తలారి సతీష్ కుమార్ కవితలు రెండు

1

ఊరునడిసినట్టూ

 

వాళ్ళు నడుస్తుంటే,

అచ్చం ఊరునడిసినట్టూ…

 

పొద్దుని నిద్రలేపుతూ ఒకరు

అదే పొద్దుని జోకొడుతూ ఇంకొకరు!

 

కొంగువట్టి పేదరికాన్ని ఒంపుతూ అమ్మ!

అదే పేదరికపు గంజిని తాగుతూ నాయిన!

యిద్దరి ఆలోచనలు వేరు వేరే అయినా

వాళ్ళ యుద్ధమంతా ఆకలిని గెలవటమే…

 

జొన్నసేను మీద వాలిన,

పిట్టలని కొడుతూ నాయిన!

ఇంటికాడ కోళ్లకు గింజలు వేస్తూ అమ్మ

వాళ్ళదంతా బతుకుమీద మమకారమే…

 

నెత్తిన కట్టెల మోపుని మోస్తూ అమ్మా

ఎనకాలే గొడ్డలి పట్టుకొని నాయిన

నడిచే ఆ తోవంతా

వానచినుకు తడి వాసనేస్తది.

 

వాళ్లంటే వాళ్ళు మాత్రమే కాదు

వాళ్ళలా కనిపించే యిద్దరు పిల్లలు

ఒకే సూరుకింద పొదిగే రొండు పొద్దులు!

 

ఎప్పుడన్నా వాళ్ళు ఒకటిగా కలిసి నడిస్తే,

వాళ్ళ ఎనకాలే పొద్దు నడిసినట్టూ

ఆరోజు ఎంత బాగుంటదో

నాయిన భుజమెక్కి చూసిన ప్రపంచంలాగ!

 

నాయిన తువ్వాల భుజమ్మీద ఏసుకొని

ఎటైన పనిమీద బయటికిపోయివస్తే,

దూరంగుండా అమ్మ చూసే చూపులే

తనకు దిష్టి తీస్తాయి…

 

ఎప్పుడూ ఒకటిగా కనిపించే

వాళ్ళిద్దరు…

మా ఇంటి పెద్దదర్వాజని ఆనుకొని ఉన్న

సెరో దీపంగూళ్లు…

2

ఏదేవుడికి దణ్డంబెట్టుకుందో…

ఆశల గంపని నెత్తిన ఎత్తుకొని

పొద్దంతా తిరిగే …అమ్మా

మాతో పాటుగా ఓ కలగన్నది…

పచ్చని మా బతుకుల్లో

కాంగ్రెసల్లం, బొట్లల్లం లాంటి

కలుపు మొక్కలకు బదులుగా

నిండు కళ్లాన్నీ కలగన్నది…

నడిసే తోవల్లో

పల్లెరుకాయలు, పర్రికంప ముండ్ల

చిక్కులన్నీ పోయి…

తొవ్వెంబడి నవ్వుతూ పలకరించే

తంగేడు, గునుగు పూల,

మనుషుల్ని కలగన్నది…

కష్టాలకు, కన్నీళ్లకు మెత్తగయిన గోడలు

పెచ్చులు ఊడకముందే,

….తనలో

భవిష్యత్తు నిర్మాణాన్ని గీసుకున్నది.

మా బతుకుల్లా! మీ బతుకులు కూడదని

అందరి తల్లులలాగానే తనుకూడా…

శక్తికి మించిన కూలీపనులెన్నో చేసింది

పొద్దుమాపటి కల్లుపైసల్ని కూడా

మాకోసమే ఖర్చు పెట్టిన అమ్మ చీరకొంగూ

మా చదువులకు పచ్చజెండా ఊపింది.

జాలెట్లవడ్డ గిన్నెలు, సెంబుల్లా

నా సంసారం బజారుకెక్కరాదని

రోజు… అమ్మా!

ఏదేవుడికి దణ్డంబెట్టుకుందో, ముగింపుగా

ఈ రోజు మమ్మల్నికన్నది

రేపటి తన కలల ప్రపంచానికి కొనసాగింపుగా!

*

కవితో రెండు మాటలు 
కవిత్వమే ఎందుకు రాస్తున్నారు?

 నేను చూసిన (లేదా) ఎదురుపడినా ఏ అంశాలైన నన్ను ఊరికే వుండనిచ్చేవి కావు. లోపలేదో జరుగుతున్నట్టుగా ఉండేది. అట్ల నావంతు చిన్న చిన్నగా రాయడం మొదలు పెట్టాను.

 మీ కవిత్వానికి ప్రేరణ ఏమిటి?
 నేను దేన్నైతే చూస్తానో దాన్నే కవిత్వ కోణంలో రాస్తాను.  అప్పుడే నాకు మనశాంతి. ముఖ్యంగా పల్లెప్రజలు, వారి జీవన విధానం, ప్రేమలు, ప్రతీది నాకెంతో ఇష్టం. కవిత్వం రాసిన ప్రతి సారి నాకు తిన్నంత అయితది.

తలారి సతీష్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు