తెలంగాణ తొలితరం రచయిత్రి, 15వ ఏటనే అష్టావధానం చేసి గద్వాల మహారాణి ఆదిలక్షమమ్మ చేత ఘన సన్మానం పొందిన విదుషీ నందగిరి ఇందిరాదేవి.1937లొనే పూణేలోని SMDT మహిళా విశ్వవిద్యాలయం నుండి G.A. (గృహ ఆగమ)లో డిగ్రీ పట్టా పొందారు. 14వ ఏట నుండే అనేక సామాజిక, సాంఘిక సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు. వాటిల్లో ప్రధానమైనది బాల్య వివాహాల నిర్మూలన. తాను స్వయంగా యుక్త వయస్కురాలైన తరువాతనే వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. 1937లో నిజామాబాద్ లో జరిగిన ‘ఆంధ్రమహిళా సభ’ కు అధ్యక్షత వహించారు.
తెలుగు సాహిత్యంలో ఈమె చేపట్టని ప్రక్రియ లేదు. కవిత్వం, రేడియో ప్రసంగాలు, నాటకాలు, నాటికలు, ఏకాంకికలు, కథలు, గేయాలు, వ్యాసాలు… ఇలా అనేక ప్రక్రియల్లో 200లకు పైగా రచనలు చేశారు. ఇవన్నీ అనాటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయినవే. దాదాపు ఆరు దశాబ్దాల పాటు దక్కన్ రేడియోలో ఈమె చేసిన ప్రసంగాలలో ఎన్నిక చేసిన ప్రసంగాలతో “మసక మాటున మంచి ముత్యాలు” పేరుతో ఒక సంకలనాన్ని 1995లో ప్రచురించారు. ఈమె భర్త నందగిరి వెంకటరావు కూడా తెలంగాణా తొలితరం కథకుల్లో అగ్రగణ్యులు. 2018లో ఈమె రాసిన 13 కథలను తెలంగాణ సాహిత్య అకాడమి డా. చీదెళ్ల సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకత్వాన “నందగిరి ఇందిరాదేవి కథలు” పేరుతో ప్రచురించింది. వీటిలో జీవిత తాత్వికథతో సాగే గొప్ప కథ పందెం. ఈ కథ మొదట 1941లో గృహాలక్ష్మి పత్రికలో అచ్చయింది.
ఒకనాటి సాయంకాలం రాజారాం సేటు తన ఇంట్లో స్నేహితులతో మందు తాగుతూ పిచ్చా పాటిగా కబుర్లలో మునిగిపోయాడు. వచ్చిన మిత్రులు కూడా చాలా ఉత్సాహంగా మందు తాగుతూ కబుర్లు చెప్తున్నారు. మెల్లగా సంభాషణ జీవిత ఖైదు మీదికి మళ్ళింది. “మీరు ఏమన్నా అనండి! యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం. అంతకంటే రెండు నిమిషాల్లో ప్రాణం పొయ్యేటట్లు ఉరితీయటం మంచిది” అన్నాడు రాంలాల్ పట్టుదలగా. “బతికితే బాలుసాకైనా తినొచ్చు. అసలే లేకుండా అంత మొందటం కంటే ఎట్లాగో ప్రపంచం మీద ఉండటం నయం.” అన్నాడు నరోత్తందాసు.
“ఏమీ స్వేచ్ఛ లేక జీవితాంతం వరకు ఆశలన్నీ చంపుకొని బతికి బాధ పడటం కంటే ఉరిశిక్ష అనుభవించటం చులకనగాదూ” అని తాను కూడా ఒక సమిధ వేశాడు సేటు. ఈ రెండు శిక్షలూ అనాగరికమైనవే. తప్పు చేసిన వారిని మంచి మార్గంలో నడిపించాలిగాని వేలుకు దెబ్బ తగిలితే వేలునే నరికేస్తే ఎలా? అని వాదించాడు లలితా ప్రసాదు.
“నిజమే ఈ రెండింటిలో నాకైతే యావజ్జీవ శిక్షే నయమనిపిస్తుంది” అంటాడు నరోత్తందాసు.
“యావజ్జీవం ఏమిటోయ్? ఒక ఐదేండ్లు ఉండలేవు! ఏకాంతంగా యావజ్జీవం గడపాలంటే మాటలా?” అన్నాడు సేటు తన మాట నెగ్గించుకోవాలని. ఇద్దరికీ మాటా మాట పెరిగిపోయి ‘పందెం’ వేసుకుంటారు.
“ఐదేళ్లు కాదు పదేళ్ళుంటాను నువ్వు ఎట్లా చెప్తే అట్లా” అన్నాడు నరోత్తందాసు.
“ఆ! పందెం రెండు లక్షలు” అన్నాడు సేటు ఉద్రేకం పట్టలేక. ఇట్లా వ్యవహారం ముదిరి పందెం అంటే పందెం అనుకున్నారు ఇద్దరూ. అనుకున్న ప్రకారం ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.
రాజారాం తోటలో నరోత్తందాసుకు ఒక గది కేటాయించారు. అందులో పదేళ్లు ఉండాలి. కావలసిన వస్తువులు, పుస్తకాలు తెప్పించుకోవచ్చు. ఇవన్నీ కిటికీ ద్వారానే అందించబడుతాయి. ప్రపంచంతో ఏమాత్రం సంబంధాలు ఉండవు. కావలిగా ఒక చౌకిదారు ఉంటాడు.
మాటా మాట పెరిగి జిద్దు మీద సవాలు విసిరి ఖైదుగా గదిలో కూర్చున్నాడు కానీ అనుకున్నంత సులభం కాదని గ్రహించాడు నరోత్తందాసు. మొదట్లో విసుగు, విచారం క్రమంగా ఏడుపులోకి మారింది. కానీ మూడేళ్లు గడిచాక ఒంటరి జీవితం అలవాటైంది. పగలు, రాత్రి చదవడంలో మునిగిపోయాడు. తాను ఖైదీననే విషయమే మరిచిపోయాడు.
సేటు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఏకాంతం భరించలేక మొదటి సంవత్సరమే ఆత్మహత్య చేసుకుంటాడని అనుకున్నాడు సేటు. ఇలా నాలుగైదేళ్లు గడిచిపోయాయి. తన రెండు లక్షలు పోయినట్లేనని కలవరపడ్తున్నాడు సేటు.
కాలం ఒక్కతీరుగా ఉండదు కదా! సేటు పరిస్థితి తలకిందులైంది. ఒకనాడు రోజుకు 500 సంపాదించే సేటు ఇవ్వాళ రోజుకు కనీసం 50 రూపాయలు కూడా సంపాదించలేని స్థితికి దిగజారాడు. ఇలాంటి స్థితిలో రెండు లక్షలు ఇవ్వటమంటే ఇక బిక్షమెత్తు కోవడమే అని లోలోపల సేటు తన్నుకులాడుతున్నాడు.
తెల్లవారితే పదేళ్లు పూర్తవుతాయి. ఆ రాత్రి సేటు రెండు లక్షలు తప్పించుకోవడానికి నరోత్తందాసును పొడిచి చంపేయాలని ఒక కత్తి పట్టుకొని గది దగ్గరికి వెళ్తాడు. గది తాళం తీసి మెల్లగా లోపలికి వెళ్తాడు. కానీ అతడు కదలడు. నిద్రపోయాడేమో ఇప్పుడైతే చాలా సులువుగా చంపొచ్చు అనుకుంటాడు. కానీ అక్కడి టేబుల్ మీదున్న కాగితం మీద ఎదో రాసి ఉంది. దీపం వెలుతురులో చదవడం మొదలు పెట్టాడు.
“నేను రేపు ఉదయం బంధ విముక్తుణ్ణి అవుతాను. నాకు స్వేచ్ఛ వస్తుంది. కానీ నేను ఈ గది వదిలి వెళ్ళటానికి ముందు కొన్ని విషయాలు నీకు విశదీకరించటం అవసరం.
ప్రపంచం అంతా పెద్దవాళ్లన్నట్టు మిథ్య. ఈ జీవితం బుద్బుదప్రాయం. ప్రపంచం పై మెరుగులతో నిండి ఉన్నది. ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించటం నాకిష్టం లేదు. ఎంతటి వాడికైనా చావు తప్పదు. అందం, చందం, ధనం, ధాన్యం, తెలివి, గొప్పతనం అంతా చెల్లు దీనితో. ప్రపంచం అబద్దాన్ని నిజం అంటుంది. పై మెరుగులన్ని నిజమైన అందం అని నమ్ముతుంది. ఇట్లాంటి లోకమే స్వర్గమని ఆనందిస్తుంది. నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది. ఇవేవీ నన్నాకర్షించవు. కొన్నాళ్ల కింద రెండు లక్షల ఆస్తి కోసం ఎన్నో కలలు కన్నాను. అనుభవించినట్లే ఆనందించాను. కానీ నేడు నాకవి అనవసరం. కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లి పోయి మన ఒప్పందం విచ్చేదం చేస్తున్నాను.” లేఖ చదివి సేటు నిరుత్తరుడై నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారి ఖైదీ పారిపోయాడని బిక్క మొకం వేసుకొని చెప్తాడు చౌకీదారు. రాజారాం ఊపిరి పీల్చుకుని రెండు లక్షల ఒప్పంద పత్రాన్ని ఓ మారు చూసుకొని ఎక్కడో దాచిపెట్టుకుంటాడు.
దీపం చుట్టూ తిరిగే పురుగులా సంపద చుట్టూ, అది అందించే సౌఖ్యాల చుట్టూ తిరిగే మనిషికి గాఢంగా బుద్ధి చెప్పే కథ. ఏవో లేవని, ఇంకేవో సాధించాలని ఎక్కడికో పరుగులు పెట్టే మనిషికి ఏకాంతంలో జ్ఞానోదయం అవుతుందని చాలా సున్నితంగా చెప్పిన కథ. సంపద ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇవ్వాళ ఉన్న ‘స్థితి’ రేపు ఉండక పోవచ్చు. జీవితాన్ని ‘పందెం’ లా భావించి ఎక్కడికో పరుగులు తీస్తున్న మనిషిని ఏకాంతమనే గుంజకు కట్టేసే కథ ఇది.
పై పై మెరుగుల ప్రపంచాన్ని చూసి మోసపోవద్దని హెచ్చరించే కథ. మన ముందు తరం వాళ్ళు ఎన్నో జీవిత మూల్యాలను, జీవన విధానాలను పుస్తకాల్లో రాసి పోయారు. కనీసం మనం వాటిని తెరవకుండానే జీవితాన్ని చాలిస్తున్నాం. సరళమైన వ్యావహారిక భాషలో సాగిపోయే ఈ కథ శిల్పపరంగా కూడా మంచి కథ. మానవ సహజమైన ఒక జిద్దు, పట్టుదలతో మొదలై ఒక గొప్ప తాత్వికథతో ముగుస్తుంది. డబ్బు కంటే జీవితం గొప్పదని, సమయం ఇంకా గొప్పదని చెప్పి ముగిసిపోయే కథ. కథంతా చదివిన తరువాత మన ఆత్మ మూలలో ఎక్కడో ఒక రసాయనిక చర్య ప్రారంభమై నిజమే మనం దేని కోసం పరుగులు తీస్తున్నాం? అని మనకు మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది. అధ్యయనం ద్వారా మానసిక వికాసం కలుగుతుందని చెప్తూనే మనిషి చేరవలసిన ఉన్నత స్థానాన్ని చూపెడుతుంది. అత్యాధునిక మానవుని వేగవంతమైన జీవితానికి, విషయ వాంఛల చుట్టూ తిరిగే ఆధునిక మనిషికి ఈ కథ ఒక శస్త్ర చికిత్స . తెలుగు కథా సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయే కథల్లో ఇదొకటి.
*
మంచి కథను పరిచయం చేశారు శ్రీధర్
ధన్యవాదాలు…
Thank you sir..
శ్రీధర్ గారు ధన్యవాదాలు.చక్కని సమీక్ష చేసి పందెం కథను పరిచయం చేయడమే కాక నాటి కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవి కథలను వెలికితీసే అదృష్టం మాకు కలిగినందుకు చాలా సంతోషం..మానవుని పరుగు దేనికోసమొ,ఆ పందెం ,పట్టింపులు ఎందుకు చక్కని తాత్వికతతో కూడిన సందేశం ,మంచి కథకు సమీక్ష చేశారు…
ఇందిరాదేవి గారి శత వార్షిక జయంతి సందర్బంగా వచ్చిన గొప్ప కథల పుస్తకం.మిగతా కథలు కూడా చదవండి..ధన్యవాదాలు శ్రీధర్ గారు….
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
హైదరాబాద్
9490367383.
ధన్యవాదాలు మేడం..
విచిత్రం ఏమంటే ఇదే కథని ఇదే పేరుతో ‘ది బెట్‘ అని ఆంటన్ చెఖోవ్ రష్యన్ భాషలో 1889 లో వ్రాసారు. బహుశా టెలీపతీ ద్వారానో, టైమ్ ట్రావెల్ చేసో చెఖోవ్ 1941 లోకి ప్రయాణం చేసి వచ్చి నందగిరి ఇందిరాదేవి గారు వ్రాయబోయే ‘పందెం‘ కథని చదివేసి, కాపీ చేసి, మళ్లీ 1889 లోకి వెళ్లి తన కథను వ్రాసినట్లున్నారు.
https://en.wikipedia.org/wiki/The_Bet_(short_story)
దయచేసి ఇకనైనా ఇది చెఖోవ్ కథకి అనువాదం అని వ్రాయండి. లేదా, చెఖోవ్ కథని యథాతథంగా తెలుగులో కాపీచేసారని చెప్పండి.
‘ది బెట్‘ పూర్తి కథ యిక్కడ చదవవవచ్చు.
http://www.eastoftheweb.com/short-stories/UBooks/Bet.shtml#7
1941 నాటికే ఒక వెనుకబడ్డ ప్రాంతమునుంచి అదీ కాకుండా ఒక మహిళ రష్యన్ రచయతని ఆంగ్లంలో చదివి కాపీ కొట్టిందనే అభాండాలు వేయడం సమంజసంగా ఉందా శ్రీనివాసుడు గారూ?.
**తెలంగాణ తొలితరం రచయిత్రి, 15వ ఏటనే అష్టావధానం చేసి గద్వాల మహారాణి ఆదిలక్షమమ్మ చేత ఘన సన్మానం పొందిన విదుషీ నందగిరి ఇందిరాదేవి.1937లొనే పూణేలోని SMDT మహిళా విశ్వవిద్యాలయం నుండి G.A. (గృహ ఆగమ)లో డిగ్రీ పట్టా పొందారు. 14వ ఏట నుండే అనేక సామాజిక, సాంఘిక సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు. వాటిల్లో ప్రధానమైనది బాల్య వివాహాల నిర్మూలన. తాను స్వయంగా యుక్త వయస్కురాలైన తరువాతనే వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. 1937లో నిజామాబాద్ లో జరిగిన ‘ఆంధ్రమహిళా సభ’ కు అధ్యక్షత వహించారు.
తెలుగు సాహిత్యంలో ఈమె చేపట్టని ప్రక్రియ లేదు. కవిత్వం, రేడియో ప్రసంగాలు, నాటకాలు, నాటికలు, ఏకాంకికలు, కథలు, గేయాలు, వ్యాసాలు… ఇలా అనేక ప్రక్రియల్లో 200లకు పైగా రచనలు చేశారు. ఇవన్నీ అనాటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయినవే.**
వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన మహిళ పై వన్నీ సాధించారే! కాపీ కొట్టడానికి వెనుకబడిన ప్రాంతాలవారు, మహిళలు అనర్హులా? అంటే, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు చెందినవారు, పురుషులు మాత్రమే అప్పట్లో రష్యన్ నుండి ఇంగ్లీషు లోకి అనువదించిన కథలు చదివేవారన్నమాట! మహిళలెవరికీ సాహితీ పరిచయం వుండదన్నమాట.
పోన్లెండి, చెఖోవే కాపీ కొట్టినట్లున్నాడు. అట్ల సర్దిచెప్పుకోవచ్చు.
కాపీయా, కాదా అన్నది చూడవలసిన ప్రమాణాలు మహిళ, వెనుకబడిన ప్రాంతం… లాంటివి కాదు. రెండు కథలూ చదివి పేర్లు మినహా ఎంత యథాతథంగా వున్నదో తెలుసుకోవడం.
శ్రీధర్ గారు పందెం కథ చెహోవ్ కథకు అనుసరణ కావొచ్చు. అయితే ఆమె ఈ విషయాన్ని 1941 జనవరి గృహలక్ష్మి సంచికలో అచ్చేసినప్పుడు పేర్కొనలేదు. నందగిరి ఇందిరాదేవి భర్త వెంకటరావు ఆంగ్లములో కూడా కథలు రాసిండు. కాబట్టి ఆమెకు ఆంగ్లముతో కూడ పరిచయం ఉండే అవకాశమున్నది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్న సాహిత్య అకాడెమి వారు ఇందిరాదేవి కథలు అచ్చేసి మంచి పని జేసిండ్రు. అయితే ఇందులో జోడించిన 13 కథలు కాకుండా ఘోష, ప్రేమమయి, ప్రాప్తం, ప్రథమ పరిచయం, పిచ్చి, ఏకాకి, అదృష్ట శిక్ష తదితర కతలు అందులో మిస్సయ్యాయి. ఈ క్తల గురించి నేను 2004లోనే దస్త్రం పుస్తకములో పేర్కొన్నాను. అర కొర కథలతో ఆగమాగంగా కాకుండా సమగ్ర కథలు వేస్తే అకడేమీకి శోభ చేకూరుతుంది.
Excellent story, and thought-provoking analysis. Congratulations to Dr. Sridhar.
“పందెం” ఎంత చక్కని కథ. బిగువైన కథన శైలి కథకు మరింత అందాన్ని చేకూర్చింది. 70 ఏళ్ళ క్రితం అంత చక్కటి వచనంలో కథ చెప్పడం అభినందనీయం . మనిషి వెంపర్లాటకు తాత్వికత ముడివేసి అద్భుతంగా చెప్పారు ఇందిరా దేవి గారు. శ్రీధర్ గారి పరిచయం సైతం సబబుగా ఉంది. ఇక ఈ కథకి చెఖోవ్ ” ది బెట్ ” మూలం కావచ్చు గాక , ఇప్పుడు ఈ తర్కం అవసరమా !? మన తెలుగువాళ్ళ మీద ప్రాశ్చాత్య ప్రభావం ఉండడంలో తప్పేముంది ? అలా అనుకుంటే శ్రీదేవి “కాలాతీత వ్యక్తులు ” నవలపై “గాన్ విత్ ద విండ్ ” ప్రభావం పుష్కలంగా ఉంది . స్కార్లెట్ ఇందిరలకు , మెలొని కల్యాణిలకు , క్రిష్ణమూర్తి రెడ్ బట్లర్ కూ , ఆష్లీ ప్రకాశం ల మధ్య పాత్రోచితంగా చాల దగ్గరి సామీప్యత కనిపిస్తుంది . కె.వి.రెడ్డి ” పాతాలభైరవి ” చిత్రంలోని ఎన్నో సన్నివేశాలు 40 ల్లో వచ్చిన “అల్లవుద్దీన్ ” అనే ఆంగ్ల చిత్రంలో ఉన్నాయి. చలం, బుచ్చి బాబు , విశ్వనాధ లపై ఆంగ్ల ప్రభావం లేదంటారా ?
కాబట్టి, ఏ పాశ్చాత్య, ఇతర భాషల కథనైనా తెలుగులోకి యథాతథంగా అనువదించేస్తే అది అనువదించినవారి ఘనతేనని, ఆ తాత్త్వికత, శైలి, బిగువు, శిల్పం అంతా అనువదించినవారిదేనని, మూలరచయిత ప్రభావంగా మాత్రమే దానిని చూడాలని భావించాలన్నమాట. ఇక గ్రంథచౌర్యం అనే మాటకు అర్థమేమిటి? ఈ కథను, వ్రాసినవారిని గొప్పగా మెచ్చుకునేవారికి ఒక విజ్ఞప్తి. ముందుగా చెహోవ్ ’ది బెట్‘ కథ చదవండి. ఆ తరువాత వ్యాఖ్యానించండి. కథ సారానికి సంబంధించి రచయిత్రి స్వంత వాక్యం ఒక్కటైనా వుందేమో చెప్పండి. పేర్లు, కాలవ్యవధి, స్థలంలాంటివి తప్పితే స్వంత వాక్యం ఒక్కటైనా వున్నదా? దీనిని ప్రభావం అంటారా? మనం కూడా కథలు వ్రాస్తుంటాం కదా. మన కథలని కూడా ఎవరైనా అలాగే యథాతథంగా ఇంకో భాషలో అనువదించేసి అది తమ ప్రతిభేనని లోకానికి చెప్పుకుంటే మనం ఒప్పుకుంటామా? న్యాయంగా ఆ కథ వ్రాసినవారికి దక్కాల్సిన గుర్తింపు వేరెవరికో దక్కుతుంటే ప్రభావం అని సరిపెట్టుకుంటారా? దానికి మళ్లీ సమర్థింపులా?
చలం, బుచ్చి బాబు , విశ్వనాధ లపై ఆంగ్ల సాహిత్య ప్రభావం లేదంటారా అని కొచ్చినేస్తున్న గొరుసన్న గోరండీ! శ్రీశ్రీ, రావిశాస్త్రి, త్రిపుర గార్ల మీద మాత్రం ఆంగ్ల సాహిత్య ప్రభావం లేదంటారా?
సంస్కృతాంధ్ర, ఆంగ్ల, రష్యన్, ఫ్రెంచ్, పర్షియన్ మరెన్నో సాహిత్యాల ప్రభావంతో ప్రతిభావంతంగా సాహితీ సృజనలు చేసిన వారికి వొందనాలు. ఏ పాశ్చాత్య, ఇతర భాషల కథనైనా తెలుగులోకి అందంగా అనువాదం చేసిన, చేస్తున్న వారికీ వొందనాలు.
నండూరి రామ్మోహన రావు గారి తెలుగు అనుసృజనల సాయం లేకుండా నేను మార్క్ ట్వేయిన్ ని ( టాంసాయర్, హకిల్ బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, కాంచనద్వీపం పుస్తకాలను ) ఆశ్వాదించగలిగేవాడినేనా ?
అయ్యా రామయ్యగారూ, మీరు చెప్పినవారెవరూ పాశ్చాత్య రచనలని తెలుగులోకి యథాతథంగా ప్రతివాక్యమూ అనువాదం చేసుకుని తమ పేరెట్టుకుని, తమదే ఆ తాత్త్వికత, శైలి, బిగువైన కథన శైలి, చక్కని వచనం అని చెప్పుకోలేదండి. ఒకవేళ వారు చెప్పుకోవడంలో నిర్లక్ష్యం చేసినా అది తెలిసిన తరువాత, కూడా మనం ఆ గొప్పతనం అనువదించినవారిదేనని బుకాయించలేదు, సమర్థించలేదండి. నేనడిందేమిటంటే అది అనువాదం, రచన తమది కాదు అని వ్రాయమనే. దానికే ఇంతవరకూ సమాధానం లేదు.