డేటింగ్ గురించి శివశంకరి నవల!

ప్రతి ప్రాంతానికి ఒక జీవించే విధానం ఉంటుంది.

ఆ విధానాన్ని ఆ ప్రాంతపు సంస్కృతి-సాంప్రదాయాలు,ఆచారవ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. మనిషి తను పెరిగిన ప్రాంతపు వాతావరణపు జీవన విధానాన్ని ఎప్పుడు సరైందిగా అనుకుంటూ ఉండటం అతి సామాన్యంగా జరిగే విషయం. దానికి భిన్నంగా జీవితంలో ఏది జరిగినా మనిషి బెంబేలెత్తిపోతాడు కూడా. ఈ నేపథ్యంలో భారతదేశంలో పుట్టి పెరిగి, విదేశాలకు వృత్తి రీత్యా వెళ్ళే భారతీయుల ఆలోచనలు ఎలా ఉంటాయో స్పష్టం చేసే తమిళ నవలే శివశంకరి గారి ‘ఆ తర్వాత?’ (ఇది తమిళంలో ‘ఇణి’ పేరుతో వెలువడింది ). దీన్ని తెలుగులోకి మంత్రిప్రగడ శేషాబాయి గారు అనువదించారు.

శివశంకరి ప్రసిద్ధ తమిళ రచయిత్రి. దాదాపుగా ముప్పై నవలలు, ఎన్నో కథలు,రెండు ఆత్మకథలు ఆవిడ రచనల్లో కొన్ని. మాదక ద్రవ్యాల వాడకంపై వారి “అవన్”నవల ప్రసిద్ధి పొంది,అనేక జాతీయ,అంతర్జాతీయ బాషల్లోకి అనువాదమైంది. సామాజిక సమస్యలపై రాసిన వారి కథలు అనేక దృశ్య మాద్యమాల్లో ప్రసారమయ్యాయి. ఆవిడ గొప్ప సామాజిక కార్యకర్త కూడా. సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఆవిడ ‘అగ్ని’అనే సంస్థను స్థాపించారు.

  ఇక ఈ నవలలోకి వస్తే- జానకి, రఘు దంపతులు. వారి పిల్లలు గౌరి, వాసు. వివాహం కాగానే భార్యతో రఘు వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. రఘు ప్రాంతం మారినా ఏ అంశంలోనూ భారతీయ అలవాట్లను విడిచిపెట్టలేదు. ఆహారం మొదలుకుని సంగీతం వరకు అన్నీ భారతదేశంలో ఉన్నవే ఇక్కడ పాటిస్తున్నాడు. జానకి కూడా దాదాపుగా అంతే. కానీ వీరి పిల్లలు గౌరి,వాసు మాత్రం అమెరికన్ సంస్కృతిని ఇష్టపడుతూ,అక్కడి జీవన విధానంలోకి ఇమిడిపోయారు. 15 ఏళ్ళ వయసు వచ్చిన గౌరి మైక్ ను డేటింగ్ చేయాలనుకోవడం ఈ కథలో ముఖ్యమైన విషయం. ఇది తెలిసిన జానకి భయపడుతుంది. తమ కూతురు అమెరికన్ సంస్కృతిలో పడి భారతీయతను మర్చిపోతున్నదని, ఈ డేటింగ్ వల్ల తన కూతురి జీవితం నాశనం అవుతుందేమో అని కూడా బాధ పడుతుంది. ఈ ముఖ్య ఘటనను ప్రధానంగా చేసుకుని రచయిత్రి జానకి గతంలో ఆమె కుటుంబ వాతావరణం గురించి,అప్పట్లో ఆచారాల పట్టింపు గురించి,ఇలా అనేక విషయాల గురించి భారత దేశంలో ఉండే అలవాట్లు,అభిరుచుల గురించి పరిచయం చేస్తారు. చివరకు ఈ తల్లిదండ్రులు తమ కూతురి కోసం ఏ నిర్ణయం తీసుకున్నారు?వారు మారారా?లేక కూతురినే మార్చారా? అన్నదే కథ.

    గౌరి డేటింగ్ చేస్తున్నందుకు ఆమె తల్లిదండ్రులు దిగులు పడుతూ ఉంటే, అమెరికన్ సంస్కృతిలో పుట్టి పెరిగిన కార్లా (జానకి ఇంట్లో  పని చేసే మెయిడ్ కూతురు) డేటింగ్ చేయకుండా ఉన్నందుకు ఆమె తల్లి కూడా బాధ పడుతుంది. ఈ రెండు ధోరణులను రచయిత్రి చాలా సమన్వయంతో రాశారు.

  ఒక్కో ప్రాంతంలో ఉండే జీవన విధానాన్ని అనుసరించి అక్కడి స్త్రీ-పురుష సంబంధాలు ఒక్కో ధోరణిలో ఉంటాయి. భారతీయ సమాజంలో ఉండే సపోర్టింగ్ సిస్టమ్ వివాహంలో ఉన్నట్టు అమెరికాలో ఉండదు.అలాగే అమెరికాలో ఉండే వ్యక్తి స్వేచ్చ,స్వాతంత్ర్యాలు అమెరికాలో ఉండవు. ఈ విరుద్ధత వల్లే ఈ రెండు దేశాల్లోని స్త్రీ-పురుష సంబంధాలు కూడా భిన్నంగానే ఉంటాయి. కానీ మారిన ప్రాంతంలో పూర్తిగా ఇమడలేక అక్కడకు కూడా తమ దేశ వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నం చేయడం వల్ల  కొంత తృప్తి ఉండొచ్చు కానీ అది నిజమైన పరిష్కారం కాదు. భారతదేశంలో దొరికేవి అమెరికాలో కూడా దొరికితే సంతోషపడుతూ,దానిలో తమ దేశాన్ని చూసుకుని బ్రతికే ప్రవాస భారతీయుల జీవిత చిత్రం కూడా ఈ నవల. ఇలా భారత దేశంలో పుట్టి పెరిగి జీవితంలో ఎదగడం కోసం అమెరికాకు వచ్చే భారతీయుల్లో అమెరికా సంస్కృతిని అర్థం చేసుకుని, గౌరవించలేని హిపోక్రసీ కూడా ఈ నవలలో అక్కడక్కడా కనబడుతుంది.

 యవ్వనంలో కొంత ఎదురుతిరిగే స్వభావం పిలల్లో ఉండటం సహజం. దానికి దేశాలతో సంబంధం లేదు. అలాగే యవ్వనంలో ప్రేమ-ఆకర్షణలు ;వివాహేతర సంబంధాలు కూడా అన్ని చోట్లా వ్యక్తుల మనస్తత్వాలను అనుసరించి ఉంటున్నాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అని నిర్ణయించగలిగే సరైన సాధనాలు ఎక్కడా లేవు. ఈ సందర్భంలో తమ పిల్లల మాతృభూమి వేరు, తమ మాతృభూమి వేరు అనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రవాస భారతీయులకు ఉంది.ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం అంటే తమ కన్నా వారు భిన్నంగా ఉంటారు అని ఒప్పుకుని, వారికి నిర్ణయ స్వేచ్చను ఇవ్వగలగడం. దీనికి భిన్నంగా ఇక్కడ వేర్లున్న ఆ పిల్లలను మరలా పెకిలించి భారత దేశంలో నాటాలని చూసిన ప్రయోజనం ఉండదని కూడా ఇంకో సందర్భంలో రచయిత్రి స్పష్టం చేస్తారు.

   ఈ నవలలో జానకి,రఘు ఆలోచనలు సమకాలీనంగానే అనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల పెంపకంలో పిల్లలపై భారతదేశంలో తల్లిదండ్రులకు ఉండే హక్కు, అధికారం అమెరికాలో ఒక వయసుకి వచ్చాక ఉండవు. ఈ ‘రోల్ షిఫ్ట్’ భారతీయ తల్లిదండ్రులకు గొప్ప సవాలు. అలాగే పిల్లలకు గౌరవం ఇవ్వడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం అన్నదే ఏ దేశంలో అయినా పిల్లలకు-తల్లిదండ్రులకు మధ్య చక్కటి ఆత్మీయ బంధం ఉండేలా చేస్తుంది. పేరెంటింగ్ గురించి, సంస్కృతుల మార్పును అర్థం చేసుకోవాల్సిన అవసరం గురించి, దేశాల మార్పుతో వచ్చే మార్పులను అనేక కోణాల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం గురించి చెప్పే నవల ఇది.

   *    *  *

రచన శృంగవరపు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “అలాగే అమెరికాలో ఉండే వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అమెరికాలో ఉండవు” అన్న వాక్యంలో “భారతదేశంలో” ఉండవు అని కదా ఉండాలి.

    అనువాద సరళి గురించి, అనువాదం చేసిన వారి గురించి కూడా సంక్షిప్తంగా పేర్కొనాలి.

    అలాగే ప్రచురణ కర్త వివరాలు పొందుపరచాలి. సమీక్ష చదివాక ఆసక్తి ఉన్నవారు పుస్తకం కొనేందుకు వీలుంటుంది.

  • “అమెరికాలో ఉండే వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అమెరికాలో ఉండవు” కాదు భారతదేశంలో ఉండవు అని ఉండాలి.

    అనువాద సరళి గురించి రాయాలి. వీలైతే అనువాదకుల గురించి కాస్త చెప్పాలి.

    సమీక్షలో పుస్తక ప్రచురణ కర్త వివరాలు ఇవ్వాలి. ఆసక్తి ఉన్నవారు పుస్తకాలు కనుగోలు చేసే వీలుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు