జీవితాన్ని కాసింత ప్రేమించమని?!

గోడలు కట్టుకోకపోతే ఎంత హాయిగా ఉంటుందో చెప్పే ప్రయత్నం నవల నిండా. Keeping it simple  అనేది ఎంత సులభమో కూడా. అందరూ ఒకరికొకరు చెందటం సంభవిస్తుంది. గొప్ప నిశ్చింత.

కొన్ని పుస్తకాలు. అవి కొంచెమే చెబుతాయి. దాన్నీ పల్చగా , తేలిగ్గా –  గాలి తెరకి మల్లే. ఊపిరి తీసుకున్నాక , ఆ చల్లదనం ఒళ్ళంతా పాకిపోయాక , అప్పుడిక విసుగు పారిపోతుంది. ఆ పూటా ఆ రోజూ – మనకీ ఆహ్లాదానికి హక్కు ఉందనిపిస్తుంది. తిరిగి వాస్తవాలలోకి పడినా స్ఫురణ పనిచేస్తూంటుంది, తలంటుకున్న జుట్టుకి పట్టిన సన్నజాజి వాసన లాగా.

 The Enchanted April అలాంటిది.

1922 లో వచ్చిన ఈ నవలకి రూపాంతరాలని చాలానే చూసినట్లున్నాము  గానీ అప్పటి కొత్తదనపు ఉపజ్ఞ తెలుస్తుంది, చదువుతూంటే.

ఒకరికొకరు సంబంధం లేని నలుగురు స్త్రీలు – లండన్ కాంతి హైన్యం లోంచి ఇటలీ సూర్యకాంతి లోకి ప్రయాణించి నెలరోజులు నివసించి వికసించటం ఈ కథ. ఆడవాళ్ళ ఉద్యోగాలూ విడి జీవితమూ ఇంకా బాగా  దూరాన ఉండిన కాలం లో , ఆ పరిమితులలోంచే ఈ రమణీయానుభవపు ఆవశ్యకత , ఆవిష్కరణ – రచయిత్రి Elizabeth Von Arnim నైపుణ్యం. అలా అని ఆవిడ గొప్ప శిల్పాన్నేమీ తెచ్చి వాడలేదు . తననే సరళంగా కాయితాలలోకి ప్రవహించనిచ్చారు అంతే… ఆరుబయళ్ళ మిలమిలలూ తళతళలూ నవలలో రాత్రులూ పగళ్ళూ వెలుగుతుండేలాగ. రచయిత్రి లోని   మధులాలస పొంగుతూ దర్శనమిస్తుంది – అందులో ఆరాటం ఉండదు, ఆగి ఆఘ్రాణించటం ఉంటుంది.

ఈ నవల వసంతకాలపుది , కాని తన మరొక ప్రసిద్ధమైన ( తన ముప్ఫై రెండవ ఏట రాసిన)నవల- Elizabeth And Her German Garden  లో అంటారు- ” ఆకాశం కిందని నాకెప్పుడూ సంతోషం. కాకపోతే – వేసవి సంతోషం వేరు, వసంతానిది వేరు, ఆకురాలే కాలానిదీ మంచు కురిసే సమయాలదీ మరింకొంచెం వేరు వేరు ” అని. ఇళ్ళలో ఇరుక్కుని ఉండిపోయేవాళ్ళకి కళ్ళూ చెవులూ బహుశా ముక్కులూ కూడా పనిచేస్తూండకపోవచ్చునని.  జ్ఞానేంద్రియాలతో ఈ గాఢమైన ఆస్వాదన – దాదాపుగాహెలెన్ కెలర్ ని జ్ఞాపకం చేస్తుంది.జీవనం పైని పిపాస రూపం దాల్చిన ఈ నవల రాసేప్పటికి ఆవిడకి యాభై ఆరేళ్ళు.

 పరిమళ ద్రవ్యం వంటి ఈ నవలని పరిచయం చేయటం – మచ్చుకి ముంజేతి మీద నాలుగు చుక్కలు జల్లి చూపించటం. ఇది నిత్యమూ నిలువెల్లా ఉపయోగించవలసినది.

  రోజువారీ జీవితపు చికాకులలో మనుషులు. చెప్పుకుందుకేమీ లోటుండని జీవితాలు, ఏదో మరింకొకలా ఉంటే బావుండుననుకుందుకూ  లేదు. Lottie Wilkins ఆ వరసలో మొదటిది. భర్త ఒక solicitor . భోజనం లో తప్ప అన్నిట్లో పొదుపు అతనికి. నాలుగు చక్కటి పువ్వులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనిపించటం కూడా అర్థం కాదు. మంచివాడే, భార్యాభర్తలు ప్రేమగలవారే. అయినా కమ్మేసే మామూలుతనం .

ఒకానొక రోజున ఒక దినపత్రిక లో ప్రకటన చూస్తుంది Lottie . ” సూర్యుడి తేజస్సూ వర్ణవర్ణ  పుష్పాలూ కావాలా మీకు ? మధ్యధరా సముద్ర తీరం లో మధ్యయుగాల కోట San Salvatore ని నెలరోజులకి అద్దెకిస్తున్నాం- సంప్రదించగలరు ”

ఎంతగా అది తనవల్ల కాదులే అనిపిస్తున్నా  ప్రాణం లాగుతూంటుంది. ఇంటి ఖర్చుల కిచ్చే డబ్బు లోంచి కొంచెం కొంచెం దాచుకుని ఉంటుంది,  ఎప్పుడైనా అక్కరకొస్తుందని. దాన్ని వాడితేనో ? ఖర్చు తగ్గించుకుందుకు మరొకరూ ఉంటే బావుంటుంది, తోడూ ఉన్నట్లుంటుంది.

ఆ ఊపులో , కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉన్న Rose Arbuthnott కి చూపెట్టి వెళదామా అంటుంది. Rose చాలా పద్ధతైన ఆవిడ. చర్చ్ తరపున  సేవాకార్యక్రమాలలో మునిగితేలుతుంటుంది. తనకోసమని అంటూ ఆలోచించుకోవటమే స్వార్థం అని అతి గట్టిగా నమ్ముతుంటుంది. దానికి బలమైన కారణం ఒకటి. ఆమె భర్త Mr Arbuthnott  పై తరగతి జనాల జీవితాలలో పుకార్ల గురించి రాసే రచయిత. పుంఖానుపుంఖాలుగా రాసి పుష్కలం గా డబ్బు గడిస్తుంటాడు. ఆ సంపాదన తప్పూ అని ఆమెకిబాధ . చేయగలిగిందేమీ లేదు – అందుకని తనవంతు గా ‘ మంచిపనులు ‘ చేస్తూ ఉంటుంది.ఎంతచేసీ  వదలని వ్యాకులత ఆమె మొహంలో. ఒకప్పుడు ప్రేమించుకుని పెళ్ళాడినవాళ్ళే- ఇప్పుడు అంతా మసకబారి ఉంటుంది.

Rose కి ఈ ప్రకటన గురించి పట్టించుకోవటం నచ్చదు.  కాని ఎక్కడో లోపల – చిన్న ఉబలాటం. అది కనిపెట్టిన Lottie , కష్టపడి ఒప్పిస్తుంది.

” ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా గడిపి రావటం గొప్ప నిస్వార్థం- వెనక్కి వచ్చాక ఇంకా మంచిగా అయిపోతాం కదా, అందుకు ” – ఇలా.

ఇద్దరూ కలిసి ఆ ప్రకటన ఇచ్చిన మనిషిని కలుస్తారు. ఎనిమిది పడకల వసతి , నౌకర్లు, ఆహారపు ఏర్పాట్లు…అంతా బాగానే ఉందిగాని అద్దె అరవై పౌండ్ లు. చెరి సగం వేసుకున్నా అది ఎక్కువే . అడ్వాన్స్ ఇచ్చేసి మళ్ళీ వీళ్ళు విడిగా ప్రకటన ఇస్తారు. దానికి ఇద్దరు జవాబు ఇస్తారు. Lady Caroline  అనే పై తరగతి అందగత్తె. Mrs Fisher అనే మర్యాదస్తురాలైన పెద్దావిడ.

Caroline  కి తన జీవితం మీద విసుగు. ఒత్తిడి పెట్టే తల్లి అంటే కోపం. పార్టీ లూ ముఖస్తుతులూ ఆకర్షణీయమైన దుస్తులు వేసుకోవలసిరావటం,  అభినందనలూ వెంట పడి బ్రతిమాలే మగవాళ్ళూ …ఇదంతా.

” దుస్తులు మనల్ని తీసుకుపోతాయి ప్రతి చోటికీ, మనం వాటిని తీసుకువెళ్ళం – ఏం బానిసత్వం అది ! ” – ఇలాంటి ఫిర్యాదులు ఆమెవి. అన్నిటి నుంచీ దూరంగా ఎక్కడికో – ఎక్కడికైనా…ఇదొక అవకాశం.

Mrs Fisher కి సరిపడా డబ్బున్నా ఆచితూచి ఖర్చు చేసే అలవాటు . 15 పౌండ్ ల అద్దెతో నెలరోజులు విదేశంలో –  బావుందనిపించి ముందుకు వస్తుంది. సొంతవాళ్ళు ఎవరూ ఉండరు. పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం. ఆవిడ చిన్నతనం అంతా గొప్ప సాహిత్యవేత్తల మధ్యనా రాజకీయ ప్రముఖుల మధ్యనా గడిచిందట. గతంలో ఘనీభవించిన మనిషి. ఊ అంటే  ఆ పెద్దవాళ్ళ పేర్లలో ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. సాంఘికం గా Rose , Lottie లది తనకన్నా తక్కువ స్థాయి అని తెలిసేలా ప్రవర్తిస్తుంది. Rose కి కోపం వస్తుంది గాని Lottie సర్దేస్తుంది- ఎలాగైనా ఇదంతా సాధ్యం అవాలనే ఉత్సాహం ఆమెది. ఆ ఉత్సాహం మితిమించిపోయి అవకతవక గా కూడా మాట్లాడేస్తుంటుంది.

 Rose  అడగ్గానే భర్త డబ్బు ఇచ్చేస్తాడు – అసలామె ఎప్పుడూ ఏదీ అడగనే అడగదు, ఇంకా ఏమైనా అడిగితే బావుండు… Rose ,Lottie  మొదటి పేర్లతో పిలుచుకునేంత స్నేహితులైపోతారు – Lottie దే ఆ చొరవ. వీళ్ళిద్దరూ ముందు వెళ్ళి తక్కిన ఇద్దరి ఏర్పాట్లు చూడాలని ప్రణాళిక. బయల్దేరతారు. ఇటలీకి రైలు ఆలస్యం, తర్వాతి బస్ ప్రయాణం అయోమయం…చీకటి పడిపోతుంది.San Salvatore  నుంచి మనిషి వచ్చి ఉంటాడు గుర్రం బండితో. కాని వీళ్ళకి కంగారు. భయం. ఒక్క ముక్క ఇటాలియన్ రాదు..ఎలాగైతేనేం కోటకి చేరతారు. పడి నిద్రపోతారు, చెరొక గదిలో.

Lottie  తెల్లారి లేచి బయటికి చూస్తే – గొప్ప సంభ్రమం. ఏప్రిల్ నెల వైభవమంతా ఆమె ముందు . కిటికీ లోంచి అలలు అలలుగా  అంతులేని పువ్వులు. రంగు రంగుల పువ్వులు. అపురూపమైన సువాసనలు. అవతల ధగధగా వెలిగే సూర్యుడు. ఆ వెలుగులో నిద్రపోతున్న సముద్రం.దూరంగా –  కొత్త కొత్త చాయలలో కొండల ఛాయలు. ఇదంతా చూస్తోంది తను, జీవించి ఉంది !! సంతోషమా – ఆ మాట చాలదు, ఆనందం , ఇంకా ఏదో…స్వర్గం, అక్షరాలా.

తనని తను ఆ సాంద్రలావణ్యం తో కలిపేసుకోవటం Lottie  కి చాలా సునాయాసంగా సాధ్యపడుతుంది. Rose కి, అలా ఒదిగేందుకు  కొంచెం సమయం పడుతుంది. ఎప్పుడూ ఆవరించుకొని ఉండే దిగులు తగ్గటం మొదలవుతుంది. అంతా ఒక ఘనమైన దైవాశీర్వచనం లాగా తోస్తుంది.

రచయిత్రి లో సాటిలేని భావుకత్వం తోబాటు మంచి హాస్యస్ఫూర్తి కూడా ఉంది. చాలాసార్లు , నవలలో – ఆ రెండూ కలిస్తే వచ్చే ఉల్లాసం వీస్తూ ఉంటుంది.

సంగతేమిటంటే, తక్కిన ఇద్దరూ వీళ్ళకన్నా ముందే వచ్చేసి ఉంటారు. ఉన్న గదుల్లో మంచివాటిని రెండిటిని చెరొకరూ ఆక్రమిస్తారు. Lady Caroline  అస్సలు తనని పలకరించవద్దని సూచన ఇస్తుంది. Mrs Fisher, గది కి తోడు ఒక sitting room ని కూడా సొంతానికి ఏర్పాటు చేసుకుని వీళ్ళని వేరే sitting room  వాడుకోమంటుంది. Rose కి కోపం, ఉక్రోషం వస్తాయి.

” స్వర్గం లో పేచీలు ఉండవు, పెట్టుకోకూడదు ” – Lottie  వివేకం అది.

గొప్ప సౌందర్యం ప్రత్యక్షమై నప్పుడు – మొదట దాచేసుకోబుద్ధి అవుతుంది , అది లోపలికి ఇంకే కొద్దీ పంచుకోవాలనిపిస్తుంది. ఆ పరిణామాన్ని సహృదయంతో  చిత్రిస్తారు రచయిత్రి.

రోజులు గడుస్తూంటాయి.

ఒక పౌర్ణమి రాత్రిని రాస్తారు – ” ఆవాళ నిండు చంద్రుడు ఉదయించాడు. తోట అంతా సమ్మోహితమైపోయింది. అన్ని పూవులూ తెల్లవే- లిలీలు, డాఫ్నే లు, నారింజపూవులు, తెల్ల గులాబీలు – తెల్లవైపోయిన గులాబీలు…కళ్ళకి అంతా పట్ట పగల్లాగా ఉంది, కాని రంగుల పువ్వులు కనిపించటమే లేదు, అవి సుగంధం గా మటుకే మిగిలాయి ”

  శాంతి. ఒట్టి తెలుపు రంగుది.

  Lottie ఆలోచనల గజిబిజి తగ్గి స్పష్టత వస్తుంది.  భర్త కూడా తన తో అదంతా ఆస్వాదిస్తే బావుండునని గాఢం గా అనిపించేస్తుంది. వచ్చి తన స్వేచ్ఛకి అడ్డుపడతాడేమోనని అనుమానం ఉన్నా, అనురాగం గెలుస్తుంది.  రమ్మని ఉత్తరం రాస్తుంది. Rose నీ రాయమంటుంది.ఆమె కి సంశయం.

 Lady Caroline  స్వభావం సహజం గా మధురమైనది. పిచ్చి పిచ్చి నియమాలూ పైపై మర్యాదలూ అక్కర్లేని ఆ వాతావరణం లో ఆమె కి క్రమక్రమం గా ప్రసన్నత వస్తుంది. వద్దనుకున్న ఇద్దరితో అప్రయత్నంగా స్నేహం చేస్తుంది.

 గోడలు కట్టుకోకపోతే ఎంత హాయిగా ఉంటుందో చెప్పే ప్రయత్నం నవల నిండా. Keeping it simple  అనేది ఎంత సులభమో కూడా. అందరూ ఒకరికొకరు చెందటం సంభవిస్తుంది. గొప్ప నిశ్చింత.

Lottie  భర్త వస్తాడు. భార్య మీద విపరీతమైన ఆపేక్షా తక్కిన స్త్రీల తో   కలుపుగోలుతనం – ఇట్టే వచ్చేస్తాయిఅతనికి. వాళ్ళూ ఇతన్ని సగౌరవంగా ఆక్షేపిస్తుంటారు.

తాత్సారం చేసి చేసి చివరికి , Rose – భర్త కి ఉత్తరం రాస్తుంది. అది అందేలోపే, Lady Caroline  అక్కడ ఉందని తెలిసి, ఆమె సంగతులు తెలుసుకు బయటికి చెప్పేందుకు [అతని పనే high society gossip లు రాయటం ] అతను వస్తాడు. Arundel  అనే మారు పేరుతో Caroline కి అతను బాగా పరిచయమే. అతను Rose భర్త అని అప్పుడే తెలుసుకుని,ఆమె మనసు కష్టపెట్టకూడదని – ఆ పరిచయాన్ని బయట పెట్టదు. తను  కోప్పడి వచ్చేసిన తల్లి ఎలా ఉందో అతన్ని పదిసార్లడుగుతుంది. ఇంకెక్కడి కోపం !

అందం, అది తప్ప మరింకేమీలేకపోవటం- ఆ నేపథ్యంలో స్వచ్ఛంగా తాజాగా  విశాలంగా అవక తప్పదు.

అదొక ఐంద్రజాలిక స్వస్థత.

Rose , ఆమె భర్త – తిరిగి లోతుగా –  ప్రేమలో పడతారు. కాలం దివ్యంగా సాగుతూంటుంది.

ఆఖర్న, ఆ కోట యజమాని Mr Briggs  చూసిపోయేందుకు వస్తాడు. వీళ్ళంతా- అతనింట్లో  అతనికి బోలెడు మర్యాద చేసి ఉండిపొమ్మంటారు. ఉండిపోతాడు. Caroline  అతనికి అద్భుతం గా కనిపిస్తుంది. ఆమె అతన్ని గుర్తించటం మొదలెడుతుంది…అంగీకరిస్తుంది.

Mr Briggs  చలాకీ అయిన మనిషి. మృదువైనవాడు. Mrs Fisher తో ఆప్యాయం గా కబుర్లు చెబుతుంటాడు. ఎవరూ వద్దనుకునే ఆవిడ హృదయమూ కరుగుతుంది, చివరికి. . అతనిలాంటి కొడుకు ఉంటే బావుండేదనుకుంటుంది. సర్వదా గతం లో బతికేసే ఆవిడకి, చైతన్యం అక్కర తెలుస్తుంది.   చచ్చిపోయి బిగుసుకుపోయినవాళ్ళు కాదు, ప్రాణమున్న మనుషులు కావాలనిపిస్తుంది, ప్రేమించేందుకు. అతి సూక్ష్మం గా ఆమెని గమనిస్తున్నLottie కి అర్థమైపోతుంది- వెళ్ళి ఆవిడ చెంప మీద గట్టి గా ముద్దు పెట్టుకుంటుంది.

ఆ ముద్దు చదువరుల చెంపల మీద రచయిత్రి పెట్టినది.

మనుషులంతా మంచివాళ్ళే- కిక్కిరిసిన తనం వాళ్ళని మూసిపెడుతుందిగానీ.

జీవితాన్ని ఇష్టంగా కౌగలించుకొమ్మని తప్ప, అందుకు అవసరమైతే ఆట కాసేపు ఆపి అలా  వెళ్ళి రమ్మని తప్ప –  ఈ నవలలో చెప్పదలచుకుంది లేదు.  ఇక్కడ అక్కర్లేదు.

*

మైథిలీ అబ్బరాజు

ఈకాలానికి దక్కిన కడిమిచెట్టు మైథిలి సాహిత్యం! కథ రాసినా, విమర్శ రాసినా తన చుట్టూరా నిమగ్న ఆవరణని సృష్టించే సహృదయి.

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అబ్బా, చదవాలని ఉందండి ఈ పుస్తకాన్ని, ఆహ్లాదకరమైన పుస్తకం చదివి చాన్నాళ్లయ్యింది ????????

  • ఈ వ్యాసం ఒక ” ఐంద్రజాలిక స్వస్థత ” _/\_ ” మనుషులంతా మంచివాళ్ళే- కిక్కిరిసిన తనం వాళ్ళని మూసిపెడుతుందిగానీ. జీవితాన్ని ఇష్టంగా కౌగలించుకొమ్మని తప్ప, అందుకు అవసరమైతే ఆట కాసేపు ఆపి అలా వెళ్ళి రమ్మని తప్ప ” Thank you so much Mam, నేరుగా పుస్తకం పట్టుకొని చదివి ఉంటే ఇంత ఆహ్లాదం కలగక పోను, మీ వ్యాసం ఆ పుస్తకాన్ని లోనికి తీసుకొనేందుకు మంచి పూలబాట వేసినట్టు 🙂

  • వందేళ్ల నాటి నవల తాలూకు పరిమళాన్నీ, చల్లదనాన్నీ తాజాగా తామరాకులో చుట్టి దారంతో కట్టిన పొట్లాం మీ వ్యాసం.
    చదూతుంటే “వళ్లంతా పాకిన చల్లదనం.తలంటుకున్న జుట్టుకు పట్టిన సన్నజాజి వాసన.”

  • దృశ్యాలు, అందులోని వ్యక్తులు కళ్ళముందు నిలిచారు. జీవితాన్ని ఇష్టంగా కౌగిలించుకోవటమే!ప్రాణమున్న భనుషులు కావాలనిపిస్తుంది.గోడలు కట్టుకోకపోతే ఎంత బాగుంటుందో మనుష్యుల, మనస్సుల మద్య! చాలా మంచి నవల! ధన్యవాదాలు! పరిచయం చేసినందుకు.!

  • చాలా బాగుందండి మీ సమీక్ష. ఏకాలానికయినా వర్తించే తాజాతనం కధావస్తువులో ఉంది. మంచి నవలాపరిచయానికి ధన్యవాదాలు.

  • దాదాపు వందేళ్ల నాటి నవల..ఎంత చక్కగా పరిచయం చేశారో..సొంతం గా చదివినా ఇటువంటి అనుభూతి ఉండకపోవచ్చు. తెగించి ఒక కొత్త ప్రదేశానికి వెళ్లడం…
    మొదటి అడుగు వేసేంతవరకే మొహమాటం. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆటవిడుపు..

  • జీవితాన్ని ఇష్టంగా కౌగలించుకొమ్మని తప్ప, అందుకు అవసరమైతే ఆట కాసేపు ఆపి అలా వెళ్ళి రమ్మని తప్ప – ఈ నవలలో చెప్పదలచుకుంది లేదు.
    ” స్వర్గం లో పేచీలు ఉండవు, పెట్టుకోకూడదు ”

    అద్భుతం చాల బాగా విశ్లేషించారు …..థాంక్స్ మేడం… మరన్ని మీ నుంచి రావాలని కోరుకుంటూ మీ అభిమాని

    • చాలా సంతోషం ఆనంద్ గారూ. తప్పకుండా.

  • అవును -గోడల్లేని -జీవితమూ–మనుసులంతా మంచివాళ్ళే–క్రిక్కిరిసిన తనమే– వాల్లని ఇరుకుగదుల్లోపెట్టి వుపిరాడనియ్యదు కదా–నిజమే-కదా—

  • మంచి నవలను సువాసనల తో సహా అందించారు. ఓ మాటు వెళ్లవద్దామా అనిపించేలా..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు