అభివృద్ధి అయినకాడనుంచి..
నేను నేనుగా లేను!
నేనంతా కార్పొరేటు వాడి చేలల్లో..
చిక్కాలు, గొల్చులులేని కాడెద్దునయినాను!
అప్పుడెప్పుడో..
బడిలోని మార్కుల గాటిలో పడి..
బాల్యంలోనే నామెదడును..
గ్లోబలైజేషను పొల్యూషన్‌లో తాకట్టుపెట్టినా!
ఉద్యోగం, కుటుంబంతో..
నన్నునేను మర్చిపోయి..
నాకుటుంబంతో గడపడమే గగనమైంది!
నా గుండెచప్పుల్లను..
నేనెప్పుడు ఇన్యానుగనక.
నా కండ్ల బాధను..
నేనెప్పుడు పట్టించుకున్యాను.
నన్ను నేను పట్టించుకోని అనాథన్నేను.
గుండెకాయల్నీ, తలకాయనీ..
మాంచి కండల్నీ, ఎంకల్నీ..
కార్పొరేటు కటికల్లో కేజీ ఇంతని అమ్ముకున్య..
తిక్కనాకొడుకులం!
వాడికంటే బాగా బతకాల్ల..
వాడికంటే పెద్ద ఇండ్లు కట్టాల..
వానికంటే పెద్దకారు కొనాల..
వానికంటే అధికారం ఎక్కువుండాలని..
నా కల్మషమైన మనసును..
అసూయల ముక్కిరిగుండెలను,,
నరాల్లో తిక్కగ తిరిగే..
ముదురు ఎరుపునెత్తర కల్మషాన్ని..
కడుక్కోడానికి కరోనా ఈ టైమిచ్చినాది!
వేల ఏండ్ల నా కణాభివృద్ధిలో…
పాపం.. బిత్తిరిగా మారుతోన్న నా కణాల్లోని..
డీఎన్ఏ లు ఎదారిపట్నాయి.
మనిషిని శాసించే డిఎన్ఏల్లోని..
మైట్రోకాండ్రియాలు ఇట్లయినా..
శానిటైజ్ అవుతాండాయి.
ఓ కరోనా వైరస్సూ..
నీ పుణ్యాన నన్ను నేను..
ప్రకృతితో శానిటైజ్ చేస్కుంటాన.
నాతోపాటు లచ్చల జీవులకు..
ఈ భూమ్మీద బతికే హక్కుండాదని అర్థమైనాది.
మనిషంటే..
కేవలం మనిషే అని గుర్తుచేసినావు..
ఓ కొవిడు 20..
అందుకే నీకో తరాలకు తరగని థ్యాంక్సు!
*
LPG effect
మన ప్రక్కవానితో పోల్చుకుంటూ, భౌతికమైన అభివృద్ధే లక్ష్యంగా మానవత మరచి, మనకే అర్థంగాని గమ్యాలవైపు పరిగెత్తున్న మనందరినీ ఈ కొవిడ్ 19 ఒక్కసారి అర్ధంలేని పరుగునాపి మనల్ని మనమొకసారి పరికించి చూసుకొనే అవకాశం ఇచ్చింది. మనిషిని ఆర్టిఫిషియల్ నిద్రనుంచి లేచి నిజాన్ని గ్రహించేందుకు అవకాశమిచ్చింది. ఈభావాన్ని ప్రతిఫలించేరకంగా ఉంది ఈకవిత.