టాగూరు మరణించి ఎన్ని సంవత్సరాలైనా అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అతను రాసిన పుస్తకాల కంటే, అతని మీద ప్రపంచ వ్యాప్తంగా వచ్చినవే కాదు, ఇంకా వస్తున్న పుస్తకాల సంఖ్యే అందుకు నిదర్శనం.
టాగూరు తన 50 ఏళ్ల వయస్సులోనే “జీవనస్మృతి” పేరున ఆత్మకథ రాయడం విశేషం. దానికి కారణం బాల్యం నుండే, కుటుంబంలో తన ముందే, ఒకరి తరువాత ఒకరి మరణం. 14 ఏళ్లపుడు తల్లి శారదాదేవి, తరువాత అతనికి అతి దగ్గరై అతనిని ఎంతగానో ప్రభావితం చేసిన వదిన కాదంబరీ దేవి బలవన్మరణం, భార్య మృణాళినీ దేవి, కుమార్తె రేణుక, తండ్రి దేవేంద్రనాథ్ టాగూరు, చిన్న కొడుకు శమీంద్రనాథ్ ఇలా ఒక్కొక్కరూ అతనిని వదిలిపోయినవారే. టాగూరు జీవితంలో ఇలా ఎన్ని బంధువియోగాలు జరిగినా, ఆ విషాదాలు అతని జీవితం పట్ల , విశాల విశ్వం పట్ల ప్రబలమైన ప్రేమని ఎన్నటికీ తగ్గించలేకపొయాయి. అయితే వదిన కాదంబరి మరణం మాత్రం, అతనికి ప్రపంచం చిన్నాభిన్నం అయిపోయినంత పని చేసింది. యువకుడుగా ఉన్నపుడు “మరొణ్ (మరణం)” కవిత రాసినపుడు, అతనికి తలియదు మరణం అతనికి నిరంతర సహవాసి అవుతుందని.
మరణం అనివార్యత మీద టాగూరు అంత విస్తారంగా రాసిన వారు ఎక్కువ లేరు. దుఃఖమూ ఉంది, మరణమూ ఉంది, ఆ రెండూ జీవితానికున్న ప్రధాన అంశాలు అని, అతని రాతల్లో స్పష్టం చేస్తూనే పోయారు. మరణం మానవ జీవితం లోని అందాన్ని, ప్రాకృతిక సౌందర్యాన్ని, ప్రవాహాన్ని, లయని ఎన్నటికీ దొంగలించలేదు అని నమ్మిన వాడు.
టాగూరు చెప్పాలనుకున్నవన్నీ, తన స్వీయ విషయాలతో బాటు, తన అన్ని రాతల్లోనూ పెట్టాడు. అతని చివరి కవితల్లో ముఖ్యమైన ఇతివృత్తం మరణం. అన్ని కట్టుబాట్లనీ తెంపుకొని, ఆత్మ ప్రభువుని చేరేందుకు, మరణం సాయపడుతుందని భావించాడు. జీవితం నది ఆవలి ఒడ్డునున్న నావికుని పిలుపుమేరకు, నదిలో యాత్ర గా జీవితాన్ని ఊహించాడు.
సత్యమూ సౌందర్యానికీ నిజమైన ఆరాధకుడుగా అతనికి ఏదీ అనంద విహీనంగా అనిపించలేదు. మానవుని ఉనికిని బెదిరించే మరణం, అతనికి ఏకోశానా భయాన్ని కలిగించకూడదు అనుకున్నాడు. దాని భయానక రూపాలన్నీ తొలగించి మరణం రూపాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుత జీవితమే సంపూర్ణ జీవిత చిత్రం కాదని, అది బాల్యం, యవ్వనం, ముసలితనం, మరణం అలా మారుతూ వచ్చే ఆవృత్తం అంటాడు. మనిషికి దగ్గరిది, ప్రియమైనది మరణం అని భావించాడు. తల్లి గర్భంలో ఉండగా పిండం తల్లిని తెలుసుకోలేదు, బయటికొచ్చాక తెలుసుకుంటుంది. ప్రపంచంలో దానికి దగ్గరై ప్రియమైనదైన తల్లి లానే, మరణాన్ని తెలుసుకోకుండా, అకారణంగా దానికి భయపడతామని, నిజానికి మరణం మనిషికి హితైషి అంటాడు. అకస్మాత్తుగా భయమెందుకు అని ప్రశ్నిస్తాడు.
మరణం ఇతివృత్తం మీద గీతాంజలిలోనే 15 కవితలున్నాయి. అందులో మరణాన్ని సంతోషకరమైన జీవితోత్సవంలా ప్రారంభంలో స్వీకరిస్తాడు. జీవితం-మరణం దేవుని రెండు రూపాలుగా భావించి “విశాల విశ్వం మీద నర్తిస్తున్న, జంటసోదరులు – జీవితం-మరణం” అంటాడు. తరువాతి కవితల్లో మరణాన్ని “చీకటి గదికి రాజు” అని పిలుస్తాడు. “నీ సేవకుడు మరణం, నా తలుపు దగ్గర ఉన్నాడు” అంటాడు. అతనికి మరణం సేవకుడు, ప్రయాణకారకుడు, సర్వోన్నత అనివార్య శక్తిగా కనిపించి చేతులు జోడించి కన్నీళ్లతో ఆరాదిస్తాడు. కొన్ని కవితలలో తనవద్దకు రమ్మని మరణాన్ని ప్రార్ధిస్తాడు. మరికొన్ని కవితలలో భయపడకుండా మరణాన్ని సగౌరవంగా స్వీకరిస్తానంటాడు. ఒక్కోమారు అవి స్వీయ సమర్పణ అనిపిస్తాయి. “పూవులల్లిన వరమాల వరునికోసం సిద్ధమయింది. వివాహం తరువాత వధువు, రాత్రి చీకట్లో తనింటిని వదిలి తన నాధున్ని చేరుకుంటుంది” అంటాడు. వధువు జీవితం తన ప్రభువు మరణాన్ని కలుసుకోవాలని ఎదురు చూస్తుంది. ఆ యాత్రలో మనిషి ఏకాకి కాడని, అతనితో సర్వశక్తిమంతుడు దేవుడు అదే పడవలో అతనితోబాటే కూడా వస్తాడని, ప్రభువు దగ్గరకు వివాహ దుస్తుల్లోనే వెళతానంటాడు. సర్వోన్నతునిలో ఆత్మ ఏకమయే ఒక మంగళప్రదమైన సంఘటన మరణం అంటాడు.
50ఏళ్ల ప్రాయం నుండీ టాగూరుకు ఆరోగ్య సమస్యలున్నా, వృద్ధాప్యం వరకూ వాటిని ఎలాగో ఒకలా నెట్టుకుంటూ వచ్చాడు. అయితే వృద్ధాప్యం అతని మీద పంజా విసిరాక, చివరి అయిదు సంవత్సరాలలో, రెండు సార్లు ఎక్కువ కాలం అనారోగ్యం పాలయాడు. మొదటిసారి 10 సెప్టెంబర్ 1937 నుండి రెండు రోజులు, రెండవసారి 1940 సెప్టెంబర్ నుండి ఆగస్ట్ 1941 వరకూనూ. స్పృహ కోల్పోవడం, జ్వరం, తలనొప్పి, గుండెలో నొప్పి, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు మొదలయాయి. వెన్వెంటనే అతనికి అన్ని ఆరోగ్య పరిక్షలూ అవసరమయాయి. మూత్రపిండం వస్తిగ్రంధి (ప్రొస్ట్రేట్) సమస్యలు ఉన్నట్టు నిర్ధారణయింది. ఈలోగా తన ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశతో, 1940 సెప్టెంబర్ లో, పదహారేళ్ల ప్రాయం నుండీ గురుదేవునిగా భాబించి అతనికి అతి దగ్గరై, అతనిని కంటికి రెప్పలా చూసుకునే మైత్రేయి ఇంటిలో, వారి ఇంటి పరిసరాల ప్రకృతి ఒడిలో సేదదీరుదామని, కాలింపోంగ్ కి కూడా వెళ్లి వచ్చాడు.
టాగూరు ఆరోగ్యం క్షీణించడం చూడలేక, చివరకు కలకత్తాలో ఉన్న ప్రముఖ శస్త్ర వైద్యులు, 1941 జూలైలో, అతనికి శస్త్రచికిత్స చేయడం ఒకటే మార్గం అని నిర్ణయించారు. అది టాగూరుకు చెప్పి ఒప్పించడం కష్టమే అయింది. ఈ శస్త్రచికిత్స బదులు, కొంత సమయం తీసుకున్నా తాను నమ్మే ఆయుర్వేద వైద్యుని వైద్యం నయమని కొడుకు రతీంద్రనాథ్ కి చెప్పినా, తండ్రి శస్త్రచికిత్సకు భయబడుతున్నాడని అతను కూడా శస్త్రచికిత్స వైపే మొగ్గు చూపించాడు. పర్యవసానంగా జూలై 30న జొరషంకో టాగూరు నివాసంలోనే డాక్టర్ లలిత్‌మోహన్ బెనర్జీ మూత్రాశయ శస్త్రచికిత్స చేసారు. ఆగస్ట్ 7 న ఉదయం ప్రాణవాయువు గొట్టాల్ని తీసేయక తప్పలేదు. చివరికి అదే రోజు 12.10 న టాగూరు చివరి శ్వాస వదిలాడు.
“అందరూ మరణించాల్సిన వాళ్లే. మానవ శరీరం ఎదో ఒక రూపంలో అంతానికి చేరుకోవాల్సిందే. దానికి నేను అతీతుడ్ని కాదు. నన్ను సహజంగా పోనివ్వక, ఎందుకు ఈ శరీరాన్ని చీలికలు చేయడం, దీనిని చెక్కుచెదరకుండా చేరాల్సిన చోటుకి చేరనివ్వండి” అని శస్త్రచికిత్సకు టాగూరు ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. ఈ ప్రాణాంతక రోగాలకి ఆవల, తన జీవితానికి అర్థం ఉందని బలంగా నమ్మాడు. అనారోగ్యం మూలంగా ఒక్కోమారు రాయలేని పరిస్థితులలో ఉన్నప్పుడు, అతను చెప్పి రాయించిన ఉత్తరాలు, కవితలు, రాణీ చందా అన్న లేఖకురాలు నమ్మకంగా ఆ పనులుచేసేది.
మరణానికి దగ్గరవుతున్న వారిలో ఒక అయిదు దశలు కనిపిస్తాయని భావిస్తారు. రవీంద్రుడు నుండి వచ్చిన చివరి అయుదు కవితలలో కూడా ఆ దశలు కనిపించాయంటారు విశ్లేషకులు. అవి ఇవి –
1 – నిరాకరణ – నిరాకరణ ఒక విధంగా తాత్కాలిక రక్షణ. వాస్తవాన్ని అంగీకరించలేని సహజ తిరస్కరణ. మొదట్లో “లేదు, లేదు, అది నిజం కాదు” అని ఎక్కువగా వచ్చిన స్పందనే తొందర్లోనే పాక్షిక అంగీకారంగా మారిపోతూ ఉంటుంది.
రూప్‌నారాయణ్ తీరంలో నేను మేల్కొన్నాను
ఈ ప్రపంచం కల కాదని గ్రహించాను
నా నిజ రూపాన్ని రక్తాక్షరాలలో చూశాను
గాయం తరువాత గాయం, వేదన తరువాత వేదనలో
నన్ను నేను గుర్తించాను
సత్యం చాలా కాఠిన్యమైనదని
అది ఎన్నడూ వంచించదని
దాని కాఠిన్యాన్ని నేను ప్రేమించాను
ఈ జీవితం ఆమరణాంతం దుఃఖపూరిత తపస్సు
సత్యం భయంకర మూల్యానికి
సకల రుణాలూ మరణంలోనే చెల్లించాలి
ఉదయన్, శాంతినికేతన్, 13 మే 1941, 3:15 ఉదయం, మరణానికి 85 రోజుల ముందు బెంగాలీలో రాసిన ఈ 15 చరణాల కవిత ఆత్మసాక్షాత్కారానికి ప్రతీక. టాగూరు తనలోకి తాను చూసుకుంటే, తన స్వీయ రూపమే సత్య సాక్షాత్కారంతో కనిపించింది.
2 – కోపం: మొదటి దశ వాస్తవాన్ని ఎంత మాత్రమూ అంగీకరించలేక, కోపం, చిరాకు, అసూయ, అసహ్యం చూపిస్తుంటారు. “నాకే ఎందుకు?” అని తిరగబడతారు. టాగూరులో అవి మరోవిధంగా బయటపడ్డాయి.
నీ జన్మదిన, కానుకల పర్వదినాన
ఈ ఉదయావరణం విచిత్ర దుస్తుల్లో ఉంది
నువు సాక్షిగా
నిత్యనూతనుడిచ్చే పండుగ కానుకలు
పూలూ ఆకులతో సమృద్ధిగా ఉన్నాయి
క్షణ క్షణం ప్రకృతి దాని నిధిని అది చూసుకుంటోంది
నీ సముఖాన ఉంచే అవకాశం దానికి చిక్కింది
దాతా స్వీకర్తా కలిసే ఉన్నపుడు ఇవాళ
విధాతకు నిత్య వాంఛ నెరవేరుతుంది
విశ్వకవి విస్మయంతో నిన్ను ఆశీర్వదిస్తాడు
వర్షం కడిగిన నిర్మల శ్రావణ ఆకాశం నుండి
తన కవిత్వంలో నిన్నే సూచిస్తాడు
ఊదయన్, శాంతినికేతన్, 13 జూలై 41, ఉదయం, మరణానికి 24 రోజుల ముందు బెంగాలీలో రాసిన ఈ 16 చరణాల కవిత, కవిగా తన స్వీయ ప్రకటన. ఈ కవిత తన మనుమరాలు నందితా దేవి, (కూతురు మీరా దేవి కుమార్తె) జన్మదినం నాడు రాసింది.
3 – బేరమాడటం: వాస్తవాన్ని తగ్గించుకుందుకో లేదా వాయిదావేసే ప్రయత్నమో కొనసాగుతుంది. ఎవరికీ తెలియకుండా దేవునితో రహస్యంగా బేరాలు ఆడతారు, లేదా అబ్యర్థిస్తుంటారు, ఆశపడతారు. “ఇంకా కొన్నాళ్లు ఉంచమని”
నూతన అస్తిత్వ ఆవిర్భావంలో
నువ్వు ఎవరని
మొదటిరోజు సూర్యుడు ప్రశ్నించాడు
సమాధానం రాలేదు
సంవత్సరాలు సంవత్సరాలు దొర్లిపోయాయి
పశ్చిమ సముద్ర తీరాన
నిశ్శబ్ద సాయంంత్రాన
చివరి దినం సూర్యుడు
ఆఖరి ప్రశ్న వేశాడు
నువ్వు ఎవరని
సమాధానమే రాలేదు
ఇది ఒక విధంగా అసాధారణమైన మరణ ప్రకటన. అసాధారణమే కానీ అనుకోనిది మాత్రం కాదు. జొరషంకో, కోల్‌కతా, 27 జూలై 1941, ఉదయం, మరణానికి 10 రోజుల ముందు బెంగాలీలో రాసిన 11 చరణాల ఈ కవిత “ఎవరు నువ్వని” ప్రశ్నా జవాబుతో, ఒక స్వీయ విచారణ. ఇక్కడ “మొదటిరోజు సూర్యుడు” పుట్టుకని, “దినపు చివరి సూర్యుడు” మరణాన్ని సూచిస్తుంది.
4 – కుంగిపోవడం: ఈ దశలో వాస్తవం గ్రహింపుకొస్తుంది. నిశ్సబ్దాన్ని ఆశ్రయిస్తారు లేదా దుఃఖపడుతుంటారు. ఈ ప్రపంచం నుండి విడిచిపోవటం కోసం తమను తాము సన్నద్ధం చేసుకుంటుంటారు. “నేను ఎలాగూ మరణించబోతున్నాను, ఇంక దేనికోసం ప్రాకులాట” అనుకుంటారు.
నా ద్వారం దగ్గర
దుఃఖపు చీకటి రాత్రి మళ్లీ మళ్లీ
బాధల వికృత భంగిమల,భయం భయానక రూపాలే
నేను చూసిన ఏకైక ఆయుధం
చీకట్లో దాని మోసాలతో అవి పరామర్శిస్తాయి
నేను దాని భయం ముసుగుని నమ్మినప్పుడల్లా నిష్ఫలమైన అపజయమే అనుసరించింది
ఈ జయ పరాజయాల ఆట, జీవితపు భ్రమ
బాల్యం నుండీ, అడుగడుగునా, దుఃఖపు ఎగతాళితో నింపుతూ –
రకరకాలుగా భయపెట్టే చలనచిత్రంలా
ఈ భీతి దుఃఖ పరిహాసం
చెల్లాచెదరైన చీకటి విషాదాన్ని
మృత్యువు నైపుణ్య కళతో సృష్టిస్తోంది
జొరషంకో, కోల్‌కతా, 29 జూలై 1941, మధ్యాహ్నం, మరణానికి 2 రోజుల ముందు బెంగాలీలో రాసిన 11 చరణాల “దుఃఖపు చీకటి రాత్రి మళ్లీ మళ్లీ” కవిత – పూర్తిగా బయంగొలిపే చలనచిత్రపు చూపు – స్వీయ మరణం.
5 – అంగీకారం: అనివార్యాన్ని అంగీరించినా ఆనందంగా ఉండలేని స్థితి. “ఏమి లాభం, పోరాడలేం, పోవాల్సిందే” అని నిశ్చయానికొచ్చేస్తారు.
చిత్రవిచిత్ర మోసాల వలతో
మీ సృష్టి మార్గం చెల్లాచెదరై ఉంది
ఓ మోసపూరితమా
నీ నైపుణ్య చేతులు బిగించిన మిథ్యా విశ్వాసాల ఉచ్చులోనే సరళ జీవనం
ఆ మోసంతోనే ఉత్కృష్టం చిహ్నితమయి
రాత్రి రహస్యం కాకుండా ఉంది
మీ గ్రహమండల నక్షత్రాలు
అతనికి మార్గనిర్దేశం చేస్తాయి
అదే అతని అంతర్మార్గం
సహజసిద్ధమైన విశ్వాసంతో
సదా స్వచ్ఛదనంతో
దానిని నిత్యం కాంతిమంతంగా ఉంచుతాడు
బయట కపటం, లోన చిత్తశుద్ధి
అందులోనే అతని అభిమానం
జనం అతనిని వంచితుడంటారు
సత్యంతో అతను సమ్మిళితుడై
అంతరాంతరాల్లో దాని స్వీయ కాంతిలో మునిగాక
అతనిని ఏదీ వంచించలేదు
అతని ఖజానాకి
తన చివరి పురస్కారాన్ని తీసుకుపోతాడు
అప్రయత్నంగా అన్ని మోసాలను అనుభవించినవాడు
మీ హస్తం నుండి
ప్రశాంతత హక్కుకి అర్హుడు
జొరషంకో, కోల్‌కతా, 30 జూలై 1941, ఉదయం 9.30, మరణానికి 7 రోజుల ముందు బెంగాలీలో రాసిన 25 చరణాల ఈ కవిత – భ్రమల దారి, పరువుగల ఆశ. కవితలో మోసపూరితం – అని జనం పిలుచుకున్నా – అతను సృష్టికర్త తీసుకొచ్చే అనేక మోసాల బాధితుడు. అతని స్మారకోత్సవంలో ఈ కవితనే చదవమని కోరుకున్నాడు.
బెంగాలీలో 293 పదాలు ఉన్న ఈ అయిదు కవితలూ, అతని “శేష్ లేఖా – చివరి రాతలు” సంకలనంలో చేర్చబడ్డాయి. చివరి రెండు కవతలూ చెబుతూ రాయించినవి. అయిదవ కవితలో చివరి మూడు చరణాల్లో అసంతృప్తి ఉండి ఆసుపత్రినుండి తిరిగివచ్చాక మారుస్తాను అని చెప్పాడు. ఆ కవిత రాసిన కాగితం మీద సంతకం సైతం చేసాడు. అదే అతని చివరి సంతకంగా మిగిలింది. మార్చాలనుకున్న మూడు చరణాలూ అనంతంగా వేచి చూస్తునే ఉన్నాయి. మరణాన్ని నిర్భయమైన సహవాసి, అధ్యాత్మిక ప్రేమ అని అతని తొలి కవితల్లో టాగూరు ఎంత అభివర్ణించినా, చివరి దశలో “మరణం రకరకాల భయాల కదిలే తెర” అని చెప్పుకున్నాడు.
చివర్న రాసిన, లేదా చెప్పి రాయించిన కవితలకు అతను శీర్షికలేవీ పెట్టుకోలేదు.1937లో అనారోగ్యం పాలైన తరువాత (నుండీ అతను పూర్తిగా కోలుకోనేలేదు) వచ్చిన అతని అయిదు కవిత్వ సంపుటాలు ఇవి – ప్రాంతిక్ (1938), రోగ్‌శయ్య (1940), ఆరోగ్య (1941), శేష్‌లేఖా (మరణాంతరం 1942). మనలోని శాశ్వతత్వాన్ని వ్యక్తపరిచే అవకాశమే ఇక్కడి జీవితమని భావించిన టాగూరు, ఒక ఉత్పత్తిస్థానం, వంద ఏరులై, వంద పాయలు పాయలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ఒక సాహిత్య జలపాతం.కళాకారుని విధి సార్వత్రిక వ్యాఖ్యాత కావడమనే అంటాడు టాగూరు.
నిశ్శబ్ద మరణాన్ని టాగూరు కోరుకున్నాడు. బహిరంగ, విశాల ఆకాశం క్రింద నిశ్శబ్ద స్వేఛ్చాయుత ప్రకృతి నడుమ సంపూర్ణ విశ్రాంతిని అతను కోరుకున్నాడు. అయితే అతని చివరి కోరిక నెరవేరనేలేదు. ఎందరో ఆయన పార్థివ శరీరంతో బాటు “విశ్వకవి జైయ్, రవీంద్రనాథ్ జైయ్, వందే మాతరం అన్న నినాదాల హోరులో తీసుకువెళ్లారు.
గీతాంజలిలో టాగూరే చెప్పుకున్నట్టు –
నాకు శలవొచ్చింది. నాకు వీడ్కోలు చెప్పండి.
నా సోదరులారా! మీ అందరికీ నమస్కరించి నేను శలవు తీసుకుంటున్నాను.
ఇదిగో నా తలుపు తాళంచెవుల్ని నేను తిరిగి ఇచ్చేస్తున్నాను.
నా ఇంటి అధికారాలు అన్నింటినీ వదులుకుంటున్నాను.
నేను మీ నుండి దయాన్విత చివరి మాటలు మాత్రమే ఆశిస్తున్నాను.
మనం చాలా కాలం పొరుగువారిగా ఉన్నాం.
కానీ నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువే పొందాను.
ఇప్పుడు తెల్లవారింది.
చీకటి మూలలో వెలిగించిన దీపం ఆరిపోయింది.
నాకు పిలుపొచ్చింది.
నా ప్రయాణానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆధ్యాత్మిక సహవాసిగా భావించే కృష్ణుడికి, గోపికలు ఎలా దగ్గరవాలని చూసారో, టాగూరు కూడా మరణాన్ని మనస్పూర్తిగా అలానే హత్తుకోవాలని చూసాడు. అయినా మానసికంగా టాగూరు మీద పునరావృతమయే అంతఃప్రవాహం, వేదనని యాతనని కలిగించకపోలేదు, వాటిని చీకటీ, భయం లాంటి ప్రతీకలతో కవితలలో బయటపెట్టాడు.
ఎప్పుడూ అతనికి వ్యక్తిగతం విశ్వజనీనం, దుఃఖం శాంతిగా మారుతుంది. టాగూరే చెప్పుకున్నట్టు –
నీతోబాటే అమరమైన ఆత్మని తెచ్చుకున్నావు
నీ మరణంలో దానినే దానమిచ్చావు ..
నా అడుగుజాడలు ఈ కుటీరంలో లేనపుడు, ఇక్కడి ఈ నదిలో నేను పడవని నడపనపుడు, ఆ సమయంలో నీకు నేను గుర్తుకు రాకపోవచ్చు, అయినా నేను ఇక్కడుంటాను, నా ఆత్మ ఇక్కడుంటుంది – అని చెప్పుకున్నాడు. మరణం ఇక్కడనుంచి శాశ్వత నిష్క్రమణ కాదని, మరో రూపంలో ఉండనే ఉంటుందని బలంగా నమ్మాడు.
మరణం మూలంగా శోకం ఉన్నా, సూర్యుడు చంద్రుడూ వస్తూనే ఉంటారు, శరత్తులు వసంతాలూ వస్తూనే ఉంటాయి, పూలు పూస్తూనే ఉంటాయి, తుమ్మెదలు పూలనుండి మధువుకోసం తిరుగుతూనే ఉంటాయి. ఏవీ ఆగిపోవు అని కేవలం తాత్కాలిక మార్పులే అని చెబుతాడు. “దుఃఖమూ ఉంది, మరణమూ ఉంది ..” వాటితోనే జీవితం అంటాడు. దృష్టి మసకబారేది, స్వీయ చీకటి మూలంగానే అంటాడు.
అమరత్వపు సందేశం మరణం. శాశ్వత నివాసానికి తీసుకుపోయే శాశ్వతత్వపు విశాల సముద్రం. అంతా ధ్వంసంచేసే మరణం, జీవితానికి పరిపూర్ణత, నూతనత్వానికి మూలం. మరణం సమాప్తం కాదు ఆధ్యాత్మిక సముద్రయానానికి ప్రారంభం. మరణం పట్ల అతనిది ఆశాపూర్ణ దృక్కోణం, ఉదాసీన బాధాతప్త దృష్టికోణం కాదు. జీవన్మరణాలు అతనికి విడదీయలేని సహవాసులు, బిడ్డగా సంరక్షించే సర్వశక్తివంతమైన అమ్మ రొమ్ములు. మరణం కాంతి లేకుండా చేసేదికాదు, కేవలం వేకువ వచ్చిందని దీపం అర్పేయటం లాంటిదని అందర్నీఓదార్చే, అతని కవిత్వం అంతా ఆధ్యాత్మికం మార్మికం.
*
సరళమైన భాష, చక్కటి వ్యాక్యనం…ఒక సంపూర్ణ కవి చివరి రోజులు కళ్ళకు కట్టించారు. నమస్కారములు.
ఠాగూర్ కవితల్లోని చివరిదశను బాగా పరిచయం చేశారు.మరణాన్ని ఆయన చూసిన తీరు ఆశ్చర్యకరమైన
నమస్తే….
ఎంతో ఆలోచనా ప్రేరకమైన విశ్లేషణ, అనువాదం….
కవిత్వ వివరణలో కూడా చాలా వెంటాడే వాక్యాలు ఉన్నాయి… అభినందనలు ధన్యవాదాలు…
విహారి
మీ వ్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా చదివించిది. అద్భుతమైన వ్యాఖ్యానమనవచ్చు. ఠాగూర్ చివరి రోజులను మాకు సాక్షాత్కరింపజేశారు. ‘మరణం’ పై తనకు గల అభిప్రాయం స్థిరమైనది. దాన్ని తన కవితల్లో బలంగా చెప్పగలిగారు. బహుశా అనేక జీవిత అనుభవాలు, సంఘర్షణలు ఆ స్థిరత్వానికి కారణం కావచ్చు.
Good
ముకుంద రామారావు గారికి నమస్కారం
మరణం గురించి ఆలోచించడమే ఒక సాహసం. మరణం సమీపిస్తున్నప్పుడు సాధారణంగా ఆ మనుషులో కలిగే అంతర్బార్ యుద్ధాలు దాదాపు సర్వకాలికం, సార్వజనీనమూ. ఆ అంశాల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలో పొదిగిన తీరును మీరు ఎంతో బాగా పట్టుకున్నారు. మీరు పేర్కొన్న ఆ ఐదు అంశాలు కేవలం మరణ సమీప సమయంలోనే కాకుండా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అటువంటి స్పందననే కొద్దో గొప్పో స్థాయి భేదంతో ఉంటుందని అనిపిస్తుంది. ఆలోచనలు రేకెత్తించే విషయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.