంకోజి దేవేంద్రాచారి గారికి అభినందనలు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన సారంగ యాజమాన్యానికి, ఈ పోటీల్లో పాల్గొన్న రచయితలందరికి మరొక్కసారి ధన్యవాదాలు. ఈ నవలలను సారంగలో త్వరలో ప్రచురిస్తాం.

రచయితల పరిచయం:

 సుంకోజి దేవేంద్రాచారి: తల్లిదండ్రులు సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డెప్పాచారి. స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలంలోని గుడ్రెడ్డిగారిపల్లె. ప్రస్తుత నివాసం కడప. వృత్తి రీత్యా జర్నలిస్టు. ప్రవృత్తి సాహితీవ్యాసంగం. ఇప్పటి వరకు దాదాపు 100 కథలు, వందకు పైగా కవితలు, 7నవలలు రాశారు. “అన్నంగుడ్డ”, “దృశ్యాలు మూడు.. ఒక ఆవిష్కరణ”,  “ఒకమేఘం కథ”, అనే కథల సంపుటాలు, మరియు “నీరు నేల మనిషి”,  “రెక్కాడినంతకాలం” అనే నవవలు, గ్రామీణ క్రీడలపై రాసిన “మనమంచి ఆటలు” అనే పుస్తకాలు వెలువరించారు.

డా. మూలా రవి కుమార్: స్వస్థలం అమరాయవలస గ్రామం, విజయనగరం జిల్లా. ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పశుపోషణా శాస్త్రవేత్త. గతంలో జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) అధికారిగా (2003-10), దేశంలొ వివిధ రాష్ట్రాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లా లోని మండపేట లోనూ పశువైద్య అధికారిగా (2010-12) అనుభవం. పద్దెనిమిదేళ్ళుగా కథా రచన, 2012 లో చింతలవలస కథాసంకలనం విడుదల. రచనాంశాలు: ఉత్తరాంధ్ర గ్రామీణం,  స్వంతవృత్తి అనుభవాలూ, సమస్యలూ, సంస్థల పనితీరు వగైరా.

వచ్చే సంవత్సరం కలుసుకుందాం, అంతవరకు సెలవు!

-TBKR సాహిత్య పోటీ కమిటీ

ఎడిటర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు