1
ఛత్రీలు
~
ఛత్రీలు అమ్మబడును
ఎటువంటి వారికి
అటువంటి కోరుకున్న ఛత్రీలు
సరసమైన ధరలకు అమ్మబడును
సంవత్సరీకాలకు కాశీయాత్రకు
పోయే పౌరోహితులకు సరిపోయే
అస్తిత్వ వాదులకు మార్పుకోరి
తుపాకులు గురి పెట్టే వారికి
ఏ మత మౌఢ్యానైనా ఎదిరించని వారికి
స్త్రీలకు పిల్లలకు పెద్దలకు
వానల నుంచి ఎండల నుంచి చలి నుంచి
బతుకనేర్చిన వారికి
ఛత్రీలు అమ్మబడును
మేధావులకు కవులకు
రాజకీయ నాయకులకు
దేవుళ్లకు దయ్యాలకు
ఛత్రీలు అమ్మబడును
ఏ ఎండ కా గొడుగు పట్టే వాళ్లకు
ప్రత్యేకంగా తయారుచేసిన
రంగురంగుల రంకుబొంకుల
ఛత్రీలు ఛత్రీలు అమ్మబడును
2
కత్తుల వంతెన మీద కాలం
~
కాలం
కత్తుల వంతెన మీద నడుస్తుంది
మనిషి
కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాడు
జీవ నది గంగా
స్వచ్ఛంగా పారుతుంది
ముందెప్పుడూ కనిపించనంత
రాత్రి చుక్కలు చమ్కిలా
దేదీప్యమానంగా మెరుస్తున్నాయి
మొస మర్రని నగరం గుండెలనిండా ప్రాణవాయువును నింపుకుంటుంది
దోపిడీ దొంగల భయం అవునో కాదో
దేశానికి మాత్రం పెద్ద కప్ప తాళం పడ్డది
వెంటపడి తరుముతున్న
చావు నుంచి మనిషి పాఠం నేర్చుకోవాలి రాజ్యం గుణపాఠం పొందాలి
దవా లేక దవాఖానాలు
కింద మీదా అవుతున్నాయి
వైరస్ కత్తుల వంతెన పైన
కాలం గెంటుతుంది
2
Add comment