డాక్టర్ రామన్   MBBS

మందులతో రోగాలకు..సేవతో సమాజానికి చికిత్స

“ఆత్మహత్యలన్నీ హత్యలే “  ఎంత బాగా చెప్పాడో త్రిపురనేని శ్రీనివాస్ అన్నాడు అతను. అలా ఆ కవితను చదువుతూ మళ్లీ “తనను బాధిస్తున్న ప్రపంచం ముల్లుని పీకి పారేసి చక్కాపోయాడు “ అని మళ్లీ చెట్టుకవి ఇస్మాయిల్ కవితలోని మరో లైన్ చెప్పాడు.

నిజానికి అందరూ యాక్సిడెంటల్ గా చనిపోతున్నారని అంటున్నారు. ఈ సంక్షుభిత సమాజంలో మనమందరం యాక్సిడెంటల్ గా బతుకుతున్నాం అన్నాను నేను.

“ అవును. బాగా చెప్పావు“ అన్నాడు.

ఆ సమయంలో మేమిద్దరం అమలాపురం పట్టణంలోకి స్వాగతం చెప్పే ఈదరపల్లి వంతెన కింద కౌశిక పాయ  ఒడ్డు మెట్లపై కూర్చున్నాం. మా పాదాలు కౌశిక నీళ్లలో నృత్యం చేస్తున్నాయి.

అతను కూచిమంచి అగ్రహారం చివర కృష్ణమూర్తి వీధిలో  నివాసముండే తిరువూరి నరసింహారావు, వెంకట రమణల తొలి సంతానం. కోనసీమలోని భీమనపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహారావు గారు తన ఇద్దరు కుమారుల కాలేజీ చదువు కోసం అమలాపురం వచ్చి కూచిమంచి అగ్రహారంలో నివాసముండేవారు. ఆ దంపతుల పెద్ద కుమారుడే రామన్. రామన్ అసలు పేరు సుబ్బరామయ్య. వాళ్ల తాతగారి పేరు. ఐదేళ్ల వయసులో తన పేరు స్టైల్ గా లేదని రామన్ గా మార్చుకున్న పుట్టు మేథావి.

రామన్ రాకతో అగ్రహారం యువకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాం. కారణం 17 ఏళ్ల రామన్ జుట్టు తెల్ల తెల్లగా నెరసిపోయి ఉండేది. అంతేకాదు ఐదడుగుల మూడంగుళాల పొడవుతో టక్ చేసుకుని చాల స్టైల్ గా నడచేవాడు.  అంత వరకు నిక్కర్లు మాత్రమే తెలిసిన మాలో కొందరికి రామన్ ఆ వయసులో టక్ చేసుకోవడం,  అదీ తోలు బెల్ట్ పెట్టుకుని అగ్రహారంలో కనిపించడం మాకో కొత్త అనుభవం.

మా క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు వచ్చేవాడు రామన్. ఆ సమయంలోనే శ్రీశ్రీ అని, చలం అని, జీన్ పాల్ సాత్రే అని, స్టిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఏవేవో కొత్త పేర్లు ఊటంకిస్తూ మాట్లాడేవాడు. రెండు వేళ్ల మధ్య పట్టుకున్న సిగరెట్ నుంచి వచ్చిన పొగ చిత్రంగా మల్లే తీగలా వంకర్లు పోతూ గాలిలో కలసిపోయేది. మేథావి అనే మాట వినని మాకు ఆ మాటని తన రూపంలోనే పరిచయం చేసిన మేథావి రామన్.

బహుశా రెండు మూడు దశాబ్ధాల తర్వాత అగ్ర‌హారంలో మెడిసిన్ సీటు సాధించిన కుర్రాడు రామన్ ఒక్కడే.

రామన్ విజయం అగ్రహారంలో అందరికి ఓ సంతోషం.

రామన్ విజయం మా అందరికి ఓ వేడుక

రామన్ విజయం అగ్రహారమంతా ఆశ్చర్యం

పుస్తకాలను నిరంతరం అంటిపెట్టుకున్న పురుగుల వంటి విద్యార్దులకు మాత్రమే మెడిసిన్ సీటు వస్తుంది అన్న భ్రమలో ఉన్న మాకు రామన్ విజయం ఓ ధైర్యాన్నిచ్చింది.

రామన్ విశాఖ‌ప‌ట్నంలో మెడిక‌ల్ క‌ళ‌శాల‌లో  చేరాడు. మొద‌టి ఆరు నెల‌ల్లోనే అక్క‌డి కుల పిచ్చికి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ప్ర‌జ‌ల‌కు వైద్యం అందించ‌డం కంటే ముందు మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఉన్న కుల పిచ్చిపై పోరాటం చేయాల‌నుకున్నాడు. చేశాడు. ఫ‌లితం అంద‌రికీ తెలిసిందే. ప్రొఫెస‌ర్ల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. అయినా వెర‌వ లేదు. అయినా బెద‌ర‌లేదు. అయినా చెక్కు చెద‌ర‌లేదు. యుద్ధం ఆప‌లేదు. చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటంలో నిద్ర‌కు దూరం అయ్యాడు. నిద్ర‌ను తెచ్చుకుందుకు బ‌ల‌హీన‌ప‌డ్డాడు. నిద్దుర పోరా తమ్ముడా… నిద్దురపోరా తమ్ముడా..

నిదురలోనే జగమునంతా నిమిషమైనా మరచిపోరా..

కరుణ లేని జీవితాన కలత నిదురే మేలురా…

నిద్దుర పోరా తమ్ముడా…

***                                                 ***                                                                               ***

ఐదేళ్ల మెడిసిన్ పూర్తి చేసిన రామన్ మెడలో స్టెతస్కోప్, చొక్క మీద తెల్లటికోటుతో అగ్రహారానికి వచ్చాడు.

అప్పుడు రామన్ నవ్వుతున్న వెన్నెలలా ఉన్నాడు

అప్పుడు రామన్ నడుస్తున్న సరస్వతీ పుత్రుడిలా ఉన్నాడు

అప్పుడు రామన్  పోరాట యోధుడిలా ఉన్నాడు

అప్పుడు రామ‌న్ కుల స‌మాజం మీద ఎగిరిప‌డాల‌నుకున్న గండ్ర‌గొడ్డ‌లిలా ఉన్నాడు.

మెడిసిన్ పీజీ కోర్సుకు సిద్దమవుతూనే ప్రముఖ వైద్యులు ఎర్రమిల్లి భీమశంకరంగారి పాత ఆసుపత్రి భవనంలో క్లినిక్ ని ప్రారంభించేడు రామన్. చుట్టుపక్కల నుంచి రోగులు వస్తున్నారు. వైద్యం చేస్తున్నాడు. వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నాడు. లేకపోతే ఊరుకుంటున్నాడు. రోగుల పరిస్థితి చూసి తన దగ్గర ఉన్న శ్యాంపిల్ మందులు ఇస్తున్నాడు.

ఇంకా అంత పేరు రాలేదు. పగలంతా ఆసుపత్రి,  సాయంత్రం సాహిత్యం. అలా నడచిపోతోంది. అదిగో అలాంటి సమయంలో ఓ పత్రికలో వచ్చిన చిన్న వార్త రామన్ ని కుదిపేసింది. వర్షాకాలంలో తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతమైన రంపచోడవరంలో వైద్యం అందక గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. అదీ ఆ వార్త సారాంశం.

డాక్టర్ రామన్ ఆ వార్త చదివిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.

ఎవ్వరితోనూ చెప్పలేదు. ఎవ్వరితోనూ పంచుకోనూ లేదు. కనీసం కాంపౌండర్ కి కూడా తెలీదు. చేతికందిన మందుల డబ్బాలని, ఇంజెక్షల్ని ఓ సంచిలో వేసుకున్నాడు. రెండు జతల బట్టలు ఆ బ్యాగులో కుక్కుకున్నాడు. అమ్మతోను, భార్య వసుంధరతోనూ  “నేను ఓ వారం రోజులు ఇక్కడ ఉండను.. పని మీద వెళ్తున్నాను. ఎవరైనా వస్తే డాక్టర్ గారికి అనారోగ్యం అని చెప్పండి” అని చెప్పి అనారోగ్యంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు.

రంపచోడవరానికి 70 కిలోమీటర్ల లోపలకి వెళ్లాడు. ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేని గిరిజనులు. ఎండిపోయిన డొక్కలతో, పీక్కుపోయిన ముఖాలతో మృత్యువుకి ప్రతిరూపంలా ఉన్నారు. వంటి నిండా కప్పుకునేందుకు జానెడు బట్టకూడా లేదు. అక్కడ వాలాడు రామన్.

ముందుగా తన వెంట తీసుకుని వెళ్లిన బిస్కెట్లు, పళ్లు అక్కడి వాళ్లకు అందజేసాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను ఉండేందుకు బస కావాలి అని అడిగాడు.

చూడగానే కూలిపోతుందేమో అని భయపడే ఓ గుడిసెను చూపించారు అక్కడి గిరిజనులు.

ఆ గుడిసె పేరే “వెంకటరమణ క్లినిక్”. బోర్డు లేదు కాని తన మనసులో ఆ పేరే పెట్టానని ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత నాలాంటి స్నేహితులకి చెప్పాడు.

మలేరియాతో అల్లాడుతున్న గిరిజనులకు వైద్యం చేయడం ప్రారంభించాడు. మందులు ఇచ్చాడు. ఇంజక్షన్లూ చేసాడు. ఆ చుట్టుపక్కల దాదాపు పది గ్రామాల గిరిజనులకి రామన్ వచ్చిన విషయం, వైద్యం అందిస్తున్న వైనం తెలిసింది. తాటాకులతో ఉన్న వెంకటరమణ క్లినిక్ కి గిరిజనుల రాక ప్రారంభమయ్యింది. ఉదయం ఆరు గంటలకి ప్రారంభమయ్యే వైద్యసేవలు రాత్రి ఏ పదింటికో ముగిసేవి. గిరిజనులు తెచ్చిన పళ్లు, తనతో ఉన్న బిస్కెట్లే రామన్ ఆహారం. ఇలా వారం రోజుల పాటు నడకతో పది గ్రామాలు తిరిగి వైద్యం అందించాడు.

అప్పుడు రామన్ గిరిజనులలో గిరిజనుడిలా ఉన్నాడు

అప్పుడు రామన్ అల్లూరికి ఆనవాలుగా ఉన్నాడు

అప్పుడు రామన్ గిరిజనులకు వారి దేవత అయ్యాడు.

***                    ***                                ***

ముఖం పీక్కుపోయి, కళ్లు లోతుకి వెళ్లిపోయి, గెడ్డం పెరిగిపోయి, బట్టలు మాసిపోయి, ఒళ్లంత అడవి తల్లి మట్టిని పులుముకున్న రామన్ చేతిలో ఓ బ్యాగ్ తో అమలాపురం వచ్చాడు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. మధ్యలో అగ్రహారంలో అతనిని చూసిన వారందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. రామన్ ఏం మాట్లాడలేదు. కనీసం చిరునవ్వు కూడా లేదు. గంభీరంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని కోసం గుమ్మం ముందు రామన్ తల్లి, భార్య ఎదురుచూస్తున్నారు. చెప్పులు విడిచి బ్యాగ్ ఓ మూల పెట్టి లోపలకి వెళ్లాడు రామన్.

“ఏరా ఇలా ఉన్నావేంటి…. ఆ బట్టలేంటి….ఎక్కడనుంచి వస్తున్నావ్… ఏంటి ఆ వాలకం” అని రామన్ వాళ్ల అమ్మగారు ప్రశ్నల వర్షం కురిపించారు.

రామన్ ని అతని భార్య వసుంధర ఆపాదమస్తకం పరికించి…పరిశీలించి చూసింది. ఏం మాట్లాడలేదు.

హాల్లో ఉన్న సోఫాలో రామన్ కూలబడ్డాడు. మోకాళ్ల మీద తలని వంచుకుని భూమిలోకి చూస్తూ కూర్చుండి పోయాడు.

పక్కనే వాళ్లమ్మగారు కూర్చున్నారు. ఆవిడకి కొంచెం దూరంలో రామన్ భార్య నిలబడి ఉంది.

రామన్ తల నిమురుతూ “ఏమైంది నాన్నా… ఎందుకిలా ఉన్నావ్… నాతో చెప్పు”

అంతే ఆ ఒక్క ఓదార్పుకి… ఆ ఒక్క మాటకి…

తల్లి నుంచి తప్పిపోయిన పిల్లాడిలా భోరున ఏడుస్తూ తల్లి ఒళ్లో తల పెట్టుకున్నాడు రామన్.

ఏడుపు ఆగడం లేదు….. గట్టు తెగిన గోదావరిలా కన్నీళ్లు జలజలా రాలుతున్నాయ్. కాసింత దూరంగా ఉన్న భార్య వసుంధర రామన్ దగ్గరకి వచ్చి మోకాళ్ల మీద కూర్చుని “ఏమైందండీ” అంటూ ఆందోళనగా అడిగింది. ఆ ప్రశ్నకీ సమాధానం వెక్కి వెక్కి వస్తున్న కన్నీళ్లే. తన ఒళ్లో పడుకున్న రామన్ తల నిమురుతూ తల్లీ….. అతని కాళ్ల దగ్గర భార్య మౌనంగా ఉండిపోయారు.

అలా 15 నిమిషాల నిశబ్దం తర్వాత కాస్త తేరుకున్న రామన్ నుంచి వచ్చిన మొదటి మాట “వాళ్లు మనుషులమ్మా. నాలాగే ఓ తల్లికి పుట్టిన బిడ్డలమ్మా. అమాయకత్వం తప్ప ఎలాంటి మోసాలు తెలియని గిరిజనులమ్మా. వాళ్లకి సరైన తిండి లేదు… వైద్యం లేదు.. నా అని ఆదుకునే వాళ్లే లేరు. ” అన్నాడు రామన్. భార్య ఇచ్చిన మంచినీళ్లు తాగి కాసింత కుదుటపడ్డాక ఈ 15 రోజులు తాను ఎక్కడికి వెళ్లాడో… అక్కడి పరిస్థితులేమిటో ఆ ఇద్దరికి చెప్పాడు. “సమాజంలో సాటి మనిషిని పట్టించుకోని లోకంలో ఉన్నాం మనం. ఇలా బతకడం అవసరమా అన్నాడు.

***                      ****                             ***  

కోనసీమని తుపాను ముంచెత్తింది. వేలాది ఎకరాలు నీట మునిగాయి. కుటుంబాలకు… కుటుంబాలే రోడ్డున పడ్డాయి. వారం రోజుల పాటు కోనసీమకు కరెంట్ లేదు. ప్రతిరోజూ గోదావరి నీళ్లతో స్నానం చేస్తున్నామని, గోదావరి నీళ్లే తాగుతున్నామని గర్వపడే కోనసీమ వాసులకి గుక్కెడు నీళ్లే కరవయ్యాయి. పల్లెల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అదిగో అప్పుడూ మళ్లీ రామన్. మిత్రుడి మోటర్ సైకిల్ మీద చేతిలో మెడికల్ కిట్ తో రోజుకి పది.. పన్నెండు గ్రామాలు తిరిగేవాడు. ఉదయం ఎనిమిదింటికి ఇంటి నుంచి బయలుదేరితే అర్ధ్రరాత్రి ఏ పన్నెండు గంటలకో ఇంటికి చేరేవాడు. తుఫాను బాధితుల కళ్ల ముందు దేవుడి పంపిన ఆసుపత్రిలా ఉండేవాడు. అలా నెల రోజుల పాటు నిద్రకి, తిండికి దూరమయ్యాడు. స్నేహితులమైన అదృష్టానికి తన సేవలో మమ్మల్నీ భాగస్వాములను చేసాడు.

ఇంత చేస్తున్నా రామన్ ని ఓ నిర్లిప్తత వెంటాడేది.

ఇంత చేస్తున్నా రామన్ ని ఓ శూన్యం ఆవరించేది.

ఇంత చేస్తున్నా రామన్ ని సమాజం అతలాకుతలం చేసేది.

అలాంటి సమయంలో రామన్ నవ్వు వెలిసిపోయిన వెన్నెల్లా ఉండేది.

***                      ****                           ***

రామన్ తండ్రయ్యాడు. అదీ తనకి అత్యంత ఇష్టమైన ఆడపిల్లకి తండ్రయ్యాడు. ఆ ఆనందాన్ని తనకు అత్యంత ఇష్టమైన పున్నమి వెన్నెలలో గోదావరి మధ్య మేటేసిన ఇసుక తిన్నె మీద స్నేహితులతో పంచుకున్నాడు.

ఆ రాత్రి రామన్ ఆనందానికి ఇంటిపేరులా ఉన్నాడు

ఆ రాత్రి రామన్ సంతోషానికి మారుపేరులా ఉన్నాడు

ఆ రాత్రి రామన్ తనకు ఇష్టమైన తిలక్ కవిత్వంలా ఉన్నాడు.

***                         ****                       ***

పన్నెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి. రామన్ పుస్తక అనువాదాలు, కవిత్వం రాయడం, వైద్యం చేయడం వంటి నిరంతరం పనులలో భాగం అయ్యాడు. పీజీ పరీక్షలకు చదువుతున్నా అదేమి తలకెక్కడం లేదు. అయినా చదువుతున్నాడు. తన ఏకైక ఆశయం మెడిసిన్ లో పీజీ చేయడం నెరవేరదేమోనని కాసింత దిగులుగానూ ఉన్నాడు.

ఒక వేదన రామన్ ని నిరంతరం వెంటాడేది. ఓ మానసిక శూన్యం అతని వెంట నడిచేది. నవ్వేవాడు. అందులో జీవం ఉండేది కాదు. పలకరించేవాడు. ఆ పలకరింపులో ప్రేమరాహిత్యం ఉండేది. “ఏమిటిది….ఏమైంది. మిమ్మల్ని చూస్తే భయంగా ఉంది. హాయిగా ఉండండి… మీకేం కావాలో చెప్పండి. మేమంతా ఉన్నాం” అని భార్య ప్రతిరోజూ ధైర్యం చెప్పినా రామన్ అదోలాంటి నవ్వు నవ్వేవాడు. ఆ నవ్వుకు అర్ధం అతడికే తప్ప ఇంకెవ్వరికీ అప్పుడు తెలియలేదు.

***                      ****                     ***

ఓ చీకటి మధ్యాహ్నం పశువులు కాసుకునే కుర్రాళ్లు ఓ దుర్వార్తను మోసుకుని వచ్చారు. ఎస్.కె.బి.ఆర్ కాలేజీ వెనుక గోదావరి పాయ కౌశిక దగ్గర ఓ 30 ఏళ్ల యువకుడు నిర్జీవంగా పడి ఉన్నాడని ఆ కబురు. అగ్రహారమంతా పరుగు పెట్టింది. మహాకవి శ్రీశ్రీ… కొంపెల్ల జనార్ధన రావు కోసం “దొంగలంజకొడుకులు అసలే మసలే థూర్త లోకంలో నిలబడలేక వెళ్లిపోయావా…” అన్నట్లు రామన్ వెళ్లిపోయాడు.

***                    *****                ***

రామన్ ఇంటి ముందు వందల సంఖ్యలో అగ్రహరీకులు, అక్కడంతా ఉద్విగ్న వాతవరణం.

అక్కడంతా తెరలుతెరలుగా కమ్ముకున్న దుఖం.

అక్కడంతా పొరలుపొరలుగా బయటపడుతున్న బాధ.

అక్కడికి కొంచెం దూరంలో చేతిలో స్టెతస్కోప్ తో ఆడుకుంటూ నాలుగేళ్ల రామన్ కూతురు గాయత్రి.

***                       ****                           ***

రెండు దశాబ్దాలు గడిచాయి. ఓ రోజు ఉదయాన్నే నాకో ఫోన్ కాల్. కొత్త నెంబరు. కాల్ రిసీవ్ చేసుకుని హలో అన్నాను.

“బుజ్జీ. నేను గిరిని. అదే రామన్ తమ్ముడిని.” అవతల నుంచి….

“గిరీ. బాగున్నావా. అమ్మ, వదినా ఎలా ఉన్నారు. ఎక్కడున్నావ్. పిల్లలు ఎలా ఉన్నారు” నా ప్రశ్నల పరంపర.

“అందరూ బాగున్నారు బుజ్జీ. నీకో విషయం చెబుదామని ఫోన్ చేసా.”

“ చెప్పు… చెప్పు” నా కంగారు.

“ఏంలేదు బుజ్జీ మా అన్నయ్య… నీ స్నేహితుడు రామన్ కూతురు గాయత్రి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతే కాదు. ఎండీ సీటు కూడా వచ్చింది. నువ్వు ఆనందిస్తావని వదిన చెప్పింది. అందుకే ఫోను చేసాను”

డాక్టర్ గాయత్రి, ఎంబీబీఎస్, ఎండీ.

మా డాక్టర్ రామన్ కూతురు.

(డాక్టర్ రామన్ మాతృమూర్తి వెంకటరమణ, భార్య వసుంధర, కూతురు గాయత్రిలకు…)

***

 

ముక్కామల చక్రధర్

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొన్ని విషయాలు గుర్తుకు వస్తే మనసు కెలికి నట్టవుతుంది, కొన్ని విషయాలు తెలిస్తే ఏదో
    ఆ బాధను లేపనాలు పూసినట్టు అవుతుంది.
    ఇదీ అంతే.
    రామన్….కారణాలు ఇంత విపులంగా తెలియకపోయినా విఫలమైన మనసుతో
    వీడిపోయిన అగ్రహారపు హీరో. అది మాత్రం
    మాకు తెలుసు.
    రామన్…అతని రూపాన్ని అచ్చంగా అలాగే
    నీ రచనలో గీసేసావ్.
    అగ్రహారపు లోగిళ్ళల్లో కొన్ని కళ్ళు చమర్చే
    కథల్లో ఇది ఒకటి.
    మాకు ఇంకా గుర్తుంది వాళ్ళ ఇంట్లో మేమంతా
    క్రికెట్ చూసేవాళ్ళం.చివరి బంతికి ఒక ఫోర్
    కొట్టాలి, రవిశాస్త్రి బాటింగ్,మేము అంతా
    కొట్టలేడు, ఇంక మ్యాచ్ పోయింది అని
    అంటుంటే ఒక్క ఉరిమి ఉరిమిన మాస్టారు
    గొంతును నేను మరచి పోలేదు. ఎప్పుడూ
    ఆశావాదంగా ఉండు, అంతేకానీ ఇలా
    నిరాశాజనక మాటలు చెప్పకన్నా మాస్టారి
    మాటలు ఇంకా నా జీవితంలో టానిక్ లా
    పనిచేస్తుంటే మరి రామన్ ఎలా అలా
    అయిపోయాడు. ఇదే విధి.
    ఆయన స్ఫూర్తి కలిగించిన మాటలు నాలో
    ఇంకా మొగుతుంటే మరి రామన్ ఎందుకు
    గ్రహించ లేకపోయాడో. అదే రాత అంటే…

    ఏది ఏమయినా రామన్ కూతురు డాక్టర్ గా
    ఎదగటం బహుశా రామన్ మొదలు పెట్టిన
    యజ్ఞం పూర్తి చేయటానికేమో,
    అభాగ్యులకు సేవలు అందించటానికేమో
    మంచి విషయం వెలికి తీసి మా అందరికీ
    రంగరించి చెప్పావ్…అభినందనలు.

  • ఆ మహా మనీషి కి వందనాలు 🙏🙏🙏
    ఎప్పటిలాగే అగ్రహారంలో తిరిగి వచ్చా.. గుండె నిండా బరువు తో.

  • చ‌క్ర‌ధ‌ర్ గారూ… డాక్ట‌ర్ రామ‌న్ కూతురికి మెడిసిన్ సీటు వ‌చ్చిందంటే… నా కూతురికి కూడా పీజీ సీటు వ‌చ్చినంత ఆనందంగా ఉంది….
    మీ ర‌చ‌నా శైలిని ఎలా వ‌ర్ణించినా… త‌నివితీర‌డం లేదు… తెలుగులో వ‌ర్ణించ‌డానికి కొత్త ప‌దాలు వెతుకున్నా… వాటి కోసం శోధిస్తున్నానంటే న‌మ్మండి సార్‌…!

  • One more Superb writing. Absolutely wonderful.I salute Dr.Raman garu.You are so privileged to had friend like him.Very nice to hear that His daughter became doctor..Our all blessings will be to her.Pray God to give her father’s dedication commitment and sensitivity towards weaker sections..
    You have narrated beautifully.

  • రామన్ గురించి నాకు తెలిసినది తక్కువే. కానీ పిరికి వాడిలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తీరు. మనస్సు ని కలిచివేస్తుంది. S K B R కాలేజీలో, జరిగే ఇంగ్లీషు
    వక్తృత్తవ్వ పోటీలలో రామన్ పాల్గొనేవారు.
    ఆ వేదికల మీద చిత్రమైన హావభావాలతో, వాగ్ధాటితో, మాట్లాడే తీరు ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఆ రోజులలో, తెలుగు. మాధ్యమం లో చదువు కొనే చాలా మందికి , ఆయన. మాట్లాడినంతసేపు ఏదో ఇంగ్లీషు సినిమా చూసినట్టుండేది.
    చాలా చక్కగా వివరించిన రచయిత కు.నమస్సులు.

  • Raman was a unique personality. I used to visit their family whenever I used to come from far away states on leave to AP. My wife and Raman s mother are close friends. Raman came to Bombay along with his newly married wife to Mumbai and stayed with us a couple of days. He did not move out but both the days he was interested in knowing about Oil exploration and production. I had explained the the entire game of oil exploration and potential dangers like blowouts etc. Konaseema in particular lost a good doctor with his untimely death.
    P.V.Ramana Rao
    Ex.ONGCian.pvrrao1512@gmail.com

  • బాగా రాశావు బుజ్జీ! డాక్టర్ రామన్ గారి పరిచయం గొప్పగా చెప్పావు ‘ఈ సంక్షుభిత సమాజంలో మనమందరం యాక్సిడెంటల్ గా బతుకుతున్నాం’ ఈ మాటతో మనం ఎలా జీవిస్తున్నామో తెలియజేస్తూ, నిజమైన మేథావి, మానవత్వానికి మారు పేరు అనే మాటలకు నూటికి నూరు పాళ్ళు రామన్ గారు అని మాకు పరిచయం చేసి నువ్వో మంచి రచయిత అని మరో సారి పాఠకులు అభిప్రాయపడడంలో ఎలాంటి సందేహం లేదు.అభినందనలు!

  • కన్నీళ్లోడుతున్నాయ్ అక్షరాలు బుజ్జీ! కన్నీళ్లతో స్నానం చేస్తున్న జీవితాల్ని అక్షరాలతో కడిగి ఆరేస్తున్నావ్! ఇంకేం రాయలేను. దిగులుతో సంతోషంగా ఉంది గాయత్రి డాక్టరైందని! ఏడిపించేస్తున్నావురా!

  • Thank you sir for Writing!! I am Nephew of Dr.Raman Garu. Now I understand where my Sister (Dr.Gayatri) got all the passion from. I was very young when he passed away but this writing made me remember some of my memories in Amalapuram with him when I was a kid and also Vasundhra Pinni’s Office close by, Gayatri’s first school which is few block’s away and Edukondalu who used to live next door & so on. Our family will always be proud of him and also gayatri. Thank you very much.

  • One more Realistic Story, memu unde place nunde oka Medhavi ni Kolpovadam Badhakaram.Hats off to Chakradhargaru

  • రామన్ కు నాకు తర్కమయ్యేది వాదనలు జరిగేది అందులో అది correct point గోపి అని ఒక హుందాతనం సేవాకార్యక్రమాలు చేస్తూ మొదట తారసపడింది ఇరువురుము అమలాపురం బ్లోఅవుట్ సమయంలో అందు బాధితులకు అందరికీ ఆశ్రయమిచ్చిన మన SKBR College లో సహాయ పనులలో నిమగ్నమై ఉన్న నన్ను రామన్ వెనకనుంచి నాభుజం మీద చేయి వేసి గోపి మనం చేద్దాం అని అతను వైద్యుడు గా సహాయం అందిస్తూ ఇంకా నేను ఏంచేయాలో చెప్పు గోపి అని తారసపడ్డాము. తర్వాత వరదల సమయంలో రామన్ మాఇంటికి వచ్చేవాడు గోపి ఈరోజు బండారులంక వెళ్ళాను ఈ సహాయం చేసాను అని మరొక రోజు వచ్చి కొన్ని కరపత్రాలతో వచ్చి గోపీ ఇది నేను సొంతంగా వ్రాసిన ది అని నలుగురికీ ఇమ్మని అందులో వ్రాసినది చదివాను అది మనిషి ఒకళ్ళ కొకళ్ళు సహాయం చేసుకోవాలని మనిషి మపిషి గా బ్రతకాలని అలాగే అని నలుగురికీ ఇచ్చాను. స్పందన కోసం అడిగేవాడు. రామన్ అతి స్వల్ప కాలంలో మంచి పరివర్తన వెనువెంటనే రాదు సమయం పడుతుందని సమాధానం ఇచ్చిన అతని లోని ఆత్రత ను చూసే వాడిని. అతని మరణవార్త విన్నాక కోల్పోయాము అని మనస్సు కి అనిపించింది నేను హైదరాబాద్ లో ఉండేవాడిని అతనితో ఇంకా మాట్లాడి అతని వేగాన్ని తగ్గించి లోక సహజ లో అడుగిడుంచులేకపోయానేమో అని వెలితి. ముక్కామల చక్రధర్ సోదాహరణంగా వరుసక్రమంలో చక్కగా వివరించావు.

  • స్నేహితుడైన‌ అదృష్టానికి తన సేవలో మమ్మల్ని కూడా డాక్ట‌ర్ రామ‌న్ భాగస్వాములను చేశార‌ని రాశాను. నిజంగా మీరు అదృష్ట‌వంతులు సర్‌. ఒక ఆశ‌యం కోసం ప‌రిత‌పించే వ్య‌క్తి సాన్నిహిత్యం అదృష్ట‌వంతుల‌కే ద‌క్కుతుంది.

  • Only about sentiment issues.
    There are some gaps in linking.
    What to Infer not getting clarity.
    After reading I had these points.
    May be wrong.
    Please take this 8n positive sense

  • I am prabhavathi pinni of Dr.Raman for us Rambabu,we all went twenty years back I do not know how to thank you. we feel that he is born again in our familyGod bless you Babu

  • Dr.Raman is My Dearest Annayya. He is Real True Doctor ( Vaidhyudu Devudu)…He is Real True Annayya to Me. His Services to the Needy Poor People were simply unexplainable and no words for his services,humanity, love, affection and everything….

    His Goodness,Kindness ,his excellence and his presence is vibrating and transferring through Our Beloved Gayathi Tiruvuri, MBBD.M.D.

    Really…. Really…Really We Missed Him….but he is Always in our Memories and Hearts.

    Some years ago Gayathri Tiruvuri was Daughter of Dr.Raman Tiruvuri…Now The Great Dr.Raman (My Loved Annayya) is Father of Dr.Gayathri Tiruvuri….

    We All HeartilyWishing to Our Dr.Gayathri Tiruvuri, MBBS.,M.D.
    All the Very Best.

    May Swamy (Bhagawan Sri Shiridi Sathya SaiBaba) Bless All of Us with Great Health and Wealth….

    Sairam..& Regards,
    Rambabu Tiruvuri
    Babayya of Dr.Gayathri, MBBS.,M.D.

  • నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు భీమనపల్లి లైబ్రరీలో 10 వ తరగతి చదువుతున్న రామన్ కు జరిగిన అభినందనసభ నాకు ఇప్పటికి కళ్ళముందు కనిపిస్తుంది. తాను వ్రాసిన కవితా సంపుటిని గ్రంథాలయ పాఠకులందరిముందు చదివి వినిపించి పాఠకులకు గొప్ప అనుభూతి కలిగించిన బాలమేధావి మన రామన్. డా. రామన్ గారి అమ్మాయి డా. గాయత్రికు M.D. సీటు వచ్చిన సందర్భముగా నా అభినందనలు

  • “వాళ్లు మనుషులమ్మా. నాలాగే ఓ తల్లికి పుట్టిన బిడ్డలమ్మా. అమాయకత్వం తప్ప ఎలాంటి మోసాలు తెలియని గిరిజనులమ్మా. వాళ్లకి సరైన తిండి లేదు… వైద్యం లేదు.. నా అని ఆదుకునే వాళ్లే లేరు. ” అని విలపించిన మహామనీషి డా. రామన్ ( డా. తిరువూరి సుబ్బరామయ్య )

    కూచిమంచి అగ్రహారం, అమలాపురం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అటవీ ప్రాంతం డా. రామన్ మానవత్వాన్ని గోదావరి పాయ కౌశిక గానం చేస్తున్నది.

    మందులతో రోగాలకు..సేవతో సమాజానికి చికిత్స చేసిన డా. రామన్ గారి స్పూర్తిదాయక అంతరంగాన్ని ఆవిష్కరించిన ముక్కామల చక్రధర్ గారికి కృతజ్నతలు.

  • Chakradhar garu,

    Raman’s demise was a shock to me and my wife.

    He used to demand we should consider him as part of our family. Still writing a short poems. He was one of the regular visitors to my house. We knew his maternal uncle Prakash who lives in Vizag.

    One more promising poet of the 80’s Vaseera also from Amalapuram and working in Vizag during the same period.

    Another tragic poetess Savitri also was in Vizag. She used to visit us. One of her visits She told my told my wife that I was a dictator.

    Raman, Anand (currently Palasa) and Malleswara Rao (Srikakulam) were classmates and friends. I used to visit them at their hostel or college as left student organiser. He was too emotional boy and uncontrollable thought process. He wanted to submit papers at medical conferences in the early years of medicine. My wife arranged to meet Late Dr. DS Raju garu of Shanthiniketan.

    Legendary poet Shiva Reddy’s ‘Bharamiti’ was released same time of his first year medicine.

    Later his friends completed the course and moved out. We heard he had difficult times at the college. He stopped visiting us slowly.

    Raman, Savitri were in our thoughts.

  • ఈకథనం చదవడానికి నాకు దైర్యం చాలలేదు, ఎందుకంటే రామన్గురించి కనుక. అందులోను అతిని సన్నిహితుడైన బుజ్జి రాసాడు,ఖచ్చితంగాగుండెలోతుల్ని కెలికేస్తుందని తెలుసు. కానీ చదవకుండా ఉండలేను ఎందుకంటే రామన్ గురించి కనుక. రామన్ లాంటి మనసున్న వైద్యుణ్ణి గాయిత్రిలో చుాసుకుందాం. ఎంతో మంచి మిత్రుణ్ణి గుర్తుచేసినందుకు దన్యవాదాలు

  • చక్రధర్ గారు…. మీ కథన కదనం అద్భుతం. పరవళ్ళు తొక్కే గోదావరి నదీ ప్రవాహ ఝరిలా సాగిన కథన శైలి అపూర్వం. స్వీయ అనుభవానికి సృజన జోడించి రచనామృతాన్ని ధారపోసిన తీరు అనన్య సామాన్యం. సామాజిక స్పృహతో, భావోద్వేగ పరంపరతో అక్షరాలకు కళ్ళు అతుక్కు పోయేలా చేసిన రచనా సంవిధానం అద్వితీయం….
    అన్నిటికీ మించి కలం సేద్యంతో సంచలనం సృష్టిస్తూ , అభ్యుదయ గళాన్ని బలంగా వినిపిస్తూ, రచనార్తుల ఆకలి తీరుస్తున్న మీరు నాకు సన్నిహితులు కావడం నా అదృష్టం..

  • ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం నా అదృష్టం . కారణ జన్ములు తమ కర్తవ్యం తీరగానే వేరే మహత్కార్యం కోసం దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతారేమో . ఆయన కి కూతురిగా పుట్టిన డాక్టర్ గాయత్రి ధన్యురాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు