జెంటిల్‌మెన్ లవ్

“అన్నా! ఒక థమ్సప్, ఒక పాప్‌కార్న్ ప్యాకెట్”

జనం అటూ ఇటూ తోసుకుంటున్నారు. ఆ గోలలో వినిపించలేదో, వినిపించుకోలేదో.. అడిగినవి చేతికందలేదు‌. విసుగ్గా పక్కకొచ్చాడు.

వాళ్లిద్దరికీ పరిచయమై రెండేళ్లు. “మై నేమ్ ఈజ్ ప్రియాంక. ఐ కంప్లీటెడ్…” అంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌ ఇంట్రడక్షన్ క్లాసులో  తొలిసారి తన గొంతు విన్నాడు. వెన్నెల కరగడం, మంచు కురవడం లాంటి అనుభూతులేవీ ఉన్నట్టుండి పుట్టకపోయినా.. తన పట్ల ఆసక్తి కలిగింది. పది మంది తర్వాత తను లేచి పేరు, వివరాలు టకటకా చెప్పేశాడు. ఆ తర్వాత మెల్లగా స్నేహం కుదిరింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరి ఫోన్లోకి చేరాయి. స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లే స్థితిలోనుంచి ఇలా వాళ్లిద్దరే సినిమాలకు వచ్చే అవకాశాన్ని రెండు నెలల నుంచి తీసుకుంటున్నారు. ఇద్దర్లో ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయంలో వాళ్లకి ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్నిసార్లు నువ్వంటే నువ్వని అనుకుంటారు. మరికొన్ని సార్లు నేనంటే నేనని పోట్లాడుకుంటారు.

స్నాక్స్ కౌంటర్ దగ్గర జనం తగ్గారు. అదే‌ టైంలో హాల్ నుంచి తను బయటికొచ్చింది.

‘ఎక్కడా’ అన్నట్టు కళ్లతో చేసిన సైగలు అతన్ని చేరాయి. దగ్గరగా వచ్చి “ఆ సైడ్” అంటూ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోయాడు.

“వద్దులే” అయిష్టంగా బ్యాగ్‌ని మరో చేతిలోకి తీసుకుంది.

“ఎందుకు?”

“బాగుండదు”

“ఏం బాగుండదు?”

“అందరిముందూ నువ్వు నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నిలబడ్డం..”

“ఏం కాదులే! ఏమౌతుంది?”

“లేడీస్ బ్యాగ్ పట్టుకుంటే షేమ్‌గా ఉండదా?”

“షేమ్ ఎందుకు?”

ఆమె చేతిలో బ్యాగ్‌ని పట్టుకున్నాడు.

“నాకిష్టం లేదు. బీ లైక్ జెంటిల్‌మెన్..”

అతను బ్యాగ్‌ వదిలేశాడు. తను ‘షీ’ అని రాసున్న బోర్డ్‌ వైపు వెళ్లింది.

నాన్న గుర్తొచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా షాపులో పని చేసి అలసిపోయి ఇంటికొచ్చే నాన్న. ఆ టైంలో నల్లా దగ్గర అమ్మ అందించే బిందె అందుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడు. ఇబ్బంది అనుకోడు. భుజాల మీద బిందెలు మోస్తూ నవ్వుతూ నడుచుకుంటూ వస్తారు. పదడుగులే! ఆ కాస్త దూరంలోనూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవడం మానరు.

ఇంటర్‌వెల్ తర్వాత మొదలైన సినిమా గంటలో అయిపోయింది. ఇద్దరూ బయటికొచ్చారు. టైం చూసుకున్నాడు. 6:15..

“డ్రాప్ చేయనా?”

“వద్దులే! ఆటోలో వెళ్లిపోతా”

బండి స్టార్ట్ చేశాడు.

వాళ్ల గల్లీ మలుపు తిరుగుతుంటే కనిపించింది ఆ దృశ్యం. నాన్న చేతిలో నీళ్ల బిందె, అమ్మ చేతిలో కూరగాయల సంచీ. పదడుగుల నడక.. అదే ప్రేమ! బొటాబొటి జీతం, అద్దిల్లు, నెలచివరి అప్పులు.. వీటిన్నింటి మధ్య అమ్మ నాన్నను ఎందుకంతలా ప్రేమిస్తుందో అర్థమైంది.

‘నాన్న.. నిజమైన జెంటిల్‌మెన్’ అనుకున్నాడు.

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Literally, నేను మీ మైక్రో కథలకు అడ్డిక్ట్ అయిపోతున్న వంశీ గారు. చాలా బాగా రాస్తున్నారు.

  • ప్రేమను చూపించడంలో సిగ్గు పడని వాళ్లందరి ప్రేమలు.. జెంటిల్ మెన్ ప్రేమలే..

    చాలా చక్కటి కథ.. 🙂

  • చాలా బావుంది…ప్రేమని స్పష్టంగా, ఇష్టంగా, ఇంత చిన్న నిడివి కథలో భలే చెప్పారు…థాంక్స్…

  • చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద కథలు చెబుతాయి. తండ్రీ కొడుకులిద్దరూ జంటిల్మన్లు.👌

  • పది అడుగుల దూరంలోనే వాళ్ళ మదిలో పదిలంగా ఉన్న ప్రేమను చాలా బాగా వ్యక్తీకరించారు.

  • నాన్నే నిజమైన జెంటిల్ మాన్ … కథ ఆలోచనలో పడేసే విధంగా బాగుంది అన్నయ్యా … 😍 అభినందనలు .

  • “వీటన్నిటి మధ్య అమ్మ నాన్నను ఎందుకు అంతలా ప్రేమిస్తుందో అర్థమైంది.”

    చాలా బావుంది వంశీ..

  • కథ సిన్లీ సూపర్బ్ … ” అతను ప్రియాంక ఫోన్ నంబర్ delete చేసాడు.” అనే వాక్యం తో కథ ముగిస్తే ఇంకా బాగుండేది అనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు