జ్వరం కాస్తే, భయం వేస్తే…?

“…మూడు సార్లు పిలవండి, చెవిలో” అని నాక్కూడా చెప్పాడు అయ్యగారు. మా అన్నయ్యకూ చెప్పాడు, తమ్ముళ్ళకూ చెప్పాడు. నేను పిలవలేదు.  నేను దేనికి వింటానో,  దేనికి విననో ఆయనకు అర్థం అయి ఉండదు, ఖాళీ కళ్లతో  నన్ను చూశాడు.

స్వర్గలోక యాత్రో, వైకుంఠ వాహనమో దాని పేరు గుర్తు లేదు కానీ,  అందులోకి ఎక్కించడానికి అమ్మను ఎత్తినప్పుడు, అప్పటిదాకా ఎడంగా  తచ్చాడుతున్న నేను, అమాంతం వెళ్లి ఒక కొమ్ము ఎత్తుకున్నాను.  దింపేటప్పుడూ అంతే. చితి దాకా తీసుకువెళ్లే దారిలో ఒక భుజం అమ్మకు ఇచ్చాను. ఇదే ఆఖరు కదా,  తనతో పాటు నేను ఇక ఎక్కడికీ నడిచేది ఉండదు.

“మూడు సార్లేమిటి, మూడువందల సార్లు పిలిచాం కదా, పలికిందా? లేదు కదా” అన్నాను చెల్లెళ్లతో. ఆ రోజు తెల్లవారు జామున, పిలిచినా, అరిచినా, కుదిపినా, చలనం లేకుండా ఉంది అమ్మ. జనవరి నెల చలి. ఒంటి వేడి తెలియడం లేదు. నాడి అందడం లేదు. గుండెకు చెవి ఆనించి వినబోతే, దడదడ నా గుండె చప్పుడే నాకు వినిపిస్తోంది. పిలుస్తున్నాము, పిలుస్తున్నాము, డాక్టర్‌ వచ్చేవరకు పిలుస్తూనే ఉన్నాము. చిన్నప్పటి నుంచి‘ అమ్మా’ అని రకరకాలుగా పిలిచి ఉంటాము. ఆ తెల్లవారు జామున పిలిచినట్టు మాత్రం ఎప్పుడూ పిలవలేదు.

నిజానికి ఎప్పుడో జరిగిన ఆరంభానికి అది ముగింపు. ఐదేళ్ల కిందట, భ్రమాత్మక భయాల నీడలు తనను కమ్ముకున్నప్పుడు, మరపు మతిని ముంచెత్తుతున్నప్పుడు, ఉపక్రమించిన ఒక సంభాషణ అర్థరాహిత్యంలోకి తెగిపోయినప్పుడు, మొదటిసారి ఆమెను కోల్పోయాము. అప్పుడే మా లోలోపల మాతృకేతనం అవనతం కాసాగింది.  జ్ఞాపకం లేనిది ఉనికే లేదు. ఆమెలో నుంచి ఆమె జారిపోసాగింది. ఆమె జ్ఞాపకంలో నుంచి మేము చెరిగిపోసాగాము. మరణమన్నది హంస ఎగిరిపోవడం కాదు, దీపం ఆరిపోవడం అని తెలియసాగింది. నెమ్మది నెమ్మదిగా ఆమె మరణిస్తూ వచ్చింది. ఆఖరి చమురు బొట్టు కూడా ఇగిరిపోయి, ఒక రోజు ఆరిపోయింది.

తను అట్లా అచేతనంగా ఉన్నప్పుడు, ఆ తరువాత నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు, ఈ మనిషి లో నుంచే, ఈ మనిషి ద్వారానే, తన వల్లనే, తన చేతనే నేను  ఈ లోకంలోకి వచ్చాను కదా అని కొత్తగా గుర్తుకు వచ్చింది. నాలోనే ఏదో దహించుకుపోతున్నట్టు మనసు పెడబొబ్బలు పెట్టింది. ఇంతటి మమత్వం తను బతికివున్నప్పుడు చూపించి ఉంటే,  ఎంత సంతోషించేది కదా అని సిగ్గు వేసింది!

అమ్మ వెళ్లిపోయి ఈ జనవరి ఆరు కు ఏడాది.  తల్లి లేని పిల్లలుగా ఏడాది. తల్లీ తండ్రీ లేక ఏడాదిన్నర.  ఎంత వయసు దాకా ఉండగలరు తల్లీ దండ్రీ! ఇంతకాలం ఉన్నారు చాలదా? … మనకు ఎంత వయసు వచ్చినా, తల్లిదండ్రులు ఉంటే, ఏదో ఒక చిన్నతనం మిగిలి ఉంటుంది. వారున్నంత వరకూ, కొడుకులూ కూతుళ్ల భావావరణంలోనే సంచరించగలుగుతాము. వాళ్ళు వెళ్లిపోయాక, ఇక మనకు మనమే అనిపిస్తుంది. వాళ్ల స్లాట్‌ లోకి మనమూ వెళ్లిపోయామని, కౌంట్‌ డౌన్‌ కాకపోయినా, కౌంటింగ్‌ మొదలయిందని  తెలిసివచ్చి, భయం వేస్తుంది.

2024 డిసెంబర్‌ లో అమ్మ సంవత్సర కార్యక్రమాలు జరిగినప్పుడు, ఆమె ఇక నుంచి మా దినచర్యల్లో కనిపించడం మానేస్తుందని, బహుశా భూ ఆవరణాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లిపోతుందని అనిపించింది.  అంత్యక్రియలకు, పెద్దకర్మకు కొన్ని అర్థాలు చెబుతారు. ఈ లోకంలోని మమకారాలకు, పైలోకానికి చేసే ప్రయాణానికి మధ్య చిన్న ఘర్షణ ఉంటుందట.  దాన్ని పరిష్కరించి, కుటుంబానికి దుఃఖం లేకుండా, మరణించిన మనిషి తన ప్రయాణం కొనసాగించే ప్రక్రియలే ఈ తతంగాలట. ఆ నమ్మకాల, పద్ధతుల సత్యా సత్యాల, మంచిచెడ్డల చర్చ ఇక్కడ అక్కరలేదు.   కానీ, ఒక జీవితానికి, ఆ జీవిత నిష్క్రమణ జరిగిన తరువాత కలిగిన దుఃఖానికి సగౌరవమైన ముగింపు మాత్రం ఏదో ఉండాలి.  తనువు చాలించిన వారిని పరలోకానికి తీసుకువెళ్లడమేమో కానీ, వదిలివెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి ఇహలోక స్రవంతిలోకి రావడానికి మాత్రం ఈ కర్మకాండలు బాగా పనికివస్తాయి.

తతంగాల మీద నమ్మకం లేని వారు సొంత మనోబలం మీద, అవగాహన మీదా ఆధారపడి, ఆ దుఃఖదినాలను గట్టెక్కాలి. మతపద్ధతులు పాటించనంత మాత్రాన, భావోద్వేగాలు, విరక్త భావన ఉండవని కాదు కదా? పరలోకప్రయాణ వివరాలను సంస్కృత మంత్రాల్లో జపించే క్రతువుల్లో పాలుపంచుకోకుండా ఉన్నప్పుడు, సోదరుల మాదిరిగా కేశవిసర్జన చేయనందుకు పశ్చాత్తాపమేమీ లేదు కానీ, వాటికి ప్రతిగా నాకూ ఒక తతంగం ఉంటే అందులో రక్షణ పొందేవాడిని కదా అనిపించింది.  అమ్మ కు వీడ్కోలు చెప్పడానికి నాదైన పద్ధతి ఏది అన్న విచారం ఆవరించింది.

మా అమ్మ  తనంతట తాను ప్రత్యేకమైన వ్యక్తి ఏమీ కాదు.  అందరు అమ్మల వంటిదే ఆమె కూడా. పైగా, తను బడికి వెళ్లి చదువుకున్నది కాదు. ఆమెకు తెలిసిన ప్రపంచం మూడునాలుగు జిల్లాలు దాటదు. కారుణ్యస్పందనలు అవసరమైన ప్రమాదాలు, ఉత్పాతాలు, హత్యలు,  ఆత్మహత్యలు, కాలధర్మాలు తప్ప మరో ప్రాపంచిక సమాచారం ఆమెను సోకదు.  తాను ఏ మానవ సంబంధాల, సామాజిక సంబంధాల చట్రంలో పుట్టి పెరిగిందో దానిలోనే ఆమె బందీ. కానీ, తనకు కావలసిన వాళ్లు ఆ చట్రానికి బయట ఉండిపోతే, లేదా, చట్రం నియమాలను పాటించకపోతే, ఆమెకు పెద్ద పట్టింపు ఉండదు. కులమూ మతమూ ఆచారమూ అన్నీ ఉంటాయి, కొన్ని విషయాలలో పిల్లల కంటె వాటికే పెద్దపీట వేస్తుంది, కానీ, అవసరమైతే,  మాతృత్వ హోదాలో దేన్నైనా వీటో చేస్తుంది. అమ్మకు ఏదో అద్భుత శక్తి లభించి ఇవన్నీ చూస్తూ ఉంటే గనుక, నేను ఈ కర్మలు, క్రియల లాంఛనాలలో పాలుపంచుకోనందుకు ఏమీ తప్పు పట్టేది కాదు, బాధపడేదీ కాదు.

ఫలానా వారి కూతురుగా, భార్యగా, తల్లిగా ఉండడం తప్ప వేరే మెట్లు అమ్మ విజయానికి లేవు. ఆమెకు వేరే సార్థకతలు లేవు. పిల్లలు పెరిగి ప్రయోజకులు కావడంలోనే తన సక్సెస్‌ కానీ, ఫెయిల్యూర్‌ కానీ!  పిల్లల్లో  పరుగు తీయలేని వారినే ఎక్కువ ప్రేమించింది. మనసులు విరిగినప్పుడు కూడా అతుకుల కోసం ఆరాటపడింది. అట్లా ఉండే  తల్లికి పిల్లలు ఏమి ఇవ్వగలరు? ఎంత ఇచ్చినా దానికి ఉండే విలువేమిటి? ఇటువంటి తల్లి ప్రేమని ఎక్స్‌ ప్లాయిట్‌ చేయకుండా మాత్రం ఏ పిల్లలు ఉండగలరు?

అనేక సన్నివేశాలలో, సందర్భాలలో ఇంకా అమ్మ స్ఫురణ పొడుచుకు వస్తూనే ఉంటుంది. అక్కడే ఎక్కడో తను కదలాడుతూ ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. మరపుతో సతమతమైన అమ్మ, ఇప్పుడు జ్ఞాపకంలో జీవిస్తూ ఉంది. కొంతకాలానికి, మా తలపులు కూడా పలుచబడినప్పుడు, ఆమె అందనంత దూరంలోని ఏదో గెలాక్సీకి ఎగిరిపోయి, ఇక ఎప్పుడూ ఈ లోకపు లంకె లేని కైవల్య పదానికి చేరుకుంటుంది కాబోలు.  తను రామానుజ మతస్థురాలు కాబట్టి, దాన్నే సాయుజ్యంగా స్వీకరిస్తుందేమో?

చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరని మంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే  ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంది.

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక పూర్వ సంపాదకులు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “పరలోకప్రయాణ వివరాలను సంస్కృత మంత్రాల్లో జపించే క్రతువుల్లో పాలుపంచుకోకుండా ఉన్నప్పుడు, సోదరుల మాదిరిగా కేశవిసర్జన చేయనందుకు పశ్చాత్తాపమేమీ లేదు కానీ, నాకూ ఒక తతంగం ఉంటే అందులో రక్షణ పొందేవాడిని కదా అనిపించింది. అమ్మ కు వీడ్కోలు చెప్పడానికి నాదైన పద్ధతి ఏది అన్న విచారం ఆవరించింది.”
    గొప్ప మాటలివి. శ్రీనివాస్ గారు ఒక్కరే ఇలా వ్రాయగలరు. అందరి మనసులో వుండే ఆలోచనకు అక్షరరూపం ఇచ్చారు ఆయన. అమ్మకు నా నివాళి! 🙏🏼

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు