1
పిల్లలు పడుకునేటప్పుడు వంతుల వారిగా కథలు చెప్పుకోవడం ఒక అలవాటుగా మారింది మా ఇంట్లో. మా ఆరేళ్ళ పాప ‘అక్షర’ క్షణాల్లో కథ అల్లుతుంది. ఇక చెప్పడం మొదలుపెడితే, మనం ఆపమని బ్రతిమిలాడే వరకు ఆ కథ కొనసాగుతూనే వుంటది. పదేళ్లున్న మావాడు (సాహస్) కొద్దిగా ఆలోచించి, కథ నిర్మాణం చేసుకొని కాస్త నెమ్మదిగ చెప్తడు. నేను కథకున్ని కాదు. కానీ అక్కడిక్కడ చదివిన, వినిన కథలు నా వంతు వచ్చినప్పుడల్లా చెప్పి పిల్లల మెప్పించే ప్రయత్నం చేస్తున్న. సమస్యల్లా కథ చెప్పడం కాదు. ఆ తర్వాత వచ్చే ప్రశ్నల వర్షాన్ని ఎదురుకోవడం. అందుకే నేను కాస్త జాగ్రత్తగానే నా కథ గురుంచి ముందే ఆలోచించుకొని చెబుత.
ఈ నిత్య కథల ప్రక్రియలో విమర్శను పాజిటివ్ గా తీసుకోవాలన్నది అందరు పాటించాల్సిన ఒక నియమం. కాని ఈ నియమం అక్షరకు నచ్చదు. “కథ మీద విమర్షేంటి. నా కథ నా ఇష్టం” అంటుంది.
మొన్న ఒక కథకు నేను కొన్ని సలహాలు ఇస్తే “నా కథ మార్చి ‘నా కల’ అని పేరు పెట్టుకొని దానిని నువ్వే పబ్లిష్ చేసుకోపో” అని అనేసింది.
సాహస్ మధ్యలో కలిపించుకొని “రచయిత అన్నాక కాసింత విమర్ష తీసుకోకపోతె ఎలా” అని పెద్దన్న సలహా ఇవ్వబోయాడు.
“నా కథ నా ఇష్టం. నీ కథ నీ ఇష్టం. అంతే. మీరిద్దరు వినకపోతె అమ్మకు చెబుత” అని ఒక బెదిరింపు. ఇదీ మా కథల యుద్ధం.
2
ఈ మధ్య నా వంతు వచ్చే సరికి నాకు కథల కరువొచ్చింది. ఏమి చెప్పాలో తోయలేదు. పిల్లలను నాకు అటుఇటుగా పడుకోబెట్టుకొని కథ కోసం ఆలోచించడం మొదలుపెట్టిన. బహుశా ఈ మధ్య కాలంలో సాయిబాబా నా ఆలోచనలో ఎక్కువగా ఉండడం మూలంగా కావచ్చు, ఆయననే కథానాయకుడిగా కథ చెబితే ఎట్లుంటది అనుకోని మొదలుపెట్టిన.
అమలాపురంలో మొదలుపెట్టి అండా సెల్ దాకా తన జీవితాన్ని, తాను ఎంచుకున్న పోరాట మార్గాన్ని, తాను అనుభవిస్తున్న రాజ్యహింసను, తన ఆరోగ్య పరిస్థితిని, జైలు జీవితాన్ని అన్నీ కలిపి కథ అల్లుతూ చెప్పిన. దాదాపు ఇరవై నిమిషాలు పిల్లలిద్దరు ఒక్క మాట మాట్లాడకుండ విన్నరు. ఎప్పుడు కథ మద్యలోనే ప్రశ్నలు వేసే అక్షర కథ అయిపోయినాక కూడ చప్పుడు చెయ్యలేదు.
“పిల్లలు ఏమి ఆలోచిస్తున్నారో?” అని నేను మనుసులో అనుకుంటుండగానే “ఇది కథ కాదు కదా డాడి” అని సాహస్ అనేశాడు.
“ఎందుకు అలా అనిపించింది” అని అడిగాను.
“కథలు ఇంత దుర్మార్గంగా వుండవు డాడి. కనీసం నేను చదివిన కథల్లో ఇంత అమానుషత్వం ఎప్పుడు చూడలే” అని ఇక నిజం చెప్పు అన్నట్లుగానే అనేశాడు.
అబద్దం చెప్పడం ఇష్టం లేక “అవును ఇది కథ కాదు. ఒక మిత్రుని జీవితం” అని చెప్పేసరికి పిల్లలు ఇక ఏమి మాట్లాడలేదు.
కొద్దిసేపట్లోనే గదంతా భరించరానంత నిశబ్ధంగా మారింది. ఇదంతా పిల్లలకు చెప్పాల్సింది కాదేమో అనిపించింది. కాసేపటి వరకు ఇద్దరు మాట్లాడకపోతె, పడుకున్నారేమో అనుకున్నాను. నేనూ ఏదో ఆలోచిస్తు అలాగే వాళ్ళ దగ్గర పడుకోని వున్నాను. కొద్దిసేపైన తర్వాత
“ఈ కథను మా స్కూల్లో చెప్పనా డాడీ. ఇది అందరికి తెల్వాలి” అని సాహస్ అనేసరికి ఒక్కసారిగా ఆలోచనలోంచి తేరుకున్న.
“చెప్పు నాకేమి అభ్యంతరం లేదు” అని చెప్పిన.
సాహస్ మాట్లాడాక నాకు డౌట్ వచ్చి పక్కకు తిరిగి అక్షరను చూస్తే తాను ఇంకా కళ్ళు తెరిచే వుంది. ఏదో ఆలోచిస్తున్నట్లే వుంది. ఎప్పుడు గలగలా మాట్లాడే ఆమె కథ విన్నాకా నిశబ్దంగా వుండటం నాకు కాస్త ఇబ్భందిగా అనిపించి “ఏంటి నాన, ఏం ఆలోచిస్తున్నావ్” అని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టిన. “ఏం లేదు” అన్నట్లుగా చూసి కండ్లు మూసుకుంది, కాని ఎప్పుడు నిద్దుర పోయిందో తెలియదు.
రాత్రి సరిగ్గా నిద్ర పోయారో లేదో తెలియదు కాని పొద్దున్నే ఏ ఇబ్బంది పెట్టకుండానే లేశారు. స్కూల్ బస్ అందుకోవాలి కాబట్టి రోజు పొద్దున్నే ఇంట్లో కాస్త హడావుడే వుంటది. అక్షరకు బ్రష్ చేయించడానికని బాత్ రూం లోకి తీసికెళ్ళి బ్రష్ మీద పేస్ట్ పెట్టి ఇచ్చిన. కాసేపు ఆ బ్రష్ అలాగే పట్టుకొని నిలబడి వుండిపోయింది. “ఏమయిందిరా? ఎందుకట్లున్నవ్?” అని అడిగిన.
రాత్రంతా ఏం ఆలోచించిందో తెలియదు కాని “డాడీ, గోడలు కూల్చడం కష్టమా?” అని అడిగింది.
“ఈ ప్రశ్న ఎందుకు అడిగింది” అనుకుంటూనే “గోడలు కూల్చడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నవ్ తల్లి?” అని అడిగిన.
“మీ ఫ్రండ్ ను జైళ్ళో పెట్టిండ్రు కదా. చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టిండ్రు కదా. అతని ఆరోగ్యం బాగలేక పోయినా బయటకు రానివ్వడం లేదు కదా. అతను బయటకు రావాలంటె ఆ గోడలు కూల్చాలి కదా” అని దాదాపు గుక్కపట్టి ఏడుస్తున్నట్లు చెప్పేసరికి నాకు ఒక్కసారిగా గుండెను పిండేసినట్లయ్యింది. ఎగిసివస్తున్న దుఖాన్ని ఆపుకోవడానికి అక్షరను గుండెలకు అత్తుకొని ముద్దుపెట్టి
“చిట్టితల్లీ, గోడలు కూల్చడం గురుంచి కాదురా, ఏ గోడలు లేని సమాజం కోసం ఆలోచిద్దాం” అని చెప్పి ఇక నేనే బ్రష్ చేసిన.
నాకు తెలుసు ఏ గోడలు కూల్చకపోతే, గోడలు లేని సమాజం కలలో కూడా రాదని. తాను భౌతిక గోడలు గురుంచి ఆలోచిస్తుంది, నేను సమాజమంతా అడ్డంగా పెరిగిపోతున్న గోడల గురుంచి చెప్పిన. తనకు ఏమర్థమయ్యిందో తెలియదు కాని, అవునన్నట్లే తల ఊపింది.
అక్షర స్కూల్ కు వెళ్ళిపోయింది కాని తన మాటలు రోజంతా నాకు చెవుల్లో మారుమోగుతూనే వున్నయి. నేను పిల్లలకు ఆ కథ చెప్పి బయపెట్టానా అని అనుకుంటుంటే వాళ్ళేమో ఆ కథకు ఒక మంచి ముగింపు ఇవ్వడానికి సహజ న్యాయ సూత్రాలు వెదుకుతున్నారు. సున్నితమైన మనస్సులే కదా అంత సాహసమైన, మానవీయమైన ఆలోచనలు చేసేది అనిపించింది. బహుశా, ప్రతి పసిబిడ్డ ఒక నిఖార్సైన కమ్యునిస్టేనేమో.
3
సాహస్ స్కూల్ నుండి వచ్చాక తన ఫ్రండ్స్ తో పంచుకున్న విషయాలు చెప్పి, తన క్లారిటీ కోసం మరిన్ని ప్రశ్నలు అడిగి విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇక అప్పటి నుండి ప్రతిరోజు ఎదో ఒక సందర్భంలో సాయిబాబ మీద జరుగుతున్న నిర్భందం గురుంచి మాట్లాడుతూనే వున్నం.
ముఖ్యంగా హైదరాబాద్ లో వరవరరావ్, ఆయన కూతుళ్ళ ఇండ్ల మీద దాడి చేశారని తెలిసి సాహస్ చాలా ఫీల్ అయిపోయిండు. మీము దూరంలో వున్నా ఆ దాడి చాలా దగ్గరగా అనిపించింది. ఎందుకంటె రెండు నెలల ముందే దాడి జరిగిన నాలుగు ఇండ్లల్లో రెండిటికి పోయి చాలాసేపు గడిపాం కాబట్టి.
ఆ దాడి తర్వాత ఒక రోజు “నాకు సాయిబాబకు లెటర్ రాయాలని వుంది. పంపే వీలవుతదా డాడీ?” అని అడిగాడు.
“నువ్వైతె రాయి ముందు, పంపే ప్రయత్నం చేద్దాం” అని చెప్పిన.
లాప్ టాప్ ముందు కూర్చోని ఒక పది నిమిషాల్లో లెటర్ పూర్తి చేసిండు.
4
డియర్ సాయిబాబ,
నా పేరు సాహస్. నాకు పదేండ్లు. ఐదవ తరగతి చదువుతున్నాను. కొంత కాలంగ భారత ప్రభుత్వం నీ మీద ఎంతటి హింస కొనసాగిస్తుందో మా డాడి ద్వార వింటూవున్నాను. చాలా రోజుల నుండి నీకు ఒక ఉత్తరం రాయాలని అనుకుంటున్నాను. కాని నాకు ఉన్న హోం వర్క్స్ వల్ల వీలుకాలేదు. ఇప్పుడు నాకు కొన్ని రోజులు బడి లేదు. ఇదే గొప్ప అవకాశమంగా తీసుకొని ఈ ఉత్తరం రాస్తున్నాను.
నీవు నా దృష్టిలో అత్యంత బలశాలివి. ఎందుకంటె ప్రభుత్వం అంత ధారుణంగా నిన్ను ట్రీట్ చేసినా కూడా నీవు ఇంకా బతికేవున్నావు. అయినా కూడ నీ గురుంచి నేను ఆందోళన పడుతున్నాను. అందుకే ఏది ఎమైనా నీకు మద్దతుగా నిలబడుతాను.
ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుందని తెలుస్తూనే వుంది. ఇదే విషయాన్ని చాలా మంది అనుకుంటున్నారు. అసలు నిన్ను ఎందుకు జైళ్ళో పెట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? కేవలం నీ భావాలను పంచుకోవడమేనా నీ నేరం?
“ఓ… అతను తన భావాలను నలుగురికి పంచుతున్నాడు. అతన్ని నిర్బంధించండి. మా తప్పులు చూపిస్తు, మాకు వ్యతిరేఖంగా ఎవ్వరు మాట్లాడ వద్దు” ఇదే కదా వాళ్ళ నీతి! అయినా పోలీసులు జైళ్ళలో పెట్టాల్సింది చెడ్డ పనులు చేసేవాళ్ళని, తమ భావాలను ప్రకటించేవాళ్ళను కాదు.
ఈ విషయంలో ప్రజలకు నాతో అంగీకారం ఉందనే అనుకుంటున్న. కాకపోతే మోడీకి భయపడి వాళ్ళు గట్టిగ గొంతెత్తి చెప్పలేక పోతున్నారు. ఎందుకంటె వాళ్ళను కూడ జైళ్ళలో నిర్బంధిస్తాడని భయం.
నిజమే కదా, నీకు మద్దతుగా ఎవ్వరు నిలబడినా కోరి సమస్యలను తెచ్చుకోవడమె. నీకు మద్దతుగా నిలబడిన వరవరరావును అదే చేయాలని చూస్తున్నారు. అరెస్ట్ చేసి జైళ్ళో పెట్టాలనుకున్నారు. కోర్ట్ కలగజేసుకోవడం మూలంగ గృహ నిర్బంధంలో వుంచారు. అయినా, ఆయన పిల్లల ఇండ్ల మీద దాడులేంటి? అది పూర్తి అన్యాయం. దీనిని ప్రజలందరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యల మూలంగ మోడి ముందు ట్రంప్ కూడ మంచోడిలా కనబడుతున్నాడు!
నిన్ను జైల్లో పెట్టింది గుర్తు కొచ్చినప్పుడల్లా నాకు ఎంతో కోపం వస్తుంది. నాలో తెలియని చిరాకు కలుగుతుంది. ప్రభుత్వం ఎంత దుర్మార్గమైంది అనిపిస్తుంది. నీకు మద్దతుగా ఇంకా ఎక్కువ మంది నిలబడితే బాగుండు అనిపిస్తుంది. నా ఆరేళ్ళ చెల్లి కూడా అలాగే అనుకుంటుంది.
ప్రభుత్వం తాను చేసిన తప్పును తెలుసుకునే రోజు వచ్చే వరకు, నువ్వు నీ ఆరోగ్య సమస్యలతో ఇంకొంత కాలం పోరాటం చేస్తూనే వుంటావనుకుంటున్న.
హృదయపూర్వకంగా,
సాహస్
5
సాహస్ లెటర్ అందుకున్న సాయిబాబ రెండు పేజీల జవాబు రాశాడు. అది వచ్చిన రోజు సాహస్ ఎంతో సంతోషపడ్డాడు. ముత్యాల్లాంటి సాయిబాబ చేరాత అక్షరాలను ఓపిగ్గా చదువుకున్నాడు. తాను జైల్లో ఎలా గడుపుతున్నాడు, రెండు పక్షులతో తాను చేస్తున్న స్నేహం, తన కూతురు గురుంచి, తన తమ్ముడి పిల్లల గురుంచి ఎన్నో విషయాలు రాశాడు. అన్నింటికన్నా సాహస్ ను బాగా కదిలించిన విషయం ఏమంటె
“నీకు తెలిసే వుండొచ్చు నేను డిల్లీ యూనివర్సిటీ లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న. కాని నన్ను ‘టెర్రరిస్టని ‘ ముద్ర వేసి జైల్లో పెట్టారు. నాకు ఇప్పటికి నిద్రలో నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లే కలలు వస్తున్నాయి. ఏదో ఒక రోజు వెళ్ళి పాఠాలు చెబుతానని అనుకుంటున్న” అని సాయిబాబ రాయడం.
అది చదవగానే “ఇప్పుడు టెర్రరిస్ట్ అనే పదానికి అర్థం ఏమయినా మారిందా డాడి?” అని అడగడంలో వాడి బాధ నాకు అర్థమయ్యింది.
స్కూల్ పనులలో పడి సాయిబాబకు జవాబు రాయడం కాస్త ఆలస్యమయినా కొత్త సంవత్సర సెలవుల్లో మల్లీ ద్యాస లెటర్ మీదికి పోయింది. ఒక రోజు కూర్చొని ఉత్తరం టైప్ చేశాడు.
6
డియర్ సాయిబాబ,
నీ ఉత్తరం అందిన చాలా రోజుల తర్వాత జవాబు రాస్తున్నందుకు క్షమించగలవు. ఇప్పుడు నీతో పంచుకోవడానికి చాలా విషయాలు వున్నాయి. నా మొదటి ఉత్తరంలో నా గురుంచి ఎక్కువగా చెప్పలేదు, ఇప్పుడు ఆ పని చేస్త.
ముందుగా, నేను ఒక ఫాంటసీ రాస్తున్నాను. అది ఒక అబ్బాయి, అతని ఇద్దరు మిత్రులు ఒక భయం పుట్టించే ఇంట్లో చేసిన సాహసాలకు సంబంధించిన కథ. కథకు సంబంధించిన అన్ని విషయాలు ఆలోచించి పెట్టుకున్నాను, కాని ఇంకా ఫైనల్ చేయలేదు.
మా ఊర్లో ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్ జరుగుతుంది. గత మూడేళ్ళుగా నేను పాల్గొంటున్నాను. మొదటి సంవత్సరం “గ్లోబల్ వార్మింగ్ ఒక మాయమాట కాదు” అని ఒక ప్రయోగం చేసి చూపించిన. పోయిన ఏడాది స్టీఫెన్ హాకింగ్ పిల్లల కోసం రాసిన ‘జార్జ్’ అనే సిరీస్ మొత్తం చదివి, వాటిలో కథల ద్వారా సైన్సు ను ఎలా పిల్లలు నేర్చుకోవచ్చో ప్రజెంట్ చేసిన. ఈ సంవత్సరం పిల్లలపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం ఎలా పడుతుందో పరిశోధించి చెప్పాలనుకుంటున్న.
ఇక అకడమిక్ విషయాలు కాకుండ, బొమ్మలు గీయడం, రాయడం నా అలవాట్లు. అప్పుడప్పుడు వీడియో గేం కూడ ఆడుతాను.
మీరు జైల్లో ఎలా రాస్తారా అనుకుంటుంటాను. వాళ్ళు నోట్ బుక్స్ లేదా పేపర్లు ఇస్తారా? చదవడం, రాయడం కాకుండ జైల్లో ఇంకేమి చేస్తుంటారు? మీకు వార్తలు ఇస్తారా?
ఈ మద్య మా డాడీ న్యూయార్క్ టైంస్ లో వచ్చిన ఒక వ్యాసం చూపించాడు. అది ఖైదీలకు ఉత్తరాలు రాసే ఒక అమ్మాయి గురుంచి. అది చదవగానే నువ్వే గుర్తుకొచ్చావు. కాని తేడా ఏమిటంటే ఆ ఖైదీలు ఏదో ఒక నేరం చేసినవాళ్ళు. నువ్వేమో ఏ నేరం చేయక పోయినా శిక్ష అనుభవిస్తున్నావు.
నిజాయితీగా చెప్పాలంటె కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కదా మిమ్ముల జైల్లో పెట్టింది, టెర్రరిస్టని ముద్ర వేసింది. అసలు టెర్రరిస్ట్ అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళకి? నావరకైతె, ఎవరైనా ఒక సమూహాన్ని భయబ్రాంతులకు గురిచేస్తెనో లేక హాని చేస్తెనో టెర్రరిస్ట్ అవుతారు. నువ్వు ఎవ్వరికి హాని చేశావు? ఏకాంత నిర్భందంలో లో కూడ నీ మంచితనం చూపుతున్నావు కదా! పక్షులతో స్నేహం చేస్తున్నావు కదా! దీనితో నిన్ను ఏకాంత నిర్భందంలో వుంచాలనుకున్న వాడి లక్ష్యం కూడ ఓడిపోయింది. కాకపోతె ఈ విషయాన్ని గట్టిగా బయటకు అనను. ఎందుకంటె ఆ పక్షులపై కూడ టెర్రరిస్ట్ ముద్ర వేసి జైల్లో వేయగలరు!
ఈ మధ్య కాలంలో భీమా కోరగాం 200 వార్షికోత్సవ ర్యాలీ లో జరిగిన సంఘటనల గురుంచి, దానిలో మతోన్మాదుల పాత్ర గురుంచి, ఆ తర్వాత మేధావులను బదనాం చేసిన దాని గురుంచి తెలుసుకున్నాను. నా అవగాహనలో మతవాదులు ఎప్పుడు మార్పుకు వ్యతిరేఖులే. ఎందుకంటె వాళ్ళ జీవితాలు బాగనే వుంటాయి కాబట్టి. కాని దళితుల జీవితాలు దానికి పూర్తి విరుద్దం. అందుకే వాళ్ళు సామాజిక పరిస్తితుల్లో మార్పు వచ్చే వరకు పోరాటాలు చేస్తూనే వుంటారు. దానికి మనందరం సపోర్ట్ చేయాలి. అందులో భాగంగానే నా చెల్లి దళితుల జీవితాలను మర్చే ప్రయత్నం చేసే ఒక అమ్మాయి కథ రాసింది.
నీవున్న పరిస్తితులనుండి కూడా సమాజ మార్పు కోసం రాస్తున్నందుకు నీ మీద ఎంతో గౌరవం పెరిగింది.
ఇక ఇంతటితో ముగిస్తాను. నీవు బాగనే వున్నావనుకుంటున్న. త్వరలో ఉత్తరం రాస్తావనుకుంటున్న. Happy New Year! (నీవు New Year మీద గత సంవత్సరం రాసిన కవిత స్పూర్తిలో!)
హృదయపూర్వకంగ,
సాహస్
7
కరడు కట్టిన ఇటాలియన్ ఫాసిస్ట్ ముస్సోలిని సహితం కమ్యునిస్ట్ మేధావి అంటోనియో గ్రాంసి సాయిబాబ మాదిరిగానే జైల్లో తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలోకి పోయినప్పుడు ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమ ఒత్తుడికి లొంగి వైద్యం కోసం ఏర్పాట్లు చేశాడు. ముస్సోలిని ని మించిన ఫాసిస్టులు అధికారంలో వున్న వేళ సాయిబాబా లాంటి ప్రజా మేధావులను, ఉద్యమకారులను కాపాడుకోవడం మొత్తం సమాజపు కనీస బాధ్యత.
*
Love you all so much. It’s a wonderful story
కన్నీళ్లు ఆగడంలేదు.కానీ సాయిబాబా కోసం కన్నీళ్లు కార్చడం నేరమే.
కదం తొక్కడమే సరైన మార్గం.–
పదేళ్ళ పిల్లవాడు ఉత్తరం రాసాడంటే ఆ పిల్ల పెద్దవాడికి, మీకూ శభాష్ధ!ధన్యోస్మి .
Thank you all.
థేంక్యూ అక్షరా సాహస్ అశోక్!
ఇంతకంటే మాటల్లేవు. ఈ మటల్లోనే నా కన్నీళ్లు చూడండి.
Thank you, Prabhakar garu!