పడమటి ఆకాశం తెల్లటి మబ్బు చారలతో విబూది పట్టెలు పులుముకున్న బైరాగి నుదురులా వుంది. జారిపోతున్న సూరీడు కుంకుమబొట్టులా ఆ పట్టీల నడుమ అమరీ, అమరక, అస్థిమితంగా వున్నాడు. సాయంత్రపు ఆటకు బయలుదేరుతున్న నాకు గొప్ప అదృష్టం ఎగురుతూ వచ్చి నా కాళ్లముందు వాలింది. అది అందమైన గాలిపటం!
మిరప్పండు రంగులో వుంది. దానికి తెల్ల తగరపు తోక వుంది. నాలుగు మూలలా మెరుస్తున్న డాబురేకులు మొనలను సూచిస్తున్నాయి. గాలిపటం సూత్రం, దానికి పది మూరల దారం కూడా వుంది.
తెగిన గాలిపటం గాలివాటున మా వాకిట్లో నా ముందు పడింది. అది తెచ్చిపెట్టిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో సుతారంగా దాన్ని రెండు చేతులతో అందుకున్నాను. ఎక్కడా చిన్న చిరుగు కూడా లేదు. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి గుండెలకు హత్తుకున్నాను. విశాల్‌గాడు, బబ్లూ దీన్ని చూస్తే కుళ్లుకుంటారు. ఆ ఆలోచన నాకు మరింత ఖుషీ ఇచ్సింది.
నా ఆనందం మనసుకి ఇంకుతుండగానే, “అదిగోరా.. అదిగో,” అంటూ కేకలు వినిపించాయి. నా గుండెలు ఝల్లుమనేలోగా మలుపు తిరిగి ముగ్గురు పిల్లలు పరుగులు, కేకలతో వస్తున్నారు. వాళ్లు ఉత్సాహంతో వెలిగిపోతున్నారు.
ఆ ముగ్గురిలో ఓ ఆడపిల్ల కూడా వుంది. ముగ్గురూ ఏడెనిమిదేళ్లు మించని నా తోటివాళ్లే. నా ఎదురుగా, దగ్గరగా వచ్చి నిలబడి ఆయాసపడుతున్నారు. వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎక్కడో దూరంగా నక్షత్రం నేలకు దిగినప్పుడు, దాని జాడ పసిగట్టిన జ్ఞానులు నిలువెల్లా ఎలా వెలిగిపోయారో తాతయ్య చెబుతుంటాడు. ఆ బొమ్మలు కూడా నాకు ఎరికే.
ఆ పిల్లకి చొరవ ఎక్కువనుకుంటాను. మాటా మంచి లేకుండానే, నేను రెండు చేతులా హత్తుకున్న రంగుహంగుల గాలిపటాన్ని ఆ అమ్మాయి సున్నితంగా లాగేసుకుంది. రెప్పపాటులో ఆ ముగ్గురూ గాలిపడగతో సహా మలుపు తిరిగి మాయమయ్యారు. నాకందుకే మలుపులంటే చచ్చే భయం!
నేను నీరుకారిపోయాను. నా కళ్లలో నీళ్లురికాయి. అయినా గాలిపటం స్పష్టంగా నాకు కనిపిస్తూనే వుంది. నిస్పృహగా తిరిగి యింట్లోకి వస్తుంటే తాతయ్య గమనించాడు. నా కళ్లలో తడి గమనించాడు తాతయ్య. ఆయన చూపులో ప్రశ్నని గమనించి జరిగిందంతా చెప్పాను.
తాతయ్య దగ్గరగా తీసుకొని తన కండువాతో కళ్లు అద్దాడు. “నీకో కథ చెప్పనా” అంటూ మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డున నిలబడి ఒకడు నాలాంటివాడు భోరు భోరున ఏడుస్తున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఋషి నీకొచ్చిన కష్టమేమిటని అడిగాడు.
ఏడ్చేవాడు శ్రుతి పెంచి నా వెండి పొన్నుకర్ర గోదాట్లో కొట్టుకుపోయింది. చాలా గొప్ప చేతి కర్ర… మంచి కొయ్య, దాన్నిండా చెక్కుడు పని. పైగా వెండిరేకు తాపడం… నా బంగారు వెండిపొన్ను కర్ర అంటూ ఎక్కిళ్లు పెడుతున్నాడు ఆ నా బోటిగాడు. ఋషి తాత్వికంగా నవ్వి “బిడ్డా! నాలుగుక్షణాల క్రితం నీది కాదు. మూడు క్షణాలు నీ చేతిలో వున్నందుకే యింత రోదన అవసరమా,” అని మొదలుపెట్టి రాజ్యాన్ని, రాణుల్ని పోగొట్టుకున్న రాజుల నిజాలు చెప్పాడు.
తాతయ్య చెప్పింది వేదాంతం. నా బాధ నా పోయిన గాలిపటం గురించి.
మా నాన్న ఫోను మాట్లాడుతూనే కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. పొద్దున నేను చెప్పగానే, “మీరు బ్లాక్ చేసి వుంటే చాలా తేడా పడేది. ఎంతసేపు హోల్డ్ చేశామన్నది కాదు పాయింటు…”
నాన్న మాటల్లో చాలా అసహనం ధ్వనిస్తోంది. నేను, తాతయ్య పక్కకి తప్పుకున్నాం. నాన్న అనుక్షణం షేర్ల మీద నడుస్తుంటాడు.
*
కొత్త పదబంధాలతో…పదచిత్రాల విన్యాసం బావుందండి