రాసిన ప్రతి కథను సోకాల్డ్ ప్రామాణిక భాషలోకాక తెలంగాణ తెలుగులోనే రాయాలని తాపత్రయ పడే కథకులు చెన్నూరి సుదర్శన్. కథకులుగా, కవిగా, చిత్రలేఖకులుగా, కార్టూనిస్ట్ గా, మైక్రో ఆర్టిస్ట్ గా, అధ్యాపకులుగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన వీరు ఇప్పటిదాకా ‘ఝాన్సీ H.M.’ (కథలు), ‘మహాప్రస్థానం’(కథలు), ‘చెన్నూరి కథానికలు’ ‘ప్రకృతి మాట’(బాల సాహిత్యం), ‘జీవన చిత్రం’ (ఆత్మ కథ), అనే పుస్తకాలను వెలువరించారు. కవులుగా, కథకులుగా, కార్టూనిస్ట్ గా పలు అవార్డులు పొందారు. దైనందిన జీవితంలో తనకెదురైన అనేక జీవిత శకలాలను కథలుగా మలిచే చెన్నూరి సుదర్శన్ కలం నుండి జాలువారిన మంచి మానవీయ కథ ‘జోడుబతుకు’. ఈ కథ మొదట నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో 19 ఏప్రిల్ 2020లో ప్రచురింపబడింది.
పేదింటి యువతి కమల. తండ్రి తాగుబోతు. ఎట్లాగైనా డాక్టర్ను అయి కుటుంబాన్ని పోషించాలని అనుకుంటుంది. కానీ పేదరికం వల్ల వీలుకాదు. కమల క్లాస్ మేట్ ఆదిరెడ్డి (లా కోర్సు చదువుతుంటాడు)తాను ఎలాగైనా కమలను చదివిస్తానని ఒప్పించి సిటీకి తీసుకొస్తాడు. ఇద్దరం కలిసుందామని (సహజీవనం) చిన్న ఇల్లు కోసం వెతుకుతారు. అట్లా ఇల్లు వెతుకుతూ కథకుని ఇంటికి వస్తారు. పెళ్లి కాక ముందే ఇట్లా కలిసుంటే మా కాలంల దీన్ని ‘ఉంచుకునుడు’ అంటారు. వీళ్ళకు అసలే ఇల్లు కిరాయికి ఇవ్వద్దని చెప్తుంది కథకుని భార్య. కానీ కమల, ఆదిరెడ్డి తమ పరిస్థితి చెప్పుకొని బతిమిలాడుతారు. ఏ బంధం, అనుబంధం లేకుండా మనిద్దరం చేసేది ‘సహజీవనం’ కాక ఏమిటి? అని భార్య మీద మానసికంగా గెలవాలనే కసితో ఆమె వద్దన్నా కథకుడు వాళ్ళకు ఇల్లు కిరాయికి ఇచ్చి కమలను కన్న కూతురిలాగా చూస్తాడు. కమల ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. తీరా పరీక్ష రాసే రోజు వాళ్ళ నాయిన చనిపోయాడని కబురు వస్తుంది. కమల దుఃఖంలో మునిగిపోతుంది. నేను మీ నాయిన అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను కానీ నువ్వైతే పరీక్ష రాయిమని కథకుడు కమలను సముదాయించి పరీక్షకు పంపుతాడు. పరీక్ష రాయించి ఆదిరెడ్డి, కమలను సాయంత్రం వరకు దహనక్రియల్లో పాల్గొనేలా చేస్తాడు. కమలకు మంచి ర్యాంక్ వచ్చి మెడికల్ కాలేజీలో చేరుతుంది. డాక్టర్ అవుతుంది. ఓ రోజు కమలను కలుద్దామని పోయిన కథకునికి ఈ గతమంతా జ్ఞాపకమొస్తుంది. కులాలకు అతీతంగా మీరు తెగించి పెళ్లి చేసుకున్నారు కానీ మా లాగా మీరు కూడా పెళ్లైనా సహజీవనం చేసినట్లుగా కాకుండా మంచి ప్రేమానురాగాలతో జీవించాలని చెప్తాడు కథకుడు. తాను తన భార్యతో మూర్ఖంగా ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంది. అంతకు ముందే కథకుని భార్యా కూడా ఇదే విషయం చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అక్కడ ఆకస్మాత్తుగా భార్యను చూసి కథకుడు ఖంగు తింటాడు. ఒక డాక్టర్ గా నేను మీకిచ్చే సలహా ఒకటే. ఆడవాళ్ళకు మెనోపాజ్ తరువాత తన మాటే నేగ్గాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. మగవాళ్ళు దీన్ని అర్థం చేసుకొని మెలగాలి. అప్పుడే జీవితం పూలతోట లేకపోతే ముళ్లబాటే అంటుంది కమల. భార్యా, భర్తలిద్దరూ మనస్పర్థలు తొలగి కలిసిపోతారు.
జీవితం రోజు రోజుకు సంక్లిష్టంగా మారి ఎట్లా బతకాలనే సందిగ్ధంలోకి నెట్టేసిన ప్రతిసారి మనిషి ఎట్లాగైనా బతికి తీరాలనే కసిని పెంచుకుంటాడు. దాని పర్యావసానాలే వ్యభిచారం, సరోగసి, సహజీవనం. ఏ పద్ధతిలో జీవించినా మానవీయతే జీవితానికి కొలబద్ద. కథ ఒక ఆర్ధ్రమైన సన్నివేశంతో మొదలై అంత కంటే ఆర్ద్రమైన నదిలోకి మనల్ని లాక్కెళ్తుంది. కథలోని ప్రతి విషయం రచయిత స్వాధీనంలో ఉండి ముందుకు అడుగులు వేస్తుంటుంది. కథ చివరికి వచ్చేసరికి కథలోని కథకుడే కమల, ఆదిరెడ్డిలతో ఎన్నో విషయాలను నేర్చుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. ఇంత జీవితానుభవం ఉన్నా భార్యతో ఎలా మెలగాలో యువ ఆదిరెడ్డికి తెలిసినంతగా రిటైరైన కథకునికి తెలియదు. లోకంలో నూటికి ఎనభై శాతం జంటలు ఒకే కప్పు కింద జీవిస్తున్నా వాళ్ళ మధ్య మైల్ల దూరం పర్చుకొని ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ, జీవితం అరిగిపోతున్నా కొద్దీ పెళ్ళైన కొత్తలో ఉన్నంత ప్రేమానురాగాలు, ముద్దూ ముచ్చట ఉండవు. పైగా ఆధిపత్యం, అహంభావం పెరిగిపోయి ప్రభువు, బానిస సంబంధాలు విస్తరిస్తాయి. చింత చచ్చినా పులుపు చావనట్లు వయసు ఉడిగి పోయినా ఈ పెత్తనం పోదు. క్రమంగా ఇద్దరి మధ్య మౌనం గడ్డకట్టుకు పోతుంది. కథ మొదటి నుంచి చివరిదాకా ఒక సానుభూతి తీగ మీద నడిచి పాఠకునిలో తగిన ప్రకంపనను కలిగించి ముగుస్తుంది. కథంతా బహుజన కోణంలో నడిచి జీవితాన్ని ఎట్లా గెల్చుకోవాలో చెప్తుంది. ప్రేమ వివాహాలు విఫలమౌతున్నాయి జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. సహజీవనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సిన సన్నని పొరను చాలా జాగ్రత్తగా చూపెట్టాడు రచయిత. ప్రపంచమంతా స్వార్థం నిండిపోయిన విషపు కాలంలో ఇలాంటి ఆదర్శప్రాయమైన కథను ఊహించడం కష్టమే అయినా రచయిత విజయం సాధించాడనే చెప్పాలి. భార్య విషయంలో కథకుని పశ్చాత్తాపం, ఆదిరెడ్డి మంచితనం పాఠకుడిని ఆశ్చర్యపరుస్తాయి.
కథకు క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం ఈ నాలుగూ ఉండాలని కథా వ్యాకరణ వేత్తలు చెప్తుంటారు. ఈ నాలుగు లక్షణాలకు అక్షరోదాహరణ ఈ కథ. ఈ కథలో ఏ వాక్యాన్ని తీసేసినా అగ్గిపుల్లలతో నిర్మించిన ఈఫిల్ టవర్ కూలిపోయినట్లుగా కూలిపోతుంది. మానవీయత అనే దారానికి రంగు రంగుల సన్నివేశాలు, సంఘర్షణలనే పూసలను ఏర్చి కూర్చడంలోనే రచయిత అల్లకపు నేర్పు బయటపడుతుంది. సోమర్సెట్ మాం కథ లేసులాగా ఉండాలి అంటాడు. అంటే లేసులో అల్లిన భాగం కన్నా, అల్లకుండా వదిలేసిన భాగమే ఎక్కువ. అంటే కథలో చెప్పవలసిన దాని కన్నా తక్కువ చెప్పి మిగతాది పాఠకునికే వదిలేయాలి. ఈ కథలో చాలా విషయాలు కథకుడే చెప్పేస్తాడు. దీని వల్ల పాఠకుడు తానుగా ఆలోచించి తెలుసుకోవాల్సింది ఏమీ లేకుండా పోయింది. కథంతా తెలంగాణ తెలుగులో సాఫీగా సాగిపోతుంది. కానీ అక్కడక్కడ రచయిత ప్రామాణిక భాషకు, మాండలికానికి మధ్య కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కథను మొదట ప్రామాణిక భాషలో రాసి తరువాత తెలంగాణ తెలుగులోకి అనువాదం చేసినట్లుగా ఉంది. అందుకే ‘వ్యవసం’, ‘సాకారం’, ‘కోసరం’, ‘లచ్చాన్ని’ ‘పచ్తాన’, ‘బహుసా’, ‘గాలిత్తానం’ ‘సోపతిరాలు’ లాంటి కృతక పదాలు పంటి కింద రాళ్లలాగా తాకుతాయి. అదే సమయంలో పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. అనవసరపు వర్ణనలోకి పోకుండా నేరుగా విషయంలోకి పోవడం బావుంది. గతంలోకి పోవడానికి పాత టెక్నిక్ పాటించి చుక్కలు లేకుండా పోతేనే బావుండేది. అంటే వర్తమానం, గతం, వర్తమానం, గతం.. ఇట్లా నడిపిస్తే మరింత బావుండేది. అలాకాక ప్రస్తుతం- గతం-ప్రస్తుతంతో ముగిసింది. కథా సంవిధానం బావున్నా ముగింపు ఓ హెన్రీ కథల్లోలాగా ఒక చిన్న డ్రామాతో, కొస మెరుపుతో ముగుస్తుంది. నిజ జీవితంలో అట్లా ఉంటుందా? అనేది ప్రశ్నార్థకం. ఐతే జీవితాన్ని ముడిసరుకుగా తీసుకొని రాసిన కథ కాబట్టి కొంత మానవీయ పరిమళాన్ని మన గుండెల్లో వెదజల్లి, ఒక సంస్కారాన్ని మిగిల్చే కథ.
*
ఈ కథను నేపథ్యంగా తీసుకుని ,కథకులకు కథాలక్షణాలను గుర్తుచేయడం బాగుంది. రచయిత పాఠకులకు ఏమీ మిగల్చకుండా అన్నీ తానే చెప్పకూ డదన్న పెద్దల సూచనను ఉటంకించడం కూడా ఉపయోగకరమైనదే ! చెన్నూరి సుదర్శన్ గారు అనుభవజ్ఞులై న తెలంగాణ కథకులు! ఆయన మనసుపెడితే మరిన్ని మంచి కథలు రాయగలరు !కథకులకు, కథావిశ్లేషకులిద్దరికీ అభినందనలు !
గుండెబోయిన శ్రీనివాస్
హన్మకొండ
కథ సమీక్ష ద్వారా కథలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు, మెళకువలు తెలుసుకోగలిగాను. వెల్దండి శ్రీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
కథా రచనను,కథా విమర్శను సవ్యసాచి లా సమర్థంగా నిర్వహిస్తున్న శ్రీధర్ గారికి అభినందనలు
సహజీవనమనే తెలుగు మాటకు “జోడుబతుకు” అనే మరో అచ్చతెలుగు పేరును కల్పించిన కథారచయిత శ్రీ చెన్నూరి సుదర్శన్ గారికి మొదటగా నా హృదయపూర్వక అభినందనలు. ఎంతో మంచి కథావస్తువు ను ఎన్నుకున్న రచయిత, దానిని తెలంగాణ తెలుగులో ఎంతో పక్కాగా, పకడ్బందీగా రాశారు. ఆ సంగతే శ్రీ శ్రీధర్ గారు వారి సమీక్ష లో ఇలా చాలా బాగా చెప్పారు. “ఈ కథలో ఏ వాక్యాన్ని తీసేసినా అగ్గిపుల్లలతో నిర్మించిన ఈఫిల్ టవర్ కూలిపోయినట్లుగా కూలిపోతుంది”. శ్రీధర్ గారు చివరగా మరో గొప్ప మాట రాశారు “నిజంగానే ఒక సంస్కారాన్ని మిగిల్చే కథ. అని. ఎంతో మంచి కథకు అంతే మంచి సమీక్ష!!
చెన్నూరి సుదర్శన్ గారి కథ ‘జోడుబతుకు’ లో వస్తువు ఎంత ప్రశస్తంగా , నిర్మొహమాటంగా ఉందో కథపై వెల్దండి శ్రీధర్ గారి సమీక్ష కూడా అంతే ప్రశస్తంగా, నిర్మొహమాటంగా ఉంది. సమీక్షకులుగా హేతుబద్ధతను పాటించడం అభినందనీయం.
ఈ రోజుల్లో కూడా ప్రతీ కథను విశ్లేషణాత్మకంగా రచయిత మనోభావాలకు అద్దం పడుతూ విశ్లేషించటం మీ గొప్పతనమే అవుతుంది. కథా రచయితలకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న మీకు శుభాకాంక్షలు సార్
కథనం బాగుంది…కానీ ఆధునిక కాలంలో ఉన్న సహజీవనం ఇందుకు భిన్నంగా ఉంటుంది.
కథపై విశ్లేషణనే ఇంత బాగుందంటే కథ ఇంకెంత బాగుంటుందో. చాలా బాగా రాశారు సార్. అభినందనలు.
గ్రామాల్లో ఇంకా దళిత బహుజన అమ్మాయి లు సహజీవనము దాకా రాలేదేమో! సమీక్ష చక్కగా వ్రాశారు శ్రీధర్ గారు, అలవాటు గా, అలవోకగా. అభినందనలు.
సహజీవనం కు కథ కొత్త గా చిత్రిస్తే విశ్లేషణ దానిని కళ్ళ కు కట్టించి అద్దం పట్టింది.
శ్రీధర్ గారికి అభినందనలు.
చాలా మంచి విశ్లేషణ