ఏడేళ్లకు రెండు, మూడు నెలలు
అటూ ఇటుగా ఉంటాయేమో
రెండు కళ్ళు రెండు గోళాల్లా
మెరుస్తున్నాయి
కృష్ణ బిలం లాంటి లోతులతో
ప్రపంచాన్ని శోధిస్తున్నాయి
ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా?
స్థిమితంగా కూర్చుని ఉన్న
నాకు సవాల్ విసిరింది
నిఖార్సయిన నిజం చెప్పడం
ఆటేం కాదు
ధైర్యం ప్రదర్శించటం
అంత తేలికా కాదు
ఏ జవాబు వెనుక ఏ నిజాన్ని
కప్పి పెట్టామో
ఏ నిజం చెప్పాలంటే
ఎంత ధైర్యాన్ని కొలిచి తేవాలో
బాల్యానికి ఏం తెలుస్తుంది
నిజానికి, నిజం చెప్పే ధైర్యానికి
ఈ ప్రపంచం దూరం జరిగి
వందల, వేల మైళ్ళ కాంతి సంవత్సరాలు
అయిపోయింది
నిజం అబద్దమై,
అబద్దమే నిజంగా రూపాంతరమై,
సముద్రంలో కలిసిన తర్వాత
నది నీళ్ళను వేరు చేయగలమా?
ఇహ ఇప్పుడు
ట్రూత్ ఆర్ డేర్ ఆడగలమా?
*
బాగుందండీ
Thank you sir
అబద్దమే నిజంగా రూపాంతరం
Thank you sir