ఒకరోజు ఆఫీస్ కాఫెటేరియాలో పక్కన టేబుల్ మీద జరుగుతున్న సంభాషణ చెవినపడింది. అది ఒక మంచి కథా వస్తువు అని వెంటనే అనిపించింది. దాదాపు కథ కూడా చూచాయగా మనసులో మెదిలింది. ఆ సంభాషణ సారాంశం Stress induced erectile dysfunction. ఉద్యోగంలో performance pressure కారణంగా రాత్రి పడక మీద perform చెయ్యలేకపోతున్నామని వాళ్లు మాట్లాడుకున్నారు. ఆ సంభాషణలో నుంచి పుట్టిన కథ పేరు డబుల్నాట్. ఆ కథ గురించి, ఆ కథ రాయడానికి నేను ఎదుర్కున్న సవాళ్ల గురించి ఈ నాలుగు మాటలు.
పైన చెప్పిన సంఘటన జరిగింది 2017 చివర్లో. ఆ చర్చలో ఉన్న ఇద్దరు ఉద్యోగులూ అదేదో జోక్ లా మాట్లాడుకున్నా అందులో విషయం చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా గుర్తించాల్సిన ఒక జీవన మార్పు. చర్చించాల్సిన అంశం. బహుశా అందుకే విన్న వెంటనే కథగా రాయలని అనిపించింది. కానీ దాన్ని కథగా ఎలా రాయటం? అశ్లీలం అనిపించకుండా, పడకింటి విషయాలు ఎలా చెప్పడం? ఈ ప్రశ్న కారణంగా కథ రాసే సాహసం వెంటనే చెయ్యలేదు. 2018లో ఒక కథా సంకలనం కోసం ఈ కథ రాద్దామని మొదలుపెట్టాను కానీ ఆ సంకలనం సంపాదకులు నన్ను కథ అడగపోవటంతో ఆ కథ పూర్తి కాకుండా ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ కొత్త కథ 2019 అనే సంకలనం కోసం కథ అడిగేంతవరకు ఈ కథ మెదడులో ఒక మూల నిక్షిప్తం అయిపోయింది. ఆలోచన నడుస్తూనే ఉంది.
కథలో ముఖ్యమైన పాత్ర టై. కార్పొరేట్ ఉద్యోగానికి, జీతానికి, హోదాకి ప్రతీకగా టై ఎప్పుడైతే స్ఫురించిందో అక్కడే కథ మెదడులో స్పష్టమైంది. అతను టై విప్పడు. ఆఫీసులో ఉన్నా, స్నానం చేస్తున్నా ఆఖరికి పడకగదిలో భార్యతో రమిస్తున్నా టై అలాగే ఉంటుంది అని రాస్తూ చెప్పాల్సిన విషయాన్ని ప్రతీకాత్మకంగా చెప్పగలిగాను.
ఇంతకుముందు నేను రాసిన “స్వప్నశేషం”, “మబ్బుతునక” లాంటి కథల్లో భార్యాభర్తలలో ఒకరు మెటీరియలిస్టిక్ గా ఉంటే మరొక భావకులుగా ఉండటం, వాళ్లిద్దరి మధ్య స్పర్ధ గురించి, రాపిడి గురించి రాశాను. దాదాపుగా ఇద్దరిలో ఒకరి ఆలోచన సరికాదు అని చెప్పే టోన్ ఉంటుందా కథల్లో. ఈసారి అలా రాయకూడదనుకున్నాను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో (consumerist world) కొంత మెటీరియలిస్టిక్ గా ఉండటం, డబ్బు సంపాదనతోపాటు ఆ డబ్బుని అనుభవించే లేదా డబ్బు ఉందని ప్రదర్శించే వస్తువులు కావాలనుకోవటం అత్యంత సహజమైన విషయమే తప్ప దాన్ని తప్పు అని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదనిపించింది. అందువల్ల కథలో ఉండే రెండు ముఖ్య పాత్రలు (భార్యా భర్తలు) ఈ రోజు ఒక కార్పొరేట్ సంస్థలో పెద్ద జీతంతో పని చేస్తున్న ఉద్యోగుల్లా ఉండేలా రాసుకున్నాను. వాళ్లిద్దరికీ దూరంగా ఉండేలా నేను ఒక సైకలాజికల్ కౌన్సిలర్ స్థానంలో కూర్చోని విన్నది కన్నది అన్నట్లు కథ రాశాను.
ఇంతవరకు బాగానే నడిచింది. కాని నేను రాసిన కథలో ఆ భార్యా భర్తలకి ఉన్న సమస్య ఏమిటో పాఠకుడికి అర్థమవడానికి మూడు పేజీలు పడుతోంది. అందువల్ల కథ మొదట్లో నాలుగైదు వాక్యాలు రాసి, సూటిగా సమస్య ఏమిటో చెప్పేయాలని ఆలోచన మొదలుపెట్టాను. భార్యాభర్తల మధ్య శృంగారం జరగటంలేదన్నది సమస్య. అది సూటిగా ఎలా చెప్పడం? ఒక రోజు ఏదో ఫ్లయిట్లో, సగం నిద్ర సగం మెలకువలో తట్టిన వాక్యాలు ఆ సమస్యని పరిష్కరించాయి. వెంటనే మొబైల్లోనే టైప్ చేసుకున్న ఆ నాలుగు వాక్యాలు ఇప్పటికీ ఫోన్ లో అలాగే ఉన్నాయి. ఇవీ ఆ వాక్యాలు –
ఆ రాత్రి, ఉఛ్చాశ్వాస నిశ్వాసల సంగీతంతో శరీరాలను దగ్ధం చేయాల్సిన రాత్రి.
మహాద్భుత ప్రాచీనాహ్లాదమేదో నదిగా, ఝరిగా, ప్రవాహంగా మారి, ఉత్తుంగ తరంగమై పైకెగసి, దుమికి, జలదావానలంగా మారి నేలను తాకాల్సిన కాలం.
ఆమెలో ప్రాకృత క్రీడాసక్తి, కరిగిపోవాలన్న కోరికగా కలిగి, నిప్పుగా రగిలి, అగ్నిగా మారి దహించమని ఆహ్వానించే వేళ.
అనాఛ్ఛాదితగా అహ్వానాన్ని శరీరభాషలో ప్రకటించే క్షణం.
అతను ప్రవహించడు. అతను రగలడు. అతను ఆమెతోపాటు దగ్ధమవడు.
విఫలయత్నాల అసహనం నిట్టూర్పుగా మారి రెండు శవదహనాలు చేసినంత విషాదంతో ముగుస్తుంది. వ్యర్థమైన వెన్నెలని తోసేస్తూ చీకటి, రాత్రి రూపాన్ని అందుకుంటుంది.
***
నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథల్లో ఇది ఒకటి. కానీ ఈ కథ పుట్టిన విధానం, రూపుదిద్దుకున్న వైనం కథ కన్న ఎక్కువ ఇష్టం నాకు. కొత్తకథ 2019 పుస్తకం విడుదలైన తరువాత నాకు చాలా పేరు తెచ్చిన కథ ఇది. ఆవిష్కరణ రోజు వక్తలందరూ ఈ కథని ప్రస్తావించారు. రచయిత, విమర్శకుడు, పత్రికా సంపాదకుదు ఎన్. వేణుగోపాల్ గారు ఈ కథని corporatized lifestyle, consumerism అంశాల మీద వచ్చిన ఉత్తమ కథ అని కితాబు ఇవ్వడం పదే పదే నన్ను నేను ఉత్సాహపరుచుకోడానికి తల్చుకునే జ్ఞాపకం. ఈ కథ ఆ సంవత్సరం కథ 2019కి కూడా ఎంపికై పాఠకుల అభినందనలు అందుకుంది.
(ఈ కథ ఆడియో రూపంలో youtubeలో ఉంది. వీరు నా అనుమతి తీసుకున్న జ్ఞాపకం లేదు. అయినా అభ్యంతరమూ లేదు. ఇదీ లింక్: https://www.youtube.com/watch?v=0ehtHaKJWZk)
కథ చదవాలనుకునేవారి కోసం –
డబుల్నాట్
ఆ రాత్రి, ఉఛ్చాశ్వాస నిశ్వాసల సంగీతంతో శరీరాలను దగ్ధం చేయాల్సిన రాత్రి.
మహాద్భుత ప్రాచీనాహ్లాదమేదో నదిగా, ఝరిగా, ప్రవాహంగా మారి, ఉత్తుంగ తరంగమై పైకెగసి, దుమికి, జలదావానలంగా మారి నేలను తాకాల్సిన కాలం.
ఆమెలో ప్రాకృత క్రీడాసక్తి, కరిగిపోవాలన్న కోరికగా కలిగి, నిప్పుగా రగిలి, అగ్నిగా మారి దహించమని ఆహ్వానించే వేళ.
అనాఛ్ఛాదితగా అహ్వానాన్ని శరీరభాషలో ప్రకటించే క్షణం.
అతను ప్రవహించడు. అతను రగలడు. అతను ఆమెతోపాటు దగ్ధమవడు.
విఫలయత్నాల అసహనం నిట్టూర్పుగా మారి రెండు శవదహనాలు చేసినంత విషాదంతో ముగుస్తుంది. వ్యర్థమైన వెన్నెలని తోసేస్తూ చీకటి, రాత్రి రూపాన్ని అందుకుంటుంది.
1.1
అంతకు ముందు ఎప్పుడో ఒకసారి –
ఓ అర్థ రాత్రి ఇద్దరూ నిద్రలో వున్నప్పుడు శరీరాలు మాట్లాడుకున్నాయి. అనుకోకుండా ఒక యుద్ధం మొదలైంది. మధురంగా అనుభవాన్ని ఆస్వాదించేందుకు మూసుకున్న కళ్ళకు విజయపతాక రెపరెపలు తెలుస్తున్నాయి.
అంతలోనే ఏదో తెలియని అపశృతి. చెయ్యి చాస్తే అందేంత దూరంలో వున్న మరో లోకపు ఆనందం జర్రున జారి అగాధంలో పడిపోయినట్లు అనిపించింది. ఆమె కళ్ళు తెరిచింది.
అతను వున్నాడా? లేనట్టు వున్నాడు.
లేడా? వున్నట్టు లేడు.
గది మూల ఒంటరిగా వున్నాడు. ముఖం మీద ముడిపడ్డ భృకుటి. కింద మెడ. ఆ మెడలో ఆ ఎర్రటి పాము.
నల్ల మచ్చల ఎర్ర టై.
అది ఎప్పుడూ అతని మెడలోనే వుంటుంది. ఎప్పుడూ. మిగిలిన బట్టలు ఒంటి మీద లేని అలాంటి సమయంలో కూడా ఆ టై అలాగే వుంటుంది అని అప్పుడే మొదటిసారి అర్థం అయ్యిందామెకి.
***
“నాకు అర్థం అవడనికి కొంతకాలం పట్టింది. ఒకటి రెండుసార్లు అదంతా మామూలే అనుకున్నాను. ఐ మీన్, ఏవో కారణాలు వుంటాయి కదా. వద్దు అనేవాడు. ఇప్పుడు కాదులే అనేవాడు. అర్థం అయ్యేది కాదు. కానీ ఒకోసారి మొదలుపెట్టి ఫెయిల్ అయ్యేవాడు. అప్పుడు కష్టం అనిపించడం మొదలైంది.”
ఇబ్బంది పడుతోంది. కానీ చెప్పక తప్పదు.
“సాకేత్‌కి కూడా ఇబ్బందిగానే వుండేది. అంటే మీకు అర్థం అయ్యిందనుకుంటాను. అవమానం అని కాదు కానీ, చెయ్యలేకపోతున్నాను అన్న బాధ వుంటుంది కదా. కారణం ఏమిటో అనే అనుమానం వుంటుంది కదా. బహుశ అదే కోపంగా బయటికి వచ్చేదేమో. నాకు అర్థం అయ్యేది కాదు. నేను ఏం చెయ్యాగలను? నా తప్పేమైనా వుందా అని చాలా ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. బహుశా అవమానంగా కూడా ఫీల్ అవుతున్నాడేమో”
కొంత సేపు ఏమీ మాట్లాడలేదు.
“మొదట్నుంచి అలా లేదు. ఐ మీన్… మొదట్లో అంతా బాగానే వుండేది. అన్ని రాత్రులు కాకపోయినా… లేదు లేదు… దాదాపు అన్ని రాత్రులు… అంటే అతను ఎప్పుడూ ఏక్టివ్‌గానే వుండేవాడు. ఒకసారి ఆకలితో వున్న పులిలా, ఒకసారి కుంచె పట్టిన ఆర్టిస్ట్‌లా… తల్చుకుంటుంటే నవ్వు వస్తోంది. చెప్పడానికి సిగ్గేస్తోంది. కానీ ఇప్పటి పరిస్థితితో పోల్చుకుంటుంటే బాధకూడా కలుగుతోంది.”
నిట్టూర్పు. తల ఎత్తలేదు.
“నా కోరిక తీరట్లేదు అని కాదు. అది కూడా వుంది. కాదనను. ఎలా చెప్పాలి మీకు? మా వయసెంతని? అతనికి ముఫ్ఫై ఒకటి. నాకు ఇరవై ఎనిమిది. ఇంకా పిల్లలు ప్లాన్ చెయ్యలేదు మేము. ఇప్పుడో అప్పుడో అనుకుంటున్న టైంలో ఇలా… ఎందుకలా అయిపోయాడు?”
1.2
అతను అలాగే కూర్చున్నాడు. చాలాసేపు. మాట్లాడటానికి మొహమాటమో, భయమో, అవమానమో.
“నేను బాగానే వున్నాను. ఎందుకు ఇదంతా? అనవసరం ఇదంతా. నేను చెప్తున్నాను కదా. ఐ యామ్ ఫైన్.”
డినైయల్. టైం తీసుకుంటున్నాడు.
“ఏంటి అది వుంటేనే అన్నీ వున్నట్లా? మా ఇద్దరి మధ్య అది తప్ప ఇంకేం లేదా? దిస్ ఈజ్ రిడికులస్ మ్యాన్. సంతోషంగా వున్నాం కదా? ఇంకేంటి?”
మళ్లీ ఆలోచనలో పడిపోయాడు.
“ఓకే. ఒప్పుకుంటున్నా. బట్ కనీసం నెల క్రితం దాకా… అంతా నార్మల్ గానే… అప్పుడప్పుడు కుదిరేదికాదు. మీకు తెలుసు కదా. ఒకోసారి కావాలని అనిపించదు. కారణం ఏదైనా… కానీ ఒకసారి మొదలుపెడితే… యూ అండర్‌స్టాండ్ రైట్? ఫెల్యూర్ ఎప్పుడూ లేదు. ఈ మధ్యే… ఐ థింక్ ఏదో సైకలాజికల్ అనుకుంటా… ఫిజికల్లీ ఐ యాం ఫైన్… బిలీవ్ మీ… మెడికల్ ప్రాబ్లం కాదనుకుంటాను.”
చేతికి వున్న ఉంగరాన్ని తిప్పాడు. చాలాసేపు.
“యమునతో ఏ ప్రాబ్లం లేదు. షీ ఈజ్ గుడ్ లుకింగ్… ఐ మీన్ షీ ఈజ్ ఏక్టివ్… తనతో ప్రాబ్లం లేదు. నాకు ఇంకేవరితోనూ… ఛ ఛ అలాంటిదేమీ లేదు”
ఉంగరం తిరుగుతూనే వుంది అతని వేలి చుట్టూ.
“నిజం చెప్పేస్తున్నాను. నాకు కూడా ఇష్టమే. కావాలని అనిపిస్తుంది. కానీ నా వల్ల కావటం లేదు. ఎంత ట్రై చేసినా…”
అతని కళ్లలో నుంచి నీళ్లు.
“గూగుల్ చేశాను నా ప్రాబ్లం. అప్పుడే తెలిసింది ఇలాంటి సమస్య ఒకటి వుందని.”
2.1
“అతన్ని పూర్తిగా చూసి చాలా కాలం అయ్యింది. అతని స్వచ్చంగా చూడాలని కళ్లు తెరుస్తానా? ఎప్పుడూ అలా వుండడతను. ఆ టై అతని మెడలో ఎప్పుడూ వుంటుంది. నిజం. నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదా? ఇది నిజంగా నిజం. అతను నా మీద వున్నప్పుడు కూడా ఆ టై నా ముఖమీద స్పృహ అనే అక్షరాలను రాస్తుంటుంది.
“ఆ టై గురించి చెప్పాలి మీకు. పెళ్లి చూపులకి వచ్చినప్పుడే చూశాను. ఇదే కాదు కానీ ఇలాంటిదే, నల్ల చారలున్న పసుపుపచ్చ టై కట్టుకొచ్చాడు. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఫోటోలు చూసుకున్నాం కానీ అదే మొదటిసారి నేరుగా చూడటం. మా వాళ్లు అందరూ ఆ టై గురించే మాట్లాడుకున్నారు. నేను ఎంతో అదృష్టవంతురాలినని చెప్పారు. ఇప్పుడు తెలుస్తోంది నా అదృష్టమేమిటో. పెళ్ళప్పుడు కూడా టై కట్టాడు. ఎదురుకోల అని చేస్తారు మా వైపు. ఎదురెదురుగా నిలబెట్టి పెళ్లికొడుకుని, పెళ్లికూతుర్ని… ఓహ్ మీకు తెలుసా ఎదురుకోల గురించి? అయితే ఏమైందో తెలుసా? ఇద్దరం దగ్గరకు వచ్చిన తరువాత ఒకరి మీద ఒకరం గంధం, సెంట్ చల్లుకోవాలి కదా. అతను చల్లాడు. నేను కూడా చల్లాను. వెంటనే టై మీద చేతులు వేసుకోని దులుపుకున్నాడు. “మరీరా నువ్వు” అన్నారు పక్కనే వున్న మా బావగారు. అదే సాకేత్ వాళ్ల అన్నయ్య”
ఏదో గుర్తొచ్చినట్లు నవ్వుకుంది. చిన్నగా.
“తరువాత తీసేశాడు లెండి. పెళ్లిపీటలమీద. పంచె కట్టుకోని, పైన పై పంచె కప్పుకోని. ఆ పైపంచె అంచుల మధ్యలో నుంచి కనిపించీ కనిపించని ఛాతి… చూడాలనిపిస్తుంది. సిగ్గేస్తుంది. చచ్చాను పీటల మీదే”
బుగ్గలు ఎర్రబడ్డాయి. మాటల్లో ఉత్సాహం పదాలను మింగేసింది.
“అలా అతని ఛాతి మళ్లీ చూడాలని వుంది నాకు. కానీ కనపడదు అలా. ఆ నల్ల మచ్చల ఎర్ర టై… అసహ్యం వేస్తోంది దాన్ని తల్చుకుంటుంటే.”
2.2
టై తో ఆడుకుంటున్నాడు.
ఎర్ర టై. నల్ల మచ్చలున్న ఎర్ర టై.
“ఇలా జరిగిన దగ్గర్నుంచి ఈ టై గురించి మాట్లాడుతోంది యమున. ఈ టై తో వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటంలేదు. దానికీ దీనికి ఏంటి సంబంధం? ఇది ఎప్పటి నుంచో వుంది. పెళ్ళైన కొత్తల్లో లేదా? పెళ్ళిచూపుల్లో కూడా వుంది. ఇన్‌ఫాక్ట్ పెళ్లి ముందు నుంచే నాకు టై వుంది. పెళ్లైనప్పుడు వాళ్ల చుట్టాలంతా ఈ టై గురించి మాట్లాడుకున్నారా లేదా అడగండి. ఈ టై అంటే తనకి ఇష్టం లేదా కనుక్కోండి. పెళ్లైన కొత్తల్లో ఈ టై తోనే ఆడుకునేది. టైతో మాట్లాడేది. నా టై పట్టుకోనే కదా సినిమాహాళ్లు, మాల్స్‌లో షాపింగ్, జ్యువలరీ, కార్, ఇళ్లు కొనుక్కుంది. ఈ టై లేకపోతే కొనుక్కునేదా? ఊరికే టైని అనడం కాకపోతే నాకున్న సమస్యకి ఈ టైకి సంబంధం ఏమిటి చెప్పండి?”
ఇంకా ఏవో ఆధారాలు జ్ఞాపకాలలో వెతుకున్నాడు.
“ఈ టై వల్ల నాకు వచ్చే హోదాని కూడా యమున అనుభవించింది. హోటల్లో, ఫ్లైట్లో వాళ్లంతా ఈ టైని చూసి గౌరవం ఇస్తుంటే ఎంజాయ్ చేసేది. కాదనమనండి చూస్తాను. మరి అలాంటప్పుడు ఈ టై సమస్య ఎలా అవుతుందో చెప్పమనండి”
3.1
“ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి. మార్నింగ్ టైమ్. నేను పూజ చేసుకుంటుంటాను. ప్రజర్ కుక్కర్ తన మీద వున్న బరువుని పైకెగరేసి ప్రజర్ ని బయటి వదులుతూ వుంటుంది.
“సాకేత్, స్టౌ ఆఫ్ చేస్తావా?” అని అడుగుతాను.
పలకడతను
కుక్కర్ నిరసనగా మళ్లీ అరుస్తుంది.
హాల్ మధ్యలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది మందితో కూర్చోని వాళ్ళతో చెర్చిస్తూ వుంటాడు సాకేత్. నాకేం కొత్త కాదు. వాళ్ళంతా అంతే. వున్నట్లుండి వచ్చిపడతారు. అందరూ అలాగే వుంటారు. మెడలో టై తో. సాకేత్ కూడా అంతే. కింద షార్ట్స్ పైన టీ షర్ట్ తో. మెడలో టై.
ఎనిమిది దిక్కులలో ఒకోరిదో డ్రస్. బనీయన్ లుంగీ. మెడలో టై.
ఇంకొకడు నోట్లో బ్రష్ పెట్టుకోని మాట్లాడుతుంటాడు. ఇంకొకడు లేచి అటూ ఇటూ నడుస్తుంటాడు. టై సవరించుకుంటుంటాడు.
కట్టుకున్న టై ఎవరికి ఉరిగా బిగుసుకుంటుందో అన్న భయం అందరి కళ్లలో. సాకేత్ కళ్లలో కూడా.
వాళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లి సాకేత్ ఎదురుగా కాఫీ మగ్ పెట్టేసి వస్తాను.
మార్నింగ్ మొదటి కాఫీ అంటే ఒక అనుభవం నాకు. చిరుచిరు చలిగాలి, వేడి వేడి కాఫీ పక్కపక్కనే ఇద్దరం. ఎన్ని రోజులైందో అలా నేను సాకేత్ తో కూర్చోని కాఫీ తాగి. నేను కాఫీ కలిపేలోపలే ఆ ఎనిమిది మంది వచ్చేస్తారు. ఒకరు అస్సామీ టీ తాగుతుంటే ఇంకొకళ్లు పొఖాల్ బాత్ తింటుంటారు. పాలల్లో జిలేబీ పొద్దున్నే తింటుంటాడు ఇంకోకాయాన. రోజూ ఇదే గోల. వాళ్ల మధ్యలో నుంచి జాగా చేసుకోని వెళ్లి కాఫీ మగ్ అక్కడ పెట్టి వస్తే, మాటల మధ్యలో గుర్తు వచ్చినప్పుడు తాగుతాడు సాకేత్. కాఫీ తాగిన గుర్తు కూడా మిగలదు”
కూర్చున్న కుర్చీ చివర్ల మీద వేళ్లతో తన బాధలేవో రాసిందామె.
“ఒక్క కాఫీ తాగేటప్పుడే కాదు. టిఫిన్ చేసేటప్పుడు వాళ్ల బాస్ వచ్చి పక్కనే కూర్చుంటాడు. సినిమాకి వెళ్తే ఎచ్.ఆర్. హెడ్ వచ్చి సాకేత్ ఒళ్లో కూర్చుంటాడు. వాణ్ణి సినిమా చూడనివ్వడు. మధ్య మధ్యలో నాకు కూడా అడ్డం వస్తాడు. నేను కోపంగా అరిస్తే ఆ వచ్చినాయన సాకేత్ టై పట్టుకోని బయటికి తీసుకెళ్తాడు.
ఇవన్నీ ఫర్లేదు. ఈ మధ్య బెడ్ రూమ్ లోకి కూడా వస్తున్నారు. అందరూ ఆ టై పట్టుకోనే వస్తారు. వాళ్లు ఆ టై ని వదలరు. సాకేత్ కూడా వదలడు”
చాలాసేపు ఏడ్చింది.
3.2
“ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ టైకి నా సమస్యకి ఏంటి సార్ సంబంధం. వూరికే డబ్బులు దొబ్బడానికి పిచ్చి పిచ్చివన్నీ కనెక్ట్ చెయ్యకండి. మీకంటూ ఒక రెస్పెక్ట్ వుంది”
కోపంగా వున్నాడు. బహుశా ఇదే కోపాన్ని ఇంట్లో కూడా చూపిస్తుంటాడు. కనుక్కోవాలి.
“సారీ… ఐ థింక్ మీరు ఏదైనా మెడిసిన్ ఇస్తే మంచిదనుకుంటాను. సమ్ టాబ్‌లెట్. మళ్లీ అంతా మామూలు అయిపోతుంది. ఇదే లాస్ట్ సిటింగ్ అవ్వాలి. ఐ డోన్ట్ వాంట్ టు కమ్ ఫోర్త్ టైమ్”
తీక్షణంగా చూశాడు. అలాగే చూస్తూ చాలాసేపు వుండిపోయాడు.
“కమాన్ డాక్టర్. మీరు నమ్ముతున్నారా? ఈ టైకి నా డిస్‌ఫంక్షన్ కీ సంబంధం వుందని? ఆర్ యు సీరియస్? అలా అయితే చెప్పండి. ఈ టై ఇప్పుడే తీసేస్తాను.”
టై తీసేయడానికి చేతులు మెడ మీద వేసుకున్నాడు. తీయగలడా? లేకపోతే అందరి లాగే…??
4.1
“మీరు చెప్పినట్లే టై తీయించాలని ట్రై చేశాము. నిన్న ఉదయం కింద కూర్చోని ముందుకు వంగి పేపర్ చదువుతున్నప్పుడు చూసాను. మాటి మాటికీ టై పేపర్ కి అడ్డం పడుతోంది. చిరాగ్గా దాన్ని పక్కకి నెడుతూ చదువుతున్నాడు. “తీసేయచ్చు కదా” అన్నాను. అతను తలాడించి ఊరుకున్నాడు
టవల్ చుట్టుకోని బాత్రూమ్ లో దూరేటప్పుడు చూశాను – మెడలో టై అలాగే వుంది.
“ఆ టై తీసేసి వెళ్లచ్చు కదా” అన్నాను కానీ ఆ మాటలు కూడా గాల్లో కలిసిపోయాయి.
స్నానం చేసి బయటికి వచ్చిన తరువాత కూడా అలాగే వుందా టై. అయినా అది తడవలేదు. టైతోనే రెడీ అయ్యాడు. టైతోనే టిఫిన్ చేశాడు. టై తోనే బై చెప్పి వెళ్లిపోతుంటే అప్పుడు మళ్లీ అడిగాను –
“ఎప్పుడూ అలా టై మెళ్లో వేసుకోని వుంటే ఎలా? ఎప్పుడన్నా ఒకసారి తియ్యాలి కదా?”
ఈ రోజు ట్రై చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
చెప్తున్నప్పుడు అతని చూపులు చాలాసేపు నేలని గుచ్చుతూ వుండిపోయాయి.
4.2
“చాలాసార్లు టై తీశాను. అసలు ఇతకు ముందు వున్న పచ్చ టై అయితే రెగులర్ గా తీసేవాడిని. ఎస్పెషల్లీ వీకెండ్స్ టై వుండేది కాదు మెడలో. ఆ టై తీసేసి, ఈ నల్ల మచ్చల ఎర్రటై కట్టుకోడానికి కారణం యమునే! మార్చమని చెప్పింది కూడా యమునే. ఇప్పుడదంతా మర్చిపోయి మాట్లాడుతోంది”
కోపం తగ్గింది కానీ అతని చేతులు మాత్రం టై తీసే ప్రయత్నం చెయ్యడం లేదు.
“కాలేజీలో… ఏదో సెమినార్ కోసమో, కోర్స్ అసైన్మెంట్ కోసమే మొదటిసారి వేసుకున్నా. మళ్ళీ తీసేశా. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు మళ్లీ వేసుకున్నా. ఆ తరువాత రోజూ వేశాను. రోజూ తీశాను కూడా. కానీ క్రమంగా అది నా శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు తీయాలంటే ఏదో ఇబ్బందిగా వుంది”
“బలవంతంగా తీసేయాలని ఒకసారి ట్రై చేశా. యమున బలవంతం మీదే. కానీ తీయాలన్న ప్రయత్నం మొదటిసారే దెబ్బకొట్టింది. వదులు చేసే కొద్దీ మరింత బిగుసుకోవడం మొదలుపెట్టింది. ఊపిరాడని పరిస్థితి వచ్చింది. భయం వేసి వదిలేశాను.”
“నిన్న మళ్లీ ట్రై చేశాం. బాగా రాత్రి. నేనేదో నిద్రలో పని చేసుకుంటున్నా. లేపింది. టై తగలబెడదామా అంది. సరే అంటే సరే అనుకున్నాము. ఒకవేళ మంట నన్ను అంటుకుంటే? మెడ చుట్టూ కాలిపోతే? అని భయం వేసింది. అయినా ధైర్యం చేశాము. యమున అగ్గిపెట్టె తెచ్చి అంటించింది”
5.1
“టై అంటుకోగానే నా మెడలో నగలు మాయమైయ్యాయి. ఆ మంట పెరుగుతుంటే ఫర్నీచర్, డైనింగ్ టేబులు కదలి గుమ్మం వైపు నడవడం మొదలుపెట్టాయి.”
ఆమె కళ్లలో ఆశ్చర్యం లేదు. నిర్లిప్తత.
“నేనే ఆర్పేశాను. అదృష్టం బాగుండి అది తగలబడలేదు. చిన్న మరక పడింది అంతే!”
“బహుశా మన ఆలోచన కరెక్ట్ కాదేమో. అనవసరంగా ఆ టైని బ్లేమ్ చేస్తున్నాం అనిపిస్తోంది. దానికి ఏం సంబంధం? వుంటే వుంటుంది మెడలో! ఏం? అది అతని శరీరలో భాగం అయిపోయింది. దానితో పెద్ద ఉపయోగం వున్నా లేకపోయినా. ఇది అర్థం చేసుకున్నాను నేను. అందుకని దాన్ని అలాగే వదిలేద్దామని డిసైడ్ అయ్యాను”
5.2
“తీయలేను. తీద్దామని ప్రయత్నించిన ప్రతిసారీ అది ఇంకా బిగుసుకుంటోంది. తగలబెట్టడానికి యమున ఒప్పుకోవటం లేదు.
డాక్టర్ ప్లీజ్… ప్లీజ్ హెల్ప్ మీ… నౌ ఐ అండర్ స్టాండ్. ఇది మెళ్లో వున్నందువల్లే నేను ఫెయిల్ అవుతున్నాను. ఇది మెడలో వున్నంతకాలం నేను అలా ఫెయిల్ అవుతూనే వుంటాను.
కానీ ఏం చెయ్యాలి? టై విప్పడానికి ఇంకేదో పద్ధతి వుండే వుంటుంది. ఏదో! చాలా సులువుగా ఏ మాత్రం నొప్పి తెలియకుండా టై విప్పేవాళ్లను నేను చూశాను. అది నేర్చుకోవాలి. ఎలాగైనా సరే!
ప్లీజ్ హెల్ప్ మీ… ప్లీజ్… ప్లీజ్…
*
Add comment