వ్యక్తిగత జీవితంలో నిలకడ, ఉద్యోగంలో ఒక నిస్తబ్దత – జీవితంలో ఒక దశను వర్ణించడానికి ఇవి రెండూ రెండు విరుద్ధ పదాలుగా అనిపించవచ్చు. కాని నా జీవితంలో 1963 కాలాన్ని వర్ణించే పదాలు సరిగ్గా అవే.
నా తొలి పుస్తకం విడుదలయ్యాక కొత్త జీవితం ప్రారంభమైనట్టు అనిపించింది. కొత్త అవకాశాలు కొన్ని నా తలుపు తట్టాయి. వెంటనే వచ్చే పెద్ద మార్పులేమీ లేనప్పటికీ, ఆ పుస్తక ప్రచురణ గొప్ప సంతృప్తిని, ఆ నిరాశపూరిత వాతావరణంలో కొంత రిలీఫ్ నూ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చే జీతాలు మరీ ఎక్కువ కాకపోయినా సరిగానే ఉండేవి. సంవత్సరంలో ఏ పని చేశారు ఏం చెయ్యలేదు అని లేకుండా ఏడాదికి ఇంతని ఇంక్రిమెంటు పడుతూ ఉంటుంది. ఏవో అలవెన్సులుంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఆదాయమూ ఉంటుంది. అందువల్ల కుటుంబ పోషణకు బెంగపడాల్సిన పనిలేదు. ఎవరికైనా ఒక స్థాయిలో కొన్ని పరిమితులకు లోబడి బతకాలి అంటే అది బాగానే ఉంటుంది.
నాకు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోయేది కనుక వ్యక్తిగత జీవితంలో నిలకడగా ఉన్నామని చెప్పుకోవచ్చు. కాని ఒకటి రెండు తీరని కోరికలుండేవి. అదేమంటే ఇంట్లో ఒక టెలిఫోన్ ఉండాలి, కారు కాకపోయినా మనకంటూ ఒక సొంత స్కూటర్ ఉండాలి అనేలాంటివి. ఇవి రెండు అప్పటి మా పరిస్థితికి సాధ్యం కావు. అప్పట్లో వెస్పా స్కూటర్లు చాలా కొత్తగా వచ్చాయి. అవి ఇటలీలో తయారయ్యేవి, విడిభాగాలను ఇండియాలో అమర్చేవారు. మా స్నేహితులు కొందరు కొనుక్కొన్నారు, కాని తరచూ ప్రమాదాలకు గురయ్యేవారు. అందువల్ల నాకు వాటిపట్ల సరదా కలగలేదు.
స్తబ్దత ఎందువల్లనంటే ఊహల్లోని జీవితానికి – వాస్తవానికి పొంతన కుదరకపోవడం వల్ల కలిగేది.
మనిషి నిరాశలో కూరుకుపోవడం సులువే. అది కర్రను చెదలు తినేసినట్టు మిగిలిన జీవితాన్ని తినేస్తుంది. నేను నా జీవితాన్ని అలా వృధా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఓర్పు, ఆశావహ దృక్పథం అనేది ఆర్థికవేత్తలకు తప్పక ఉండాల్సిన లక్షణాలు. నేను వాటినే అలవరచుకునేందుకు ప్రయత్నించాను.
*****
1962లో చైనాతో యుద్ధం వచ్చింది. దాని ప్రభావం ప్రభుత్వం మీద తీవ్రంగా ఉండేది. కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో తక్షణ మార్పు వచ్చింది. ఉదాహరణకు – ఆ సమయంలో పంచవర్ష ప్రణాళికలకు విరామం ప్రకటించాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఒకవైపు రక్షణ మరోవైపు అభివృద్ధి – రెండూ ప్రభుత్వ కర్తవ్యాలే. ఆ రెండిటి మేలుకలయికగా ఒక కొత్త మంత్రిత్వ శాఖ రూపుదిద్దుకుంది. దాని పేరు ‘మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ కోఆర్డినేషన్’.
దాని విధులేమిటో వెంటనే తెలియరాలేదు. ఆర్థిక శాఖ సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్న కొన్నిటిని అది పునరావృతం చేసేది. అప్పటికి ఉన్న నమూనాకు భిన్నంగా ఈ కొత్త మినిస్ట్రీ లో చిన్న స్థాయి ఉద్యోగుల కన్నా జాయింట్ సెక్రెటరీలు ఎక్కువమంది ఉండేవారు. ఊరికే ఫైళ్లు పైకి కిందకి తిరక్కుండా, నిర్ణయాలు త్వరగా తీసుకునేందుకు చేసిన ఏర్పాటది. యుద్ధసమయంలో ‘ఫైనాన్స్ అండ్ కామర్స్ పూల్’ ఒకటి ఏర్పాటయింది. అనుభవజ్ఞులైన అధికారులు అందులో ఉండేవారు, వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆ స్ఫూర్తితో దీన్ని మొదలు పెట్టారుగాని వాస్తవంలో ఆ శాఖ పాత సెక్రటేరియట్ శైలిని మార్చుకోలేకపోయింది. ఆర్థికపరంగా అనిశ్చిత స్థితి ఉన్నప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మనదగ్గర విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయి. పరిస్థితి మెరుగు పడాలంటే ఎక్కువ విదేశీ సాయం కావాల్సిందే. అందువల్ల చివరకు నిర్ణయాలు దాతల దృక్పథాల మీద ఆధారపడి తీసుకోవలసి వచ్చేది.
రక్షణ రంగానికి కావలసిన ఉత్పత్తిని పెంచారు. దానికి ఎక్కువ దిగుమతులు కావాలి. మరీ ముఖ్యంగా నాన్-ఫెర్రస్ మెటల్స్ దిగుమతులు అవసరమయ్యేవి. అప్పటికవి లోటులో ఉండేవి. ఎయిడ్, ఇతర దాతలు ఇచ్చే ప్రాజెక్టు లోన్లతో వాటిని దిగుమతి చేసుకోవడం కుదిరే పని కాదు. మనకు ఇంకా ఎక్కువ సాయం కావాలి. అదికూడా ఏ ప్రాజెక్టుకూ సంబంధించని నాన్-ప్రాజెక్ట్ లోన్లు కావాలి.
తమ పద్ధతిని మార్చుకోవడానికి దాతృత్వ సంస్థలు మొదట్లో ఇష్టపడలేదు. కాని ఇండియా అడగ్గాఅడగ్గా 200 మిలియన్ డాలర్లు నాన్ ప్రాజెక్ట్ నిధులు ఇచ్చేందుకు యూఎస్ ఎయిడ్ సంస్థ అంగీకరించింది. మొదట్లో వాణిజ్య దిగుమతుల కోసమే ఆ రుణం వచ్చింది. ఆ డబ్బు త్వరగా అయిపోయింది. కాని సప్లై ఆగిపోకూడదు అనే కారణంతో మరో 300 మిలియన్ డాలర్లు (రెండో నాన్ –ప్రాజెక్ట్ రుణం) ఇచ్చింది ఆ సంస్థ. దీంతో రుణాల సరళి మారిపోయింది, అమెరికా నుంచి మనకు అందే సాయం అనూహ్యంగా పెరిగిపోయింది. అప్పటివరకూ ఏడాదికి 200 మిలియన్ డాలర్లు వస్తే గొప్ప అనుకునేది కాస్తా, తర్వాత ఏడాదికి ఒక బిలియన్ డాలర్లు సాధారణమైపోయింది. ఇదిగాక పి.ఎల్.480, రక్షణరంగ పరికరాలు వేరేగా వచ్చేవి.
ఈ తరహా మార్పులు, విదేశీరుణాల్లో పెంపు వంటి అంశాలను దగ్గరగా గమనించడం వల్ల నేను ఇండియన్ ఇండస్ట్రియల్ ఎకానమీ గురించి బాగా నేర్చుకోవడం సాధ్యమైంది. యూఎస్ ఎయిడ్ పనితీరు, పద్ధతులు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ అర్థమవుతూ వచ్చాయి. నా రోజువారీ విధుల్లో భాగంగా నాకు ప్రభుత్వ ఉన్నతాధికారులతోను, మరోవైపు అమెరికా ఎంబసీకి చెందిన అధికారులతోనూ కలిసి పనిచెయ్యాల్సి వచ్చేది. అందువల్ల నా అవగాహన విస్తృతమయింది.
*****
మినిస్ట్రీ లోపల, వెలుపల కూడా నా తొలి పుస్తకం తెచ్చిన గుర్తింపు నీడలాగా అంటిపెట్టుకుని ఉండేది నన్ను. పుస్తకం అచ్చులో వచ్చి కొద్ది వారాలు గడిచాయి. ఇక పత్రికల్లో సమీక్షలు రావడం మొదలైంది. ఇండియా, యు.కె. దినపత్రికల్లో వచ్చినవాటిని ఉత్సాహంగా కత్తిరించి ఒక ఫైల్ లో భద్రపరచుకున్నాను. కొన్ని పుస్తకం బాగుందని రాస్తే, మరికొన్ని అద్భుతమని రాశాయి. కొన్ని అచ్చుతప్పులు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిచూపి క్షమించాయి. మొత్తానికి నేను ఊహించిన దానికన్నా మంచి ఆదరణ లభించింది పుస్తకానికి. అన్నిటికన్నా అసలు సారాంశాన్ని పట్టి ప్రచురించినది – టైమ్స్ లిటరసీ సప్లిమెంట్. ఆ జర్నల్ నేను తరచూ చదివేవాడిని కాదు. నా సహోద్యోగి కె.సుబ్రహ్మణ్యన్ – ఆయన స్వయంగా కవి, దాన్ని క్రమం తప్పక చదివేవారు. ఆయన టైమ్స్ లో నా పుస్తక సమీక్ష చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి చూపించారు. అది చిన్నది, క్లుప్తంగా ఉంది. అయినా ‘ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ చదివే విద్యార్థులు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి’ అని రాశారు. ఇక నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆరోజు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగపడుతూ రాసినప్పటికీ ఆ పుస్తకం బాగా రావడం, ఆదరణకు నోచుకోవడం గొప్ప సంతోషాన్నిచ్చింది. దాంతో వచ్చిన మంచిపేరును ఎలా మలచుకోవాలో అదే నా చేతిలోనే ఉంది.
*****
ప్రభుత్వ ఉద్యోగంలో ముందుకెళ్లే అవకాశాలు తక్కువ. ప్రమోషన్లు సీనియారిటీ మీద ఆధారపడతాయి. నాకన్నా ముందు ఎందరో లైన్లో ఉన్నారు. దాంతో నేను ప్రైవేట్ రంగంలో అవకాశాలు వైపు చూపు సారించాను. కేవలం ఉద్యోగాల కోసం కాదు, నా సొంత పరిశ్రమ ఒకటి పెట్టాలనే ఆలోచన ఉండేది. అది కొత్త వారికి కష్టం. మేనేజ్మెంట్ అప్రెంటీస్ గా పనిచేసిన అనుభవం కావాలి. దానికోసం నేను సి.సి.దేశాయ్ గారికి ఒక ఉత్తరం రాశాను.
ఆయన సివిల్ సర్వీసుసు వదిలి ప్రైవేట్ సెక్టార్లో అనేక కంపెనీలకు చైర్మన్ గా పనిచేశారు. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. నా ఉత్తరానికి ఆయన వెంటనే స్పందించారు. వచ్చి తనను కలిస్తే అవకాశాలు ఏమున్నాయో చర్చించవచ్చు అని రాశారు. మంచి మనిషి. ఆయన కోసం చాలామంది వేరే గదిలో వేచి చూస్తున్నా సరే, నా కోసం సమయం కేటాయించారు. విషయం పూర్తిగా చర్చించారు, నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారు. నేను నాలోపలి సందిగ్ధాలను ఆయనతో పంచుకున్నాను. అనుకున్నట్టు ఏదీ కుదరకపోతే, హైదరాబాద్ వెళ్లి సొంత వ్యాపారం పెట్టాలనుకుంటున్నట్టు చెప్పాను.
ఇండియన్ డిటొనేటర్స్ లిమిటెడ్ అనేది ఆయన కంపెనీల్లో ఒకటి. అప్పట్లో అది పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ప్రభుత్వ సర్వీసును వీడాలని పూర్తిగా నిర్ణయించుకుంటే తనను మరోసారి కలవమని చెప్పారు సి.సి. దేశాయ్. అప్పుడు ఆ కంపెనీ బోర్డులోకి తీసుకుంటానని కొద్ది సంవత్సరాలు అక్కడ పనిచేశాక ఆపై నా అదృష్టం పరీక్షించుకోవచ్చని చెప్పారు. అన్నారు దాంతో నాకు పెద్ద ఊతం దొరికినట్టు అనిపించింది.ఈ దారిలో ముందుకు వెళ్ళేవాణ్నే, కాని నా పని ప్రదేశంలో అప్పుడే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
1963 వసంత మాసంలో నాపై అధికార వర్గంలో కొన్ని మార్పులు వచ్చాయి. అక్కడకు రావాల్సి ఉన్న అభ్యర్థిని ఇండియా దౌత్య కార్యాలయంలో ఎకనామిక్ మినిస్టర్ గా వాషింగ్టన్ పంపారు. ఆయనే ప్రపంచబ్యాంకులో మన దేశపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేసేవారు. అప్పటివరకూ అదే స్థానంలో పనిచేస్తున్న అధికారి మూడేళ్ల పదవీ కాలం ముగిసిపోయింది. దాంతో ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. అతని సమర్ధతకు ఎంత పేరుందో, ఆయన టెంపర్ వాలటైల్ అని కూడా అంతే పేరుంది. దాని గురించి బోలెడు కథలు వినిపించేవి. సరిగా మాట్లాడకపోయినా, నంగి వేషాలు వేసినా, పొగిడినా ఆయనకు ఇష్టం ఉండేది కాదు.
ఆయన విధుల్లోకి చేరిన వెంటనే మొత్తం రుణాల సంగతి అంతా సమీక్షించడానికి ఒక శనివారం ఉదయం సమావేశం పెట్టారు. దానికి కేవలం డిప్యుటీ సెక్రటరీలనే పిలిచారు అని చెప్పారు. అవసరమైతే తమ జూనియర్ అధికారులను వారు తమ వెంట తీసుకొని రావచ్చని చెప్పారు. మా డిప్యూటీ సెక్రటరీ ఆదేశాల మేరకు నేను కూడా ఆ సమావేశానికి వెళ్లాను. నేను పనిచేస్తున్న రుణాలు (ప్రాజెక్ట్, నాన్-ప్రాజెక్ట్) ఖర్చుల పద్దు, భవిష్యత్ ప్రణాళిక అన్నీ తీసుకొని సిద్ధమై వెళ్ళాను.
జాయింట్ సెక్రెటరీ అప్పటివరకు వాషింగ్టన్లో ఎయిడ్ రుణాలపై పనిచేసినవారు కావడంతో ఆయనకు ప్రతి చిన్న విషయం మీద అవగాహన ఉంది. ఆయన ప్రాజెక్టుల జాబితాను వివరంగా సమీక్షిస్తున్నారు. ఆ వరుసలో ఆయన శబరిమలై పవర్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. డిప్యూటీ సెక్రటరీ నావైపు చూసి సమాధానాలు చెప్పమన్నట్టుగా కనుసైగ చేశారు. నేను సమాధానం చెప్పాను. అకస్మాత్తుగా సమావేశంలో నిశ్శబ్దం అలముకుంది.
జాయింట్ సెక్రెటరీ నా వైపు తీక్షణంగా చూశారు. ‘జూనియర్ అధికారుల నుంచి నాకేదైనా సమాచారం కావాలంటే నేను అడుగుతాను. అప్పటివరకు మాట్లాడకుండా ఉండండి’ అన్నారు కటువుగా, పెద్దగొంతుతో.
ఆయన ఉగ్ర స్వరానికి, అందులోని కటుత్వానికి అక్కడున్న మిగిలిన వారిలాగే నేనూ స్థాణువైపోయాను! నా తప్పేమిటో కూడా తెలియలేదు. పైవారి అభిప్రాయాలను ప్రశ్నించడం పద్ధతి కాదు. ఎదురు మాట్లాడామంటే మా కెరీర్ను వారు సర్వనాశనం చేయగలరు. నేను తలదించుకుని కూర్చున్నాను.
తర్వాత సమీక్ష సమావేశం కొనసాగింది. ఆయన మరో ప్రశ్న వేశారు.
మా డిప్యూటీ సెక్రటరీ కూడా చాలా తెలివైనవారు, మర్యాదస్తులు. ఆయన ‘నాకు తెలియదు బహుశా ప్రేమ్ చంద్ కు తెలియవచ్చు’ అన్నారు.
నేను ఏమీ మాట్లాడలేదు. అప్పుడు జాయింట్ సెక్రటరీ మరోసారి గర్జించారు. ‘ఏం మాట్లాడవు’ అని.
‘మీరు అడిగితే తప్ప మాట్లాడవద్దు అన్నారు గనక నేను నోరు విప్పడం లేదు. ఇప్పుడు మీరు అడిగారు గనుక చెబుతాను’ అంటూ మర్యాద నిండిన స్వరంతో ఆయన అడిగిన వివరాలను తెలియజేశాను. ఆ తర్వాత ఆయన కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత వేరే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. వాటిలో నా అవసరం పడలేదు.
సమావేశం అయిపోవచ్చింది. అందరూ కాగితాలు సర్దుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నేను కూడా. మళ్ళీ ఆయన అరుపు వినిపించింది. ‘నువ్వు ఇక్కడే ఉండు. నేను నీతో మాట్లాడాలి’ అని.
మిగిలినవాళ్లంతా బయటకు వెళ్లిపోయారు. మా డిప్యూటీ సెక్రటరీకి నేనంటే చాలా అభిమానం. ఏం జరుగుతుందో అని ఆయన భయపడ్డారట. మహా అయితే డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతానని అనుకున్నారట.
ఆ గదిలో నేనూ ఆయనా – ఇద్దరమే మిగిలాం. మామధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయనకెలా ఉందో తెలియదుగాని నాకు క్షణమొక యుగంగా గడిచింది. మరణశిక్ష పడినవాడికి కాలం ఎలా గడుస్తుందో నా అనుభవంలోకి వచ్చింది. అటువంటి సందర్భాల్లో బుర్ర పాదరసంలా పనిచేస్తుంని శామ్యూల్ జాన్సన్ వంటి పెద్ద మనుషులన్నారు. కాని నా బుర్ర మాత్రం మొద్దుబారిపోయింది.
బహుశా జాయింట్ సెక్రటరీ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. మొదట ఆయనకు కోపం వచ్చిందిగాని, నేను చేసిన నేరమేమిటో, దానికే శిక్ష వెయ్యాలో ఆయనకు అర్థం కాలేదనుకుంటాను. అలాగని ఆయన కోపంగా కనిపించలేదు. ఎందుకంటే ఆ సమీక్షలో అంతా సవ్యంగా ఉందని తేలడమే. తాను నిర్వహించే పోర్ట్ ఫోలియోకు అందిన విదేశీసాయం సవ్యంగా వినియోగమయిందన్న సంతృప్తి అప్పటికే ఆయనను శాంత స్థితికి తీసుకొచ్చింది.
ఏది ఎలాగ పరిణమించినా నన్ను నేను రక్షించుకోవాలన్న కృతనిశ్చయానికి వచ్చేశానప్పటికే నేను. పిల్లినైనా గదిలో బంధించి కొడితే తిరగబడుతుంది కదా. అయితే అదృష్టవశాత్తు మా సంభాషణ ఆ స్థాయికి రాలేదు. ఆయనే ముందు మాట్లాడటం మొదలుపెట్టారు. నా నేపథ్యం, విద్యార్హతలు, ఫైనాన్స్ మినిస్ట్రీలో నా అనుభవం – ఇవన్నీ అడిగారు. నేను ఏ భావమూ లేకుండా సమాధానాలు చెబుతూ వెళ్లాను.
నా చదువు గురించి చెబుతూ ఐఐపిఎలో ఏడాది స్టడీ గురించి, పుస్తకం ప్రచురితమైందని చెప్పాను. అప్పటిదాకా మాట్లాడుతున్న ఆయన అక్కడ ఆగిపోయారు.
‘కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండిచర్ పుస్తకం రాసింది మీరేనా?’ అని అడిగారు నమ్మశక్యం కాని భావంతో.
అవునన్నాను.
అంతే, దాంతో ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. నాపట్ల అభిమానం పొంగుకొచ్చింది.
ఆయన వాషింగ్టన్ లో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి ఆయనకు ఆ పుస్తకం ఉపకరించిందట. దానితో ఆయనకు నాపట్ల అభిమానం, కాస్త గౌరవం కలిగాయి.
‘అయితే మినిస్ట్రీలో ఇంత చిన్న ఉద్యోగంలో ఏం చేస్తున్నట్టు?’ అని అడిగారు ఆశ్చర్యంగా.
సమాధానం నాకూ తెలుసు, ఆయనకూ తెలుసు. సుదీర్ఘ సమాధానం ఇవ్వాల్సిన పనిలేకపోయింది.
నేను ఉన్నచోట ఉండటం అనేది వనరులను నిరుపయోగపరచడమని, వీలైనంత త్వరగా లేదా మంచి అవకాశం దొరగ్గానే అక్కణ్నుంచి బయటపడమని, దానికోసం తనకేమాత్రం అవకాశమున్నా సాయం చేస్తానని ఆయనే చెప్పారు.
‘నేను ప్లానింగ్ కమిషన్ మెంబర్ తార్లోక్ సింగ్ తో మాట్లాడతాను. అక్కడేమైనా ఖాళీలున్నాయేమో అడుగుతాను’ అన్నారాయన ఎంతో ఉదారంగా. నేను కృతజ్ఞతలు తెలియజేశాను.
ఈ మాటతో మా సమావేశం ముగిసింది. ఈ ముగింపు ముందు ఊహించనిది. ఊహాతీతమైన ముగింపులతో కథలు రాస్తాడని ఒ. హెన్రీకి పేరు. నా కథ అంతకుమించిపోయింది! ఉరిశిక్ష పడుతుందనుకున్న ఖైదీకి అది తప్పిపోవడమేగాక కారాగారం నుంచి విముక్తి కూడా లభిస్తే ఎలా ఉంటుందో నాకు అనుభవంలోకి వచ్చింది. నాకు ఉరి తప్పదని సంబరపడిన కొందరు సహోద్యోగులు ఉసూరుమన్నారు.
ఆయన మాత్రం తన మాట నిలబెట్టుకున్నారు. నన్ను ఎలాగైనా ఆ చిన్న ఉద్యోగం నుంచి తప్పించి ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. తార్లోక్ సింగ్ తో మాట్లాడి నేను ఆయన్ను కలిసేలా చేశారు. తర్వాత ప్రస్తుతానికి ఏ ఖాళీ లేదు, అది రాగానే నన్ను తప్పక ప్లానింగ్ కమిషన్ లోకి తీసుకుంటామని తార్లోక్ సింగ్ నాకు వాగ్దానం చేశారు.
కొన్ని నెలల తర్వాత ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ మనీలాలో స్థాపించబడింది. ఆ జాయింట్ సెక్రటరీ మన దేశం తరపున తొలి ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఆయనతో పాటు అక్కడ ఉద్యోగం చేసేందుకు మొదటి విడత అధికారుల్లో ఒకడిగా ఆయన నాకు ఆఫరిచ్చారు. కాని అప్పటికే నేను వేరే అసైన్మెంట్ అంగీకరించి ఉన్నాను గనక దీనిలోకి రాలేనని చెప్పాను. దానికాయన శాంతంగా ‘ఎప్పుడైనా నీ ఆలోచన మార్చుకుంటే చెప్పు’ అన్నారు.
ఇంతకూ ఆయన పేరు చెప్పలేదు కదూ, సి.ఎస్.కృష్ణమూర్తి.
తర్వాత పదేళ్లపాటు ఆయన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులో విధులు నిర్వర్తించారు.
‘జీవితంలో అద్భుతాలు జరుగుతాయి’ అన్నదానికి సజీవ ఉదాహరణ ఆయనతో నా పరిచయం.
*****
ఎయిడ్ పని చాలావరకు వివాదాలకు తావు లేకుండా నడిచేది. ఎక్కువమంది అధికారులకు దాని షరతులన్నీ తెలుసు. అందువల్ల ప్రాథమిక స్థాయి నివేదికలు మొదలుకొని ప్రాజెక్టు మొదలైన తర్వాత నెలవారీ ప్రోగ్రెస్ రిపోర్టుల వరకూ అన్నీ పద్ధతిగా సరిగా ఉండేలా జాగ్రత్తపడేవారు.
1963 చివర్లో అనుకుంటా, సంప్రదాయానికి ఒదగని ఒక కేసు వచ్చింది. అది తారాపూర్ అటామిక్ ఎనర్జీ ప్రజెక్టు రిపోర్టు. దానికి సన్నాహాలు జరుగుతున్నట్టు దినపత్రికల్లో వార్తల ద్వారా తెలుసుగాని ప్రాజెక్ట్ లోన్ ప్రోగ్రామ్ భాగంగా ఆ పని నావరకూ రాలేదు. అకస్మాత్తుగా నివేదిక రావడం, దానిమీద విశ్లేషణ వెంటనే కావాలని పై అధికారులు తొందరపెట్టడం నాక్కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ సమయంలో అణుశక్తి అనేది ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించే అంశం. అది అత్యున్నత స్థాయి వ్యవహారం. ఒక డిపార్ట్ మెంట్ సెక్రటరీ స్థాయి అధికారి దానికి ఫైనాన్షియల్ కమిషనర్ గా ఉండేవారు.
అటామిక్ ఎనర్జీ కమిషన్ బొంబాయిలో ఉండేది. కమిషన్ ఛైర్మన్ డాక్టర్ హోమీ జె. భాభా. ఆయనకు ఇండియా, దాని భవిష్యత్తు పట్ల కచ్చితమైన ఆలోచనలుండేవి. తన అభిప్రాయాల పట్ల వ్యతిరేకతకు, భిన్నాభిప్రాయాలకు ఆయన తావిచ్చేవారు కాదు, సహించేవారు కాదని లోపాయికారీగా అందరికీ తెలుసు. భాభాకు ప్రధానమంత్రితో నేరుగా సంబంధముండేది.
ప్రాజెక్ట్ నివేదిక చూస్తే చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా అక్కడ జరిగే ఉత్పత్తి, పర్ యూనిట్ ధర మీద అంచనాలు వాస్తవికంగా లేవు. ఆ ఎస్టిమేట్ల పునాదులు దృఢంగా లేవని ఇట్టే తెలిసిపోయింది. ఫైల్లో నా నోట్సుగా వాటిని ఎత్తిచూపాను. తర్వాత ఫైలు మీదకు వెళ్లిపోయింది. ఉన్నతాధికారులు కూడా నా అభిప్రాయాలతో ఏకీభవించారు. నాకు తెలిసి, కింద, మధ్య స్థాయుల్లో ఏ మార్పులూ జరగకుండానే ఫైలు అణుశక్తి విభాగానికి తిరిగి వెళ్లింది.
ఆ ప్రాజెక్టుకు యూఎస్ ఎయిడ్ రుణం మంజూరు చేసిందని, దానికి సంబంధించిన రుణ ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్నాయని మాకొక రోజు ఉదయాన్నే తెలిసింది! అంతేకాదు కొద్దిరోజుల్లో ప్రధాని సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకునే కార్యక్రమం జరగబోతోందని, మేం సిద్ధంగా ఉండాలని కూడా వర్తమానం వచ్చింది!!
ఆరోజు రానే వచ్చింది. విదేశాంగ వ్యవహారాల శాఖ కాన్ఫరెన్స్ రూమ్ లో ఆ వేడుక జరగబోతోంది. మేం సిద్ధం చేసిన పత్రాలన్నీ తీసుకుని వెళ్లాం. అమెరికా దౌత్యాధికారి చెస్టర్ బౌల్స్ వచ్చారు. ఆయనతోపాటే ఎయిడ్ అధికారుల బృందం ఒకటి వచ్చింది. తర్వాత డాక్టర్ హోమీ జె. భాభా వచ్చారు. ఆయనతోపాటు ఒక అధికారుల బృందం వచ్చింది. అందరూ తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. వేదిక మీద కూర్చున్న దౌత్యాధికారి, ఫైనాన్స్ సెక్రటరీ, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ ల వెనకన ఉండి, వారికి రుణ ఒప్పంద పత్రాలను సంతకాల కోసం అందించడం నా విధి.
అందరం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కోసం వేచిచూశాం. ఆయన వచ్చారు, చాలా అనారోగ్యంగా ఉన్నారని చూడగానే తెలిసిపోయింది. నెమ్మదిగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వేదిక మీదకు చేరుకున్నారు. మరొకరి సాయం కావాలన్నంత బలహీనంగా ఉన్నారు. బరువైన కుర్చీని నేను జరిపాను, ఆయన అందులో ఆశీనులయ్యారు. నేను ఉద్యోగం మొదలుపెట్టిన తొలినాళ్లలో, పార్లమెంట్ చర్చల్లో చూసిన చురుకైన జవహర్లాల్ ఈయనేనా అనేంతగా, అస్సలు పోలికే లేదన్నట్టుగా తయారయ్యారు ఆయన. చైనా యుద్ధం ఆయన శక్తిని పూర్తిగా హరించేసింది.
రుణపత్రాల మీద సంతకాలు అయ్యాయి. చెస్టర్ బౌల్స్ తాను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని వినిపించారు. ఇండియాలో అణుశక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తర్వాత ప్రధాని స్పందించారు. నేను ఆయనకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఆయన ఏమి మాట్లాడారో వినిపించనంత లోగొంతుకతో మాట్లాడారు! ఎంతో నెమ్మదిగా ఆగుతూ, ఆగుతూ మాట్లాడిన ఆయన ప్రసంగం ఎవ్వరికీ వినిపించలేదంటే అతిశయోక్తేమీ కాదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ భవనానికి మరోవైపున ఉన్న తన కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆయన ఇక ఎంతోకాలం ఉండకపోవచ్చని అక్కడున్న అందరికీ అనిపించింది.
ఆ కార్యక్రమంలో గుర్తుండిపోయిన మరో అంశం – డాక్టర్ హోమీ జె. భాభాతో సీనియర్ సివిల్ సర్వెంట్లు మెలిగిన తీరు. వారిలాగా కాకుండా డాక్టర్ భాభాకు ఇండియా చేరవలసిన గమ్యం పట్ల ఒక సుస్పష్టమైన దృక్పథం ఉండేది. అందులో తాను పోషించవలసిన పాత్ర ఏమిటనే స్పష్టత కూడా ఉంది. దాంతో సైన్స్ ప్రపంచానికి మకుటం లేని యువరాజన్నట్లు ఆయన వెలిగిపోయారు. భాభా అతి తక్కువ కాలంలోనే ఒక తిరుగులేని పవర్ సెంటర్ గా మారారని, బడ్జెట్ కేటాయింపులు ఆయనకు ఉదారంగా వస్తాయని, ఇతర శాఖలతో పోలిస్తే ఆయన బలం వల్ల అణుశక్తి శాఖ నిధులను అంతే ఉదారంగా ఖర్చు చెయ్యగలదని సివిల్ సర్వెంట్లకు బాగానే తెలుసు. ఇటు భారత ప్రధాని, అటు విదేశీ రుణదాతలు – రెండు పక్షాల దన్నూ ఆయనకు పుష్కలంగా ఉందన్నది బహిరంగ రహస్యం. మామూలుగానైతే వారు తమ పరిధిని కాపాడుకోవడానికి పాట్లు పడుతుంటారుగాని, ఆనాడు భాభా వారిని ఏదీ ఆలోచించే అవకాశం ఇవ్వని తుఫానులాగా ముంచెత్తేశారు.
‘అణుశక్తి’ శక్తి ఏమిటో ఆ వేడుకనాడు స్పష్టంగా తెలిసింది. కాని ఆ ఒప్పందం జరిగిన కొద్ది వారాల్లోనే జెనీవా సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో డాక్టర్ హోమీ జె. భాభా దుర్మరణం పాలయ్యారు. మరో ఆరు నెలల్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా మరణించారు.
నాలుగు దశాబ్దాలు గడిచాక చూసుకుంటే అణుశక్తి లక్ష్యాలు అసంపూర్తిగానే ఉన్నాయి. ఉత్పత్తయిన మొత్తం శక్తిలో దాని వాటా చాలా తక్కువ. ఎస్టిమేట్లలో అనుకున్నదానికన్నా ఖర్చు ఎక్కువ, యూనిట్ ధర ఎక్కువ. ఇవేమీ పట్టించుకోకుండా ఇతరత్రా కారణాలతో జరిగిన నిర్ణయాలు కొన్ని ఉంటే, అందులో ఇది ఒకటి.
*****
1964 కొత్త సంవత్సరం మొదలైంది. కొత్త ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచార్యులు తన దగ్గర పనిచేస్తున్న ఎస్. గుహన్ ద్వారా నన్ను కలవమంటూ కబురుపంపించారు. నేను పరుగెత్తుకెళ్లాను. ఆఫీసులో కూర్చోబెట్టి క్షేమసమాచారాలు, ఏం చేస్తున్నారని అడిగారాయన. అప్పటికి మేం కలిసి మూడేళ్లయింది. కాసేపు వర్తమాన వ్యవహారాలు మాట్లాడాక ఆయన నేను ఆశ్చర్యపోయే సంగతి చెప్పారు.
‘నాలుగో ఫైనాన్స్ కమిషన్ కొత్తగా ఏర్పడుతోంది. మీరు దానిలో పనిచేస్తారా’ అని అడిగారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చెయ్యడానికి నాకు అది చాలా మంచి అవకాశం – అని ఆయన అనుకున్నారు. నేను వెంటనే సరేనన్నాను. కాని నేనున్న ఉద్యోగం నుంచి అక్కడికి బదిలీ ఎలా అవుతుందో, ఎలా సాధ్యమో నాకు తెలియదని అన్నాను.
‘అది నాకు వదిలేయ్’ అన్నారాయన.
నేను వదిలేశాను, ఆయన అన్నట్టుగానే అన్ని ఏర్పాట్లూ చేశారు. కొత్తచోట డెప్యుటేషన్ అలవెన్సుగా 20శాతం ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే ఆర్థికపరంగానూ లాభమే.
అప్పటికి ఎకానమీ గడ్డు పరిస్థితుల్లో ఉండేది. వర్షాభావం, మిలిటరీ ఖర్చులతో కుదేలైంది. మరోవైపు గ్రామీణస్థాయిలో పి.ఎల్.480 స్టాక్స్ ను ముందుగానే విడుదల చెయ్యడం వల్ల ఆహారధాన్యాల ధరలు మందగించాయి. ఆ నేపథ్యంలో బడ్జెట్ రాబోతోంది.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నాకు విద్యార్థి, తర్వాత స్నేహితుడు అయిన నరేంద్రరెడ్డి అప్పట్లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ వారి ‘ఎకనామిక్ రివ్యూ’ పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తూ ఉండేవాడు ఆ సమయానికి. నా ఆర్టికల్స్ కొన్ని ప్రచురించాడు. నేను కమిషన్ లో చేరడానికి ముందు అతనో ప్రతిపాదన చేశాడు. రాబోయే బడ్జెట్ మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలని. మా అభిప్రాయాలు తెలియజెయ్యడానికి, అది సరైన అవకాశం అనిపించింది. మినిస్ట్రీలోని ఎకనామిక్ డివిజన్ లో మరికొందరు స్నేహితులను కలుపుకొని వ్యాసాలు రాశాం. కాని వ్యాసకర్తలుగా మా పేర్లు లేకుండా చూసుకున్నాం. బడ్జెట్ పాలసీ మీద, ఆర్థికాభివృద్ధి మీద మేం రాసిన వ్యాసాలకు మంచి పేరొచ్చింది. పార్లమెంటు సభ్యులు ఆయా అంశాలను లేవనెత్తి చర్చించారు, ఆర్థిక మంత్రి ఆత్మరక్షణలో పడ్డారు. అలాగని ఆయన బడ్జెట్ ప్రతిపాదనలేమీ మారలేదు. మా విజయం కేవలం పేరు ప్రతిష్టలకే పరిమితమైంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించామని మాకు వ్యక్తిగతంగా సంతృప్తి కలిగిందిగాని మార్పు శూన్యం. కొసమెరుపు ఏమంటే – ఎంత పేర్లు లేకుండా రాసినా, ఆ వ్యాసాల్లో, సంచిక ఆవిధంగా రావడంలో నా చెయ్యి ఉన్నట్టు తాము కనిపెట్టేశామని తర్వాత కొందరు ఉన్నతాధికారులు నాకు చెప్పడం!!
*****
ఫైనాన్స్ కమిషన్ లోకి నా బదిలీ సులువుగా అయిపోయింది. అక్కడ పనిచేసిన కాలం నేనెన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడింది. దానికి ముఖ్య కారణం ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పి.సి.మాథ్యూ, ఆయన అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం. ఆయన ఐ.సి.ఎస్. అధికారి, స్టాటిస్టియన్. నేషనల్ ఇన్ కమ్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ వంటి చోట్ల బోలెడు స్థానాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు.
ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఐదేళ్లకోసారి ఏర్పడుతుంది. మెంబర్ సెక్రటరీతో కలిపి ఐదుగురు సభ్యులుంటారు. అప్పుడు ఛైర్మన్ గా మద్రాసు హైకోర్టు నుంచి రిటైరైన జడ్జి ఉన్నారు. ప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ భవతోశ్ దత్తా ఒక సభ్యుడు. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) లో పనిచేసిన తొలితరం భారతీయుల్లో ఒకరు. ఆర్.బి.ఐ.లో రిటైరయిన డిప్యుటీ గవర్నర్, ఒక రాజకీయవేత్తలు మిగిలిన సభ్యులు. రాజకీయ నాయకుడు మోహన్ లాల్ గౌతమ్ కొత్త ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి అత్యంత సన్నిహితుడు. ఉత్తరప్రదేశ్ లో మాజీ మంత్రివర్యుడు.
కమిషన్ కాలవ్యవధి తక్కువ కనుక సభ్యులు తొలిరోజు నుంచే సీరియస్ గా పనిచెయ్యడం మొదలుపెట్టారు. కమిషన్ ప్రతి రాష్ట్రానికీ వెళ్లి మంత్రివర్గాన్ని కలుస్తుంది. దానికి ముందే ఆ రాష్ట్ర స్థితిగతులు అధ్యయనం చేసి కమిషన్ కు చెప్పడం మా విధి. అలాగే కమిషన్ ప్రొసీడింగ్సును గమనించడం, ఆ రెండు పక్షాల మధ్య ఏవైనా వైరుధ్యాలు తలెత్తితే చర్చించడం, సాంకేతిక అంశాలను పరిష్కరించడం – ఇవన్నీ చెయ్యాలి.
సంప్రదాయంగా ఫైనాన్స్ కమిషన్ ఘనత ప్లానింగ్ కమిషన్ వల్ల కొంత మసకబారింది. కేంద్ర సాయం ఎంతనేది నిర్ణయించడంలో, వార్షిక ప్రణాళికల్ని ఆమోదించడంలో అది కీలకపాత్ర పోషించడం మొదలుపెట్టింది. అది క్రమంగా సాయిబును బయటకు నెట్టి ఒంటె గుడారాన్ని ఆక్రమించుకున్న కథలాగా తయారయ్యింది. దీన్ని రెండో ఆర్థిక సంఘం గుర్తించింది. మూడో సంఘం పెద్ద అంశంగా చర్చకు పెట్టి రగడ చేసింది. కాని ప్రభుత్వ మద్దతు లేక చతికిలపడింది. దానిలో మెజారిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా దాని మెంబర్ సెక్రటరీ అసమ్మతి పత్రం (డిసెంట్ నోట్) రాసేలా ఒప్పించారు. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
నాలుగో ఆర్థిక సంఘం వచ్చేటప్పటికి దానికి, ప్రణాళిక సంఘానికి విధుల మధ్య తేడా పెరిగింది. రెవెన్యూ ట్రాన్స్ ఫర్లు (పన్నుల ఆదాయం పంపిణీ), గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ ఎంత అని నిర్ణయించడానికి నాలుగో ఫైనాన్స్ కమిషన్ పరిమితమయ్యింది. తర్వాత కమిషన్లలో ఆ ఓవర్లాప్ బాగా తగ్గిపోయింది. ప్లానింగ్ కమిషన్ లో ఫైనాన్స్ మెంబర్ ను ఆర్థిక సంఘంలో కూడా సభ్యుడిగా పెట్టడం ద్వారా సమస్య పరిష్కారం అయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలకు వెళ్లడం ఉత్తేజకరంగా ఉండేది, ఎన్నో విషయాలు నేర్చుకునే వీలుండేది. విచిత్రమేమిటంటే రాష్ట్రాలు పక్కవారితో పోటీలు పడేవి – వారికన్న తాము వెనకబడినవాళ్లమని నిరూపించుకోవడంలో, తమకు ఎక్కువ సాయం కావాలని కోరడంలోనూ! జమ్ముకశ్మీర్ వంటి రాష్టాల సమస్యలు ప్రత్యేకమైనవి. అవి కమిషన్ తో రహస్యంగా సమావేశమయ్యేవి. మిగిలినవన్నీ బహిరంగమే. కొందరు ముఖ్యమంత్రులు తాము అనుకున్నది సాధించేలా కమిషన్ను ఒప్పించగలరు, బలవంతపెట్టగలరు.
ఉదాహరణ ఆనాటి గుజరాత్ సి.ఎమ్. బల్వంత్ రాయ్ మెహతా. చూడటానికి పొట్టిగా అతి సాధారణంగా కనిపించే ఆయన ఏ రాజకీయ పరిభాష వాడకుండా నింపాదిగా ఇచ్చిన ప్రెజెంటేషన్ గొప్పగా ఉండి, ఆ రాష్ట్ర స్థితిగతులను బేరీజు వెయ్యడానికి కమిషన్ కు ఎంతో అక్కరకొచ్చింది. విచారకరమైన విషయం ఏమంటే – కమిషన్ కాలవ్యవధి ముగియటానికి ముందే ఆయన మరణించడం. ఇండో – పాక్ యుద్ధ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని పాక్ సైన్యం కూల్చేయడంతో ఆయన ప్రమాదవశాత్తు మరణించారు.
కొన్ని రాష్టాల్లో సి.ఎమ్. ల కనుసన్నల్లో ఆయా శాఖల మంత్రులే ప్రెజెంటేషన్ ఇస్తారు. మరికొన్ని చోట్ల సివిల్ సర్వెంట్లు ఇస్తారు. మేం తమిళనాడు వెళ్లినప్పుడు అక్కడ కమిషన్ సమావేశం జరగాల్సిన భవనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధికారభాషగా హిందీ వద్దు అంటూ నిరసనలు చేస్తున్నవారితో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. అక్కడికి సి.ఎం. పోలీసు వాహనంలో వచ్చి, సమావేశ మందిరంలోకి వెనుక తలుపు నుంచి ప్రవేశించారు!
నాలుగో ఆర్థిక సంఘానికి అతి పెద్ద అంశం – రాష్ట్రాల రుణాలు, అవి ఉన్న బాకీలు. ఇప్పుడిది ఇంకా పెద్ద అంశంగా మారింది. రాష్ట్రాలు మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెచ్చుకుంటాయి. రాష్ట్రాల అవసరాలు తీర్చడానికి కేంద్రం ఇంకా పెద్ద అప్పులు చేస్తుంది. రాష్ట్రాల రుణాల నిబంధనలు కేంద్రంతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అప్పట్లో కేంద్ర రుణాలు ఆర్.బి.ఐ. చూసుకునేది. రాష్ట్రాలకు అటువంటి సౌకర్యం లేదు. ఫలితంగా అవి కేంద్రం మీద తప్పనిసరిగా ఆధారపడాలి. దీనివల్ల ఒక వర్చువల్ వెర్టికల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ ఏర్పడింది. దీన్ని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేది తాజా ఖర్చుల్ని భరించడానికి, విపత్తు ఉపశమనాలకు. అంతేగాని తమ ఉత్పాదకశక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు కాదు. ఏవో కొన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టులు, సెల్ఫ్ లిక్విడేటింగ్ ఉంటాయి. వాటి ఫలితం అంతంతమాత్రం. చివరకు రాష్ట్ర బడ్జెట్ మీదే ఆధారపడేవి. రాష్ట్రాలు కొత్త రుణాలు తీసుకొచ్చి, కేంద్రానికి అప్పు తీర్చేసి అవి తీరిపోయిన భ్రమలు కల్పించేవి. వాస్తవానికి అది అకౌంటింగ్ గిమ్మిక్కు తప్ప మరేమీ కాదు. అది అందరికీ తెలిసిన రహస్యమే. పాత అప్పులు తీరిపోతున్నాయన భ్రమలో ఉండటం, ఉంచడం తప్ప సమస్యను నేరుగా ఢీకొట్టే సాహసం ఎవరూ చెయ్యలేదు. పబ్లిక్ ఫైనాన్స్ లో ఒక భయం ఏమంటే సమస్యను చిన్నస్థాయిలో గుర్తించలేకపోతే అది పెద్దగా అయిపోతుంది, మొగ్గలో తుంచకపోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్నట్టు మారిపోతుంది. రాష్ట్రాల మల్టీపర్పస్ ప్రాజెక్టులను కేంద్రం తీసుకుని నిర్వహిస్తే సమస్య కొంత పరిష్కారం కావొచ్చునని నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సూచించింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పనిని విమర్శిస్తూ నేను ‘సెంటర్స్ మూవ్ టు టేకోవర్ స్టేట్స్ ప్రాజెక్ట్స్ – ఎ రాంగ్ మూవ్’ అని ధైర్యంగా ఒక శీర్షిక పెట్టేసి అప్పటికున్న పెద్ద పత్రికల్లో ఒకటైన ఎకనామిక్ టైమ్స్ కు పంపాను. అది ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ ప్రభావమో లేక నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సూచనను ఎవరూ ఫాలో అప్ చెయ్యకపోవడమో – ఆ ప్రతిపాదన మూలకు పోయింది.
ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన ఆర్టికల్ నాకు, ఆర్థిక సంఘానికి కూడా కొత్త తరహా అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఆఫీసు పని మీద బొంబాయి వెళ్లినప్పుడు ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్ పి. ఎస్. హరిహరన్ గారిని కలిశాను. ఆయన నా రచనను ప్రశంసించారు. ఇంకా తరచుగా చాలా రాయాలన్నారు. నా ఆర్టికల్స్ లో ఉండేవి రహస్య విషయాలేం కాదు. కేవలం నా అభిప్రాయాలే. అయితే అవి ప్రాచుర్యంలో ఉన్నవాటికో ప్రభుత్వ ఆలోచనలకో భిన్నంగా ఉంటాయి. అందుకని, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ, నిష్పాక్షికంగా ప్రభుత్వ విధానాలను విమర్శించలేను. అప్పుడేం చెయ్యాలని చర్చించుకున్నాం. నేను రాసినవి ఢిల్లీలో నరేంద్ర రెడ్డికి అందజేస్తే ఆయన నేరుగా ఎడిటరుకు పంపుతారు, వారు ప్రచురిస్తారు, రాసినదెవరో మా ముగ్గురికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ పద్ధతి చాలా బాగా నడిచింది.
తర్వాత హరిహరన్ ఆసియా అభివృద్ధి బ్యాంకులో చేరారు. ఆయన స్థానంలో ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్ గా డి.కె.రంగ్నేకర్ వచ్చారు. నా పని యధావిధిగా కొనసాగింది. ఇది తర్వాత నేను ‘ఫెడరల్ ఫిస్కల్ సీన్’ అనే కాలమ్ కొనసాగించేందుకు ఉపయోగపడింది. దాన్నుంచి పారితోషికం వచ్చేది, నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడి చేసే అవకాశం వచ్చేది. ఇది 1969 వరకూ నడిచింది.
కమిషన్ పరంగా ఏం జరిగిందంటే రాష్ట్రాల రుణభారం గురించి అది అర్థవంతమైన చర్చను లేవనెత్తింది. ప్రోడక్టివ్, నాన్ ప్రోడక్టివ్ రుణాల మధ్య తేడా ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. రుణాలు కేవలం ఉత్పాదక కార్యక్రమాలకే పరిమితం కావాలనే సూచనా ఇచ్చింది. కాని ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు ఆ ధోరణి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. ఇప్పుడు ఏకు మేకైన చందాన సమస్య ముదిరిపోయింది. చట్టాల రూపకల్పనలో పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరూ సాహసించరని నాకు అప్పుడు అర్థమయ్యింది. సమస్యను ఎవరో ఒకరు పరిష్కరిస్తారు అనుకోవడం పల్లెటూరి లక్షణం. రాజకీయ అవసరాలు తలెత్తనంత వరకూ పిల్లిని స్వేచ్ఛగా తిరగనీ, పెరగనీ అనేదే వ్యవస్థ.
ఆర్థిక సంఘాలు వచ్చినప్పుడల్లా రాష్ట్రాలు తాము వెనకబడి ఉన్నామని, తమ చేతులను కట్టేశారని, తమకు ఏ స్వాతంత్య్రమూ లేదని గోల చేస్తాయి. నాలుగు రోజులకు అదంతా మరుగున పడుతుంది. కొత్త కమిషన్ వచ్చేవరకూ అంతా గప్ చుప్ గా ఉంటుంది.
*****
అనువాదం: అరుణా పప్పు
(ఇంకా వుంది)
Thanks Aruna Garu. I was apprehensive that you stopped translating this interesting story. I also emailed to clear my doubts. Now, you mentioned that it is to continue. Thanks a lot and awaiting with my whole family for your next posting. We are revisiting our village life in Shri Premchand sir’s life story.
Regards
Sir, as usual, on the first day of posting of Saranga, I searched for your biography and could not find. After 3 days of wait, today found your blog. Please expedite. It is our sincere request. We are visiting our past through your biography.