*
కాలపు కూడలిలో నిర్మించబడ్డ
“ఉక్కుకోటల” పునాదుల కింద
మరణశయ్యల పర్చుకున్న
గాయాలను ఎన్నని వెలికితీయాలి?!
రాలిపడిన చుక్కల్లా
తెగిపడిన రెక్కల్లా
వీళ్ళుంటే
ఆకాశ పూదోటలో అందాల నక్షత్రాలై
గాయాలు చేసేవాళ్ళు మాత్రం
మిణుకుమిణుకు మంటుంటారు..
నీలితెరను కప్పుకొని
ఆకాశం కొట్టే ఉరుములదెబ్బల తట్టుకొని
కురుస్తున్న మేఘం
ఊసెత్తేవాళ్ళం ఎంతమందిమి?!
వసంతమై వెలుగుతూ ప్రవహించే
ప్రకృతి రంగుల దోసిటపట్టుకుంటాం
ప్రకృతంటే శ్రామికుల చెమటచుక్కలతో
పోతపోసిన తెరని
ఎంతమంది ఒప్పుకుంటారు?!
పాదాలపగుళ్ళ నుంచి కారే రక్తం గుండా
ఎదురుదెబ్బలు తాకి చీకిన గుండెల నిండా
ప్రవహిస్తున్న గాయాల గురించి
ఒక్క నిమిషమైనా మాట్లాడుకోవాలి
ఒక సెకనైనా ఆరా తీయాలి
ఆరోజొస్తే
ప్రవహిస్తున్న గాయాలు
ఎక్కడివక్కడే తిరగబడవచ్చు.
నీలితెరను కప్పుకున్న మేఘాలు,
పోతపోసిన ప్రకృతితెర
కన్నెర్రజేయవచ్చు
గాయాలు ఇక్కడి ఇళ్ళు ఖాళీ చేసి
వాళ్ళుండే చోట ప్రవహించవచ్చు
ఆరోజే
మరణశయ్యలు పర్చుకున్న గాయాలు
స్శశానవాటికల్లోకి తరలినట్టు
పూర్తిగా కాలి బూడిదయినట్టు
అప్పటిదాకా
ఈ గాయాలు ప్రవహిస్తూనే ఉంటాయి.
*
కుటుంబ నేపథ్యం:
మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం.నాన్న పేరు శ్రీహరి,అమ్మపేరు పుష్పలీల.
మా నాన్నగారు వృత్తి పని రిత్యా పెద్దగూడూరుకు వచ్చి ఎలక్ట్రికల్ షాపు పెట్టారు.కానీ మా సొంత ఊరు మహబూబాబాద్ మండలం,ముడుపుగల్.నేను అదే గ్రామంలో పుట్టి,పెరిగాను.గత కొన్నేళ్ళుగా పెద్ద గూడూరులో నివసిస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాం. నాన్నగారి విషయానికొస్తే పెద్దగా చదువుకోలేదు కాని పట్టుదల ఉన్న మనిషి.ఎప్పుడు నాలో స్ఫూర్తి నింపటం కోసం “అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు” అనే పద్యాన్ని పాడి వినిపించేవారు.నాన్నగారు వ్యవసాయపనులు చేస్తూనే మోటారు వైండింగ్ పని కూడా నేర్చుకున్నారు.ఇప్పటికీ ఎలక్ట్రికల్ షాపు నడిపిస్తూ వ్యవసాయపనులు చురుకుగా చేస్తుంటారు.ఆయన నన్ను తన శక్తికి మించి చదివించి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా చేశారు.
ఇక అమ్మ విషయానికొస్తే అమ్మ కూడా పెద్దగా చదువుకోలేదు కాని చాలా తెలివి కలిగినది.నాన్నకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించిన ధీశాలి.నన్ను ,చెల్లెల్నిఎంత గొప్పగా చూసుకుందో ఈ కొన్ని వాక్యాల్లో చెప్పలేను.
అమ్మ,నాన్న ఋణం తీర్చుకోవాలంటే మళ్ళీ వాళ్ళకు మరో జన్మంటూ ఉంటే నేను నాన్నగా పుట్టిన అంత చేయలేనేమో.
నేను మొదటి తరగతి నుండి 4వతరగతి వరకు ముడుపుగల్ లో ఉప్పలయ్య సార్ బడిలో చదువుకున్నాను.అక్కడ నుండి నాన్న ఎలక్ట్రికల్ షాపు పెట్టాలని గూడూరుకు వచ్చారు.అప్పుడు నేను 5వతరగతి.
5వతరగతి నుండి 10వ తరగతి వరకు “అరవింద విద్యాలయం”లో చదువుకున్నాను.ఇంటర్మీడియట్ వికాస్ కాలేజీ మహబూబూబాద్ లో,డిగ్రీ విద్యను ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట మరియు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండ లో చదివాను.ఎం.ఏ నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టన్స్ లో చేశాను.బి.ఇడి మథర్ థెరిసా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబాబాద్ లో చేశాను.
వాస్తవంగా నేను బి.ఎస్.సి డిగ్రీ పూర్తి చేశాను.కానీ చిన్నతనం నుండే తెలుగంటే ఎనలేని ప్రేమ.ఒకటి నాన్న గారు తనకు వచ్చిన పాటలు వినిపించి నాచేత పాడించటం కావచ్చు,చిన్నతనంలో మా గురువుగారు పింగిళి శ్రీనివాస్ గారు పాఠశాల స్థాయిలో దేశభక్తి పాటలు పాడించటం కావచ్చు,తెలుగు ఆచార్య వెంకట్రాం నర్సయ్యగారు పద్యాలు చక్కగా పాడుతూ ఉత్సాహంగా పాఠం భోధించడం కావచ్చు.పాట కావచ్చు,పద్యం కావచ్చు.నాకు పూర్తిగా తెలుగు పట్ల ఎనలేని ఇష్టాన్ని పెంచాయి.కాస్త తెలివి కలిగిన విద్యార్థులమని మనం ఇష్టంలేని కష్టమనిపించే చదువులు సమాజం కోసమో,ఇంకెవరికోసమో చదువుతుంటాం. నావిషయంలో కూడా అక్షరాల అదే జరిగింది.చివరికి తెలుసుకొని నాకిష్టమైన తెలుగువిషయం లోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం,సాహిత్యపరంగా ముందుకు సాగటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం.ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా.ఎస్.రఘుగారి పర్యవేక్షణలో “సుంకిరెడ్డి నారాయణ రెడ్డి-రచనలు సమగ్ర అధ్యయనం”అనే అంశంపై పి.హెచ్.డి చేస్తున్నాను..
నేను డిగ్రీ వరకు పాటలు పాడటం పైనే దృష్టి సారించేవాన్ని.
వచ్చిన కొత్తపాటను పూర్తి లిరిక్ తో పాడేవాన్ని.
చక్రి గారి పాటలు,ఆర్.పి పట్నాయక్ గారి పాటలు నన్ను ప్రభావితం చేశాయి.చక్రి గారు మా పక్కనే ఉన్న కంబాలపల్లి వాస్తవ్యులు కావటం కూడా ఒక కారణం.మిత్రులు కూడా చక్కగా పాడుతున్నావని ప్రోత్సాహం ఇచ్చేవారు.
నా డిగ్రీ(2003-2005)చదువుతున్న రోజుల్లోనే పాటలు రాయటం మీదకు దృష్టి మళ్ళింది.పాటలు పాడే ఆలోచన ఉన్న నాకు పాటలు రాస్తే బాగుండు అని తోచింది.సినిమా ఇండస్ట్రీ వైపుకు ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న నాలో ఉత్పన్నమైంది.అప్పుడే 20 పైచిలుకు పాటలు రాశానని చెప్పటం అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత నాలో ఒక ఆలోచన పుట్టింది.మనకు చదువే దైవం.దానితోనే ఏదైనా సాధించవచ్చు అన్న విషయం తెలిసొచ్చింది.చదువుపై దృష్టి సారించి ఉద్యోగం సాధించేంత వరకు మళ్ళీ సాహిత్యం వైపు దృష్టి సారించలేదు.బి.ఇ.డి చదువుతున్నప్పుడు తెలుగు మెథడాలజీ తీసుకొని పూర్తిచేశాను.ఆ కోర్స్ చేసే రోజుల్లో చక్కగా పద్యాలు పాడేవాన్ని.టీచర్ ఉద్యోగం సంపాదించటం కోసం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి వచ్చింది.యూ.జి.సి నెట్ పరీక్షలో జె.ఆర్.ఎఫ్ సాధించటంలోను తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి వచ్చింది.ఆ విధంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయటం నా జీవితానికి గొప్ప మలుపు.
2012లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన తర్వాత మళ్ళీ కవిత్వం వైపుకు దృష్టి మళ్ళింది.నన్ను బాగా ప్రభావితం చేసిన సాహిత్య పుస్తకాలు తిలక్ గారు రచించిన అమృతం కురిసిన రాత్రి,త్రిపురనేని గోపిచంద్ గారి అసమర్థుని జీవయాత్ర.డిగ్రీ చదివే రోజుల్లో కేవలం ప్రేమకవిత్వం మాత్రమే రాసిన నాకు ఆ తర్వాత సమాజం పట్ల అవగాహన పెరిగి ప్రకృతి,మానవీయవిలువలు అనే కోణంవైపుకు అడుగులు వేయాలనిపించింది.అందుకే నేను రాసిన మొదటి కవితలోనే “పల్లె జీవితాన్ని ” పలకరించాను.అలా మొదలైన సాహిత్య ప్రస్థానంలో ఎంతో మంది మిత్రుల శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో సాహిత్యరంగంలో ముందుకు సాగుతున్నాను.గత జులై21 న నా మొదటి కవితా సంపుటి “నీటిదీపం”ను ఆవిష్కరించాను.
నా వెన్నంటే ఉండి నాకు సహకరిస్తూ ,నా కవిత్వాన్ని ప్రేమించే నా శ్రీమతి సంధ్య పాత్ర కూడా మరువలేనిది.నాకు ఇద్దరు కుమారులు ఆర్య చక్ర ప్రపుల్ల,సాయి ప్రద్యుమ్న.
కవితా నేపథ్యం:
చరిత్రను మనం గమనిస్తే శ్రామికుడు ఎప్పుడు శ్రామికుడుగానే మిగిలిపోతాడు.అందలమెక్కడు, రాజభోగాలను అనుభవించడు.వారికి కనీసం మద్దతు నిచ్చి
కడుపునిండా భొజనం చేసే పరిస్థితిని కల్పించాలి కదా?పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలి కదా?శ్రమజీవులు నమ్ముకున్న వృత్తులకు భరోసా నివ్వాలి కదా?
“ప్రభువెక్కే పల్లకి కాదోయ్
అది మోసే బోయీలెవ్వరు”
“తాజ్ మహల్ నిర్మాణానికి రాల్లెత్తిన కూలీలెవరు”
శ్రీశ్రీ గారు శ్రమజీవిని గుర్తించటంలేదన్న
విషయాన్ని ఈ వాక్యాల్లో స్పష్టంగా చెప్పారు.ఎప్పుడు మన ఆలోచనంతా వస్తువును వాడుకోవటంలోనే ఉంటుంది తప్ప
ఆ వస్తువును తయారు చేయటంలో తెరవెనుక సూత్రదారుల మాటైనా మనము ఎత్తం.
ఇక్కడ నా ఆవేదన కూడా అదే.శ్రమజీవికి చేతులుజోడించి నమస్కారం చెప్పటం కాదు సాష్టాంగ పడి నమస్కారాలు తెలిపే రోజులు రావాలన్న కోరిక నాది.ఇతర అధికారులకు ఏ విధంగా గౌరవమిస్తామో శ్రమజీవికి అంతే గౌరవం ఇవ్వాలన్న ఆకాంక్ష నాది.ఎంతోమంది శ్రమజీవులు రోజు గాయాలపాలై వేదనను అనుభవిస్తూ ఈ భూమాత భారాన్ని మోస్తున్నారు.వారు భుజాలు తప్పించిన రోజు ప్రృకృతి ఉనికే ప్రశ్నార్థకం.మానవుని మనుగడే కష్టసాధ్యం.
అలాంటి శ్రమజీవులు కాలాలు మారిన అణచి వేయబడుతున్నారు.ఇంకా హక్కుల కోసం లాంగ్ మార్చ్ లు ,నిరహారదీక్షలు ,ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది.వారి గాయాలు రోజు రోజు కు మిన్నంటుతూనే ఉన్నాయి.ఈ గాయాలు రూపుమాపబడాలంటే శ్రమజీవులను గుర్తించటం ఒక చారిత్రక అవసరంగా ప్రతి ఒక్కరు భావించాలి.వారికి అండగా నిలబడాలి.తెల్లచొక్కాకే కాదు గోచిగుడ్డకు గౌరవమిచ్చే రోజులు కళ్ళముందుకు రావాలి.
శ్రమజీవుల పక్షాన నిలుస్తూ వారికి నేనిచ్చే కవితా కానుక ఈ ప్రవహిస్తున్న గాయం.ఇప్పటినుండి ఒక్క నిమిషమైనా వారి గురించి మాట్లాడుదాం.ఒక్క సెకనైనా వారు ఎలా ఉన్నారో ఆరా తీద్దాం..
*
భవిష్యత్ కవి గురించి కవి కవిత్వాన్ని గురించి
జీవిత గమనం గూర్చి వివరించడం చాలా బాగుంది సర్.అక్షరాలను ఏరుకునే హరీష్ గారి గురించి పరిచయం చేసి కొత్త తరానికి ప్రోత్సాహకాలు అందించడం చాలా గొప్ప పని . అభినందనలు హరీష్ సర్,
ధన్యవాదాలు డాక్టర్ ఆఫ్సర్ మహ్మద్ సర్ గారు.
ధన్యవాదాలు రాము..
Congrats sir
ధన్యవాదాలు సర్..
చాలా బాగుంది సర్.
ఇట్లు
సిరా
ఇల్లందు.
ధన్యవాదాలు సర్..
విషయ తీవ్రతతో ఆర్ద్రంగా వుంది
ధన్యవాదాలు గురువు గారు..
శ్రమజీవుల పక్షాన నిలబడదాం అని రాయడం చాలా బాగుంది హరీష్. నీ కవిత్వమంతా ఆ ఛాయలుంటాయి.
ధన్యవాదాలు అన్న..
Congratulations Mr Harish
Thank you very much sir..