జీవిత ఇతిహాసం ‘తాయమ్మ’

తొలి గణ రాజ్యాల దగ్గరి నుండి తరువాతి ఆదివాసీ, ఫ్యూడల్ సమాజాలు, వివిధ రాజరికాలు, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నీ అనాదిగా స్త్రీని అనేక రకాలుగా దోపిడీకి గురిచేస్తూనే ఉన్నాయి. మాతృస్వామ్య వ్యవస్థ రద్దయిపోయిన అనంతరం కర్కశమైన పితృస్వామ్య వ్యవస్థ, భూస్వామిక స్వభావమున్న కుటుంబ వ్యవస్థ  అమానవీయంగా ఆడదాన్ని చివరి రక్తపు బిందువు వరకు పిండుకొని, పీల్చి పిప్పిచేసి ఎంతో నేర్పుగా, హింసాత్మకంగా అణచివేస్తోంది.

24/7 ఇంటి చాకిరీ, పిల్లల పెంపకం, భర్త, అత్తమామలకు సేవలు, అనుమానపు, అవమానపు మాటలు, తన్నులూ, గుద్దులూ, మిగతా సమాజం అందరూ కలిసి ఇల్లాలి కడుపుకింత తిండి పడేసి ఊపిరి సలపనంతగా అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోంటే ఈ ఊపిరాడని తనాన్ని, దుర్మార్గాన్ని మౌనంగానే తట్టుకుంటూ, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక యుగాలుగా రెక్కలు తెగిన మహిళ ఒంటరిగా పోరాడుతూనే ఉంది. ఈ శోకమంతా ఒక దుఃఖ సముద్రమై మన గుండెల్ని కమ్మేసే కథ ‘తాయమ్మ’.

కథ తాయమ్మచదవండి.

తాయమ్మకు పెండ్లంటె ఏందో తెల్వక ముందే ఈశ్వరయ్యతోని పెండ్లయిపోయింది. అప్పుడు ఆమె వయసు పదకొండేండ్లే. పైగా రెండో సంబంధం. ఇక అప్పటి నుంచి ఆమె నరక సమానమైన చీకటి బతుకు షురువైంది. “ఆ ఇల్లు అల్కేటందుకే మూన్నాల్గు గంటలు పడ్తది. ఆకిలి గూడ పెద్దదే. దానికో గంట సేపు పడ్తది. పది కుండలు సాంపి జల్లాలి. ఆరు బర్లున్నయి. అండ్ల ఎప్పుడు రెండు మూడు బర్లు పాలిస్తయి. బర్ల కాడికి సాకిరంత తాయమ్మదే. సల్ల తాయమ్మకు, పెరుగు ఆళ్ళకు. యాభై మేకల దాంక ఉన్నయి. మేకలను గోస్తే పొట్ట పేగులు, తలకాయ గిన తాయమ్మకేస్తరు.

వంద దాంక కోళ్ళున్నయి. కోళ్ళను గమ్ముడు, అయి గుడ్లు పెడ్తే గిన తీసేది తాయమ్మనే. తినేది ఆళ్ళు. పది ఎకరాల పొలం, ఏడెకరాల చెల్క వుంది. పొలం పన్లకు పోవాలి. నాట్లెయ్యాలె, కలుపు దియ్యాలె. కోతలు గొయ్యాలె. మల్ల పొయ్యిలకు కట్టెలు గొట్టుకరావాలె. కారం దంచాలె. పసుపు దంచాలె. బర్లకు గడ్డి గోస్కరావాలె. పొద్దున్లేసిన కాన్నుంచి రాత్రి పండు కునే దాంకా నడుములిరిగేటంత పని. ముడ్డి మలుప ఈలుగాదు.”

గొడ్డు లాగా ఇంత కష్టపడ్డా ఏం సుఖం లేదు. “మూడు రోజులకోపాలి తానం జెయాలె. ఓ నాడు తానం జేసొచ్చి చీర కట్టుకుంటాంటె సూస్తా వుండు. ఏందో నిమ్మలంగ సూస్తుండని సిగ్గయింది. చీర కుచ్చిల్లు పోసి బొడ్లకు దోపుకొని అట్లనే ఒంటింట్లకు పొయ్యి పీటేసిన. ఒచ్చి కూసుండు. పల్లెం ముందల పెట్టి అన్నం బెట్టిన. కూరేద్దామని ఇటు మల్లంగనే పులోదిగ మీద పడ్డడు. యాడ పడ్తె ఆడ గుద్దుతుండు.  ఇంతెల్ల అంత కోపమొచ్చే పనేం జేసిన్నో అర్థంగాలె. ఏడుసుకుంట ‘ఏంది అట్ల గొడ్తవు. నేనేం జేసినిపుడు’ అనడ్గిన.

‘ఏవెర్గనట్టు మాట్లాడుతుంది జూడు ఎర్రిపిల్ల. లంజె శెకలు. ఏ మిండడు సూడాలనే చీర కుచ్చిల్లు పోసి కిందికేలాడేసినవు. గోసి పొయ్యి లం.. గోసిపొయ్. ఇంకోపాలిట్ల నా కండ్లకు కనిపించినవో బత్కవు బిడ్డ మల్ల’ అన్నడు పెనిమిటి ఈశ్వరయ్య. గిట్ల సోకుల వడేది ఎక్కువ కాలం వుండదని వాల్ల బావతోని విచారం చేసిన పెనిమిటి తాయమ్మకు ఒక వడ్ల గిర్ని పెట్టించిండు. ఇక అప్పటి నుంచి తాయమ్మ బతుకు పెనం మీంచి పొయ్యిల పడ్డట్టు అయింది. ఇంట్ల పని పూర్తి కాక ముందే గిర్ని పని. గిర్ని పని ఒడువక ముందే ఇంట్ల పని. దీనికి తోడు అనుమానం. ఎప్పుడన్న తలుపు తీయడం ఆలస్యమైతే ఎందుకింత ఆలస్యమైంది? ఎవన్నన్నా వుంచుకున్నవా అని ఇల్లంతా దీపం పట్టుకొని వెతికేటోడు.

ఇంత కష్టాన్ని కూడా పిల్లల కోసం, సంసారం కోసం పంటి బిగువున భరించుకుంటూ వస్తుంటే తాయమ్మ మీద దొంగతనం మోపుతారు. కనీసం కడుపుతోని ఉన్నప్పుడు కూడా తల్లిగారింటికి పంపించరు. ఎన్ని కాన్పులైనా ఇదే తంతు. తెగించి చెప్పక చెయ్యక తల్లిగారింటికి పోతే మల్ల తోల్కపోను రానేరారు. చూసి చూసి తల్లే అత్తగారి ఇంట్ల పడగొట్టుటానికి వస్తే పెద్ద పంచాయితి.

చూస్తుండగానే ఇట్లాంటి చీకటి రోజులేన్నో భారంగా గడిచి పోయినయి. పెద్ద బిడ్డ పెండ్లి కూడా చిన్న తనాననే చేసిండ్రు. ఆమె కూడా తన పెండ్లికి తన ప్రమేయం ఏమీ లేకుండా ‘పెద్ద మనుషుల్ల బొమ్మైంది’. ఈశ్వరయ్య “ఊరికి సర్పంచయిండు. ఊర్ల పంచాతులు చెప్పుడు, ఊరి మీద పడి తిరుగుడు. కష్టంజేసి యింట్లకు ఒక్క పైసా తేలే. పొలమ్మీద ఒచ్చిన పైసల లెక్క సరిగ జూపిస్తలే. జల్సాలకు పెట్టుడుతోనే సరిపోతుంది. పొత్తుల సొమ్ము నాశనం జేస్తుంటే” వేరు పడేసిండ్రు. వేరు పడ్డ కాన్నుంచి మరింత అధ్వాన్నమైంది. ఇంటికి వచ్చుడే లేదు. ఓ నాడు పొలం అమ్ముతుందని తెల్సి వద్దన్నది. పిల్లల మొకమన్న జూసి అమ్మకుమని బతిమిలాడింది.

“నాకు పుట్టిన పిల్లలైతే గద” అన్నడు.

“చెప్పుకు పియ్యంటిచ్చి కొడ్త”

నన్నే గంత మాటంటావే అని నాల్క సందు లేకుంట కొట్టిండు. మల్లోనాడు పెయ్యి మీది నగలన్నీ గుంజుకపోయిండు. ఇంకోనాడు ఇగ గిర్నికే ఎసరు పెట్టిండు. గిర్ని అమ్ముతానని బావతోని, అల్లుని తోని మంతనాలు జేసిండు. ఉన్న ఒక్క ఆధారం పోతే ఎట్ల? నేను పిల్లలు ఎట్ల బతకాలి? అని తాయమ్మ మదన పడింది. చివరికి ఏమైంది? గిర్ని అమ్మిండా? తాయమ్మ ఎదురు తిరిగిందా? ముసలితనాన తాయమ్మ, ఈశ్వరయ్యను ఎట్లా చూసింది తెలియాలంటే కథలోకి తొంగి చూడాల్సిందే.

నిజానికి ఇదొక నవల. కానీ విస్తరణ భీతి దృష్ట్యా రచయిత్రి దీన్ని కథగా మలిచారు. అయినా 35 పేజీల జీవితేతిహాసమైంది కె. శివారెడ్డి అన్నట్లు ఇదొక Epic Story. ఆకాశంలో సగభాగం, జీవితంలో సగ భాగమైన మహిళ పీడితురాలిగానే ఎందుకు మిగిలిపోయింది? ఒకే సమాజంలో, ఒకే కుటుంబంలో నివసిస్తున్న స్త్రీ, పురుషుల బతుకులు ఎందుకు ఒకే విధంగా లేవు? ఎందుకు స్త్రీ బానిస, పరాధీనురాలిగా మారి, పురుషుడు ప్రభువై శాసించే స్థాయికి, ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరాడు? ఎందుకు స్త్రీ చుట్టూ అనాదిగా ఇన్ని కుయుక్తులు, కుతంత్రాలు, మాయోపాయాలు పన్ని ఆమెను కనిపించని పితృస్వామిక తాళ్ళతో బంధిస్తున్నారు?

మాతృస్వామిక వ్యవస్థలో ఒకప్పుడు మొత్తం సమాజాన్ని శాసించిన స్త్రీ ఎందుకు కుంచించుకు పోయింది? దీనికి కారకులెవరు? కుటుంబ శ్రమలో, ఉత్పత్తిలో భాగస్వామ్యం ఉన్న స్త్రీకి తన జీవితం మీద తానే నిర్ణయం తీసుకునే హక్కు ఎందుకు లేకుండా పోయింది? కుటుంబంలో, సమాజంలో స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరురాలిగా ఎందుకుంది? కుటుంబ శ్రమలో ఇరవై నాల్గు గంటలూ నలిగిపోయే స్త్రీ శ్రమకు విలువ కట్టే ప్రమాణాలు ఎందుకు రూపొందలేదు? కనీస విశ్రాంతి కూడా లేకుండా స్త్రీ చేసే శ్రమకు బదులుగా ఆమె ముఖాన ఇంత తిండి, ఇన్ని బట్టలు విసిరేస్తే సరిపోతుందా? ఇలాంటి పితృస్వామ్య వ్యవస్థ కాళ్ళ కింది భూమి కదిలిపోయే ఎన్నో ప్రశ్నలను సంధించే  బలమైన కథ ఇది.

స్త్రీకి చిన్నపాటి సంతోషాన్ని, కనీసం నవ్వడాన్ని కూడా నిషేధించిన పితృస్వామ్య క్రూరత్వానికి ఈ కథ ఒక ఎత్తిన పతాక. స్త్రీ సర్వస్వాన్ని కొల్లగొట్టిన కుటుంబంలో చివరికి ఆమెకు భర్త తోడు దొరకదు సరికదా పిల్లలు కూడా తోడు నిలవక పోవడం విషాధం ఈ కథలో. చివరికంటా ఆమె ఒంటరిగానే పోరాడుతుంది. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో చెప్తూనే ఎన్నో శోఖపు తెరలని, కన్నీటి పోరలని మన గుండెలో ఒక ఉప్పెనలా ఉప్పొంగించే ఈ కథ తెలుగు కథా సాహిత్యానికి గొప్ప చేర్పు.

ఒక దుఃఖపు స్వగతంతో మొదలయ్యే ఈ కథ మరో దుఃఖపు వలపోతతోనే ముగుస్తుంది. కథ ప్రతి పుటలో  కూడా గుండెకింది తడిలా దుఃఖమే పర్చుకొని ఉంటుంది. తాయమ్మ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆమెతో పాటు మనల్ని కూడా కూకటివేళ్ళతో కదిలిస్తుంది. ఒక స్త్రీ ఎంత పీడనను భరించగలదో చూసి మన హృదయాల్లో దుఃఖం, రక్తం ఎగిసి పడుతుంది. తెలుగు కథా చరిత్రలోనే ‘తాయమ్మ’ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర.

ఎంతో సరళ శిల్పంలో సాగిపోయే ఈ కథ చదువుతున్నంత సేపూ స్త్రీ ధైన్య స్థితిని తల్చుకొని మన గుండె భూమి కంపించినట్లుగా కంపించిపోతుంది. కథంతా కాగడా పెట్టి వెతికినా ఒక్క అతిశయోక్తి మాట కనిపించదు. జీవితం ఎంత వాస్తవికంగా ఉంటుందో కథ కూడా అంతే తడితడిగా ఉంటుంది. కథల్లోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులకు ప్రతిబింబాలని చెప్పడానికి తాయమ్మ పాత్ర ఒక ఉదాహరణ. తాయమ్మ ఎంతో మంది గ్రామీణ స్త్రీలకు ప్రతీక. భూమికున్నంత ఓర్పును జీవితాంతం దశాబ్దాల పాటు మోసి మోసి ఇక భరించలేక అగ్నిపర్వతమై లావాలా విరుచుకుపడుతుంది. స్త్రీ సహనానికి, స్త్రీ శక్తికి కూడా నిదర్శనమీ పాత్ర. కథకు సంక్షిప్తత ప్రాణమంటుంటారు కానీ ఇంత పెద్ద కథలో ఏ పేరానూ తీసివేయలేము. ఇది రచయిత్రి సాధించిన శైలీ, శిల్పాలకు నిదర్శనం.

తాను రాసిన తొలి కథ ‘తాయమ్మ’ కథ పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న ‘తాయమ్మ కరుణ’ అసలు పేరు పద్మ. మైదాన ప్రాంత కథల్ని, ఆదివాసీ కథల్ని, విప్లవోద్యమ కథల్ని తెలుగు కథా సాహిత్యానికి జోడిస్తూ వస్తోన్న తాయమ్మ కరుణ మొదటి కథల సంపుటి ‘తాయమ్మ మరికొన్ని కథలు’ను 2009లో విరసం ప్రచురించింది. ఇందులోని 16 కథలకు మరో 14 కథలు కలిపి ‘జీవితం’ కథల సంపుటిని తానే 2018లో వెలువరించారు. ఇవిగాక ‘కొలిమి’ వెబ్ పత్రికలో కొన్ని విప్లవోద్యమ కథలను ధారావాహికగా రాశారు. కొన్ని కవితలు, కొన్ని సామాజిక వ్యాసాలు కూడా రాశారు కానీ ఇవేవీ పుస్తకంగా రాలేదు. ఇదొక లోటు. మావోయిస్టు పార్టీలో చాలా కాలం పనిచేసి ‘లోపలి’ జీవితాన్ని కథలుగా మలుస్తున్న రచయిత్రుల్లో తాయమ్మ కరుణది విలక్షణమైన గొంతు.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • ధన్యవాదాలు,, కొంచం,”పని పిల్ల”కథా తుమేటి రఘోతమరెడ్డి పంపరా…….

  • విశ్లేషించడంలో మీకు మీరే సాటి సర్ హృదయపూర్వక అభినందనలు శ్రీధర్ గారు

  • ఆణిముత్యం లాంటి కథ. విశ్లేషణ బాగుంది శ్రీధర్.

  • తాయమ్మ పాత్ర తడారని శ్రీల బ్రతుకులకు సాక్షి. కే శివారెడ్డి గారు అన్నట్లు ఇది ఎపిక్ స్టోరీ. రాజరిక వ్యవస్థలో నైనా, రాజకీయాల్లో నైనా స్త్రీలను బొమ్మలు గానే భావిస్తున్నారు తప్పితే, వారి నిర్ణయాలను, హక్కులను ఎల్లప్పుడూ కాల రాస్తూనే ఉన్నారు.

    గ్రామీణ జీవితానికి తాయమ్మ నిలువుటద్దం. వంశ గౌరవం పురుషుడు కాపాడాల్సింది పోయి, మరో వంశం నుంచి వచ్చిన స్త్రీలు కాపాడటం విడ్డూరం. నిర్ణయాలు అంటే పురుషులే తీసుకోవాలి. ఆడవారు అంటే ఇంట్లో పనే చేయాలనే కర్కశ ఆలోచనలకూ పాతర పెట్టాలి. నేడు మనమంతా శాస్త్ర సాంకేతిక రంగాలు, అభివృద్ధి అంటూ 21వ శతాబ్దంలో ప్రయాణిస్తున్న సమాజం అంటేనే సగభాగం అయిన స్త్రీలకు ఆ స్థానాన్ని ఇవ్వటంలేదు.

    కందుకూరి, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు కోరుకున్న సమాజం నేటికి నిర్మాణం కాకపోవడం బాధాకరమైన విషయం.

    పెద్దల మాటకు విలువిచ్చి, విలువైన తమ బతుకులను చిన్నాభిన్నం చేసుకుంటున్న బాలికలు, బాల్య వివాహాలతో బలి అయిపోతున్నాయి.

    రచయిత్రి పద్మ గారు వాస్తవ ప్రపంచంలో నిత్య సంఘటనలను ఎంతో ఆర్ద్రంగా గమనించి, కన్నీళ్లను కలం లోకి ఒంపి, పాఠకుడి కళ్ళల్లో కరుణను కురిపించే, కనువిప్పు కలిగించే అద్భుతమైన కథగా మలిచారు. ఇలాంటి సజీవమైన కథలు చదివయినా, నిర్జీవమైన మనుషుల మనసుల్లో మార్పు రావాలని మనసారా కోరుకుంటున్నాను.

    ఇలాంటి రచనలకు కథలు అని, నవలలు అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రచయిత ఆవేదన, ఆర్ధత ఎంతవరకు ప్రయాణిస్తే అంతవరకు రాయాలి. ఈ కథను నవలగా మార్చాల్సిన అవసరం కూడా ఉందని నాకు అనిపిస్తున్న అభిప్రాయం మాత్రమే.

    నాకు నచ్చిన కథలలో ఇది ఒకటి. ఎందుకంటే తాయమ్మ లో మా అమ్మ కూడా కనిపించింది. మా అమ్మ తాయమ్మ అన్ని కష్టాలు మా నాన్నతో పడింది. ఈశ్వరయ్య పాత్ర మా నాన్న కు ఏ మాత్రం తీసిపోదు. నేటికీ బిడ్డల బరువును, బాధ్యతలను మోస్తూనే ఉంది. నా తల్లి లాంటి వారెందరో నిత్య ప్రసవవేదన అనుభవిస్తూనే ఉన్నారు.

    ఈ కథ ని విమర్శించిన శ్రీధర్ సార్ గారు రచయిత్రి బాధను, బాధ్యతగా మనందరికి అందించారు. ఇంతటి గొప్ప కథను అందించిన శ్రీధర్ సర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.

  • కథ , విశ్లేషణ రెండు చాలా బాగున్నాయ్
    ఇద్దరికీ అభినందనలు

  • “కథంతా కాగడా పెట్టి వెతికినా ఒక్క అతిశయోక్తి మాట కనిపించదు” అని విశ్లేషణలో శ్రీ శ్రీధర్ గారు రాసిన వాక్యం వారి విశ్లేషణకు కూడా వర్తిస్తుందని నేను భావిస్తున్నాను. కథ గురించి వారు చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం! ఉన్నతమైన కథకు సమానం స్థాయిలో విశ్లేషణ జరిగింది. కథా రచయిత్రి గారూ, విశ్లేషకులవారూ అభినందనీయులు!! పాఠకులమైన మేమంతా ధన్యులము!!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు