టాగూర్ వచన కవిత: సాధారణ యువతి

బెంగాలీ నుండి అనువాదం – ముకుంద రామారావు

టాగూరు అనువాదాలు చాలావరకు వచన కవితలే అయినా, ఆశ్చర్యంగా అతని స్వీయ బెంగాలీ కవితలు మాత్రం ఛందోబద్ధమైనవి. వాటిల్లో సిద్ధహస్తుడు అతను. వచన కవిత్వం వైపు అతను మొగ్గడానికి కారణం, గీతాంజలి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందడం, అందులోని వచన కవిత్వం అంగీకరించబడటం. 70 ఏళ్ల ప్రాయంలో టాగూరు ఈ వచనకవిత్వ ప్రయోగం ఆశ్చర్యంగా యువకవులనే ఎక్కువగా ఆకర్షించి, వారిలో ఆసక్తిని రేకెత్తించింది.

‘పునశ్చ’ ముందుమాటలో వచన కవిత్వం లోకి తానొచ్చిన నేపథ్యాన్ని ఇలా చెప్పుకున్నారు టాగూరు – “గీతాంజలి గీతాల్ని ఆంగ్ల గద్యంలోకి అనువదించాను. ఆ అనువాదం కావ్య శ్రేణిలో ఎన్నదగింది అయింది. పునశ్చ – మొట్టమొదటిసారిగా వచన కవిత్వ రూపంలో రాసిన 50 కవితలున్న పుస్తకం 1932లో ప్రచురించబడింది. ఎక్కువగా సామాజిక సమస్యలు జీవన్మరణ విషయాల్ని టాగూరు అందులో స్పృశించారు. టాగూరు వచన కవితల్ని తన చివరి పదేళ్ల జీవిత అధ్యాయంలో, బెంగాలీ సాహిత్యంలో ముఖ్యమైన కవిత్వ మాధ్యమంగా రాబోయే తరాలకు అందించారు. ఆంగ్లంలో తాను రాసిన కవితలు అతి తక్కువ. అందులో “ద చైల్డ్ – శిశువు ‘ ని 1931లో ప్రచురించారు. దాని బెంగాలీ అనువాదం తానే చేసి ‘శిశు తీర్థ ‘ పేరుమీద, ‘పునశ్చ’ సంకలనంలో చేర్చారు. అలా తన ఆంగ్ల కవితకు తానే బెంగాలీ అనువాదం చేసుకున్న కవిత ఇదొక్కటే. ఆ సంకలనంలోదే అన్ని విధాలా భిన్నంగా ఉన్న మరో కవిత “సాధారన్ మేయ్” (సామాన్య యువతి). ఆ కవితనే ఉదాహరణగా తీసుకుందాం టాగూరు వచనకవిత్వం చవి చూడటానికి.

 

సాధారణ యువతి

 

నేను ఇంటిపట్టునుండే ఆడపిల్లను 

నేనెవరో మీకు తెలియదు

మీ చివరి కథల పుస్తకం చదివాను, శరత్ బాబూ

వాడిన పూల మాల”

మీ నాయిక ఎలోకేశి

ముప్పయి అయిదేళ్ల వయసులోనే మరణదశలో కొచ్చి

ఈర్షాద్వేషాలతో ఇరవై అయిదేళ్ల ఆమెతో పోటీ 

అయినా నిజంగా మీరు ఉదారులు

గెలిపించేసారు ఆమెనే

 

నా గురించి చెప్పనా

నేను పడుచుపిల్లను

నా వయస్సు వశీకరణ

ఒకని హృదయాన్ని తాకింది

అది తెలిసి నా హృదయం ఆనందంలో

అత్యంత సాధారణ యువతినని మరచిపోయింది

అంతటా నాలాగ వేలవేల పడుచుపిల్లలు

వారి యవ్వన వశీకరణంతో ఉన్నారు

 

మీకు నా విన్నపం

సాధారణ యువతి కథ రాయండి దయచేసి 

ఆమె దుఃఖిత 

ఆంతరికంగా ఆమెలో ఏదైనా గొప్పతనం దాగి ఉంటే

ఆమె దానిని ఎలా నిరూపించుకోగలదు  

కొందరే దానిని తెలుసుకోగలరు 

వారి కళ్లలో లేప్రాయపు ఇంద్రజాలం   

మనస్సు సత్యాన్ని తెలుసుకోదు 

మేము అమ్మేయబడతాం అబద్ధపు అభయానికి

 

ఇదంతా ఎందుకో నన్ను చెప్పనివ్వండి

అతని పేరు నరేశ్ అనుకుందాం

ఇంతవరకూ నాలా ఎవరూ అతని కళ్లను ఆకర్షించలేదన్నాడు

నమ్మాల్సినంత పెద్దదిగా దానిని

తీసుకునే సాహసం నేను చేయలేకపోయాను 

చేయలేకపోవడానికీ నాకు శక్తి లేదు  

 

ఒకరోజు అతను విదేశం వెళ్లిపోయాడు

అప్పుడప్పుడు నాకు ఉత్తరాలు వచ్చేవి 

నాకు నేనే అనుకున్నాను, రామరామా

అక్కడ అంతమంది ఆడపిల్లలా తోసుకుంటూ

వారంతా అసమాన్యులా – 

అంత తెలివైన వారా, అంత ప్రతిభావంతులా?

ఒక్క నరేశ్ సేన్‌ని వాళ్లంతా కనుక్కోగలిగారా

అతని పరిచయం స్వదేశంలో పది లోపలే ఉండే వానిని

 

క్రితం మెయిల్‌ ఉత్తరంలో అతను రాసాడు   

లిజ్జీతో సముద్రం దగ్గరకు వెళ్లినట్టు

(ఒక బెంగాలీ కవి కవిత నుండి కొన్ని చరణాలు ఉదహరించాడు

అందులో సముద్రం నుండి పైకి లేస్తున్న ఊర్వశి) 

ఆ తరువాత పక్కపక్కనే ఇద్దరూ ఇసుకలో కూర్చుంటే –   

వారిముందు నీలి అలలు ఊగిస

ఆకాశంలో స్పష్టమైన సూర్యకాంతి

చాలా నెమ్మదిగా లిజ్జీ అతనితో అంది

ఈరోజే వచ్చావు, రెండు రోజుల్లో వెళ్లిపోతావు నువు

తెరుచుకున్న నత్తగుల్ల మధ్యన 

నిండిన ఒక కన్నీటి బిందువు

అమూల్యమైనదీ అరుదైనదీనూ

ఎంత విస్మయంగా మాటాడడం

నరేశ్ ఇంకా రాసాడు,

ఆ మాటలు తెచ్చిపెట్టుకున్నవే అయినా ఇబ్బంది ఏమిటని..

అవి అద్భుతం అని

రత్నాలు పొదిగిన స్వర్ణపుష్పాలు వాస్తవమేనా? అయినా వాస్తవం కాదా’

 

మీకు అర్థమవుతే  

అతని ఉత్తరంలో సూచనప్రాయ పోలిక

నా హృదయాన్ని కనిపించని ముళ్లులా గుచ్చుకుంటూ చెప్పింది 

నేను అలాంటి సాధారణ యువతినని 

అమూల్యానికి పూర్తీ ధర చెల్లించే

సంపద నా దగ్గర లేదని

అవునూ లేదు, అదే అయింది

లేదంటే శాశ్వతంగా నేను బాకీపడే ఉంటాను 

 

శరత్ బాబూ! మీ పాదాలమీద పడి వేడుకుంటున్నాను,

ఒక కథ రాయండి శరత్ బాబూ,

ఒక సాధారణ యువతి కథ –

దురదృష్టవంతురాలైన యువతి దూరం నుండి పోటీపడటం

తక్కువలో తక్కువ అరడజను అసమాన స్త్రీలు – 

ఏడుగురు రథ సారథ స్త్రీల దండయాత్రని ఎదుర్కోవటం

నా తలరాత తగలడిందని నాకు అర్థమయింది

నేను ఓడి పోయాను

కానీ మీరు రాయబోయే యువతి కథలో –

ఆమెను జయించనివ్వండి నాకోసం

అది నేను చదివినపుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోవాలి

మీ కలం ధన్యమవాలి

 

ఆమెకి మాలతి అని పేరు పెట్టండి

అది నా పేరు

ఎవరికీ తెలియదు

ఎవరికో దొరికిపోతానన్న భయం లేదు

బెంగాల్‌లో అనేకమంది మాలతిలు ఉన్నారు

వారందరూ సాధారణ యువతులు

వారికి ఫ్రెంచ్ లేదా జర్మనీ రాదు

ఎలా ఏడవడమో వారికి తెలుసు

 

ఆమెను ఎలా గెలిపిస్తారు

మీ ఆలోచనలు ఉన్నతం, మీ కలం శక్తివంతం

బహుశా శకుంతలలా ఆమెను స్వీయ త్యాగంతో,

అత్యంత దుఃఖదాయక దారిలో తీసుకుపోతారు  

దయచేసి నా పట్ల  దయ చూపించండి 

మిమ్మల్ని మీరు నా స్థాయికి తెచ్చుకోండి

రాత్రి అంధకారంలో, నా పక్కమీద నుంచి

దేవుడ్ని అసంభవ వరాలు కోరుకుంటాను

అవేవీ దొరకవు

కానీ మీ నాయిక వాటిని సాధించుకోగలగాలి

లండన్ లోనే ఏడేళ్లు నరేశ్ ని ఉండనివ్వండి

పరిక్షల్లో సంవత్సరాలుగా తప్పుతూపోనివ్వండి 

అతని అనుయాయులు అతనిని తలకెక్కించుకోనివ్వండి  

 

ఈలోగా

కలకత్తా విశ్వవిద్యాలయం నుండి

మాలతి ఎం.ఏ. పాస్ కానివ్వండి

మీ కలం గారడీతో గణితంలో ప్రధమురాలై

 

అక్కడితో ఆగిపోకండి

మీ సాహిత్యశిరోమణి బిరుదుకు కళంకం తెచ్చుకోకండి

నేను దురదృష్టవంతురాలినే కావచ్చు

అయినా మీ ఊహకి అడ్డుకళ్లెం వేసుకోకండి

దేవుడులా మీరు పిసినారి కారు

 

మాలతిని యూరప్ పంపించేయండి

వివేకవంతులు, పండితులు, శక్తివంతులు, కవులు, కళాకారులు, ధనవంతులు –

అందరూ ఆమె చుట్టూతా చేరనివ్వండి.

ఖగోళశాస్త్రజ్ఞుళ్లులా ఆమెను ఆవిష్కరించనివ్వండి

ఆమె విదేశీయురాలు విద్యాంసురాలనే కారణంతో కాకుండా ఆమె స్త్రీ అని

మూర్ఖుల దేశంలోలా కాకుండా, ఆమె సమ్మోహనం తెలుసుకోనివ్వండి

ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్ లాంటి

విద్యా పారీణులు ఉన్న దేశాలలో

 

మాలతి గౌరవార్దం ప్రఖ్యాతులు ముఖ్యులతో

ఒక సదస్సు జరగనివ్వండి

ఎడతెగని అమె ప్రశంసలతో అది సాగుతున్నట్టు ఊహించండి

అలల మధ్య సాఫీగా సాగిపోతున్న మరపడవలా

అవేవీ పెద్దగా పట్టించుకోకుండా ఆమె నడిచిపోతున్నట్టు

 

ఆమె కళ్లు భారతీయ ఆకాశంలోని వర్షించే మేఘాలూ సూర్యకాంతుల సమ్మిశ్రణం అని   

ఆమె కళ్ల విషయం గుసగుసలాడుకుంటారు

(ఇక్కడ నేను ఒప్పుకోవాలి, గర్వంతో కాదు, దేవుడు నాకు నిజంగానే అందమైన కళ్లు ప్రసాదించాడని, యూరప్ లో వాటిని మెచ్చుకునేవాళ్లు తటస్థపడకపోయినా)

నరేశ్ ని ఓ మూలన నిల్చోనివ్వండి

అతని అసామాన్య యువతుల సమూహంతో అక్కడికి వచ్చి

 

ఆ తరువాత? ఆ తరువాత

నాలో శక్తి క్షీణిస్తుంది

నాలోని కల పూర్తవుతుంది

అయ్యో సాధారణ యువతి సృష్టితో

విధాత శక్తి వృథా అయిపోతుంది

*

ముకుంద రామారావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు