శూలాలై దిగబడుతున్న మోదుగురంగు చూపులతో కట్టె సర్సుకపోయిన కనురెప్పలు కునుకు తీయవు. చెప్పవశంగాని తనమేదో దేహమంతా పులుముకుని ఒక నిస్సత్తువ ఆవరిస్తుంది.
ఎటూ కదల్లేవు. ఏ పనీ చేయలేవు. ఎవరో తోడుకుపోయినట్టు లోపలంతా శూన్యం. దేవుకుంటానికి కాపిష్కెడంత గూగం సుత మిగలని ఒట్టి డొల్ల బతుకు. గుల్లబారిన వెలితితో అంతా కలికలి అయితది.
ఉరి తీయబడుతున్న నమ్మకాలకు ఊడలమర్రి సమాజం ఊపిరూదుతుంటది. చెట్టు మీది బేతాళుడు మళ్ళీ భుజమెక్కుతడు. ఎంతకని మోసుకు తిరుగుతవు? మార్సుకుంటానికి మరో భుజం ఆసరా అవ్వదు. ఏరోకు ఒరిగి పడుతదో తెలిసినా ఏం చేయగలవు?
బొండిగె నులుముకుంటానికి చేతులిప్పుడు నీవి కావు. వేలిముద్దెరల నెపంతో వెక్కిరిస్తున్న గవాయితనం నిలువునా కాల్చేస్తుంటది. ఎప్పుడు బూడిద కుప్పలా కూలబడుతవో అంచనాకు అందదు.
అంతా బుగులు. మనసంతా కీడు. అలల అలజడి శబ్దమైనా సరే.. పెయ్యంతా జలదరిత్తది. ఏ తరంగ కంపనాల్నీ తట్టుకోలేక విలవిలలాడుతవు. ఎప్పుడో తలకట్టు పెట్టినందుకు తల తాకట్టు పెట్టాల్సిందే!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment