బర్మాకేంపు కొండ మీద నుంచి గాలి మెల్లగా కమ్మలపాకలు, మేడ, పెంకిటింట్లో ఉన్న అందరినీ ఓసారలా తాకుతూ కింద శ్మశానం వరకూ వెళుతోంది. . పోర్టులో కాంట్రాక్టు లేబరయిన ఆ మగమనిషి చద్దన్నంలో ఎండిచేప ముక్క నంజుకుని తినేసి సైకిలు తీసుకుని సర్రుమని వేగంగా బర్మాకేంపు డవునుకు దిగిపోతున్నాడు. రిక్షా అప్పలరాజు కేంపు ఎత్తుకు రిక్షాతొక్కలేక నడిపిస్తూ వొస్తున్నాడు.
నూకాలమ్మ గుడి ఇవతల బర్మా నుంచి వచ్చిన ‘దోశలమ్మ’ వుంది. ఆవిడ అల్లుడేమో రామ్మూర్తి పంతులు పేట దగ్గర పట్టాలు దాటుతుంటే రైలు ప్రమాదంలో చనిపోయాడు.. కోడలకు, పిల్లలకు ఆమే ఆధారం. కుటుంబాన్ని పోషించాలంటే ముసిలిది ఇంకేం చేస్తాది. పొద్దునే ఇంటి ముందు కూర్చొని ఇడ్లీల వాయ దించుతూ, అప్పటికప్పుడు పల్చటి తీగ మందంతో ‘అట్లు వేస్తోంది. గిన్నెలు పట్టుకొచ్చిన గుంటలు అట్లు ఓ గిన్నెలోనూ వేరుశెనగ చట్నీ ఒక గిన్నెలోనూ తీసుకుని చిల్లర ఆ మామ్మ కిచ్చేసి ఇంటికి పరుగు పెట్టేస్తున్నారు. ఇంకా ఆ కొండ కింది ఇళ్ళల్లో అక్కడక్కడా ఆడాళ్లు ఇంటి దగ్గర పొద్దునే టిఫిన్లు అమ్ముతున్నారు. సత్తు గిన్నెలో తమిళ పద్ధతిలో చేసిన ఇడియాప్పం, లేదా బర్మా సేమ్యాలలో పంచదార వేసుకుని తినీసామా ఆ పూటకి టిఫినీ అయిపోయినట్టే.
పనిచేసే ఆడాళ్లు, మగాళ్లు గంజి అన్నం, మజ్జిగ అన్నంలో పిండి వడియమో. క్రితం రాత్రి చేపలకూరలో మిగిలిన చేపముక్కో ఎండిచేపో నంజుకుని డ్యూటీలకు, కాలక్షేపాలకు వెళ్లిపోతున్నారు.
కంచరపాలెం మెట్టు దుంపలబడికి, కప్పరాడ కప్పల బడికి, గ్నానాపురం మిషనరీ స్కూలుకి వెళ్లే గుంటలు మాత్రం పొద్దున్నే గిన్నె పట్టుకుని అట్లు, వేడివేడి ఇడ్లీలు, పంచదారతో సేమ్యాలు ఆరగించందే బడికి పోరు.
నాన్ రోటీల కొట్టు బర్మాకేంపు కిందనుంచి ఎత్తుకు నడుస్తోంటే ఎడమవైపు రోడ్డును అనుకుని వుంటుంది. పొద్దున పొద్దున్నే గుంటలు అక్కడకూడా చీమల్లా చేరిపోయేవారు.
‘కొట్టు ‘అంటే కర్రలతో చేసిన ఒక ప్రదేశం అంతే, ఒక గదంత వైశాల్యం ఉన్న స్థలంలో రాత్రి నాన పెట్టిన మైదాను, రోటీ చేసి గుడ్డలతో చేసిన ‘బందిగుడ్డ’ మీద అమర్చి, కుండ గాది పొయ్యి లో అతికించి ,రోటీ ఆ నిప్పుల మీద కాగాక, దాని మీద బుడగల లాగా చిన్నగా ఉబ్బగా, రెండు ఇనుప ఊసలతో లాఘవంగా ఇవతలకు లాగిపడేసి, రోటీలు పేపర్లో కట్టి అందిస్తుంటే గుంటలంతా పట్టుకుపోయ్యేవారు.
కట్ బనీను, లుంగీ వేసుకుని, నల్లగా, కొంచెం పొట్టతో, ఎప్పుడూ నవ్వుతూ, చెమటలు కక్కుతూ పనిచేస్తూ, ఎవ్వరి మీదా ఒక్కసారి కూడా విసుక్కోకుండా అందరికీ ఇంట్లో మనిషిలా శ్రద్ధగా, ఆత్మీయంగా నాన్ రోటీలు చేసి ఇచ్చేవాడాయన. అమ్మడం బాధ్యత వాళ్లావిడ అన్నపూర్ణమ్మ తీసుకునేది.
సరిగ్గా ఎంత కాలాలో అంతే కాలిన ఆ నాన్ రోటీని ‘టీ’ లో ముంచుకొని తినేసేవాళ్లు బర్మాకేంపోళ్లు, నాన్ రోటీలాయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక రిద్దరు థాయిలాండ్ , బర్మా తరహాలో విశాఖకు “కౌసే ‘ అని పిలిచే నూడుల్సు బండి పెట్టారు. జనం ఎగబడి తిన్నారు.
‘వొయిజాగుకు నూడిల్స్ పరిచయం చేసింది బర్మాకేంపోళ్లే ‘ అని గర్వంగా చెబుతాం అంటాడు. డాక్యార్డ్ లో పనిచేసే అక్కయ్య.
* * * *
మొదటి ప్రపంచయుద్ధంలో బర్మా నుంచి కొంతమంది తెలుగు వాళ్లు ఇండియా వచ్చేసారు.1962 అంతర్యుద్ధంలో మరికొంత మంది 1980 తరువాత స్థానికులు, స్థానికేతరుల గొడవలలో మొదటి ఓడలో మరికొంత మంది ఇండియా వచ్చేసారు. అలా వచ్చిన పూర్వకాల గోదావరి జిల్లా కాపాయనే ఈనాన్ రోటీల నిద్రబంగి జ్ఞాన ప్రకాశరావు. అలా వచ్చినాయన్ని బర్మాకేంపు ఆప్యాయంగా ఆదరించింది.
గొంప గంగరాజు, బొగ్గురాజు, గంగబాబు తాత, పోతురాజు, రామ్మోహన్ రావు బామర్ధి అడపా మోహనరావు, బర్మా అర్జునరావు ఇలా నాన్ రో టీలాయనకి అందరూ నేస్తాలే.
జ్ఞాన ప్రకాశరావు రుచికరమైన నాన్ రోటీలు అమ్మి బర్మాకేంపులో ఇళ్లు, స్థలాలు కొన్నాడు. తన బంధువుతో శ్రీహరిపురం బర్మాకోలనీలో కూడా నాన్ రోటీల కొట్టు తెరిపించాడు. ఆయన తరువాత కొడుకు నూకరాజు నాన్ రోటీలు చేసేవాడు.
నమస్కారాలు పెట్టినోళ్లకి ఆస్తులు ఊరికే ఇచ్చేసాక మనవడి తరం వచ్చేటప్పటికి ఆస్తులు వేడి నాన్ రోటీ మీద వేసిన వెన్నలా కరిగిపోయాయి.
* * *
ఒకప్పటి మత్స్యకారులు పల్లె మహానగరమయింది. విశాలంగా ఉండే బర్మాకేంపు ఇళ్ల మీద ఇళ్లు, ఇంటి పక్కన ఇళ్లు కట్టుకుని ఇరుకయిపోయింది.నాన్ రోటీల నిద్రబంగి జ్ఞాన ప్రకాశరావు కాలం చేసాడు. కొడుకు నూకరాజు తండ్రి వారసత్వం అందుకుని రాత్రి మొదలు పెట్టి తెల్లవార్లూ షాపు తెరచి, నైట్ డ్యూటీనుంచి వచ్చేవాళ్లకి, రెండో ఆట సినిమా చూసి ఇళ్లకు వెళ్లేవాళ్లకి, డ్యూటీ పోలీసులకి ఆకలి తీర్చేడు .
కాలం రోలు యంత్రం కింద నలిగి నాన్ రోటీల షాపు మూతపడింది.
ఒకప్పుడు ఊరంతటికీ హీరో అయి, స్థలాలు, స్వంత ఇళ్లు ఉన్ననాన్ రోటీలాయన మనవడీరోజు అద్దె ఇంట్లో ఉంటూ డెయిలీ కేటరింగ్ పనులకి వెళ్ళిపోతున్నాడు.
‘నోవాటెల్ లో మూణ్నెళ్లు చేసేనండి, నేనే హెూటలు మేనేజుమెంటులోనూ ట్రయినింగు అవలేదు. మా నాన్న దగ్గర నేర్చుకున్న విద్యే ఇది. నాన్ రోటీలే ఆ స్టార్ హోటల్లోనూ చేసేవాడిని. కానీ మనకీ హెడ్ కుక్కి మాట పట్టింపు వొచ్చి మానీసేను’
“ఇప్పుడు నేను నాన్ రోటీలు చేద్దామన్నా స్థలమూ లేదు. జనానికి ఇక్కడ తినే తీరికా లేదు, అందుకే కేటరింగ్ పనులకు వెళ్లిపోతున్నా’ అన్నాడు నిద్రబంగి ప్రకాశరావు మనవడు నరేంద్ర.
ఓడల్లో బర్మా నుంచి వచ్చిన నాన్ రోటీలాయన బండి ఓడయింది. మనవడి ఓడ బండి అయింది.
మీరిప్పుడు మా ఊరొస్తే నాన్ రోటీలు తినాలంటే ‘స్టార్ హోటల్’ కే వెళ్లి జేబు గుయ్యమనపించుకోవాలి. అక్కడ కాక ఇంక ఎక్కడన్నా కనిపిస్తే ‘నాన్ రోటీ’ ఇచ్చుకొని కొట్టండి నన్ను!
*
కథ చాలా బాగా సాగింది.అప్పటి రోజుల్లో ఏ టిఫిన్ తినేవారు వివరించడం బాగుంది. తీగ లాంటి అట్లు,సెమ్య .నాన్ రొటీ పరిచయం చేసిన ఆయన గురించి రాయడం బాగుంది.బాగా సంపాదించిన తన మనవడికి ఏమి లేకపోవడం కూడా అతని యొక్క మంచితనం తెలుపుతుంది.
టీ కప్పులో నాన్ రోటీ కధ చాలా ఆసక్తిగా చదివిపజేసింది. కధను ఆసక్తిగా మలిచారు.రచయిత అభినందనీయులు.
కథనం బావుంది. ముగింపు చాలా బావుంది
కథనం బాగుంది. చరిత్రను పదిల పరచి ఉంచుతోంది. అయితే, ఇందులో కథ లేదు! కథా లక్షణాలు ఏమీ నాకు కనబడ లేదు. అంతా వర్ణనే. దీన్ని కథగా కాక, జ్ఞాపకంగా ప్రచురిస్తే బాగుంటుంది.
👍🏻👍🏻👌🏼
కథనం బాగుంది. కాలగమనంలో ఓడలు అవడం, ఓడలు బళ్లు అవడం అన్నది బాగా చెప్పారు.
కథనం బాగుంది. కాలగమనం లో బళ్లు ఓడలు అవడం, ఓడలు బళ్లు అవడం అన్నది బాగా చెప్పారు.
కథ, కథనం చాలా బాగుంది హరిగారు. మీ నుంచి ఇలాంటి మరెన్నో కధలు జాలువారాలని ఆశిస్తూ ……
మీ
శ్రీనివాస్ గోగుల
నాన్ రోటీ టీ బాగుంది హరి గారు.సీ