టచ్ మి నాట్ 

బాల్యం సీతాకోక చిలుక

ఉరికే జలపాతం

అందమైన జ్ఞాపకం

 

పువ్వల్లే విచ్చుకునే వయసు

దేహాన్ని ఎవరు తాకినా, ఎక్కడ తాకినా,

ఎదురు తిరిగి ప్రతిఘటించలేని బాల్యం

నోరు తెరచి మాట్లాడలేని బాల్యం

లోకం తెలియని అమాయకత్వం

 

స్పర్శకి  తేడా తెలియని పసిమొగ్గల కాలమది

చిన్నారి శరీరం మీద ఏం జరిగినా

మనసు పొరల్లో నిక్షిప్తమౌతుంది

బాధా సముద్రం ఘోషపెడ్తుంది

అవును, చైల్డ్ సెక్స్ అబ్యూజ్

అనుకోకుండా జరిగే ఒక ‘యాక్సిడెంట్ ‘

ఈ చేదు జ్ఞాపకాన్ని చెరిపేసుకోవాలి

దీన్ని మరచిపోయి  త్వరగా కోలుకోవాలి

 

ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ

ఎంతసేపు అలా కూర్చున్నానో తెలీదు

నా చుట్టూ చీకటి కమ్ముకుంది

ఆకాశంలో కూడా

ఆ రోజు ఆ అమ్మాయిని

మేం కడుపులోదాచుకున్నాం

నేను, వాళ్ళమ్మ, వాళ్ళ టీచర్

జరిగింది మర్చిపొమ్మని చెప్పాం,

ముందుకు సాగిపొమ్మని చెప్పాం

జీవితం అత్యంత ప్రియమైంది,

దాన్ని నక్షత్రాలతో అలకరించమని చెప్పాం

 

ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర

గాయపడ్డ జ్ఞాపకాలేమీ లేవు

బ్రతుకు బాటను అలంకరరించుకుంది తను

పాటలతో, రంగులతో, పక్షుల రాగాలతో!                                             ( In support of the victims of Child sex abuse ).

*

చిత్రం: సృజన్ 

మహెజబీన్

మహె జబీన్ కవయిత్రి, రచయిత్రి, సామాజికవేత్త, మానవ హక్కుల న్యాయవాది. జబీన్ కవిత్వం లో ప్రధానంగా జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ దృక్పధం కనిపిస్తాయి. ఈమె కవితా సంకలనం 'ఆకురాలు కాలం' (1997) విమర్శకుల మన్ననలను అందుకుంది. ఈమె కవిత్వం అనేక అంతర్జాతీయ స్థాయి కవిత్వ సంకలనాలలో చోటుచేసుకుంది. విస్కాన్సిన్ యూనివర్సిటీ ప్రెస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, Bloomsbury పబ్లిషింగ్, ఇండియన్ లిటరేచర్, NBT /INDIA మహె జబీన్ కవిత్వాన్ని ప్రచురించాయి.

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు