జ్ఞాపకం 

రాత్రి నిద్రపట్టక అటూ యిటూ దొర్లుతుంటే పాత రోజులన్ని గుర్తొచ్చాయి.వొక్కసారిగా గతంలోకి ప్రయాణం చేయడం మొదలెట్టాను.
అవి నేను తొమ్మిదో తరగతి పూర్తై పదోతరగతిలోకి అడుగుపెట్టడానికి మధ్యన వున్న సమయాలు.వేసంకాలం సెలవులు మొదలయిన రోజులు.ఏదైనా పని దొరికితే బావున్ను అని పనికోసం రెక్కీ మొదలెట్టాను.
పని దొరికితేగానీ ఆ పై సంవత్సరం యింటర్మీడియేట్ చదవలేని పరిస్థితి.
యింటి చుట్టుపక్కల వాకబు చేస్తే యింటిదగ్గర తెలిసినాయన ద్వారా ఆయన పనిచేసే ఫ్యాక్టరీలో రోజుకూలీగా పనిదొరికింది.కూసింత సంతోషమేసింది.కానీ ఆ ఫ్యాక్టరీ మా యింటి నుండి దాదాపు ఐదు మైళ్ల దూరం.వెళ్ళడమెలగా అని చింతన మొదలయింది.ఆటోకి వెళ్ళేంత చిల్లర లేదు.బస్పాస్ వేశంకాలంలో పనిచేయదు.
నాన్నకున్న వొకే వొక సైకిల్,అది నాకివ్వడం కుదరదు.నాన్న దానిమీదే రోజూ డ్యూటీకి వెళ్ళిరావాలి,కాబట్టి నాకివ్వడం జరగదు.యెలా వెళ్లడం అని వొకటే మదన పడుతుంటే వొక మెరుపులాంటి ఆలోచన తట్టింది.నాన్నకి షిఫ్టు డ్యూటీ,ఆ టైములో కాకుండా నేను వాడుకుంటే సరి అని నాన్నని సైకిల్ అడిగితే సరే తీసుకెళ్లమన్నారు.హార్కులస్ సైకిల్ అది,పాతకాలం నాటి సైకిల్ అయినా యెక్కి తొక్కుతుంటే భలేగా వుండేది,నేను పడుతూ లేస్తూ నేర్చుకున్నది ఆ సైకిల్ పైనే.
యెట్టకేలకు అన్ని కుదిరి ఫ్యాక్టరీలో జాయిన్ అవడానికి వెళ్లాను.అక్కడ నాలాగే పనికోసం వచ్చిన రోజుకూలీలు వందలమంది వున్నారు.
అందులో పనిచేసే వ్యక్తి సిఫారసు చేయడం వలన నన్ను పనిలోకి తీసుకున్నారు.
అదే మొదటిసారి మా నాన్న పనిచేసే కంపెనీ తరువాత అంత పెద్ద ఫ్యాక్టరీ చూడ్డం.అడ్మిన్ బిల్డింగ్ దాటి లోపలికెళ్ళాక పనిచేసే ప్లాంట్ యేరియా.నేను కుర్రాడిని అవడం వల్ల మొదటిరోజు కటింగ్ మెషిన్ దగ్గర వేశారు.
ఆ మెషిన్ కి యిరువైపులా గుండ్రటి రంపాల్లాంటి చక్రాలు.ఆ మెషిన్ స్టార్ట్ అవగానే రయ్మని వచ్చే భీకర శబ్దం మనల్ని దానివైపు శ్రద్ధగా మసులుకునేట్టు  చేస్తుంది.ఆ మెషిన్కి ముందు భాగంలో వో పెద్ద బల్ల.ఆ బల్ల పైకి వో పదడుగుల పొడవు పదడుగుల వెడల్పు వున్న వో పెద్ద బరువైన పలకలాంటి చెక్కను(మామిడి దుంగలతో తయారైన)నలుగురు నాలుగు వైపులా పట్టుకుని సమాంతరంగా వొకేసారి ఆ మెషిన్లోనికి పంపించాలి వేగంగా తిరుగుతున్న ఆ రెండు గుండ్రటి రంపపు చక్రాల గుండా.
అటూయిటూ చక్కగా చదునుగా కత్తిరించబడ్డ చెక్క ముక్క ఆ వైపుగా బయటికొచ్చింది.
నాకు అవతలున్న మరో వ్యక్తి అరిచి చెబుతున్నాడు నాతో,రే తమ్మి జర భద్రం!సక్కగా పట్టుకోకుంటే చేతులు కట్ అయితయ్ సూస్కో అని జాగ్రత్త చెప్పాడు.మునుపు అలానే చేతులు పోగొట్టుకున్న యిద్దరి ముగ్గురు గురించి చెప్పాడు ,ఏదైతేనేం మొత్తానికి కష్టమైనా కాస్త అలవాటైంది చేస్తూ చేస్తూ.మొదటిరోజు కష్టంగానే పూర్తయింది.
మరుసటి రోజు మళ్ళా కుర్రాడవడం వల్ల నాలాంటి కుర్రాళ్ళందరికీ ప్లాంట్ బయట పనిచేసారు,అంటే ప్లాంట్ కి స్టీమ్ సప్లై చేసే బాయిలర్ కి ఆవల.బాయిలర్ నుండి వచ్చిన బూడిదనంతా పెద్ద పారతో లాగి వేరే చోటికి తరలించాలి.అసలే మే నెల,అదీ మిట్టమధ్యాహ్నం షిఫ్టు నాది.సూర్యుడి ప్రతాపం నువ్వా నేనా అన్నట్టుగా భూమ్మీదకి ప్రవహించే కాలం.
మొదటిసారి కదా బూడిదేగా లాగేద్దాం అని వూపుగా పార తీసుకువెళ్లగా వోసారి లాగి వో ట్రాలీ నింపగానే విపరీతమైన బాధ.కాళ్లకి వేసుకున్న పారగాన్ చెప్పులు రబ్బరు ఆ బూడిదలో వేడికి కరుగుతున్నట్టుగా అనిపించింది.చేతివేళ్ల మధ్యన పడ్డ బూడిద వేడికి మండడం మొదలయింది.వొక్క వుదుటున నీడలోకి వచ్చాను.అక్కడే కుర్చీ వేసుకు కూర్చున్న పర్మినెంట్ వర్కర్ తిట్టడం మొదలెట్టాడు.నాన్న కూడా యెప్పుడూ యేరా అని పిలవలేదు,అతనేమో  బూతులు తిడుతున్నాడు.చెప్పుకోలేని వేదన మొదలయింది బహుశా అప్పుడే అసలైన ప్రపంచం మొదలైనట్టుంది నాకు.యీ బాధతో మొదలయిన ప్రయాణం యెటువైపుకి సాగుతుందో.
*

తిలక్ బొమ్మరాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు