అవి నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు లేదా అమెరికా వచ్చిన కొత్త రోజులు. వచ్చిన మొదట్లో రోడ్డు మీద పెద్ద పెద్ద కార్లు నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. మా అమ్మ దగ్గర్నించి కనీసం వారానికో ఉత్తరం వచ్చేది. అక్కడి విశేషాలు ఏమిటి. వివరాలన్నీ రాయి. ఆవటా అని. ఉద్యోగం, సద్యోగం లేక అడ్డగాడిదలాగ, రోడ్డు మీద పడి తిరుగుతున్న నాకు పెద్ద మంచి విశేషాలేమున్నాయి, రాయడానికి? ఉన్న సంగతులు అంటే అమ్మాయిలు బావుండటం, ఎవరికి కనపడకుండా అదోరకమైన సినిమాలు చూడడం వగైరాలు అమ్మకి, బాబుకి రాయడానికి లేదు కదా! అంచేత ఉత్తరంలో పేజీ నింపడానికని, ‘కళ్యాణం’ గురించి రాశాను.
అదే లెండి. ఇక్కడికి రాక ముందు నుంచీ మా అమ్మ “ఏమిట్రా వెధవా, ఆ చెంపల దాకా జుట్టూ, నువ్వూనూ. బైరాగి వెధవలాగా” అంటూ తిడుతూ ఉండేది,. ఇంకా రెండు మూడు నెలల్లో అమెరికా వెళుతున్నా కదా, అక్కడ అందరూ ఇలాగే ఉంటారు, జులపాలు లేకపోతే వెనక్కి పంపేస్తారు కాబోసు అని కష్టపడి జుట్టు పెంచి ‘యాయా’ అంటూ మాట్లాడ్డం నేర్చుకొన్నాను కదా. అదీ సంగతి, అందుకే ఆ ఆవిడ తిట్లు! తీరా ఈ దేశానికి వద్డును గదా, జనం అంతా మామూలుగానే ఉన్నారు. వెతికి చూస్తేనే గాని పెద్ద జుట్టు వాళ్ళు కనబడలేదు.
ఇక అమెరికా వచ్చి ఎన్నాళ్ళయినా ఉద్యోగం రావటం లేదని, నేను వాపోతుంటే, శివరాం గాడు “ఒరేయ్, ఆ వెధవ జుట్టేసుకొని ఇంటర్వ్యూకి వెడితే హ్యూస్టన్ లో ఉద్యోగం ఎవడిస్తాడూ? వెళ్ళి కాస్త క్షవరం చేయించుకునిరా. మరీ మిలట్రీవాడు లాగా కాకుండా, కొంచెం కెన్నెడీలా చేయించుకో” అని హితబోధ చేశాడు.
సరే… ఉద్యోగానికి ఈ ట్రిక్కు కూడా చేసి చూద్దాం, అని ఓ రోజు మంగలి షాపు వెతుకుదామని వచ్చీరాని, డ్రయివింగు చేస్తూ రోడ్డు మీద బయల్దేరాను. దాని దుంప తెగ.. “ఇచ్చట అందముగా క్షవరము చేయబడును, ప్రొ. వీర్రాజు” లాటి బోర్డులు” ఎంత వెతికినా కనబడవే! అసలు అమెరికాలో మంగలి షాపులు పైనుండి చూడ్డానికి ఎలా ఉంటాయోనని బయల్దేరేటప్పుడు శివరాంగాడ్ని అడగనయినా లేదు, ఇప్పుడు ఎలాగరా అనుకుంటూ వెళుతుండగా, ఒకచోట Hair Shaft అన్న బోర్డు కనబడింది. “ఆహా, వాడి కొట్టు పేరులో Hair అని ఉంది కదా,..అనగా ‘జుట్టు కడ్డీ” కదా. అంచేత జుట్టు కత్తిరించే బార్బరు షాపు సంగతి వాళ్ళకి తెలియకపోతుందా, అడిగి చూద్దాం, ఆ షాఫ్ట్ స్పెల్లింగ్ తప్పు అయిఉంటుంది అనుకుని అక్కడ ఆగాను. బయట నుంచి అంతా గ్లాస్, దాని లోపల కర్టెన్లు, తలుపెక్కడో కనపడి చావదు. సరే, ఇలా ఉందా అని, ఆ గాజు ఒక పక్క నుంచి మొదలు పెట్టి, తోసి, లాగి, నానా విధాలుగా, తంటాలు పడ్డాను. మొత్తానికి ఒకచోట తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాను. అంతా చీకటిమయం. ఏమీ కనబడి చావదు. కళ్ళు నులుముకుంటే చీకట్లో చూడడం అలవాటు అవుతుందని అనుకుంటుండగా ఎక్కడ్నించో ఒక చక్కటి ఆడగొంతు “May I help you” అన్నట్లు వినబడినది. జాగ్రత్తగా, దీక్షగా పట్టి చూస్తే, ఎదురుగుండానే, ఓ పెద్ద; బల్ల, ఆ బల్ల వెనకాల కృష్ణదేవరాయలు సింహాసనం లాంటి కుర్చీ, అందులో ఓ చక్కటి తెల్లటి పిల్ల వరసగా కనపడ్డాయి. ఆ పిల్ల నందివర్ధనం పువ్వులా ఉంది చూడ్డానికి, వాసనకి కూడాను. ఆట్టే బట్టలు కూడా వేసుకున్నట్లు లేదు. ఇదేదో తప్పు చోటుకి వచ్చేము కాబోసు అని వెనక్కి తిరగబోతుంటే, ఆ పిల్ల మళ్ళీ కోకిల్లాగా కూసింది “ఏమన్నా సాయం కావాలా” అని.
“సరే, ఇలాగ నాకు జుట్టు బాగా పెరిగింది, క్షవరం చేయించుకుందామని తిరుగుతున్నాను” అని కథ చెప్పబోయాను.
“ఇప్పుడే కావాలా, తరువాతా” అంది ఆ పిల్ల. క్షవరం రేపు కావలసి వస్తే ఇవాళెందుకు వస్తానోయ్ వెర్రి మొహమా అనుకొని ఆ మాటే కాస్త మర్యాదగా చెప్పాను. ఆ పిల్ల ఏవేవో కాయితాలు తిరగేసి, ఒక కంప్యూటర్తో కాబోసు మాట్లాడి, “ఒక అరగంట కూచుంటావా ఏర్పాటు చేస్తాను” అంది. అప్పటికి చీకట్లో చూడడం అలవాటయి, ఆ పిల్ల వాటం చాలా బావుండటం గమనించి సరే సౌందర్య వీక్షణ చేస్తూ కూర్చోవచ్చుగదా, మొత్తానికి మంగలి షాపు పట్టేశాం అనుకుని సరే అన్నాను.
“సార్, మీ పేరు, ఎడ్రస్, టెలిఫోను నెంబరు ఏమిటి?” అంది నందివర్ధనం.
ఏవన్నా డేట్ అడుగుతుందేమో అనుకుని ఆశగా, గొంతుక తడి ఆరిపోగా అన్నీ చెప్పాను.
“ఇక్కడ సంతకం పెట్టు” అని ఒక కాగితం ముక్క ఇచ్చింది.
జుట్టు కత్తిరించడానికి ఈ సంతకం గట్రా ఎందుకు, ఆస్తి రాయించుకుంటోందా? ఏమోనని జాగ్రత్తగా చదివాను.
క్షవరం చేసినప్పుడు, నా బుర్రకి, మరే అవయవాలకు గాని దెబ్బలు తగిలినా, కోసుకున్నా నేను వాళ్ళ మీద దావా వెయ్యను అని ఆ కాగితం ముక్క సారాంశం.
‘ఖర్మరా’ అని సంతకం చేసి సోఫాలో చతికిలబడ్డాను. ఏవో పుస్తకాలు చూద్దామనుకుంటే అంతా చెత్త. ఫ్యాషన్ మీద, ఎలాంటి హైరాయిల్ వాడాలి, ఏ విగ్గు పెట్టుకోవాలి అనే పుస్తకాలు తప్పితే మంచివి లేవు. అదే ఇండియాలో అయితే ‘అభిసారిక’, ‘మదన” వగైరా పుస్తకాలుండేవి. ప్రొ. వీర్రాజు వచ్చి భుజం కుదిపేదాకా టైము తెలిసేది కాదు.
కాసేపు నందివర్ధనం కేసి, కాసేపు పుస్తకాల్లోకి చూస్తుండగా, ఎక్కడనుంచో హఠాత్తుగా వాడెవడో ఊడిపడి చెయ్యి ముందుకు చాపి, “I am Bob, your barber, are you ready” అన్నాడు.
వాడు చూడ్డానికి హాలీ వుడ్ వాళ్ళలా తెల్ల నవ్వు నవ్వుతున్న యస్వీరంగా రావులా ఉన్నాడు. వాడి పేరుకీ, వృత్తికీ ప్రాస బాగానే కుదిరిందనుకుంటూ రెడీయేలేవోయ్ అని వాడి వెనకాలే బయలు దేరాను. వాడు నన్ను అలాగ, ఇలాగ తిప్పి మొత్తానికి ఓ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక కుళాయి, అంటే సింక్ అన్నమాట. దాని ముందు మరో భోజరాజు సింహాసనం లాంటి కుర్చీ చూపించి కూచో బెట్టాడు. ఈ అఖండ గౌరవానికి ఆనందిస్తుండగా, వాడు, మెడ దగ్గర ఏదో మీట నొక్కాడు. రపీమని, మన కాళ్ళు గాల్లోకి, తలకాయ సింకులోకి వెళ్ళిపోయాయి. మనకి మాట పెగిలేలోపుగా నెత్తి మీద వేడినీళ్ళు, వాడి వేళ్ళు కలిసి, నా క్రాపింగ్ చెడగొట్టేశాయి.
ఓహోహో! వీడు మనకి మంగళస్నానాలు చేయిస్తున్నాడు కాబోసు, అని ఈ కళ్యాణ సమయంలో జరగబోయే అసలు పెళ్లి గురించి ఆలోచిస్తూండగా ఆ బాబు గాడు జుట్టంతా తుడిచేసి, మళ్ళా నన్ను నిలువునా కూచోబెట్టాడు.
మళ్ళీ పది నిముషాలు, ఆ మయ సభలో నడిపించి మరో కుర్చీలో కూచోబెట్టి, “ఎలా చెయ్యమన్నావు?” అన్నాడు.
వాడు మాట్లాడుతున్న టెక్సాస్ భాష నాకు అర్థం కాక, నేను మాట్లాడిన తెలుగు ఇంగ్లీషు వాడికి అర్ధం కాక వాడు చూపించిన దొరల బొమ్మలలో ఏదో బొమ్మ చూపించి అలా తగలెయ్యి అన్నాను. వాడో అరగంట సేపు సకల యంత్రాలతో తంటాలుపడి, నా జులపాలు తగ్గించి, నన్ను మళ్ళీ మర్యాదస్తులలో పడేసాడు. నెత్తి మీద బరువు దించిన ఫీలింగుతో మళ్ళీ నందివర్ధనం దగ్గరికి వెళ్ళాను.
నన్ను చూసి కంప్యూటర్లోంచి ఒక కాగితం లాగి, “కేష్ ఇస్తావా ఆర్ ఛార్జ్ చేస్తావా” అంది.
ఆ రెండవ పనికి స్తోమత లేక..అంటే అప్పటికి మనకి ఇంకా ఒక్క క్రెడిట్ కార్డు కూడా లేదు కావున “కేషే నోచ్” అన్నాను. “20 డాలర్లు సర్” అంది. “అమ్మ బాబోయ్, 160 రూపాయలే!’ అనిపించగానే నందివర్ధనం పర్వతవర్దిని లాగ కనపడింది. చేసేదేమి లేక, ముడుపు సమర్పించుకుని తిట్టుకుంటూ బయటపడ్డాను.
మరింక రాయడానికి విశేషాలు ఏమీ లేక, మా అమ్మకి, ఈ విశేషాలన్ని వ్రాశాను.
వెంఠనే ‘కేబుల్’ వచ్చింది. “మన ప్రొ. వీర్రాజు ఇంటికి వచ్చి రూపాయకే నెల నెలా చేస్తాడు. ఆ దేశం మనకెందుకు, వెంఠనే ఇండియా వచ్చేయ్”అని.
*
Add comment