అలుపెరగని పోరాటంలో తాజా ఆయుధం

బుద్ధుడు పుట్టిన నేల మీదే బౌద్ధమతం ఎలా కనుమరుగైపోయింది?

కులం ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైంది? అది అంటరానివాళ్ళను ఎలా తయారు చేసింది?

ఈ గడ్డపైనే ఎన్నో వేల ఏళ్ళుగా బతుకుతున్న మూలవాసులకు ఎందుకు సొంత భూమన్నదే లేకుండా పోయింది?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘తంగలాన్’! అలాగని ఇదేదో డాక్యుమెంటరీ అనుకునేరు. కానే కాదు. కఠిన వాస్తవాలనో, కొరుకుడు పడని సందేశాన్నో సామాన్య జనానికి చేరవేయాలంటే వాటికి కమర్షియల్ హంగులు అద్దడం ఒకానొక మార్గం! డైరెక్టర్ పా రంజిత్ ఈ విషయంలో సిద్ధ హస్తుడు. భారతీయ సమాజంలో వేళ్ళూనుకునిపోయిన కుల వ్యవస్థపై సినిమా అనే ఆయుధంతో అలుపెరగని పోరాటం చేస్తున్న ఈ దర్శక యోధుడి తాజా అస్త్రమే ‘తంగలాన్’!

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్ర ఆధారంగా ఈ కథను రాసుకున్న పా రంజిత్ మరుగునపడిపోయిన కొన్ని వేల ఏళ్ళ నాటి చరిత్రను తవ్వి జనం ముందుంచే ప్రయత్నం చేశాడు. అదీ నేరుగా కాదు. Symbolism, magical realism సాయంతో!

తంగలాన్ అంటే స్వర్ణ పుత్రుడు అని అర్థం. అది 1850వ సంవత్సరం. మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర ఆర్కాట్ జిల్లా వేప్పూర్ గ్రామంలో ఉంటాడీ తంగలాన్. అతని భార్య గంగమ్మ. ఐదుగురు పిల్లలు. ఐదు గుంటల భూమే ఆ కుటుంబానికి ఆధారం. మిగతావాళ్ళకైతే అదీ లేదు. పండిన పంటను కాల్చేసి శిస్తు కట్టలేని పరిస్థితి కల్పించి మరీ జమీందారు తంగలాన్ భూమిని లాగేసుకుంటాడు. బంగారం వెలికి తీయడంలో ఆ గ్రామస్థుల పూర్వ చరిత్ర తెలుసుకున్న బ్రిటీష్ ఆఫీసర్ క్లెమెంట్ అక్కడికి వస్తాడు. బంగారం కనిపెట్టడానికి సాయపడితే డబ్బిస్తానని ఆశచూపెడతాడు. ఆ డబ్బుతో తమ భూములు వెనక్కి తీసుకోవచ్చన్న ఆలోచనతో తంగలాన్ మరికొందరిని తీసుకుని బంగారు గనుల వేటకు బ్రిటీష్ వారి వెంట బయల్దేరతాడు. కానీ గనులను కాపాడుతున్న ఆరతి అనే దేవత వాళ్ళను అడుగుడుగునా అడ్డుకుంటుంది. మరి తంగలాన్ ఆ గనులను చేరుకోగలుగుతాడా? బ్రిటీష్ వాళ్ళు అనుకున్నది సాధిస్తారా? తంగలాన్, అతని తోటివాళ్ళు కోరుకున్నట్లుగా భూమి తిరిగొస్తుందా? ఇదీ మిగతా కథ.

నిజానికి ఇదో ట్రెజర్ హంట్ స్టోరీని తలపిస్తుంది. Narrative style కూడా ఆ తరహాలోనే ఉంటుంది. తంగలాన్ బుర్రలో అప్పుడప్పుడు కనిపించే గత జన్మల తాలూకు దృశ్యాలను దర్శకుడు వాస్తవ దృశ్యాలతో మేళవించి చూపిస్తాడు. ఇలాంటి genreనే magical realism అంటారు. ఇక మరుగునపడ్డ చరిత్రను దర్శకుడు నేరుగా కాక కొన్ని metaphors రూపంలో చెబుతాడు. ప్రత్యేకించి బౌద్ధ మతం మన దేశంలో ఎలా అంతరించిపోయిందో చెప్పడానికి symbolism సాయం తీసుకున్నాడనిపించింది. బంగారానికి బుద్ధుడి విగ్రహం కాపలా ఉండడం, ఆ విగ్రహం తల నరికితే గానీ బంగారం వశం కాదని ఒక బ్రాహ్మణుడు రాజుకు చెప్పడం లాంటి సందర్భాలు- బౌద్ధ మతపు ఆనవాళ్ళు ఈ దేశంలో లేకుండా పోవడానికి ఎవరు కారణమో చెప్పకనే చెబుతాయి. బంగారాన్ని మొదటి నుంచి కాపాడుకుంటున్న నాగజాతి వారికి, ఆదివాసీలకు అవినాభావ సంబంధముందని establish చేసే ప్రయత్నం జరిగింది. నాగు పాములు, ఏనుగు కొండ కూడా symbolismలో భాగమే! బంగారం బంగారం మాత్రమే కాదు. అణగారిన వర్గాల విజయానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక.

తనదైన స్టైల్ లో కథను ముందుకు నడుపుతూనే దళితులు పడ్డ అవమానాలను అవకాశమున్న చోటల్లా పా రంజిత్ కళ్ళకు కట్టాడు. భూస్వామ్య వ్యవస్థ, అగ్ర కులాల ఆధిపత్యం, బ్రిటీష్ వారి కుటిల తంత్రాల మధ్య నలిగిపోతూ అంటరానివారిగా మిగిలిపోయిన దళితుల దుస్థితిని ఆవిష్కరించాడు. బ్రిటిషర్లు ఎంత క్రూరులైనా దళితులను అంటరానివారిగా చూడకపోవడం కొన్ని సీన్లలో కనిపిస్తుంది. దళితుల్లో చాలా మంది అటు వైపు ఎందుకు అడుగులు వేశారో ఈ సందర్భాలు చెప్పకనే చెబుతాయి.

తంగలాన్ భూమిని జమీందారు లాక్కునే సీన్ ద్వారా దర్శకుడు దళితులు తమ భూమిని ఎలా కోల్పోతూ వచ్చారో చెప్పే ప్రయత్నం చేశాడు. బ్రిటీష్ అధికారి దగ్గర పని చేసే ఒక బ్రాహ్మణుడి పాత్ర ఆ జాతి అహంకారపూరిత ధోరణికి ప్రతిబింబంలా కనిపిస్తుంది. రామానుజుడి భక్తి ఉద్యమంలో చేర్పించడం ద్వారా దళితులను అంటరానితనం నుంచి బయటికి లాగాలని పశుపతి పాత్ర తపిస్తుంటుంది. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా సదరు బ్రాహ్మణుడు కించపరుస్తాడు. జంధ్యానికి విలువ లేకుండా చేస్తున్నావంటూ ఈసడించుకుంటాడు. తంగలాన్ కి బ్రిటీష్ ఆఫీసర్ బట్టలివ్వడం అతగాడికి ఏమాత్రం నచ్చదు. తంగలాన్ ని కొట్టడానికి సైనికులు మీదకొస్తున్నప్పుడు ముందు ఆ బట్టలు చించి పారేయండి అని అక్కసు వెళ్ళగక్కుతాడు. ఇక తంగలాన్ భార్య గంగమ్మ సహా మిగతా ఆడవాళ్ళు కొత్తగా రవికలు వేసుకున్నప్పటి సంబరం చూస్తే మనసు బాధతో మెలికపడుతుంది. సరైన తిండికి, బట్టలకు నోచుకోని దళితుల దుస్థితిని తెలియజెప్పే ఈ సీన్ ని దర్శకుడు హృద్యంగా మలిచాడు. “చావును ఎదిరించే వాళ్ళకు మాత్రమే ఇక్కడ జీవితం” అంటాడు తంగలాన్. ఇక్కడే ఉంటే చచ్చిపోతాం అని ఒకరంటే ఇప్పుడు మాత్రం ఏం బతుకున్నారని ప్రశ్నిస్తాడు. అంటే అవమానాల పాలవుతున్న దళితుల బతుక్కి, చావుకీ పెద్ద తేడా లేదని చెప్పడమే దర్శకుడి ఉద్దేశం.

సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ దర్శకుడి ప్రతిభ, తపన ఉట్టిపడతాయి. అతనితో పాటే మరొకరు కూడా సినిమా అంతటా తానే అయ్యి విస్తరించారు. ఆయనే చియాన్ విక్రమ్. కుటుంబ పెద్దగా, తండా నాయకుడిగా, తండ్రిగా, భర్తగా, వీరుడిగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రను గొప్పగా పోషించాడు. Performance పరంగా, appearance పరంగా విక్రమ్ ఈ సినిమాని ముందుండి నడిపించాడు. గంగమ్మ పాత్ర పోషించిన పార్వతి తిరువోత్తు చాలా సహజంగా నటించింది. ఇక ఆరతిగా మాళవికా మోహనన్ భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో విక్రమ్ తో పోటీ పడింది.

జి.వి. ప్రకాశ్ కుమార్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకి ప్రాణం పోశాయి. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. Technicalగా నన్ను బాగా ఆకట్టుకున్న అంశం- magical realismతో కూడిన సీన్స్ ఎడిటింగ్. Real scenes, magical real scenes పక్కపక్కనే కనిపిస్తూ సృష్టించిన chaos చాలా ఎఫెక్టివ్ గా ఉంది. క్లైమాక్స్ లో వెంట వెంటనే వచ్చే పగలూ, రాత్రీ సీన్స్ లో సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ప్రతిభ, శ్రమ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం- డబ్బింగ్! తెలుగు డబ్బింగ్ సినిమాల్లో సాధారణంగా కనిపించే పెట్టుడుతనం ఇందులో లేదు. చిత్తూరు యాసలో ఉన్న డైలాగ్స్ సినిమాకి మంచి ఫీల్ ఇచ్చాయి.

అయితే ఈ సినిమాలో లోపాలే లేవా అంటే ఉన్నాయి. చరిత్ర, అసమానతలు, ఫ్యాంటసీ – ఇన్ని రకాల అంశాలను నేర్పుగా మేళవించడంలో పా రంజిత్ కొంత తడబడ్డట్లుగా కనిపించాడు. సినిమాలో ఎన్నో గొప్ప సీన్స్ ఉన్నాయి కానీ వాటిని overallగా కనెక్ట్ చేసే ఒక emotional thread ఏదో మిస్సయినట్లు అనిపిస్తుంది. Narrationలో కొంత ఎగుడు దిగుళ్ళు కనిపిస్తాయి. కొన్ని చోట్ల screenplay నత్త నడక నడిస్తే మరికొన్ని చోట్ల చెప్పిందే చెప్పినట్లుగా ఉంటుంది. తంగలాన్ నాగజాతి వాడని చివరలో తెలుస్తుంది. చాలా elevate చేయాల్సిన ఈ విషయాన్ని చాలా మూమూలుగా లాగేసినట్లనిపించింది. Screenplay ద్వారా చెప్పాల్సిన విషయాలను డైలాగ్స్ రూపంలో తెలియజేయడం వల్ల ఆడియెన్స్ కొన్ని చోట్ల కనెక్ట్ కాలేకపోయారు.

విజువల్ గ్రాఫిక్స్ up to the mark లేవు. గ్రాఫిక్స్ దీటుగా కనక ఉండి ఉంటే ఈ సినిమా గొప్ప విజువల్ వండర్ అయి ఉండేది. సినిమాలో నన్ను నిరాశపరిచిన మరో అంశం- location selection. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గా చూపించిన ప్రాంతం చాలా ప్లెయిన్ గా అనిపిస్తుంది. సినిమాకే ఆయువు పట్టు లాంటి ఈ ప్రాంతాన్ని మరింత complexగా, mysticగా డిజైన్ చేయాల్సింది.

మొత్తానికి తంగలాన్ మంచి సందేశమున్న మంచి సినిమా. అబద్ధాలే చరిత్రగా ప్రచారమవుతున్న తరుణంలో కొండను ఢీకొట్టాలని సంకల్పించిన గట్స్ ఉన్న సినిమా. టెక్నికల్ విలువలు మరికాస్త పటిష్టంగా ఉండి, రైటింగ్ లో ఇంకాస్త డెప్త్ ఉండి ఉంటే ఇది మాస్టర్ పీస్ స్థాయిని చేరుకునేదేమో!

*

శాంతి ఇషాన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 👌👌👍
    చాలా మంచిగా సమీక్షించారు.

    “అబద్ధాలే చరిత్రగా ప్రచారమవుతున్న తరుణంలో కొండను ఢీకొట్టాలని సంకల్పించిన గట్స్ వున్న సినిమా” అని చివరాఖన ఓ గొప్ప మాట అన్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు