వ్యసనాలన్నీ చెడ్డవి కానవవసరం లేదు.
కొన్ని కొన్ని మంచి వ్యసనాలు కూడా ఉంటాయి.
ఆపకుండా పుస్తకాలు చదవడం అలాంటి ఒక మంచి వ్యసనం.
కంటికి కనిపించిన మంచి మంచి పరభాషా కథలనల్లా తన భాషలోకి అనువదించి తనవాళ్ళకు అందించాలన్న తపన ఉంది చూసారూ – అది అచ్చమైన సద్వ్యసనం!
ఇది నాకు బాగా తెలుసు – నాకా అలవాటు ఉంది గాబట్టి.
అలాంటి సాటి వ్యసనపరుడు కొల్లూరి సోమ శంకర్.
కనిపించిన మంచి కథనల్లా తెలుగు చేసేయాలన్న కోరిక – తపన – పిపాస. ఆ పిపాసకి సరిజోడుగా అనువాదం చెయ్యగల శక్తి. వెరసి, వందను దాటిన అనువాద కథలు. కొన్ని ఇతర దేశాల కథలు.
అందులోంచి ఏరి మాల గుచ్చితే – ఇదిగో ఈ పధ్నాలుగు కథల ‘ఏడు గంటల వార్తలు’.
నాలుగయిదు పేజీల చిన్న కథలు కొన్ని. పదిహేను పేజీల పెద్ద కథలు మరికొన్ని. నిడివి సంగతి ఎలా ఉన్నా కథల్లోని అంతఃసూత్రం – జీవితం.
సుదూరపు కెనడా నుంచి పక్కనే వున్న నేపాల్ వరకూ ఆయా జీవితాలను, జనజీవన సరళినీ తెలుగు పాఠకుల దగ్గరకు చేర్చే పధ్నాలుగు కథలు. నూట ఏభై ఏళ్ళనాటి అమెరికా అంతర్యుద్ధం నుంచి వర్తమాన కాలపు కజకిస్థాన్ భాషా సమస్య దాకా చరిత్రకూ, సంస్కృతికీ వారధిలా నిలిచే కథలు.
సాహిత్యానికీ జీవితానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించీ – ఆ సంబంధాన్ని అలవోకగా ఒడిసిపట్టుకొనే కథా సాహిత్యం గురించీ కనీస అవగాహన ఉన్న ఏ మనిషికైనా ఈ ప్రపంచమే ఒక కథారంగం. మనసు తెరిచి పరిసరాలను పరకాయిస్తే, కనిపించిన మనుషుల్ని పలకరిస్తే, పలకరించిన మనుషుల్లోకి కాస్తంత తొంగి చూస్తే – కథలే కథలు. జీవితమే జీవితం. ఏ జీవితాన్ని ముట్టుకున్నా రాలేవి కథలు. కారేవి కన్నీళ్ళు. కురిసేవి – అరుదుగానైనా – ఆహ్లాదాలు. దానికి అగ్రరాజ్యమూ బడుగుదేశమూ అన్న తేడా లేదు. తెల్లదొరా నల్లచర్మమా అన్న వివక్ష లేదు. ఉష్ణమండలమా శీతలదేశమా అన్న పట్టింపు లేదు. ఆర్యభాషా ఆటవికుల ఘోషా అన్న తేడా లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మనిషిని చూసినా, ఏ భాషను విన్నా, ఏ ఘోషకు చెవి ఒగ్గినా వినిపించేవి అవే విషాదగాథలు. అదే మధుర సంగీతం.
***
సైనికుడు అనగానే రక్త పిపాస, మతగురువు అనగానే అమితమైన కరుణ మనకు ప్రపంచం నూరిపోసిన మూసప్రతీకలు. ఏ కాలంలోనయినా ఆయా దుస్తులూ, వృత్తులూ వెనుక ‘మనిషి’ అసలు రూపం వేరుగా ఉండే అవకాశం ఉండదా? ఉంటుందనే అంటుంది ‘మానవత్వం’ కథ. అమెరికా అంతర్యుద్ధపు చివరి రోజులలో దక్షిణ రాష్ట్రాల కాన్‌ఫెడెరేట్ సైన్యాల అధికారికీ ఒక మతాధికారికీ ఉత్తరానికి పారిపోతున్న నల్ల బానిస తారసపడతాడు. అప్పటి జాతి ధర్మాలూ, యుద్ధ న్యాయాల ప్రకారం మరో ఆలోచన లేకుండా చెయ్యవలసిన పని ఆ బానిసను నిర్మూలించడమే. మతాధికారి సైన్యపు మేజర్‌ని ఆ పని చెయ్యమనే అంటాడు, బలవంతపెడతాడు, విరుచుకుపడతాడు. అప్పటికే యుద్ధాలు, హింసలు, రక్తపాతాలు బాగా చవిచూసి ఉన్న ఆ సైన్యాధికారి ఎదుటిమనిషిలో పారిపోతున్న బానిసను కాకుండా జీవనకాంక్ష బలంగా ఉన్న సాటి మానవుడిని చూస్తాడు… అతను సురక్షిత ప్రదేశానికి చేరుకోడానికి సాయపడతాడు.
ప్రపంచంలోని ఏ మూలన అయినా, ఏ వ్యవస్థలో నయినా బలవంతుల అధికారాలూ, దౌర్జన్యాలూ చెల్లుబాటయ్యేది బలహీనులూ, నిస్సహాయుల మీదే అన్న మాటను మరోసారి లిస్బన్ నగరం మీదుగా ఆఫ్రికా మారుమూల గ్రామాల్లోకి పాఠకులను తీసుకువెళ్ళి విస్పష్టంగా చూపించే కథ ‘వానదొంగ’.
అంతర్యుద్ధాలు, జాతుల వైరాల పుణ్యమా అని ఏ పాపమూ ఎరుగని, ఏ నేరమూ చెయ్యని అతి సామాన్య ప్రజలు వివక్షకూ, విద్వేషాలకూ ఎంత దారుణంగా గురి అయ్యే అవకాశం ఉందో చెపుతుంది ‘విద్వేషం’ అన్న ఆఫ్ఘనిస్థాన్ కథ. పాకిస్థాన్‌లో శరణార్థిగా ఉన్న ఒక ఆఫ్ఘన్ తల్లి చిత్తు కాగితాలు పోగు చేసుకుని పిల్లవాడి కడుపు నింపే తల్లి – వర్షం వల్ల ఆ రోజూ ఆ ఒక్క ఆధారమూ కొట్టుకుపోతే, ఇహ తప్పని పరిస్థితిలో భిక్షాటనకు తెగబడినప్పుడు ఓ ఇంటి యువతి ఆ ఇంటి పెద్దావిడతో “ఏమన్నా ఉంటే కుక్కల కన్నా వెయ్యి గానీ ఆ కాబూలీలకు పెట్టక” అంటే పాఠకుల మనసు ఏమవుతుంది?! ముందు నీరుగారిపోతుంది. కాస్తంత నిలదొక్కుకోగలిగితే ఈ విద్వేషాలు మనిషికీ మనిషికీ మధ్య ఎంత దారుణమయిన గోడలు కట్టాయీ?! అన్న ఆలోచన కలుగుతుంది. కథా నేపథ్యం ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ అవడం యాదృచ్ఛికం – అది, ఆ విద్వేషం – ఏ నేల మీదయినా వేళ్ళూనుకుని చరచరా ఎదిగే విషవృక్షం.
ఏ దేశపు రాజకీయ నాయకులలోనైనా బట్టలూ పొట్టా విప్పి చూస్తే కనిపించేవి స్వార్థమూ, కుతంత్రమూ అన్న మౌలికమైన విషయాన్ని హాస్య వ్యంగ్య ధోరణిలో ఆకట్టుకునేలా చెప్పిన కథ ‘గ్రామసీమల్లో మంత్రిగారి పాదయాత్ర’. ఆ ‘కుతంత్రం’ ఎంతగా మనిషిలోకి చొచ్చుకుపోయి ఒక సహజ లక్షణంగా మారిపోతుందో ఈ నేపాలీ మంత్రిగారు విశదీకరిస్తారు. స్వగ్రామం ముఖ్యమా దేశం ముఖ్యమా అన్న మహత్తరమైన ప్రశ్న వేసుకుని – (దేశపు రాజధానిలో ఏసీ సౌకర్యం ఉంటుంది గాబట్టి) దేశమే ముఖ్యం అంటూ గ్రామం నుంచి నగరపు దిశగా వెళ్ళే మంత్రి గారిలో మనకు తెలిసిన రాజకీయ నాయకుల ఛాయలు కనిపించడం – సహజమే!
కజక్ భాషను నేర్చుకోడానికి ఇష్టపడని విద్యార్థుల పుణ్యమా అని వాళ్ళ టీచరుగారి ఉద్యోగం పోతుంది! అసలు ఆ పదకొండో క్లాసు పిల్లలు ఎందుకు కజక్ భాష నేర్చుకోం అంటున్నారూ?! వాళ్ళ మాటల్లోనే విందాం: “కజక్ ఎవరికి కావాలి? మేమంతా రష్యా వెళ్ళిపోతున్నాం. ఇంగ్లీషు నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు కజక్ ఎవరు నేర్చుకొంటారు?”… ఇది అచ్చు గుద్దినట్టు మన అమలాపురంలోనో ఆదిలాబాదులోనో జరిగిన సంభాషణలా లేదూ?! ఇపుడు ఇంగ్లీషు ప్రభావం వల్ల మాతృభాషలకు చేటు కలగడం అన్న విషయంలోకి వెళ్ళను. ఇది సందర్భం కాదు. కానీ సమస్య ప్రపంచవ్యాప్తం అన్న స్పృహ మనకు ఈ ‘ఉద్యోగం పోయింది’ అనే కథ కలిగిస్తుంది!
***
మనిషిలో మూడు ప్రపంచాలు ఉంటాయి: అంతర్గత ప్రపంచం, పరిసర ప్రపంచం, ఉమ్మడి ప్రపంచం. మొదటి రెండు ప్రపంచాల గురించీ సగటు మనిషికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మూడో ప్రపంచం విషయంలో ఈ అవగాహన చాలామందిలో ఉండదు. సౌదీ అరేబియా రిఫైనరీ మీద డ్రోన్‌ల దాడి జరిగితే, మన ఊర్లో పెట్రోలు ధర ఎందుకు పెరుగుతుందో తెలిసినంతగా సామ్రాజ్యవాదం, జాతుల ఆధిపత్య ధోరణి, బలవంతపు యుద్ధాలు, అమెజాన్ అడవుల మంటలు మన దైనందిన జీవితం మీద చూపించే ప్రభావం గురించి చాలామందికి తెలిసిరాదు. ఈ కథలు చదివితే ఆ ఉమ్మడి ప్రపంచఫు ఛాయలు లీలా మాత్రంగా మన కళ్ళ ముందు కదలాడుతాయి!!
సగానికి పైగా కథల్లో యుద్ధం, హింస, రక్తం కథా వస్తువు. కనీసం నేపథ్యం. యుద్ధ నేపథ్యమే అయినా కథల్లో కనిపించేది అచ్చమైన జీవితం అన్న స్ఫురణ మనకు కలుగుతుంది. ‘ఆ తుపాకీ మొనలపైనే గడ్డిపూలు పూయడం’ లాంటి మానవత్వపు పరిమళం కథల్లో కనిపించి సంతోషపరుస్తుంది. ప్రపంచం మీదా, భవిష్యత్తు మీదా నమ్మకం కలుగుతుంది. అనువాదానికి ఆయా కథల ఎంపిక యథాలాపంగా జరిగిందని అనుకోను. కథల ఎంపిక వెనుక అలోచన ఉంది, ఒక పద్ధతి ఉంది…
మూలభాషకూ, మూల కథకూ అన్యాయం జరగకుండా; అదే సమయంలో లక్ష్యభాషా పాఠకులను ఇబ్బందికి గురి చెయ్యకుండా అనువాదాలు చెయ్యడం అంత సులువు కాదు. సరళమైన కథనం, స్థానిక పలుకుబడుల సాయంతో సోమ శంకర్ పైన చెప్పిన పని ఎంతో సులభం అన్న భ్రమ పాఠకులలో కలిగిస్తారు. అనువాదకుడిగా ఆయన సాధిస్తోన్న పెద్ద విజయం ఇది. ఆ విజయపు సులక్షణాలు ఈ పధ్నాలుగు కథల్లోనూ పరుచుకొని ఉన్నాయి.
ఇంకో చిన్న విశేషం చెప్పాలి. కొన్ని కొన్ని మూలకథలు ఆంగ్లంలో ప్రచురితమైన ఒకటి రెండు నెలల్లోనే అనువాదకుడి పుణ్యమా అని తెలుగులో అందిన వైనాన్ని ఈ పుస్తకంలో చూడవచ్చు. అదెలా సాధ్యపడుతోందీ? అందుకు సోమ శంకర్ ఎలాంటి పద్ధతిలో శోధన చేస్తున్నారూ అన్న కుతూహలం పాఠకులలో కలుగుతుంది. ఆ సంగతి వివరిస్తే పాఠకుల కుతూహలం తీరడమే కాకుండా ఇతర అనువాదకులకు కాస్తంత దారి చూపినట్టూ అవుతుంది!
కాలక్షేపానికో, సరదా కోసమో, ఉల్లాసానికో, ఉత్తేజానికో ఒక చిన్న పుస్తకంతో ఓ గంట గడుపుదాం అనుకునేవాళ్ళకు ఈ ‘ఏడు గంటల వార్తలు’ మొట్టమొదటి ఎంపిక కాబోదు!
అలాగే ఈ కథల్లో వ్యవస్థల గురించీ సంస్కృతి గురించీ జ్ఞానం ప్రసాదించే కథలూ ప్రవచనలూ లేవు. జీవితపు సంక్లిష్టతలను ఉద్వేగభరితంగా మనసును తాకేలా చెప్పే కథలు ఇవి. మన ఆలోచనా ధోరణిని మరికాస్త విశాలం చేసి ప్రపంచాన్ని మరికొంచెం స్పష్టంగా చూడటానికి ఉపకరించే కథలు ఇవి.
***
మనిషికి ఉన్న సద్వ్యసనాల్లో మంచి పుస్తకాలు చదవడం ఒకటి. ఈ ‘ఏడు గంటల వార్తలు’ ఆ వ్యసనానికి తోడ్పడే పుస్తకం.
*
Excellent article Master.Thick in content and simple in language…thanks …
Thanksandi
‘ఏడు గంటల వార్తలు’ ఈబుక్ కినిగెలో లభ్యం
http://kinige.com/book/Edu+Gantala+Vartalu
అనువాదమంటేనే ఒక ప్రపంచంలో వెలువడిన మానస తరంగాన్ని మరో ప్రపంచానికి అందజెయ్యడం. అనువాద కథల సంకలాన్ని గురించి వివరించడమంటే ఒక పూల గుఛ్చాన్ని మాటల్లో వర్ణించడం వంటిదే. అది అమరేంద్రగారివంటి సిద్ధహస్తుల చేతుల్లోనే రక్తి కడుతుందనీ, సంకలనానికీ సంకలన కర్తకీ రావలసిన గుర్తింపు తెచ్చిపెడుతుందనీ మరోసారి ఋజువైంది. చక్కటి పుస్తకాన్ని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండీ!