జై సీతక్కా…….. జయ జయహో సీతక్కా……

సీతక్కను ఒక నక్సలైట్ నాయకురాలుగానో, తెలుగు దేశం, కాంగ్రెస్ కార్యకర్తగానో చూస్తే ఆమెను తక్కువచేసి చూసినట్టుగా వుంటుంది.

మె ఒక సమ్మోహన శక్తి. కటిక చీకటి లో దిక్సూచి లా దారి చూపించే ధ్రువ తార. ఆకలితో అలమటించే ఆదివాసుల బతుకులకు ఆమె ఒక భద్రతా. అబద్రతతో జీవిస్తున్న అణగారిన జనాలకు ఆమె ఒక రక్షణ. ముల్ల పొదల్లో చేతులు పెట్టి మెత్తని ఫలాలను కోసి తన జనాలకు అందిస్తున్న అక్షయ పాత్ర. గిరిజన కోయ గూడాల్లో, లంబాడి తండాల్లో, దళిత బహుజన కంచాలల్లో ఈ కరోనా ఉత్పాత సమయంలో ఆకలి తీర్చే మెతుకు ఆమె. ముళ్ళ దారులను, వాగులు వంకలను, కొండలను గుట్టలను దాటి అన్నార్తులను చేరుకొని చేయి నందిస్తున్న ఆపన్న హస్తం. నిరాడంబర జీవితం ఆమె సొంతం. తుపాకి ఎత్తి దోపిడీ దొంగల గుండెల్లో గుబులు పుట్టించిన నక్సలైట్, పేదలకు అండగా నిలిచిన టార్చిలైట్. ఆమెనే అడవి నుండి అసెంబ్లీ కి చేరిన ఒక అడవి మల్లె. అసెంబ్లీ నుండి అడవి దారి పట్టి ఈ కరోనా ఉత్పాతంలో ఆకలి కేకలతో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ. పుట్టలను తవ్వి సమస్యల నాగుల కోరలను పీకేస్తున్న వీరనారి. కమ్ముకున్న కరోనా మబ్బులను చెదరగొడుతున్న లేత భానుని కిరణం. అడవి బిడ్డలకు అండ దండా, సమ్మక్క – సారాలమ్మల వారసత్వ సంపద. అసెంబ్లీ లోనూ దిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నల్ల కలువ. ములుగు జిల్లా మూలవాసి, సమ్మక్క సమ్మయ్యల ముద్దు బిడ్డ, జగ్గన్నపేట లో జంఘ్ లో పుష్పించిన ఎర్రని మోదుగు పూవు…. బుల్లెట్ నుండి బ్యాలెట్ దాక పయనించి ఇంకా జనంతో జేజేలు కొట్టించుకుంటున్న సీతక్క. ఆమె ములుగు MLA దనసరి అనసూయ అలియాస్ సీతక్క పరిచయమే అవసరం లేని చిరునామా ఆమెది.

బాల్యం – విద్యాభ్యాసం:

సీతక్క దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ములుగు పట్టణం నుండి 11 కి.మీ. దూరం లో వున్న జగ్గన్నపేట గ్రామం లో 9 జూలై 1971 లో సమ్మక్క, సమ్మయ్య లకు పుట్టిన రెండో సంతానం. ఆమె కు పెట్టిన పేరు అనసూయ, కోయ కుటుంబాలల్లో ఈ పేరు అసహజం. కాని వీళ్ళ పక్కింట్లో గిరిజనేతరులు వున్న కారణంగా ఆమెకు అనసూయ అని వాళ్ళు పెట్టారు. అమ్మ నాన్న లు కూలిపని చేస్తూ, అటవీ వనరులపై ఆధారపడి జీవనం సాగిస్తూ అనసూయను చదివించారు. అనసూయకు అన్న సాంబయ్య ఉండేవాడు. ఆమె బాల్యం అంతా జగ్గన్నపేటలోనే గడిచింది, తర్వాత ములుగు లో ప్రభుత్వ హాస్టల్ లో వుండి ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను ముగించుకొంది. అప్పటికే అనసూయ మేనమామ విప్లవోద్యమంలో పనిచేయడం మూలాన అనసూయకు కొంత ఆ సంప్రదాయం అబ్బింది. అందుకే హాస్టల్ లో చదువుతుండగా హాస్టల్ సమస్యలపై గొంతెత్తడం మొదలుపెట్టింది. తోటి స్నేహితురాల్లను కూడగట్టుకుని హాస్టల్లో నాణ్యత లేని అన్నం, పురుగులుపడిన తినుబండారాలను నిరసిస్తూ, సరిపోను ఆహారం పెట్టని సమయాల్లో, వసతులు సరిగా లేని సందర్భాలల్లో సమస్యలపై గళమెత్తి పోరాడింది. ఈ క్రమం లో PDSU విద్యార్థులతో కూడా సంబంధాలు ఏర్పడడంతో వారితో కలిసి విద్యార్ధి వుద్యమాలల్లో పాలుపంచుకుంది. 1986 సంవత్సరంలో గోదావరి నదీ ఉప్పొంగి ఎటూరి నాగారం, మంగ పేట మండలాల్లో గ్రామాలను ముంచాయి. ఫలితంగా జరిగిన నష్టాన్ని, ప్రాణహానిని చూసి సహచర విద్యార్థులతో కలిసి 13,500 రూపాయలను చందాగా వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిచింది. మొదటి సారి పదవతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయింది.

తానూ పుట్టి పెరిగిన వూరు జగ్గన్నపేట విప్లవ సంప్రదాయాలు, ఉద్యమ ప్రభావం కల గిరిజన గ్రామం. అన్నల కనుసన్నల్లో వున్న గ్రామం, అన్నలకు అండగా నిలిచినా గ్రామం. ఈ క్రమంలో అనసూయ ‘విప్లవోద్యమ’ ప్రభావానికి ఆకర్షితురాలాయి తదనంతరం 1988 జూన్ మాసం లో అక్కడ పనిచేస్తున్న సి.పి.ఐ. (ఎం-ఎల్) చండ్ర పుల్లారెడ్డి గ్రూప్ లో చేరి దళం లోకి వెల్లింది.

విప్లవోద్యమ జీవితం

అనసూయ విప్లవోద్యమం లో చేరడానికి పూర్వమే తన మేన బావ కుంజా రాము, సి.పి.ఐ. (ఎం-ఎల్) చంద్రపుల్లా రెడ్డి పార్టీ లో కమాండర్ హోదా లో పనిచేస్తూ వున్నాడు. బంధువులు అయినా తనకు అనసూయ కుటుంబంతో పెద్దగా సంబందాలు ఉండేవి కావు, అనసూయ దళం లోకి వెళ్ళే క్రమంలో అనసూయతో ఆ కుటుంబంతో రాముకు సంబంధాలు పునరుద్దరించాబడ్డాయి. పార్టీ రహస్య సూత్రాలకు అనుగుణంగా అనసూయ సీతగా మారింది. దళం లో చేరిన కొంత కాలానికి అనసూయ, రాము విప్లవ సంప్రదాయపూర్వకంగా దళములోనే పెళ్లి చేసుకున్నారు. అప్పటినుండి సీతక్కగా జనం హృదయాలలోకి చొచ్చుకు పోయింది. అప్పటికే రాము కు ములుగు ప్రాంతంలో పెద్ద ‘నక్షలైట్’ గా పేరుంది. సీత తన స్వశక్తితో పార్టి లో మెలకువలను నేర్చుకుంటూ ఎదగడం ప్రారంభించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేది. ఈ క్రమం లో సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యింది. ఈ కాలమంత అద్యయానికి ప్రాధాన్యత నిచ్చింది. విప్లవ సాహిత్యాన్ని అవపోషణ పట్టింది.

ఈ కాలం లో 10 తరగతి లో ఫెయిల్ అయిన హిందీ సబ్జక్ట్ పరీక్ష రాసి పాసయింది. తర్వాత మగ పిల్లాడికి జన్మనిచ్చి రెండు నెలల పిల్లాడిని బంధువుల దగ్గర వదిలేసి మల్లీ విప్లవ కార్యాచరణలో పాలుపంచుకోవడానికి తిరిగి తన దళం లోకి వెళ్ళింది. ఈ సమయంలో పార్టీ ని విస్తరించేందుకు కొత్త ప్రాంతాలపై దృష్టిపెట్టి పనిచేయడం జరిగింది. ఆమె ప్రధానంగా నర్సంపేట ప్రాంతం లో (రాము స్వంత వూరు ప్రాంతం) పని చేసి ప్రజాదరణ పొందింది. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ దళ కమాండర్ స్తాయికి చేరుకొని తర్వాత మూడు జిల్లాల కార్యవర్గ సభ్యురాలుగా ఎదగడం విప్లవ పార్టీలల్లో అంత సులభం కాదు, అకుంటిత దీక్ష, అంకిత భావంతో, నిజాయితీతో పనిచేయడం, ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ, విమర్శ-ఆత్మ విమర్శ సూత్రాలను పాటిస్తూ, ప్రజా జీవనం లో మమేకమై ముందుకు సాగింది.

ఈ క్రమంలో చాలా ఎత్తు పల్లాలను, ఒడుదోడుకులను అధిగమిస్తూ తన విప్లవ ప్రయాణాన్ని సాగించింది. ఒకవైపు పోలీసు నిర్భంధమూ, మరోవైపూ పని ఒత్తిడి, కొత్త క్యాడర్ ను తాయారు చేయడం, దళ సభ్యులకు నిరంతరం ప్రేరణనివ్వడం, రాజకీయ తరగతులు నిర్వహించడం, పార్టీలో చర్చిస్తున్న వివిధ ధోరణులను అధ్యయనం చేయడం, సభ్యులకు అవగాహన కల్పించడం, రక్షిత ప్రాంతాలను వెతుక్కోవడం, ప్రజల భూసమస్యలపై పోరాటాలను నిర్వహించడం, పట్టణ ప్రాంత ఉద్యమంతో అనుసనందానం చేసుకోవడం, పై కమిటీల సూచనల మేరకు తన కింది కమిటీలకు దిశా నిర్దేశన చేయడం మొదలైనవి ఆమెకు నిత్యకృత్యాలయినాయి, ఇవే జీవితమై అందులోనే ఆనందాన్ని ఆస్వాదించేది. శత్రువు కనిపెట్టని చోట, రక్షిత ప్రాంతాలల్లో ఎప్పుడో సహచరుడిని కలవడం, వ్యకిగత మరియు సంస్తాగత విషయాల ను చర్చికొంటూ ముందుకు పోయిన వైనం. ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేస్తూ, పై కమిటీల సూచనలను పాటిస్తూ, వీరి కార్యకలాపాల రిపోర్ట్ లు తాయారు చేయడం, పై కమిటీలకు పంపడం తన జీవితంలో పరిపాటయ్యాయి. దొరికిన దినపత్రికలు చదవడం, విప్లవ పత్రికల విషయాల లోతులను అర్థం చేసుకుని తోటి దళసభ్యులతో చర్చిస్తూ, నిరక్షరాస్యులైన దళసభ్యులకు అక్షర జ్ఞానం నేర్పిస్తూ, సభ్యుల అవగాహన శక్తిని పెంచుతూ విశాల ద్రుక్పథాన్ని అవలభించేట్టు చేసేది. ఆమె మాటల్లోనే నూతన ప్రజాస్వామిక విప్లవం ముందుకు తీసుకు పోవడానికై కృషి చేసేవారు, వున్న ఉద్యమ ప్రాంతాలను కాపాడుకుంటూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ భారత దేశంలో వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా, దానికి గిరిజన ఆత్మగౌరవ పోరాటాలను జోడించి పనిచేసేవారమని చాలాసార్లు చెప్పింది.

శత్రుదాడుల నుండి తప్పించుకున్న అనుభవాల పుటలు సీతక్క పుస్తకంలో చాలానే వున్నాయి. ఉదాహరణకు ఒకసారి అనుకోకుండా గందరగోళ స్తిథిలో పోలీసులతో తారసపడి పరస్పర కాల్పులు జరుపుకోగా సహచరులు గాయలపాలైనారు, వారిని రక్షిస్తూ అందుబాటులో వైద్యులతో వైద్యం చేయిస్తూ శత్రువుకు కంటపడకుండా తప్పించుకోగల్గింది. తన రక్షణకన్నా సహచర సభ్యల రక్షణకై ప్రాధాన్యత ఇచ్చేది. మరొక్కసారి కొత్త ప్రాంతంలో దారి తప్పి కొంచెంలో ఎండిపోయిన భావిలో పడేవారు, తోటి సహచరుల చాకచక్యంతో ప్రమాదం నుండి తప్పించుకోవడం జరిగింది. ఇలా చాలా సార్లు తనకు అనుభవంలో వున్నాయని చాలా సార్లు చెప్పింది. ఎక్కడో ఎదో ప్రాంతంలో ‘ఎన్ కౌంటర్’ జరిగి ఎవరైనా కామ్రేడ్స్ మరణిస్తే ఆ వార్త విన్న సీతక్కకు, ఇతర సహచరులకు ‘ముద్ద దిగేది కాదు, మనసంతా అతలాకుతల మయ్యేద’ని చాలాసార్లు చెప్పింది. అయినా మొక్కవోని విశ్వాసంతో, పట్టుదలను పెంచుకుని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వారిని స్మరిస్తూ “ఎర్ర జెండా ఎర్ర జెండా ఎనియ్యాలో” అంటూ పాటలుపాడుతూ సహచరులల్లో భరోసాను నింపుతూ అడుగులు ముందుకేస్తూ సాగేది. తిండి దొరకని రోజులు ఉపవాసాలుండేవారు, జనాలు ఎప్పుడైనా మిగులు అన్నం తెస్తే ఆ మిగిలిన అన్నాన్ని ఎంబెట్టుకుని ముల్లెకట్టుకుని పోయేవాళ్ళు, తిండి దొరకని చోట ఆ ఎండిన అన్నాన్ని తాలింపు (పోపు) చేసుకుని లేదా కారం కలుపుకుని తినేవాళ్ళు, అటవీ పళ్ళను, దుంపలను కూడా తినేవాళ్ళు కాని అటవీ జంతువులను వేటాడే వారుకాదు, నీళ్ళు దొరకని రోజుల్లో చాలా ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా ఎండాకాలంలో శత్రువు ఎప్పుడూ నీటి వనరులచోటే, మడుగుల చోటే మాటుకాసేవాడు అలాంటి సందర్భాలల్లో పల్లపుల్లలు వేసుకుని లాలాజలాన్ని నోటిలో ఊరించుకుని దప్పిక తీర్చుకునేవాళ్ళు, మురికి నీరు దొరికిన చోట చెట్ల మూలికలు వేసుకుని శుద్దిచేసుకుని తాగేవాళ్ళు, వందల కిలోమీటర్ల నడక, పాదాలు పొక్కులుపడి గాయలవడం, చెప్పులు తెగిపోవడం, ముళ్లు కుచ్చుకోవడం, పాదాలకు గాయాలవ్వడం సర్వ సాధారణం… కాని లక్ష్యం హిమాలయాకన్నా ఉన్నతమైనది కాబట్టి దాని సాధన కొరకు ఆమె ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తూ సమ్మక్క సారలమ్మ లకు వారసత్వంగా నిలిచింది సీతక్క. ఇలా సీతక్క ఉద్యమ జీవితం తియ్యగానూ – ఉప్పగానూ 1996 వరకూ సాగింది.

జన శక్తి పార్టీ (C.P.I-ML ) లో సంక్షోభం:

ఈ క్రమం లో రకరకాల విభిన్న రాజకీయ ధోరణులు పార్టీ లో పొడసూపాయి. బాహ్య ప్రపంచం లో జరుగుతున్న దళిత ఉద్యమాల ప్రభావం, దళితులపై జరిగిన దాడులు, హత్యలు, మహిళల పై అతాచారాలు మొదలైన సంఘటనలు, ప్రపంచీకరణ అంశాలు, సోవియట్ రష్యా, చైనాలల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు దిగజారిపోయి సామ్రాజ్య వాదం వైపు అడుగులేస్తున్న ధోరణులు భారత దేశ విప్లవ ఉద్యమాలపై తీవ్ర ప్రభాలను చూపాయి. ఒక వైపు దళిత వాదనా, కుల వర్గ వాదన, మరో వైపు వ్యతిరేక వాదనలు, నాయకత్వ సమస్యలు జనశక్తి పార్టీని కూడా తీవ్ర సంక్షోభం లోకి నెట్టాయి. వీటి ప్రభావం అడవిలోని దళాల్లోకి, మైదాన ప్రాంత పార్టీ లోకి చేరడం, వీటి ఆధారంగా చర్చలు కుప్పలు తెప్పలుగా జరిగడం, మొదలైన అంశాలన్నీ రాజకీయాల విభేదాలకే కాదు వ్యక్తిగత విభేదాలకూ దారితీసాయి. కొంత కాలం ఐక్యతాగానం మరికొంత కాలం చీలిక రాగం కార్యకర్తల్లో గందరగోళ పరిస్తితులను సృష్టించాయి. విప్లవ పార్టీల, ఉద్యమాల ప్రాభాల్యమే తక్కువ అందులో అప్పుడే ఇన్ని విబిన్న కోణాలు, ఒకరిఒకరు విమర్శించుకోవడం మొదలయిన కారణాలరిత్యా చాలా మంది కామ్రేడ్స్ విప్లవ రాజకీయాలనుండి జారుకోవడం మొదలయింది. కొంతమంది వీరన్న దళిత ఆలోచనా విధానం లోకి వెళ్ళారు, కొందరు వేరే విప్లవ పార్టీలోకి వెళ్ళారు. మరికొందరు కొందరు ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. రాము లాంటి కొందరు ఆదివాసి విముక్తి పోరాట బాట పట్టారు. ఇలా చెల్లాచెదురైన కాలంలో పార్టీ రాష్ట్ర స్తాయి నుండి గ్రామ స్తాయి వరకు నిట్టనిలువునా చీలింది. పార్టి క్యాడర్ లో నమ్మకం సడలింది. సీతక్క కూడా విప్లవ బాట నుండి ఇంటిదారి పట్టింది.

సీతక్క అనసూయ గా పునర్జన్మ:

సీతక్క విప్లవ పార్టీతో, తన సహచరునితో తెగతెంపులు చేసుకుని బాధా తప్త హృదయంతో, కన్నీటిని దిగమింగుకుని పోరు బాట వదిలి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టి పాత కేసులో గౌరవంగా న్యాయస్థానం ముందు లొంగిపోయింది. తన ఆత్యంత సన్నిహిత స్నేహితుల సహకారంతో జైలు నుండి విడుదలయ్యి బయటి జీవితం మొదలుపెట్టింది. మధ్యలో వదిలేసిన విద్యనూ తిరిగి ప్రారంభించి సింగల్ సిట్టింగ్ లో ఇంటర్ పూర్తిచేసి, తర్వాత పడాల రామిరెడ్డి లా కాలేజి వరంగల్ లో 5 సం. లా డిగ్రీ చదువుతూ, జీవనాధారం కొరకు ‘యక్షి’ అనే స్వచంద సంస్థ లో వుద్యోగం చేస్తూ లా కోర్సు పూర్తి చేసింది. ఏ న్యాయవాది తన కేసులను వాదించారో ఆ న్యాయవాది అయిన శ్రీ వెంకటస్వామి రెడ్డి గారి దగ్గర జూనియర్ గా పనిచేసింది. మెల్లమెల్లగా సాధారణ జీవితాన్ని అలవర్చుకొంది. అయినా తన అంతరాలల్లో ఏదో మూలన ప్రజా జీవిత జ్ఞాపకాలు, ఆ పోరాటాలు, అడవితో అడవిబిడ్డలతో పెనవేసుకున్న అనుబంధాలు సుడులు సుడులుగా తన కళ్ళముందే కదలాడ సాగాయి, తిరిగి ఉద్యమం లోకి పోయే పరిస్తితి లేదు అలాగని ప్రజలను వదులుకునే స్తితిలోలేదు, ఆ వెలితి అలాగే మిగిలి ఏదో చేయాలనే తపన మాత్రం తనను నీడలా వెంటాడుతూనే వుంది.

ఆమె విప్లవోద్యమ జీవితమంతా వరంగల్ జిల్లాలోనే కొనసాగడం అక్కడి ప్రజలల్లో తలలో నాలుక గా మెదలడం, పార్టీని సీతక్క వదలడం ప్రజలకు మొదట్లో కొంత వ్యతిరేకత వున్నా సీతక్క పనివిధానం, పనిచేసిన సమయంలో వాళ్ళపట్ల చూపిన ప్రేమ, సమస్యలపై స్పందించిన తీరు తదితర కారణాల మూలాన అక్కడి ప్రజల్లో చెరగని ముద్రవేసుకునివుంది. ఉద్యమబాట వదిలినా ఆ ప్రజలతో తత్సంబందాలు కొనసాగించింది. ఈ క్రమంలో 2004 లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, అదే సమయం లో అక్కడి ప్రజలు, మిత్రులూ అసెంబ్లీకి పోటీ చేయమని ప్రతిపాదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన శక్తివంతమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ప్రజా సేవలోకి రమ్మని ఆహ్వానించారు. మొదట్లో తడబాటుకు గురైనా తర్వాత ‘ఎలా, యెట్లా’ అనే సందేహాలు ఆమెకు, ఆమె సన్నిహిత మిత్రులకు మెదడులో బీజ రూపంలో తొలవడం మొదలయింది. స్వతంత్ర్య అభ్యర్తిగా పోటీ చేయాలనుకున్నారు, కాని ఈలోగా తెలుగు దేశం పార్టీ నుండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయమని వర్తమానం, ఆహ్వానం వచ్చింది. కాని ఒక పెద్ద సంశయం, విప్లవోద్యమంలో వున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ‘ఎన్ కౌంటర్’ పేరున హత్య చేయడం ద్వారా ఎందరో మిత్రులను పోగొట్టుకోవడం, ఇవ్వాల్ల అదే పార్టీలో చేరడం ‘ఎలా’ అని తర్జన బర్జన లకు గురికావడం జరిగింది. కాని వున్న పార్లమెంటరీ పార్టీలల్లో ఒక నిర్మాణ పద్దతిలో నడుస్తున్న పార్టీ తెలుగు దేశం, డ్వాక్రా గ్రూపుల ద్వారా, మైక్రో ఫైననాన్స్ ల ద్వారా మహిళల వున్నతికి పాల్పడిన పార్టీగా, వెనకబడిన బడుగు బహీన వర్గాల పార్టీగా పేరుతెచ్చుకున్న పార్టి తెలుగు దేశం పార్టీ, గ్రామస్తాయి వరకు రాజకీయాలను నేర్పిన పార్టీ తెలుగు దేశం అని నిర్దారణకు వచ్చి, వాళ్ళ ఆహ్వానాన్ని అంగీకరించింది. ఆనాడు అది తప్పో ఒప్పో తేల్చుకోలేక చివరికి తెలుగు దేశం లో చేరడం పోటీ చేయడం, ఓడిపోవడం కూడా జరిగింది.

ఏదేమైనా తన భావాలను వదులుకోకుండా, ఏ పార్టిలో వుంటే ఎంటి అని గుండెదిటవు చేసుకుని ప్రజాసేవకు కేవలం ఒక వేదిక కావాలని తెలుగు దేశం తరుపున 2004 అసెంబ్లీ పోటీలోకి దిగిందనేది సత్యం. అప్పటికే మలిదశ తెలంగాణా ఉద్యమం రాజుకుంటున్న తరుణం, తెలుగు దేశం పార్టీ ఆంధ్రా పార్టీ అని ముద్రపడడం ఆ పార్టీ పట్ల తెలంగాణలో వ్యతిరేకత పవనాలు వీయడం లాంటి కారణాలవల్ల ఈ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని తెలంగాణా ప్రజలు తిరస్కరించడం తత్పలితంగా సీతక్క కూడా పోడెం వీరయ్య చేతిలో ఓటమి పాలవడం జరిగింది. ఆమెకు ఈ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ కొత్త అయినా మొదటిసారే ఓడిపోయానని గుండేజారేలేదు, ధైర్యం కోల్పోకుండా ప్రజలతోనే వుంది, రోజువారి సమస్యల పట్ల స్పందిస్తూ తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో అయిదు సంవత్సరాలు వేచివుంది. ఈ కాలంలో తన సంబంధాలను సంఘటితపరుచుకుని తిరిగి తెలుగు దేశం పార్టి తరుపున 2009 లో పోటీచేసి పోడెం వీరయ్య పై ఉమ్మడి వరంగల్ జిలలోనే అత్యధిక మెజారిటీ లో గెలుపొందింది.

బెరుకు బెరుకుగా అడవి నుండి అసెంబ్లీ లోకి ప్రవేశించింది, MLA గా మొదటిసారి “ధనసరి అనసూయ అనే నేను” అంటూ ప్రమాణ స్వీకారం చేసింది, కొత్త జనాలమధ్య, కొత్త సంబంధాల, కొత్త పాలక రాజకీయాల మద్య కొత్త జీవితం ప్రారంభించింది. ఒక సందర్భం లో తెలుగు దేశం లో ఎందుకు చేరావని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “ఒక నిర్మాణ వ్యవస్థ కలిగిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని, సి.పి.ఐ, సి.పి.యం పార్టీ లు తప్పా వేరే ఏ పార్టీలు ఒక నిర్మాణ క్రమశిక్షణ, నిబద్దత గల పార్టీలు కావని, వేరే పార్టీలల్లో నాలాంటి అభ్యర్తులనుండి కూడా సీట్ ఇవ్వడానికి డబ్బుతీసుకుంటారని కాని నన్ను ఆదరించి పైసా ఖర్చులేకుండా గెలిపించిన పార్టి తెలుగుదేశం పార్టి అని చెప్పింది.” అసెంబ్లీ లో కూడా పార్టీ విభేదాలు లేకుండా ఒక ‘అడవి బిడ్డా’ అని మిగతా పార్టీలవాళ్ళు కూడా సీతక్క ను ఆదరించడం, విలువనీయడం వెనక తన పూర్వ ఉద్యమ ప్రభావమేనని తన మూలాలను గుర్తుచేసుకుంటూనే వుంది.

మొదటి సారి అసెంబ్లీ లో గిరిజన ఆరోగ్య భద్రతపై మాట్లాడి తోటి సభ్యుల మన్నలను పొందింది. “గిరిజనుల తండాలల్లో విషపురుగుల ప్రమాదం, దోమలు, వైరస్ లాంటి సూక్ష్మజీవుల బెడద వల్ల తరచుగా మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు రావడం, గిరిజనులు అనారోగ్యం పాలుకావడం, మరణాలు సంభవించడం మామూలే. వీటివల్ల రోజు రోజుకు గిరిజన జనసంఖ్య తగ్గుతుంది కావున ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని” అసెంబ్లీ లో గట్టిగా డిమాండ్ చేసింది. ఈ కాలంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నది, కాకతీయ విద్యార్థులకు సంఘీభావంగా ఎనిమిది రోజులు ఆమరణ నిరాహర దీక్షలో పాల్గొని అరెస్ట్ అయి రెండ్రోజులు జైలుకు పోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టి లో వుండడం, 2009 నుండి 2014 కాలంలో తెంగాణ మొత్తం మలిదశ తెలంగాణా పోరాటాలు ఉదృతం కావడం, అన్ని పాలక వ్యవస్థలు నిర్వీర్యం కావడం మూలానా నియోజకవర్గంలో అనుకున్న అన్ని హామీలు నెరవేర్చలేకపోయింది. అయినా తన పరిదిలో కొన్ని రహదారుల నిర్మాణం, కొన్ని ప్రాంతాలకు తాగునీరు తేవడం, మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో, పడిగిద్దేరాజు గద్దెను సాధించడం మొదలైనవి సీతక్క కృషి ఫలితాలు. వైద్య సదుపాయాల పరికల్పనలో, భూమి పట్టాలను ఇప్పించడంలో శక్తివంచనలేకుండా పనిచేసిందనడంలో సందేహం లేదు. అయినా ప్రతిపక్ష పార్టీలో వుండడం ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే వుండడం తదితర కారణాల చేత అనుకున్న అభివృద్దిని నియోజకవర్గం లో సాధించలేక పోయాన్ని తానె స్వయంగా చెప్పుకొచ్చింది.

సకలజనుల సమ్మె, మిల్లెనియం మార్చ్, సాగరహార దిగ్భందం, విద్యార్థుల బలిదానాలు, జాతీయ రహదారుల పై వంటావార్పు, కొదండరాం నాయకత్వంలో అన్ని ప్రజాసంఘాలు ఐక్య పోరాట వేదికగా ఏర్పడడం, తె.రా.స (టి.ఆర్.ఎస్) నాయకుడు కే.సి.ఆర్ నిరాహార దీక్ష, సి.పి.ఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఒప్పుకోవడం, ఉద్యమాలు చేయడం, భారతదేశం లోని మెజారిటీ రాజకీయ పార్టీలూ అంగీకరించడం అన్నీ కలిసి కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి పెరగడం మూలాన సోనియా గాంధి పార్లమెంట్ లో ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణా బిల్లు పెట్టడం, ఆమోదించడం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తె.రా.స మెజారిటీ సీట్లలో విజయం సాధించడం జరిగింది. తె.రా.స ప్రభుత్వం ఏర్పడి కే.సి.ఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ఈ ఎన్నికలల్లో ములుగు నియోజక వర్గం నుండి టి.డి.పి నుండి మళ్ళీ సీతక్క పోటిచేసింది. తెలంగాణా తెచ్చిన పార్టిగా తె.రా.స పవనాలు రాష్ట్రమంతటా వీచడం మూలానా సీతక్క ఓడిపోయింది. తెలంగాణా ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ తెలంగాణలో గెలువలేకపోయింది, కేంద్రంలో భా.జా.పా (బి.జే.పి) కాంగ్రెస్ ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకొంది. ఆ తరువాత జాతీయ రాజకీయలల్లో మరియు ప్రాంతీయ రాజకీయాల్లో పెనుమార్పులు, కూటముల తారుమారు, స్నేహితులు శత్రువులుగా, శత్రువులు స్నేహితులు గా మారడం లాంటి మార్పులు చకా చకా జరిగిపోయాయి.

మేడారం జాతర – సీతక్క:

సీతక్క గురించి వ్రాసినప్పుడు మేడారం జాతర దాని చారిత్రక ప్రాశస్త్యం ఉటంకించడం అవసరం. ఎందుకంటే బతుకమ్మ అంటే కవిత ఎలా గుర్తుకు వస్తుందో సమ్మక్క-సారలమ్మ జాతర అంటే సీతక్క అలానే గుర్తుకువస్తుంది. నిజానికి సేతక్కే మేడారం జాతరకు ప్రజల బ్రాండ్ అంబాసాడర్. రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర దీనికి దాదాపు కోటి మంది వస్తారు. విగ్రహాలు లేని గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జాతర. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మ లను స్మరించుకొంటూ జరుగుతుంది. క్రీ.శ. 1260 నుంచి 1320 కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు కాకతీయుల సామంతరాజు గా పరిపాలించే వారు. పడిగిద్దరాజు సతీమణి సమ్మక్క వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడడంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితిలో పగిడిద్దరాజు కప్పం కట్టలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు కాకతీయ సైన్యాన్ని పంపి ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పడిగిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది.

తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడి ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది అని ఇక్కడి ప్రజల విశ్వాసం. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను వంశపారపర్యంగా వస్తున్న గిరిజన పూజారులు తీసుకువస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణి రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.

కోయ గిరిజనుల ఆరాధ్య వన దేవతల జాతర ఉనికిని ప్రచారంలోకి తేవడంలో సీతక్క మొదటినుండి చాలాకృషి చేసింది. రహదారులు లేని, నీటి వసతులులేని, నివాస గృహాలు లేని మేడారాన్ని నేటి స్తాయి మేడారంగా తీర్చిదిద్దడంలో సీతక్క పాత్ర శ్లాఘనీయం. మేడారం జాతర ప్రారంభానికి దాదాపు నెల రోజులనుండే సీతక్క అక్కడి పనుల పురోగతిని పరిశీలిస్తూ పనులను వేగవంతం చేయించడం లో నిమగ్నమౌతుంది. పడిగిద్దరాజు గద్దెను మేడారంలో సాధించడంలో సీతక్క కృషి గొప్పది. కోటిమంది హాజరయ్యే ఈజాతర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించడంలో, ఇతర అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో సమన్వయం చేసుకోవడంలో, జాతరకు సరిపోను నిధులను సాధించడంలో ఆమె పాత్ర గొప్పది. ఈ జాతర ప్రాముఖ్యాన్ని నలుదిశల వ్యాప్తిచేయడంలో ఆమె కృషి అభినందనీయం. గత జనవరి, ఫిబ్రవరి మాసాలల్లో పూర్తికాలంగా సీతక్క మేడారం లోనే ఉంటూ జాతర విజయవంతానికి కృషి చేసింది. ఈ జాతరకు గౌరవాన్ని పెంపొందిచడంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత గుర్తింపు తేవడంలో సీతక్క కృషి అమోఘమైనది.

తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్స్ లోకి ప్రయాణం:

తెలంగాణ టి.డి.పి. లోని యువ నాయకత్వం కాంగ్రెస్ లోకి పోవడం, కొంతమంది తె.రా.స లోకి పోవడం, తెలంగాణా లో టి.డి.పి. బలహీనమవడం కారణాలు ఎమైతేనేమి సీతక్క, రేవంత్ తదితర నాయకులు కాంగ్రెస్ లోకి పోవడం జరిగింది. గత ఓటమిని గెలుపుకు సోపానం అనుకుని తన నియోజకవర్గం లో జనంలో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తూ తన పునాదిని గట్టిపరుచుకుని ముందస్తుగా వచ్చిన 2018 ఎన్నికలల్లో మళ్ళీ ములుగు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి అజ్మీర చందూలాల్ (తె.రా.స) ను ఓడించి గెలుపొంది. అసెంబ్లీ లో మళ్ళీ MLA గా అడుగిడింది. గత ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయంగా చాలా మార్పులు జరిగాయి, కేంద్రం లో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో టి.అర.ఎస్ గెలుపొందగా, ఆంద్ర ప్రదేశ్ లో టి.డి.పి. ఓడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్, టి.డి.పి లు పొత్తుపెట్టుకుని పోటీచేసి దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోయింది. గెలిచినా కొద్దిమంది కాంగ్రెస్ MLA లు సైతం తె.రా.స. లో చేరి మంత్రిపదవులుకూడా పొందారు.

సీతక్కను ను కూడా తె.రా.స. లో చేరమని ఒత్తిడులు, నజరానాలు ఇస్తామని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ ను వదలలేదు. కాంగ్రేస్ పార్టీ కూడా సీతక్కకు తగిన స్తానాన్ని కల్పించి అఖిలభారత మహిళా కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చింది. చత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను కూడా చూస్తుంది. సోనియా గాంధి, రాహుల్ గాంధి ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో దూసుకుపోతుంది.

ఈ కాలంలో ధర్నా చౌక్ ఎత్తివేయడానికి వ్యతిరేకంగా, డబుల్ బెడ్ రూమ్ ల సాధనకై, నియోజవర్గ సమస్యల సాధనకై, మేడారం జాతరకు నిధులు సాధించడంలో ఇలా చాల విషయాల్లో ప్రభుత్వం తో పోరాటంచేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఉహాన్ లో వూడిపడ్డ కరోనా స్మూక్ష జీవి ప్రపంచాన్ని చుడుతున్న తరుణంలో భారత్ లో కూడా ప్రవేశించింది. ఒకవైపు గుజరాత్ లో హల్లో ట్రంప్ కార్యక్రమం, మరోవైపు కరోనా ఆక్రమణ రెండూ ఒకేసారి జరిగాయి కాని ట్రంప్ ఒక బాహుబలిలా బారతీయులకు ప్రత్యక్షమై ఆ మైకంలో ప్రభుత్వాలు తెలియాడుతుంటే మరోవైపు అదృశ్య సూక్ష్మ జీవి మెల్లిమెల్లిగా ఖండాంతరాలు దాటి ఇండియాలో ఏ స్వాగతం లేకుండానే ప్రవేశచింది.

కరోనా ఉత్పాతం పై సీతక్క యుద్ధం:

కరోనా ప్రవేశం, సరిగ్గా ఇదేసమయంలో తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు చైనాలో, ఇటలీలో, స్పెయిన్ లో ఇతరదేశాలల్లో కరోనా బారినపడి చనిపోయిన వారిశవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్న తరుణం. ఇదే సమయంలో మొట్టమొదటిసారి అసెంబ్లీ లో కరోనా పై ప్రస్తావన చేసింది సీతక్కనే. అంటే ఆమె ముందుచూపు ఎంతుందో అది అర్థమవుతుంది, మాస్కుల గురించి, సానిటైజర్ లగురించి ప్రభుత్వాన్ని నిలతీసింది. కాని ప్రభుత్వ పెద్దలు ఆమెను అవహేలనచేసారు. కరోనా “రమ్మన్న రాదు” అని భాద్యత గల ప్రభుత్వమే అసెంబ్లీ లో ప్రకటించింది. అసలు ఈ దేశంలో ఒక్క కేరళ మినహా అన్ని రాష్ట్రాలు కరోనాను తేలికగా తీసుకున్నారు, కాని అనతికాలంలోనే దేశమంతా మార్చ్ 22, 2020 నుండి లాక్ డౌన్ ప్రకటించి ఇప్పటికి కొనసాగిస్తున్నారు. చప్పట్లు కొట్టించారు, దీపాలు పెట్టించారు, రవాణా బందుచేసారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బందుపెట్టారు, వలస కార్మికులు ఉపాది కోల్పోయి ఎక్కడి వారు అక్కడే వుండిపోయారు, సర్వం బందు చేసారు, రోజువారికూలీల పరిస్థితి “అటు ఉట్టికి ఇట స్వర్గానికి” నోచుకోలేక, వాళ్ళ ఇంటిమీద బెంగతో సంకలో పిల్లతో, నెత్తిన ముల్లెతో వేల వేల కోసులూ నడస్తూ నడుస్తూ నడుస్తూ వూపిరులను సైతం కోల్పోతూ అటు సరిహద్దులు దాటలేక ఇటూ వున్న వూరిలో ఉండలేక నరకయాతన పడుతూనే వున్నారు.

ఇలాంటి అనుభవాలను ప్రత్యక్షంగా తన కళ్ళతో స్వయంగా చూసిన సీతక్క నడుం బిగించి తన నియోజక వర్గ ప్రజల సేవకై రంగంలోకి దిగింది. ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోక గత 40 రోజులుగా తన నియోకవర్గ ప్రజల ప్రధానంగా కోయ గిరిజననుల తో పాటు నియోజకవర్గ ప్రజల ఆకలి తీరుస్తుంది. గిరిజనులు నివసించే గ్రామాలన్నీ మారుమూలల్లో అడవుల మధ్యలో ఉంటున్నాయి. ఆయా గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం కాదు కదా కనీసం కాలినడక కూడా కనిపించదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి మరీ వారి ఆకలిని తీర్చడానికి కంకణం కట్టుకుని తన ప్రజల కడుపులు నింపే కార్యక్రమాన్ని నిర్ణయించుకుంది సీతక్క. దీనిని ఒక యజ్ఞంలా కొనసాగిస్తుంది. ఈ సేవలకు పునాది రాయి తన విప్లవోద్యమ అనుభవమనే చెప్పకతప్పదు. తన నియోజకవర్గంలో వున్నా 600 గ్రామాలకు చేరుకొని అవసరాలున్న ప్రతి మనిషి ని చేరుకొని వీలైంత మేరకు ఈ ఉత్పాత సమయంలో ఆదుకోవాలనే లక్ష్యం తో ఈ బృహత్కార కార్యాన్ని ప్రారభించి, గత 40 రోజులుగా సగటున రోజుకు 10 గ్రామాలు చుట్టూముడుతూ ఇప్పటివరకు 400 గ్రామాలల్లో ఆకలి తీర్చిందంటే నమ్మశక్యం కాని విషయమే, తన తాహతుకు మించిన పని. అడవి బిడ్డల ఆకలిని తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నది. దట్టమైన అడవుల్లో నివాసం ఉంటోన్న గిరిజనుల కోసం నిత్యావసర సరుకులను చేరవేయడానికి సహచరులతో కలిసి కాలినడకన తిరుగుతున్నారు. కొండలను ఎక్కిదిగుతున్నారు. సామాన్యుల్లో సామాన్యురాలిగా గిరిజనుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తూనే వుంది. రేషన్ కార్డ్ మీద బియ్యం తీసుకునే వెసులుబాటు వున్నా వారికి కూరగాయలు, నేనే,పప్పు దినుసులు, సబ్బులు, సానిటైసర్లు మొదలైనవి అందజేస్తూ అన్ని వర్గాల ప్రజలనుండి జేజేలు కొట్టించుకొంటుంది.

ఈ కరోనా ఉత్పాతం సమయంలో మార్చ్, 22, 2020 న కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలని తన ములుగు ప్రజలకు పిలునిచ్చి విజయవంతం చేసింది. తానూ బయటికి పోకుండా పుస్తకాలను ముందేసుకుని మెదడుకు మేత పెట్టుకుంది. కరోనా వ్యాధితో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు చెబుతూ అన్ని గుళ్ళలో, ప్రార్తనా స్తలాల్లో అప్రమత్తంగా వుండాలని ఎవరైనా విదేశాలనుండి లేదా కొత్తప్రాంతాలనుండి వస్తే సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయల సహాయం ఏమూలకు సరిపోదని దానిని 5000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని ప్రతిసారి గట్టిగా డిమాండ్ చేస్తూనే వుంది. అలాగే రేషన్ ఇచ్చేటప్పుడు వేలిముద్ర పద్దతిని తీసివేసి ప్రత్యామ్నాయ పద్దతిలో ఇస్తే కరోనా వ్యాప్తి జరగకుండా వుంటుంది అని సలహా ఇచ్చింది. మిర్చి రైతులకు, కూలీలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రతలను ఆ తోటలకు స్వయంగా వెల్లి వివరించింది. జగ్గన్నపేట ఏరియా లో మార్చ్ 23న షహీద్ భగత్ సింగ్ వర్దంతి జరుపుకుని ఆ స్పూర్తితో తన కార్యా చరణను ను రూపొందించుకుని, మార్చ్ 27 న రోజున ఆదివాసి పోరాట యోధులు అమరులు తన భర్త కా.రాముకు, అన్న కా.సాంబయ్య లకు మోకాళ్ళ పల్లె లో జోహార్లు అర్పించి కరోనాపై యుద్దానికి బయదేరింది. కరోనాతో యుద్దంలో నష్టపోయే రోజువారి మిర్చి కూలీలకు ములుగు MLA కార్యాలయం నుండి 28 మార్చ్ న దాదాపు 60 కుటుంబాలకు బియ్యం, పప్పు, కూరగాయాలు, నూనె అందజేసింది. తరువాత ఒడిషా వలస కూలీలకు భోజనాలు ఏర్పాటుచేసింది. గుత్తి కోయల, ఇతర గిరిజన, దళిత గూడాల్లోకి వెళ్లి నెలకు సరిపడా తినుబండారాలను అందజేస్తూ కరోనా మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచడం కూడా తన కార్యక్రమంలో భాగం చేసుకుంది. ఈ క్రమమంలో దాతలను గుర్తిస్తూ వారిని సంప్రదిస్తూ సరుకులను సమకూర్చుకుంటూ 50, 60 కి.మీ. దూరంలో వున్నా కోయ గూడాలకు అందజేసింది. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల గురించి స్పందించి సహాయం చేసింది వాల్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది. అలా తన సేవ కార్యక్రమాలను విస్తరిస్తూ కనీసం దారిలేని ‘జలగా లంచ’ గుత్తి కోయ గూడానికి ట్రాక్టర్ నిండా వాళ్లకు సరిపడే సరుకులు తీసుకెళ్ళి పంచుతూ శుభ్రత గురించి వివరిస్తూ ఈ వైరస్ ఏ కులానికి, మతానికి చెందింది కాదు కావున ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు అని కూడా ఆ గూడాల ప్రజలకు తెలిజేసింది. ఇలా రోజూ పల్లె గూడాలకు చేరుకుంటూ నిత్యావసర సరుకులు అందజేస్తునేవుంది.

ఏప్రిల్ 4న తాడ్వాయి మండలం లో ఐసోలేషన్ వార్డు సందర్శించి, అకినేపల్లి ST కాలనీలో   స్తానిక నాయకుల సహకారంతో పేదలకు ఆహార సరుకులు పంపిణీ చేసింది. గ్రామ గ్రామన వున్న మునిసిపాల్ వర్కర్ లకు సహాయాన్ని ప్రకటించి సానిటైజర్ లు, మాస్కులు అందచేసింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తారు అనే నినాదం తో దాతలను ప్రోత్సహించి నిరుపేదలకు ఆకలి లేకుండా చేయడానికి భగీరత ప్రయత్నం చేస్తూ తన రణాన్ని/యుద్ధాన్ని కరోనపై సాగిస్తూ ముందుకు సాగుతూనే వుంది. పోలీసులకు, ఆశ వర్కర్ లకు, చర్చ పాస్టర్లకు, ఆటో డ్రైవర్లకు బియ్యం, కూరగాయలు, నూనె, ఉప్పు, పప్పులు, సబ్బులు తదితర నిత్యావసర సరుకులను అందజేసింది. తనవంతు సహకారం చేసింది. “నా ప్రజలకు ఏకష్టం వచ్చినా, నేను ముందుండి ఎదుర్కొంట” అని తన బాటలో తానూ సాగుతూనే వుంది. ఇలా ప్రతిరోజూ కొన్ని ఏజెన్సీ గూడాలను సందర్శిస్తూ కరోనా జాగ్రత్తలూ చెబుతూ సరుకులు అందజేస్తూనే వుంది. “ఒక నిజమైన విప్లవకారుడే సమాజాన్ని గొప్ప ప్రేమభావం ద్వార నడిపించగలుగుతాడు అనే చే గువేరా సూక్తిని” నమ్ముతూ సాగుతున్న గొప్ప త్యాగశీలి మన సీతక్క. కొత్తగూడ, గంగారం మండలాల్లో రేషన్ కార్డ్ లేని పేద కుటుంబాలకు మరియు 11 గ్రామాల పేదలకు ప్రతి ఇంటికి కూరగాయలు, బియ్యం, నూనె పంచారు. అలాగే సీతక్క నాయకత్వంలో కర్లపల్లి, బూదిదగడ్డ గుత్తికోయ కుటుంబాలకు 5 కే.జి ల బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె అందించారు. సీతక్క ఫౌండేషన్ ద్వారా నడుస్తున్న స్కూల్ లో కూడా సరుకులను, భోజానాలను అందజేసింది. వాగులు వంకలను, ఒర్రేలను, కొండ గుట్టలను, ముళ్ళ డొంకలను దాటుతూ అంగరక్షకులు లేకుండానే ఎడ్ల బండ్ల పైన, కాలినడకన, ట్రాక్టర్ల పైన ప్రతి పల్లెను, గూడాలకు చేరుకుంటూ కరోనా పై అవగాహనా పెంచుతూ, నిత్యావసర సరుకులను అందజేస్తూనే వున్నారు.

సీతక్కకు అడవంటే ఇష్టం, అడవిలో నడవడం అంటే ఇష్టం. అందుకే బుక్కెడు బువ్వలేని నిరుపేద గిరిజన, బహుజన ప్రజలకు పిడికెడు బువ్వ పెట్టడడమే లక్షంగా ఆనాడు గన్నుతో తిరిగిన అక్క ఈ రోజు పికెడు బువ్వతో ఆకలి తీరుస్తూవుంది. ఈ లాక్ డౌన్ కాలమంతా ఆమె తిండి తిప్పలు అన్నీ జనం తోనే కలిసి చేస్తుంది అంటే ప్రతీ రోజు జనంలోనే వుంటుంది. ఈ రకంగా ప్రతి రోజున ఇప్పటివరకు ఎవరూ కాలిడని గ్రామాలకు చేరుకుంటూ వాళ్ళ ఆకలిని తీరుస్తున్న వనదేవత సీతక్క. తీవ్రమైన ఎండల్లో గుడాలల్లో గుడిసేకప్పులకిండా సేద తీర్చుకుంటుంది. వాహనాలు పోలేని దారుల్లో ఒక్కోక్కోసారి 20 నుండి 30 కి.మీ. దూరం కాలినడకన నడుస్తూ ప్రతి పల్లె గుడిసెను తాచ్చాడుతూ గుమ్మాలను ముద్దాడుతూ వాకిల్లల్లో సెద తీర్చుకుంటూ సైనికునిగా సాగుతున్న సీతక్క హృదయం పాదరసంలా పేదవాళ్ళ మనసులచుట్టూ తిరుగుతూనే వుంది. ఈ పయనంలో మద్ది మడగ ఆదివాసీలతో చెలిమెల నీళ్ళు తాగుతూ వాల్ల అడుగుల్లో అడుగులేస్తూ ధైర్యాన్ని నింపుతూ కరోనాపై అవగాహన చేస్తూ సివంగిలా సాగుతూనే వుంది.

“నా దృష్టిలో మానవత్వం మన మతం” అంటూ ఐసోలేషన్ నుండి బయటపడిన ముస్లిం సోదరులకు సాదరంగా స్వాగతం పలికింది, ముస్లిం సోదరులు తాము బయటపడిన సంతోషం లో పేదల సహాయానికి 20000 రూపాయలు సహాయం చేసారు అంటే ఆక్కను గుండెల్లో ఎలాపెట్టుకున్నారో అర్థంచేసుకోవచ్చు. గో హంటర్ గో (పో ఆకలి పో) అంటూ చాలా మందికి చాలెంజ్ విసిరి ఇతరప్రాంతాల వారని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తూ తన ముద్రను చూపిస్తుంది. తీవ్రమైన ఎండల్లో సైతం ఒక్కొక్కసారి తిండి లేకున్నా జనం చూపిస్తున్న ప్రేమ అనురాగాలతో కడుపునింపుకుంటూ ఆ బాధలను మరచిపోతూ చిరునవ్వు నవ్వుతూ తన పని తానూ చేసుకుంటూ పోతుంది. గుట్టలు ఎక్కుతూ దిగుతూ జనాలను చేరుకోవడం కాలు బెనకడం, అనారోగ్యంతో ఒక్కొక్కోసారి ఇబ్బంది పడినా తానూ చూడాలనుకున్న మరో ప్రపంచాన్ని స్వప్నిస్తూ సాగుతూనే వుంది. ఇలా దాదాపుగా 40 రోజులుగా జనంలో వుండి జనం కొరకే జీవిస్తున్న సీతక్క ములుగు ప్రజలకు దొరికిన కోహినూర్ వజ్రం, నల్ల కోయిల. ఇప్పటికే తన నియోజక వర్గం లోని అన్ని మండలాలను, గ్రామాలను సంద్రర్శించి వారి ఆరోగ్య, ఆర్థిక భాదలను తెలుసుకుని వారితో మమేకమయి వారి సమస్యల పరిష్కారినికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కరోనా పై యుద్డంచేస్తూ మొత్తంగా నియోజకవర్గ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ, బాదితుల కుటుంబాలలో వెలుగులు నింపుతూ సాగిపోతున్న సీతక్క గిరిజన జాతులకే కాదు ఈ దేశానికే తలమానికం.

సీతక్క తెగింపును, అంకిత భావాన్ని, ఆ మట్టిమనిషి శ్రమను, పేదలకు ఏదో చేయాలనే ఆరాటాన్ని చూసి సామాజిక మధ్యమాలల్లో, జాతీయ అంతర్జాతీయ ప్రసార కేంద్రాలు సైతం సేతక్క కృషిని కొనియాడుతున్నాయి. బి.బి.సి నుండి స్తానిక ప్ర్రాసార సంస్థలు ప్రతిరోజూ సీతక్క డైరీని ఆవిష్కరిస్తున్నాయి. తెలంగాణా మీడియా తో పాటు కర్నాటక, మహారాష్త్ర, ఆంధ్రా, ఓడిశా, చత్తీస్ ఘడ్, తమిలనాడు తదితర రాష్ట్రాల పత్రికలూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మొదలైనవి సీతక్క యజ్ఞాన్ని ఏదో రూపంలో శ్లాఘిస్తున్నారు. ఏ చానల్ లో నైనా, పత్రికలోనైనా, ఇతరత్రా వేదికలల్లో సీతక్క కృషిని కొనియాడుతున్నారు, పాటలు, కవిత, చిత్రాలు, వ్యాసాలు ఎన్నో సీతక్క చుట్టూ తిరుగుతున్నాయి, ఇది ఒక అట్టడుగున వున్న గిరిజన మహిళ విజయమని చెప్పక తప్పదు. తన పనిని చూసి అసూయ పాడేవాళ్ళు వున్నరందం లో స్నాదేహం లేదు.

ముగింపు

సీతక్క జీవితమే మనకు వర్తమాన ఉదాహరణ. అన్నిరకాల జీవన ఆటు పోటులను ఎదుర్కొంటూ దోపిడీ సమాజంలో ఎదురీదుతూ ఈ స్తాయికి ఎదగడం చాలా అరుదూ కష్టతరం కూడాను అందులో స్త్రీ . సీతక్క జీవితం ఏనాడు పూలపాన్పు కాదు. ఆమె ఆనంద పడిన కాలమూ వుంది కుంగిపోయిన కాలమూ వుంది. ప్రజాపోరాటాలల్లో విజయం సాధించినప్పుడు యెంత సంతోషించిందో మిత్రులు అమరులైన సందర్భాల్లో అంతకన్నా ఎక్కువే కుంగిపోయింది. ప్రధానంగా పార్టీని వదిలినప్పుడు తల్లి ఒడినుండి జారిపోయినట్టు కుమిలిపోయింది. భాగస్వామి అయిన సహచరుడి చేయి వదిలినప్పుడు, ఆ సహచరుడిని పోలీసులు పట్టుకుని కాల్చివేసినప్పుడు తన శరీర భాగాన్ని కోల్పోయినట్టు గుండెకోతకు గురైంది. ఇంటికి నిట్టాడు లాంటి అన్న సాంబయ్య (భూషణం) పోలీసుల బూటకపు ఎన్-కౌంటర్ లో హత్య చేయబడి నిర్జీవుడై కళ్ళముందే చితిలో కాలిపోతుంటే తోటి పేగుబంధం తెగిపోయిన బాధను భరించింది. తన కారు చక్రాలకింద ప్రమాదవశాత్తు పడి చిన్నారి చనిపోయినప్పుడు కన్నీటిపర్యంతం అయ్యింది. ఇలాంటి భాదలను, దుఃఖాలనుఎన్నింటినో తన గుండెలో, కడుపులో, అంతరాంతరాలల్లో దాచుకుని సాగుతున్న తొణకని కుండ మన సీతక్క.

సీతక్కను ఒక నక్సలైట్ నాయకురాలుగానో, తెలుగు దేశం, కాంగ్రెస్ కార్యకర్తగానో చూస్తే ఆమెను తక్కువచేసి చూసినట్టుగా వుంటుంది, ఈ పార్టీల పరిధులు ఆమె పరుచుకున్న వృత్తపరిధి కన్నా చిన్నవి కావున వాటి హద్దులు దాటి ఒక మానవత వాదిగా, గిరిజన-దళిత-బహుజనుల చిహ్నంగా చూసి అశేష ప్రజానీకానికి ప్రతీకగా చూడాలి. ఆమె జీవితం ఎందరికో పాఠాలు నేర్పుతుంది. ఆమె ఆత్మవిశ్వాసం, గుండె దిటవు, పట్టుదల, నిరంతర శ్రమ, దృఢసంకల్పమూ మనకు ఉత్తేజాన్నిస్తుంది. ఆమె జీవితం అందరికి ఆదర్శం కావాలని ఆమె ఇంకా ప్రజాసేవలో తన్మయత్వం పొందుతూ ప్రగతిశీల పంథాలో నడువాలని ఆశిస్తున్నాము.                ప్రజాసేవే పునాదిగా కల సీతక్కలాంటి సామజికస్ప్రుహ వున్న ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో చాలా మంది వున్నారు. కనీసం పార్టీలకు అతీతంగా కేవలం ప్రజా అనుకూల – సామాజిక భాద్యత గల నాయకులు కలిసి ఒకత్రాటి పైకి వచ్చి ఇతర ప్రజాస్వామ్య వాదులను, పౌరసమాజాన్ని కలుపుకుని ఇలాంటి కష్టకాలంలో ఆపత్తి సమయాల్లో అవసరాలున్న ప్రజలకు ఆర్థిక, సామాజిక, నైతిక మద్దతును అందజేస్తే…… ఇది ప్రజలలోకి వెళ్లి విస్త్రుతమై బహుళ ప్రయోజనాలను పొందగల్గుతుంది. అప్పుడు ప్రజా నాయకుల జీవితాలకు సార్ధకత వుంటుంది.

చివరగా సీతక్క తన సహచరుడు అమరుడు కా.కుంజా రాము వర్ధంతి సందర్బంగా కవిత యెంతో ఇష్టంగా ఆద్రత, సాంద్రతతో రాసుకుందో…..

ఎక్కడున్నావు
..
…….
ఆ పొడిసే పొద్దు నిన్ను గుర్తుచేస్తూనే ఉంది..

ఎర్రచెక్క భూమి కాలువలో పారే నీళ్లు పాశిపెయిన బువ్వలో కలుపుకొని తాగిన సంగతి గుర్తొస్తే
గుండె ఎక్కిళ్ల రోదనవుతుంది
అప్పుడప్పుడు ఆకలికి దూపకి
ఎండిపోయి ఆరిపోయిన నీ పెదాలు గుర్తొస్తే
ఈ నెలజీతం మొత్తం ఎన్విలాప్ కవరుతో సహ చించి అవతల పారేయాలనిపిస్తది.
ఎన్నిసార్లు చంపినా మళ్ళీమళ్ళీ పుట్టడం
ఎన్నిసార్లు పడ్డ మళ్లీ మళ్ళీ లేచి నిలబడటం
ఎంత గొప్ప జీవితం..
ఇపుడు.
అగర్భ గుడిసెల్లో తాగిన
గంజి తాగాలని ఉంది.
గూడెం ప్రజల కోసం చేసిన పోరాటాలు గుర్తొస్తూ ఉంటాయి
ఇపుడు నీదారిలో నీవెంట నడుస్తున్నాను.

అసలు..
బతికేదే చావడానికైనపుడు
ప్రజల కోసం బతకడం లోనే ఆనందం ఉంది, నిరంతరం ప్రజల్లో ఉంటా మీరు చూపించిన మార్గం లో నడుస్తాం,ప్రజల కోసం పోరాడుతా అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తా.
ఎప్పుడు.
నువ్వు నేర్పిన నీతి లోనే నడవాలనుంది……………….

స్వేచ్చగా ఊపిరి వదులుకోడానికైనా సిద్ధం

లాల్ సలాం కామ్రేడ్                          

 

సీతక్క రామును గుర్తు చేసుకుంటూ

“నువ్వు నేర్పిన నీతి లోనే నడవాలనుంది…. స్వేచ్చగా ఊపిరి వదులుకోడానికైనా సిద్ధం” అని ప్రకటిచింది.

కా.రాము తన జేవిత ఔనత్యాన్ని తృణప్రాయంగ ఆదివాసి విముక్తికై త్యాగం చేసిన మహనీయుడు.

భారతదేశం లో ఒక సరైన చిరునామా లేని ఆదివాసులు నిరంతరం వారి వారి ఉనికిని కాపాడుకొనుటకు, స్వయంనిర్ణయదికారం కొరకు చేస్తున్న ఉద్యమాలకు నాయకత్వం వహించి కా.రాము ఆశయాలను కొనసాగిస్తూ ఇలాగే సాగాలని కోరుకుంటున్నాం.

దనసరి అనసూయ అలియాస్ సీతక్క భారత గిరినోధ్యమం లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించి మూలవాసి, ఆదివాసి చరిత్రలో నిలిచిపోవాలని ఆశిద్దాం.

సీతక్క ఆశయాలూ ఆచరణ రాబోయే తరాలకు ఇటు గిరిజనులకు అటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలకు గీటు రాయి కావాలని కోరుకుందాం.

జై సీతక్కా ….. జయహో సీతక్కా ………..

*

 

శ్రీనివాస్ శ్రీ రంగనాయకుల

శ్రీనివాస్ శ్రీరంగనాయకుల, సిరిసిల్ల ఊరు, సహచర శీను గా పరిచయం, ఉపాద్యాయ వృత్తి లో వుండి 2017 వరకు ఇథియోపియా లో ప్రభుత్వ యూనివర్సిటీ లో (హరమాయా యూనివర్సిటీ , జిగ్-జిగా యూనివర్సిటీ) లో ఆచార్యునిగా పనిచేశారు.. విద్యావేత్త, సాహితి ప్రియుడు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chala manchi vyasam Sreenu. Very good introduction to a dedicated life time people’s activist. Seethakka cannot be seen just as a MLA and she is much more than that which you have depicted rightly so. Thank you very much

  • మంచిగా రాసినవే శీనన్న . ఇంటువంటి రాతలు సమాజానికి చాలా అవసరం ✊️

  • Good narration of a great fighter
    This should be translated and sent country wide
    Good inspiring life

  • బాగా రాసినవ్ శ్రీను!. ఒక మంచి బయో పిక్ తీసేందుకు అవసరమైన మంచి కథాంశం- “బులెట్ టు బ్యాలెట్ “ . జీవితంలో ఎన్నో సార్లు ఓడి పోయినా , మొక్కవోని ధైర్యంతో పోరాడి , గెలిచి మళ్ళీ తానేమిటో నిరూపించుకుంది. పాలక పక్షాలు నిర్లక్షము చేస్తున్న గిరిజనుల బాగోగులు చూస్తూ, కరోనా కష్ట కాలంలో ఒక గ్రౌండ్ లెవెల్ కార్యకర్తగా వారికి అండగా ఉంటున్న తీరు చాలా అద్భుతం. సమ్మక్క , సారక్క జాతర కి సీతక్క అంత ఇంపార్టెన్స్ ఎందుకిస్తుందో తెలుపుతూ , సమ్మక్క-సారక్క కథ ని అర్థం అయ్యేలా వివరించడం చాలా బాగుంది. అసెంబ్లీలో అందరికన్నా ముందే కరోనా పై చర్చించడం ఆమె ముందు చూపుకి నిదర్శనం. చివరగా “నువ్వు నేర్పిన నీతి లోనే నడవాలనుంది…. స్వేచ్చగా ఊపిరి వదులుకోడానికైనా సిద్ధం!” అంటూ సీతక్క రాసిన కవితతో ముగించడం బాగుంది. మరిన్ని ప్రజామోదమైన పనులతో ప్రజలలో కలకాలం నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను

  • It is a beautiful portrait of Seethakka with different colors and touch-up of different times. We need more models to listen to the sounds of hunger and other cruelties. Also, we need to be careful about the ruling class and corporate media nexus, which is deliberately bringing the curtain down and trying to ignore the tears and needs of the victims of this political system during Corona times by showcasing the models. Good work dear.

  • వ్యాసం రాసిన తీరు చాలా బాగుంది.

  • చాలా బాగా సీతక్కని పరిచయం చేశారండి

  • సీతక్కను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే నెల జీతం అక్షరాల 2.90 లక్షలు. మీరు చెబుతున్నట్లు ఆమె ఈ 45 రోజుల్లో ఒక్క నెల జీతం కూడా ఖర్చు చేసినట్లు కనబడలేదు. కోట్లు పెట్టినా దొరకని ప్రచారం ఆమెకు దక్కింది. సీతక్క టీడీపీ నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచింది. రెండు సార్లు ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టింది. రెండు పర్యారాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు ఏమాత్రం సంపాదన కూడబెట్టుకుంటారో మీకు నాకు తెలియనిది కాదు. ఇక పత్రికల గురించి మీడియా గురించి ప్రపంచానికి ఎరుకే. మీడియాకు ఏది అవసరమో దాన్నీ ప్రచారం చేస్తుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా బాగా ప్రచారం చేసుకుంటుంది. సీతక్క ఎడ్లబండి మీద ట్రాక్టర్ మీద కూర్చున్న సీన్లను మాత్రమే హైలెట్ చేశారు. కొన్నిసార్లు నడవడం.. చెలిమల్లో నీళ్లు తాగడం.. నిజ జీవితంలో ఆమె ఇలాగే ఉందా.. అసెంబ్లీకి ఎడ్లబండి మీద వస్తుందా? ఇదే ప్రచారం చేస్తున్నారు తప్పితే.. ఆమె ఆదివాసులకు ఏం పెడుతుంది అనే విషయాన్ని చూపడం లేదు. సీతక్క గూడెంలోని ఓ వృద్ధ మహిళనలు అడుగుతుంది ‘నేను ఎవరిని’ ఆమె నీవు ఎవరో నాకు తెలియదు అని కుండబద్దలు కొడుతుంది. అంతాలా ఉంది సీతక్క ప్రచారం. ఓ గంటె పులిహోరా… ఓ కిలో టమాటాలు.. ఇన్ని బియ్యం ఇంతకంటే ఆమె పెట్టినట్లు కనబడలేదు. ఈ మాత్రం సాయం చాలా మంది చేస్తున్నారు. సీతక్క ఆదర్శం అని చెబుతున్నారు. ఆమెను వాళ్లు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఆమె బాధ్యతగా ఉండాలి. సీతక్క 2009 ఎన్నికల్లో గెలిచింది. 2014 ఎన్నికల్లో ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. 2023 ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చేయాలి మరీ.. ఆమె చేస్తున్న సాయం ఆదర్శం కాదు.. అవకాశవాదం ఎంతైనా ఆమె ఓట్ల రాజకీయాలను నమ్ముతుంది కదా.. ఓట్లు వేయించుకున్న నాయకులు ఎలాంటి పులులో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

    • మీ కామెంట్ చూసా…. అర్దం చేసుకున్న…. కోట్లు.పెట్టినా దొరకని ప్రచారం ఈమెకె ఎందుకు దొరకాలి? తృనమో ఫలమో ఇవ్వడడం తప్పంటారా? ఎన్ని కొట్ల ఆస్తులు సంపాదించారొ చెప్పలేదు….. ఒక గిరిజన అతి కింది స్థాయి మహిళ ఈ పాలకవర్గ రాజకీయాలలో ఎదగడం మీరు చూడ నిరాకరిస్థున్నారు…. నేను ఆమెను ఒక పార్టీకి ఆపాడించకుండా ఒక సామాజిక కార్యకర్త గానే చూస్తున్న, అదే అగ్రకుల వ్యక్తి అయితే మీ స్పందన వేరేగా వుండేది. ఒకే… అమె భాద్యత అని గుర్తుచేశారు… మేరు కరాక్టె….. యిదే భాద్యత అందరూ ML A లు యెందుకు చెయడం లేదు? PM నుండి లోకల్ కార్యకర్త వరకు ప్రచారాన్ని చేసుకోవడం లేదా…. గంజాయి వనం లో తులిసి మొక్క ను చూడకపోతే అర్థం కాదు. నేను పరిశీలించిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గురించి వున్న వాస్తవాలనె రాసాను. ముందు ముందు కాలానికి పునాది వేసుకోవడం అతి సహజం. యే ప్రభుత్వాలు కూడా ప్రజల కు ఇచ్చే పథకాలు, సదుపాయాలు ఇలాంటివెనా…. యేదేమైనా ఈ టైం లో అవసరానికి చేయి అందించడమే నా దృష్టిలో గొప్ప. మీ కామెంటుకు ధన్యవాదములు…..

  • ” గూడెం ప్రజల కోసం పోరాడుతా, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తా… ” అని నినాదాలతో కాక ఆశయాలు నిబద్దతో ఆచరణలో చూపుతున్న సీతక్కకు ( ధనసరి అనసూయ అలియాస్ సీతక్క )…

    అతికింది స్థాయి గిరిజన మహిళగా ప్రారంభం అయిన తన మూలాలను… మౌలిక మానవ విలువలను… విప్లవోద్యమ జీవితం, అడవితో అడవిబిడ్డలతో పెనవేసుకున్న అనుబంధాలు… మరవని సీతక్కకు…

    భారత గిరిజనోధ్యమంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలకాలనుకుంటున్న సీతక్కకు….

    లాల్ సలాం కామ్రేడ్ అని అనాలని ఉంది.
    ( అలా అనేటందుకు నాకేవి అర్హత ఉన్నదనే బిడియాన్ని గాలికి వదిలేస్తూ )

  • “ ఎక్కడ ఉన్నా అక్కడ ( ఉద్యమం/దళంలో ) నేర్చుకున్న మంచి అంశాలను పేద ప్రజల కోసం పనిచెయ్యాల… దాన్ని మాత్రం ఎక్కడ ఉన్నా ఇంప్లెమెంటేషన్ చేస్తాము. ఎందుకంటే అందరి యీ సమాజం బాగుండాలె, అంతరాలు పోవాలె. అసమానతలు, కులవ్యవస్థలు ఇవన్నీ ఉండకూడదు అనే ఒక గొప్ప సిద్ధాంతం అక్కడ నేర్చుకున్నాము కాబట్టి దాన్ని ఎక్కడ ఉన్నా ఇంప్లెమెంటేషన్ చెయ్యటంలో తప్పు లేదు.

    లీనమై పోయాం కదా.. చూస్తే అక్కడే, నిలబడితే అక్కడే… చుట్టూ ఉన్నవాళ్లే కుటుంబం, ఆదరించే వాళ్లే ప్రపంచం.

    నాకు తెలిసినంత వరకూ నేను ప్రజలకు అనుకూలంగా పనిచేస్తా.. ప్రజల సంక్షేం కోసం పనిచేస్తా.. మన విధానాలు కచ్చితంగా ప్రజలకు ఇష్టంగా ఉండాలనే అనుకుంటా . నన్ను నేను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తా తప్ప, ఎదుటి వాళ్లు వేలెత్తి చూపే అట్లా ఉండను, ఉండకూడదు. “

    ~ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క

    I decided to come out of the forest… Danasari Seethakka

    Danasari Seethakka, Mulugu MLA and is AICC Women Wing General Secretary. In this interview she shared about her political Career.

    https://hasawics.blogspot.com/2019/01/i-decided-to-come-out-of-forest.html

  • సీతక్క గారి గూర్చి
    నెను చాలా ఇంటర్వ్యూస్ చూసినాను ఉద్ద్యమం భావాలు అనిర్వచనీయం
    ఆదివాసుల గుర్చి అక్క చేస్తున్న పోరాటం మరువలేనిది (సమ్మక్క సారక్క కనిపించని దేవతలు ఐతే )ఆదివాసుల గూడెం ప్రజలకి సీతక్క కనిపించే దేవత

  • Loved the way you have narrated the article Sir Ji.
    Hope you can start writing the books and become an author . Have never seen such dimension of you while working with you. It was great experience working with you at AP College of Education.
    Let’s meet some time when you are available .
    Thank for being a great leader.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు