ఈ దేశంలో ఎందరో కాళ్లకు చెప్పులు లేకుండా స్కూలుకు వెళతారు. ఒకే షర్టు ను రోజూ ఉతుక్కుని వేసుకుంటారు. లేదా ఎవరో ఇచ్చిన షర్టును అపురూపంగా వాడుకుంటారు. ఇంటికి వచ్చే సరికి తినడానికి 11 మంది సంతానం తల్లిదండ్రులతో జీవించే ఒక పూరిగుడిసెలో అన్నం ఉంటుందో, పస్తులుండాలో తెలియని పరిస్థితి. నానపెట్టిన శనగలను అదే స్కూలు ముందు అమ్మేవారు, మార్కెట్ లో లాటరీ టిక్కెట్లు అమ్మేవారు ఉంటారు. అలా కటిక పేదరికంలో బాల్యం గడిపిన వ్యక్తుల్లో, చదువును, సాహిత్యాన్ని విస్మరించకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు అక్టోబర్ 31న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేసిన డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు. ఆయన జీవిత గాథలో ఎన్నో రచనలకు, సినిమాలకు ప్రేరణ కావల్సిన ముడిసరుకు ఉన్నది.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో జన్మించిన శ్రీనివాసరావు 1980లో పదోతరగతి పాస్ కాగానే పొట్ట చేత పట్టుకుని ముంబై వెళ్లి నానా పనులు చేశారు. టెలిఫోన్ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తూ గుంతలు త్రవ్వి కేబుళ్లను బాగు చేసేవారు. సాయంత్రం డాక్టర్ దగ్గర కాంపౌండర్ గా పనిచేసేవారు. రైల్వే స్టేషన్ ముందు టైప్ మిషన్ పెట్టుకుని అవసరమైన వారికి టైపింగ్ చేసిపెట్టేవారు. ఎలక్ట్రిక్ పనులు నేర్చుకుని ఇళ్లలో వైరింగ్ చేసేవారు, బియ్యం వ్యాపారులకు లెక్కలు రాసిపెట్టడం, బ్యాంకుపనులు చేసిపెట్టడం చేసే వారు. టపాసులు అమ్మేవారు. వీడియో క్యాసెట్లు కిరాయికి ఇచ్చేవారు. అన్ని పనులు చేస్తూనే సమయం దొరికించుకుని చదువుపై దృష్టి పెట్టి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ముంబై సాహిత్య అకాడమీలో జూనియర్ క్లర్కుగా ఉద్యోగం దొరికే వరకూ ఎనిమిదేళ్ల పాటు ఆయన జీవితం ఒక కల్లోల సముద్రంలో పడవ ప్రయాణంలా గడిచింది. ఈ ఉద్యోగంలోనే ఆయన ఎన్నో మెట్లెక్కి ప్రతి దశలోనూ తన ప్రతిభ నిరూపించుకుని 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లీషు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ డిగ్రీ పొంది డాక్టర్ శ్రీనివాసరావు అయ్యారు. దేశ విదేశాల్లో కీలక ప్రసంగాలు చేశారు.
స్వయం ప్రకాశ శక్తి అయిన శ్రీనివాసరావుకు ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించగలిగిన గ్రహణ శక్తి ఉన్నదని, ఆశక్తి వల్లనే అనతికాలంలోనే ఆయన భారతీయ, ప్రపంచ సాహిత్యంలోని అనేక మంది రచయితలు, రచనల గురించి ఆకలింపు చేసుకుని సాహిత్య ప్రపంచంపైనే తన ప్రభావం చూపగలిగారని ప్రముఖ సాహిత్య విమర్శకుడు, ఢిల్లీ యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ హరీశ్ త్రివేది ఒక సందర్భంలో ప్రశంసించారు. సాహిత్య అకాడమీ కార్యదర్శులుగా ఉన్న ఇంద్రనాథ్ చౌదరి, సచ్చిదానందన్, అధ్యక్షులుగా ఉన్న బీరేంద్ర కుమార్ భట్టాచార్య, యుఆర్ అనంత మూర్తి, రమాకాంత రథ్, గోపీచంద్ నారంగ్, సునీల్ గంగోపాధ్యాయ, విశ్వనాథ ప్రసాద్ తివారీ వంటి ప్రముఖ కవులు, రచయితల సారథ్యంలో శ్రీనివాసరావు పరిపూర్ణమైన సాహితీవేత్త కాగలిగారు. ఈ దేశంలో శ్రీనివాసరావు అంటే తెలియని రచయిత, కవి ఉండరు. అదే సమయంలో ప్రతి భాషలో ఉత్తమ సాహిత్యం, ప్రక్రియలు, రచయితల గురించి శ్రీనివాసరావు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చేమో. ఆయనకే స్వయంగా నాలుగైదు భాషలపై పట్టు ఉన్నది.
2003 నవంబర్ లో కేంద్ర సాహిత్య అకాడమీ స్వర్ణోత్సవాలను ప్రోగ్రాం అధికారిగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒంటిచేత్తో అద్భుతంగా నిర్వహించడం శ్రీనివాసరావు కార్యసాధకతను సాహితీ లోకానికి తెలియజేసింది. ఏ పని అప్పజెప్పినా అందులో ప్రతిభను అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ముంబై ప్రాంతీయ కార్యదర్శిగా అకాడమీ చరిత్రలో మొదటి సారి పశ్చిమ భారత భాషల్లో జోనల్ రచయితల సమావేశాలను, లెక్కలేనన్ని సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, అకాడమీ పుస్తకాల అమ్మకాలను ఏడాదికి రూ 8 లక్షలనుంచి 53 లక్షలకు పెంచడం, ఆడిటోరియంను నిర్మించడం వంటి పనులు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్రలో రచయితలందరూ ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఢిల్లీలో ఆయన చేసిన మహత్కార్యాలు ఎన్నో. భారతీయ కవిత్వం, సాహిత్యాల్లో ఎన్ సైక్లోపేడియాలు ఆయన చేతులమీదుగానే రూపొందాయి. ఆయన కార్యదర్శి కాకముందు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఒకే రోజులో ముగిసేది. కాని కార్యదర్శి పదవి చేపట్టినప్పటి నుంచీ ఈ అవార్డుల ప్రధానం సందర్భంగా ప్రతి ఏడాదీ అయిదు రోజుల పాటు జాతీయ స్థాయిలో వార్షిక ఉత్సవాలు జరిపి దేశ వ్యాప్తంగా వందలాది రచయితలను భాగస్వాములు చేసిన ఘనత ఆయనకే దక్కింది. 2024లో అతి పెద్ద సాహిత్యోత్సవాన్ని జరిపినుందుకు అకాడమీకి ప్రపంచ రికార్డు లభించింది. అంతే కాదు, ప్రపంచం నలుమూలలనుంచి కవుల్ని , రచయితల్ని ఆహ్వానించి ‘ఉన్మేష’ పేరుతో ఇప్పటికి మూడు సార్లు అంతర్జాతీయ సాహిత్యోత్సవాలకు ఆయనే రూపకల్పన చేశారు.
తీర ప్రాంత దేశాల రచయితలతో తొలిసారి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కవితోత్సవాలను నిర్వహించారు. బాలసాహితి, పూర్వోత్తరి, గ్రామలోక్, యువసాహితి, నారీ చేతన, భాషాంతర అనుభవ్, పుస్తక చర్చ, దళిత చేతన పేరుతో వినూత్న సాహిత్య కార్యక్రమాలను ప్రారంభించారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, ఎల్ జిబిటిక్యులను సాహిత్యకార్యక్రమాల్లో భాగం చేయడం, ఢిల్లీలో ఆదివాసీ, మౌఖిక సాహిత్య కేంద్రాలను నెలకొల్పడం, మెట్రో స్టేషన్లలో పుస్తకాల షాపులను ఏర్పాటు చేయడం, గతంలో విస్మరించి ఈశాన్య రాష్ట్రాలు, కార్గిల్, అండమాన్, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం వంటి అనేక పనులు చేశారు. షాంఘై కోపరేషన్ దేశాల భాషల్లో సాహిత్య అకాడమీ ద్వారా చేపట్టిన అనువాదాల్లో ప్రముఖ రచయిత రావిశాస్త్రి రచించిన ‘ఇల్లు’ కూడా ఉన్నది. గంగాశరణ్ సింహ్, హిందీ సేవా సమ్మాన్, సృజన్ శిఖర్ సమ్మాన్, భారతీయ వాదమయ పీఠ్, విజనరీ లీడర్ షప్, కళారత్న వంటి అనేక పురస్కారాలు ఆయనకు దక్కాయి. అనేక యూనివర్సిటీలు, సంస్థల సాహితీ కార్యక్రమాలను నిర్వహించే కమిటీల్లో భాగస్వామి అయిన శ్రీనివాసరావు పద్మా పురస్కారాలకు సాహితీ వేత్తలను సూచించే కమిటీలో కూడా ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీనివాసరావు సాహితీ కృషి ఒక ఎత్తు. ‘ద పారడాక్సికల్ ఇండియా’ పేరుతో కేంబ్రిడ్జి ప్రచురిస్తున్న ఆయన రచనలను చదివితే ఆయన భారతీయ, ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకున్న తీరు అర్థమవుతుంది. ‘భారత్, చైనా, జపాన్, అన్ని దూర ప్రాచ్యదేశాలు, మధ్య ప్రాచ్యదేశాలు ఒక్కటిగా వ్యవహరిస్తే సాహిత్యం, సంస్కృతిలోనే కాదు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర సాంకేతిక రంగాలు, పర్యాటకం, పరిశ్రమలు, మొత్తం మానవ కార్యకలాపాల్లో వాటికి తిరుగుండదు..’ అని ఆయన ఒక వ్యాసంలో ప్రకటించారు.
భారతీయ సాహిత్యంలో మధ్యయుగాలవరకు మౌఖిక సాహిత్యానికే ఆధిపత్యం ఉన్నది. అందులో కవిత్వం, నాటకాల ప్రాధాన్యతే ఎక్కువ అని ఆయన చేసిన ప్రకటన ఎంతో విలువైనది. నిజానికి మధ్యయుగం యూరప్, పశ్చిమ దేశాలకు చీకటి యుగం కావచ్చు కాని మనకు మాత్రం స్వర్ణయుగమేనని ఆయన అన్నారు.
భారతీయ సాహిత్యాన్ని, సంస్కృతిని నిర్దేశించింది అనువాదమేనని, భరతముని, అభినవగుప్తుడు, మమ్మటుడు, అనంద వర్ధనుడి కాలం నుంచే మన దేశంలో సాహిత్య విమర్శ వర్ధిల్లిందని శ్రీనివాసరావు చెప్పారు. ఎందరో భారతీయ తత్తవేత్తలు మన సాహితీ సంప్రదాయాలను వర్ధిల్లజేశారని, సామాజిక వ్యత్యాసాల్ని తొలగించడం, ప్రజలను సమైక్యం చేయడంలో భక్తి సాహిత్యం అద్భుతమైన పాత్ర నిర్వహించిందని ఆయన అన్నారు. 1500 భాషలున్న భారత దేశంలో దాదాపు 200 భాషలు క్షీణ దశలో ఉన్నాయని, ఒక భాష మరణిస్తే అపారమైన జ్ఞానం, సంస్కృతి, నాగరిక, చరిత్ర అంతమవుతాయని, ఆదివాసీ సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదని శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఆలోచించాల్సినవి.

అసలు ప్రజలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడని సాహిత్యం ప్రయోజనమేమిటని ఆయన ఒక రచనలో ప్రశ్నించారు. భారత దేశ ప్రజలను సాంస్కృతికంగా ఐక్యం చేయగలిగిన శక్తి సాహిత్యానికి ఉన్నదని, ఏ భాషా సాహిత్యంలోనైనా దేశం అంతటా అర్థం చేసుకునే సార్వత్రకత ఉంటుందని ఆయన విశ్లేషించారు. భిన్నత్వంలోనే ఏకత్వం ఉన్న మన దేశంలో సహనం, అసహనంపై చర్చ జరగడం విషాదకరమని, అన్నిటినీ ఆమోదించగల ప్రాచీన భారతీయ స్ఫూర్తిని ప్రస్తుత తరం అలవర్చుకోవాలని ఆయన చెప్పారు. ‘వేర్వేరు భాషల్లో వచ్చినా భారతీయ సాహిత్యం ఒక్కటే’ అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తిని ఆయన పదే పదే ఉటంకిస్తారు. అనేక భావాలకు, భావజాలాలకు, సిద్దాంతాలకు, సంస్కృతులకు వేదిక అయిన భారత దేశంలో భావ వ్యక్తీకరణకే ముప్పు రావడం ఆందోళకరమని, ఈ విషయంలో రాజకీయ వ్యవస్థల జోక్యం పెరిగిపోవడం బాధాకరమని ఆయన ఒక రచనలో తన అభిప్రాయాలను ధైర్యంగా స్పష్టం చేశారు. దేశంలో సాహిత్య వాతావరణం పైకి కనపడినంత సుసంపన్నంగా ఏమీ లేదని చెప్పేందుకు ఆయన వెనుకాడలేదు.
ప్రముఖ కన్నడ నాటక రచయిత, కళాకారుడు గిరీశ్ కర్నాడ్ రచనలపై శ్రీనివాసరావు రచించిన ‘మిత్స్, ప్లేస్ అండ్ గిరీశ్ కర్నాడ్’ అనే గ్రంథంలో శ్రీనివాసరావు పురాణాలను ఆధారం చేసుకోని సాహిత్య సంప్రదాయమే లేదని స్పష్టం చేశారు. పురాణాలు భారతీయ చేతనలో జీర్ణించుకుని పోయాయని, వాటిని కేవలం మతరచనలుగా చూడదని ఆయన చెప్పారు. మనదేశంలో భారత రామాయణాలు, గ్రీస్ లో ఒడిస్సీ, ఇలియడ్, మెసెపోటీమియా సంస్కృతికి చెందిన గిల్గమేష్, ఆంగ్లోసాక్సన్ ప్రాంతాల్లోని బేవుల్ఫ్, గిరిజన సంస్కృతులలో ప్రబలంగా ఉన్న వివిధ పురాణాలు ఇవన్నీ మన సాహిత్య సంస్కృతికి దర్పణాలు. అన్నిటిలోనూ ఒక కథానాయకుడి కథ ఉంటుంది. లేదా మనందరి జ్ఞాపకాల్లో పంచుకున్న కొన్ని ఘట్టాలు ఉంటాయి. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. ఒక జాతి కోరికను అవి నెరవేరుస్తాయి. ‘ఒక రకంగా పురాణాలు మనిషి ఆదర్శంగా తీసుకునే కలలు’ అని డా.కృత్తివెంటి శ్రీనివాసరావు అంటారు. ప్రతి చెడు వ్యక్తిలోనూ రావణుడిని, దుర్యోధనుడిని, శకునిని మంచి వ్యక్తిలో రాముడిని, యుధిష్టిరుడుని చూసే సంస్కృతి మనది అని ఆయన చెప్పారు. రాజారావు రచించిన కాంతాపురలో గాంధీజీని కూడా కృష్ణుడుగా చిత్రించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్థానిక దేవతల్ని మన సంస్కృతిలో భాగంగానే చూడాలని. అదే సమయంలో సంస్కృతి నిరంతరం మారుతూ ఉంటుందని ఆయన అన్నారు.
పురాణాల అధ్యయనం ద్వారా నాటక రచనల్లో మానవ సంబంధాలను తెలియజేసిన మహారచయితలెందరో ఉన్నారు. కాళిదాసు మహాభారతంలోని అభిజ్ఞాన శాకుంతలం అనే ఘట్టాన్ని ఎంచుకుని గొప్ప సాహిత్యాన్ని సృజించారు. భాసుడు, భవభూతి భారత, రామాయణాలను భిన్నంగా చిత్రించారని విశ్లేషించారు. ఆధునిక భారతీయ నాటకాన్ని ప్రారంభించిన రవీంద్రనాథ్ టాగోర్ సంస్కృత నాటకాల రచయితల నుంచి స్ఫూర్తిని పొంది అనేక నాటకాల్లో ప్రజల సార్వత్రిక సమస్యల చిత్రణకు పురాణాలను ఉపయోగించారని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఆయనే కాదు, డబ్ల్యు బి ఈట్స్, విలియమ్ గోల్డింగ్స్, టిఎస్ ఇలియట్ లాంటి వారు కూడా పురాణాల వెలుగులో సమకాలీన సమాజంలో మానవ సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారని, వారికోవకే గిరీశ్ కర్నాడ్ చెందుతారని ఆయన తెలిపారు. ‘ఏ సైన్సూ పురాణాల స్థానాన్ని తీసుకోలేదు, ఏ సైన్స్ నుంచీ పురాణాన్ని సృష్టించలేము’ అని ఆయన స్పష్టీకరించారు.
శ్రీనివాసరావు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ సాహిత్యంపై ఆయన చూపిన ప్రభావం మాత్రం చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు
*








డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారిని మొదటి సారి ఆంధ్రా ఎడ్యుకేషన్ సంస్థ మెయిన్ స్కూల్ (డా సరోజినీ దేవి} విద్యాలయం లో 2013 రిపబ్లిక్ దినోత్సవం నాడు కలిశాను. మా సంస్త ముఖ్య కారదర్శి శ్రీ ఈశ్వరప్రసాద్ గారు వారిని విద్యార్ధులకు పరిచయం చేస్తూ కృష్ణరావు గారు తెలిపిన విషయాలన్నీ తెలిపారు. ఢిల్లీ తెలుగు వేదిక వారు నేను కన్వెనర్ గా 2014 లో రావి శాస్త్రి గారి కధల మీద పూర్తి రోజు కార్యక్రమం జరిపినప్పుడు వారు ముఖ్య అతిధి గా వచ్చి వారు శాస్త్రి గారి కధసాహిత్యం గురించి బాగా మాట్లాడారు.
అదే 2014 లో ఢిల్లీ తెలుగు సాహితి , ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక కలసి ఆంధ్రా అసోసియేషన్ లో జరిపిన రెండు దినాల స్త్రీ ల సాహిత్యం పై చర్చలకి కృత్తివెంటి శ్రీనివాసరావు గారు కేంద్రీయ సాహిత్య అకాడమీ వారి సహకారం కూడా అందచేశారు.
నాకు నాటకాలపై ఉన్న ఇంటరెస్ట్ చూసి వారి పిహెచ్‌డి పుస్తకం “‘మిత్స్, ప్లేస్ అండ్ గిరీశ్ కర్నాడ్’ ఇచ్చారు .
వీలయినన్ని ముఖ్య సాహిత్య అకాడమీ కార్యక్రమాలకి వెళ్ళడం లో వారి వల్ల ఉత్సాహం కలిగేది.
ఆయన తన పదవీ విరమణ జీవితం ఆహ్లాదకరంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను