“When we lose the right to be different, we lose the right to be free “-Diane Polov and Andrea Schneider
ఈ కొటేషన్ పాతికేళ్ళు పైబడ్డప్పుడు చదివాను కానీ …ఈ స్వేచ్ఛ అనే పదం నాకు , ఎదుగుతున్నప్పుడు చాలా గొప్పదిగా, ఆచరించలేనిదిగా, మామూలు వాళ్ళకు ఒక గొప్ప మిథ్యగా , దాని గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళలో రాసేవాళ్ళలో చాలా ఓటితనంగా – పిరికితనంగా…చాలా రకాలుగా కనబడేది.
అలా ఎదుగుతున్న దశలో నా జీవితం చాలా ఛాయాచిత్రాలు – మనసులో ముద్రపడిపోయినవి, మరొకరితో పంచుకున్నా అర్థం కానివి , చాలా మిగిల్చింది.
మా హేమత్తయ్య, నాన్న స్వేచ్ఛావాదులు ..వారి స్నేహితుల్లో చాలామంది అట్లాగే ఉండేవారు. వీరందరి డ్రాయింగ్ రూమ్ టాక్ లో చాలా చాలా విషయాలు – అమలిన శృంగార కథలు , అజ్ఞాత ప్రణయాలు, విఫల ప్రేమలు, నిరంతర వియోగాలు – అలా ఒక స్త్రీని ఆరాధిస్తూ మిగిలిపోయిన బ్రహ్మచారులు, వివాహేతర ప్రణయాలు – ఇలా చాలా రసవత్తరమైన విషయాలు వింటూ ఉండేదాన్ని.
మళ్ళీ వీళ్ళలో చాలామంది వాళ్ళ భార్యలు, పిల్లలు – వైద్యం – వీటికోసరం వచ్చినప్పుడు చాలామంచి భర్తలుగా తండ్రులుగా కొంతమంది భార్యా విధేయులుగా , కుటుంబక్షేమం ఆలోచించే బాధ్యత గల తండ్రులు గా …పెళ్ళిరోజు అంటూ వచ్చి మా బామ్మగారి కాళ్ళకు దణ్ణం పెడుతూ..ఉండేవాళ్ళు.
మనుషు ‘ల్లో ‘ మనుషులు ఉంటారని, వారి ప్రపంచం వేేరే ఉంటుందని … సోమర్సెట్ మామ్ , బెర్నార్డ్ షా లు చెప్పేదాకా తెలియలేదు.
ఐదుగురు పిల్లలున్న ఒక ప్రొడ్యూసర్ – ఒక హీరోయిన్ ఆరాధన లో పడి ,[ఆవిడకు నాన్న గార్డియన్ అన్నంత గౌరవం ] ఆవిడను హీరోయిన్ గా చేయించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆవిడ తల్లీ తండ్రీ అడిగినంత డబ్బు ఇస్తానని ఒప్పుకుని …తనే ‘ హీరో ‘ వేషం వేసి, ఆవిడ తో ఒక డ్యూయెట్ పెట్టించుకుని…
”డాక్టర్ గారూ ఏమి అందమండీ ! ఆ చూపులు ఏమిటండీ అసలు…ఇవాళ నన్ను చూసి తమాషాగా నవ్విందండీ ” అని రోజూ వచ్చి చెప్పుకుంటూ ఉండేవాడు.
అన్నీ వింటూ ” ఇదంతా నీ గోలే ! ఆ అమ్మాయి ఎట్లాంటి హీరోలతో యాక్ట్ చేసిందో తెలుసుగా ! ఊరికే ఓవర్ గా కలలు కనకు ” అని నాన్న ఏడిపిస్తూనే ఉండేవాడు. హెచ్చరించేవాడు.
” ప్రేమా వాడి మొహమా! ఆ అయిదుగురు పిల్లల తల్లి…పిల్లాడికి పదిరోజులు జ్వరంట . నీ స్నేహితుడిని పిచ్చిన పడవద్దని చీవాట్లు పెట్టు ” అని బామ్మ ప్రాక్టికాల్టీ మాట్లాడ్డం విన్నప్పుడల్లా చాలా ఆలోచించేదాన్ని.
ఆవిడకు ఇల్లాలితనం ఆపాదించేశారు కాబట్టి ఆ పాత్ర పవిత్రం గా, పరిధుల్లో ఉండిపోయింది. అదే ఆమె ఎవరి ప్రేమలోనైనా పడితే ?!
అమ్మో …ఇంకేమన్నా ఉన్నదా ?! చాలా పవిత్రవంశాలు ఇట్లాంటి ఇల్లాళ్ళ బంగారు సమాధుల మీద కట్టబడ్డవే కదా !
మూడున్నర ఏళ్ళకే అమ్మ చనిపోయిన నేను బామ్మ పెంపకం లో పెరిగాను. పదహారేళ్ళ వయసుకే తడిబట్టలు కట్టుకుని నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళ తద్దినపు వంటలు చేసి వడ్డించే సంప్రదాయం లో పెరిగాను. భయం, భక్తి, అణకువ – ఇవన్నీ మంచి అమ్మాయికి పర్యాయపదాలని నూరిపోశారు మా బామ్మలు.
ఎలా ప్రవర్తించాలో వాళ్ళు నేర్పించారు…ఎలా ఆలోచించాలో జీవితం, సాహిత్యం నేర్పించాయి.
మిగతావాళ్ళు నను చూసి ” పాపం ” అన్నప్పుడల్లా నాకు ” ఎందుకు ” అని ఆశ్చర్యం వేసేది…నాకు ఏమిటి తక్కువో అర్థమయ్యేది కాదు. దానికి కారణం మా బామ్మ గారు లక్ష్మీదేవమ్మ గారి అద్భుతమైన ప్రేమ…అవ్యాజమైన అనురాగం.
ఆవిడకు అనారోగ్యం వచ్చేదాకా –
మినప్పప్పుకీ కందిపప్పుకీ తేడా తెలియదు… పనివత్తిడి అంటే తెలియదు… బాధ్యత ఏమిటో తెలియదు…వాళ్ళ హృదయాల్లో నేను రాజకుమారిని.
మూడురోజుల అంటుస్నానానికి తెల్లవారు ఝామునే రెండు కాగుల నీళ్ళు పసుపు వేపాకు వేసి కాచి, మొదటి చెంబు పోసుకోగానే ముట్టుకుని, నేను అలసిపోతానని తల రుద్ది, స్నానం చేయించి , సాంబ్రాణి పొగవేసి, వెండిగిన్నె లో గోంగూర పచ్చడి, వెన్నపూస, మీగడపెరుగన్నం, ఆవకాయ ముక్క రెడీ గా ఉంచి నోట్లోపెట్టి – ” స్కూలుకు వెళ్ళే ముందు లేపుతాలే ” అని పడుకోబెట్టి దుప్పటి కప్పే – ఆ అనురాగం , ప్రేమ …అనుభవిస్తేకానీ అది ఎంత అదృష్టమో అర్థం కాదు.
కాని ఈ ప్రేమల వెనకాల అతిజాగ్రత్తలు, గన్నేరు చెట్టు మీద బూచివాడు, తోడు లేకుండా వెళ్ళలేకపోవడం, చీకటంటే భయం – ఇవన్నీ కూడా నాలో ఉండిపోయాయి.
” నూటమూడు డిగ్రీల జ్వరం లో దాని జోలికి అంటుస్నానమని వెళ్ళారా చంపేస్తాను… నాలుగు రోజులు ఆగి స్నానం చెయ్యచ్చు – మీ బొంద ఆచారాలు ..” అని తిట్టి నాన్న ఊరుకు వెళితే – జల్లెడ పెట్టి 108 స్నానాలతో సమానం అని పసుపు వేణ్ణీళ్ళు పోసేశారు. ఆ తరవాత న్యుమోనియా, నాన్న తిట్లు , బామ్మ దేవుడికి మొక్కుకుని ఉపోషాలు…
నాకు చిన్నప్పటినుంచి వెన్నెల్లో పడుకోవడం – పక్కనిండా మల్లెపూలు, నైట్ క్వీన్ పూలు పరచుకుని పడుకోవడం చాలా ఇష్టం….కానీ , ” గుచ్చుకుంటాయమ్మా. మెత్తటి ఒళ్ళు ” ( కచ్చూరాలు, బావంచాలు, కస్తూరి పసుపు – వీటితో నలుగులు పెట్టేవాళ్ళు మరి ) అని దులిపి తరవాత పక్కమీద పడుకోపెట్టేవారు బామ్మ.
మంచం చుట్టూ రాలిన ఆ పూలు…వాటిని చూస్తూ పడుకునేదాన్ని. వెన్నెల అందం ఆస్వాదించేలోపల …
” జలుబుచేస్తుంది. మంచు పడుతోంది, లోపలికి రా ” అనేసేవారు.
కానీ…నాకు బాధ అనిపించేది కాదు.
ఇలా మనకు కావలసినవి ఎవరో కాదన్నప్పుడు బాధ, దుఃఖం, కోపం, కచ్చ …ఎందుకు రాలేదా అని తరవాత తరవాత ఆలోచించేదాన్ని. నాకప్పుడు స్వేచ్ఛ లేదు అనిపించేది కాదు. ఎందుకూ అంటే బహుశా చుట్టూ ఉన్న ఆప్యాయతల చలివేంద్రం కారణమేమో. సెక్యూరిటీ ఉన్నప్పుడు నిష్టూరాలూ నిందలూ ఉండవేమో …ప్రేమ రాహిత్యం ఉన్నప్పుడే ఇవన్నీ బైటకు వస్తాయేమో…
నాకు పాల ఉబ్బసం ఉందని , పథ్యం కూరలు, నెయ్యి పోపు తప్ప ఎరుగను నేను…కొబ్బరి నిషిద్ధం..దగ్గు వస్తుంది..టమోటాలు మనుషులు తింటారని నాకు హైద్రాబాద్ మా పిన్ని గారింటికి వెళ్ళేదాకా తెలియదు. ” పిల్లలు తోసేస్తారు ..తల చెరిగిపోతుంది…బట్టలు మాసిపోతాయి..” అంటే – ఆడుకునే పిల్లల్ని చూస్తూ ఎంజాయ్ చేసేదాన్ని.
బీచ్ ఒడ్డుకు వెళ్ళి నీళ్ళలో తడవడం నాకు చాలా ఏళ్ళుగా తెలియదు. నాన్న ఎప్పుడైనా బీచ్ కు తీసుకువెళ్ళి ప్లాట్ ఫాం మీద ఉండే గట్టు మీద కూర్చోబెట్టి, జీడిపప్పు కొనిపెట్టి – ” చల్లగాలి , లంగ్స్ ఎఫెక్ట్ ” అని చెప్పి తీసుకువచ్చేసేవారు . ఐస్ క్రీం అస్సలు నిషిద్ధం.
కాలేజీ లో చదువుతున్నప్పుడు నేను, హేమత్తయ్య – టెంపోరావు గారి ఇంటికి వెళ్ళి అక్కడినుంచి పౌర్ణమి అని బీచి కి వెళ్ళి , వెన్నెల్లో అలలను స్పృశిస్తూ..సముద్రం మీద వెండి తరగల తెలివెన్నెల వెలుతురులో- ఎన్నో అముద్రితమైన కథలు , అక్రమసంబంధాలకు ప్రణయాలని పేరుపెట్టే వారి జీవితాల్లో అపశృతులు- వాటిని మనిషిగా ఎలా చూడాలో, రచయిత ద్రష్టగా ఎలా వివరించాలో – ఆశోపహతులను దైవోపహతులను ఎలా ఆలోచిస్తే క్షమించగలమో…అజ్ఞానాన్ని క్షమించవచ్చు గాని అన్యాయాన్ని ఎలా క్షమించలేమో…
ఇవన్నీ జీవిత పాఠాలు..
మనసులో స్పందించే అరూప దర్శనాలు …
ఓణీ కొంగులో బోలెడు నత్తగుల్ల లు , శంఖాలు ఏరుకున్నాను.
కొన్ని అత్తయ్యే ఏరి ఇచ్చింది. ” ఇది చూడు ఎంత అందం గా ఉన్నదో ! సర్వేశ్వరుడి సృష్టి ..” అని కాసేపు..నేను బైరన్ ఓషియన్ పొయిట్రీ గురించి చెప్పాను.
సముద్రం అనంతశక్తికి ప్రతీక..మనిషి శక్తి, ఉనికి దాని ముందు ఎంత పరిమితమైనవి…అన్న వేదాంతం…
టాంగా మాంగా సుండల్, మురుకులు తింటూ పరిగెత్తుతుంటే…ఒక్కసారిగా , గాలికి నా ఓణీ ఎగిరి, నేను కష్టపడి ఏరుకున్న శంఖాలు, ఆల్చిప్పలు …అలలపాలైపోయాయి.
బిక్క ముఖం వేసుకుని చూస్తున్న నన్ను –
” ఏమిటి ? బాధగా ఉన్నదా ? జీవితం అంటే ఇంతేనే పిచ్చి మొద్దూ. అద్భుతాలు అనుకునే జ్ఞాపకాలు అలా…అలా.. నీటిపాలైపోతాయి. పెద్దదానివి అవుతున్నకొద్దీ నీకు చాలా అర్థమౌతాయి. సముద్రపు ఒడ్డున ఏరుకున్నవి సముద్రం తీసేసుకున్నది , అంతేగా ! ” అన్నది. ఆవిడ గొంతులో నిర్వేదం.
మరింత పెద్ద అల…ఎవరో కట్టుకున్న ఇసుక ఇంటిని కూడా ఆ అల ఈడ్చుకు వెళ్ళిపోయింది.
పకపక నవ్వింది అత్తయ్య.
ఆ వెన్నెల్లో రోజా పూవులున్న నల్ల జార్జెట్ చీర, మెరుస్తున్న రాళ్ళ లోలాకులు, పెద్ద జుట్టు – ఆవిడ సౌందర్యం లో ఒక తమకం ఉండేది.
” ఎందుకు నవ్వుతున్నావు ? ”
” నీ ముఖం…ఆ పెద్ద ఇసుక ఇల్లు , నీ నత్తగుల్లలు సముద్రానికి ఒకటే. ‘ నావి ‘ అనుకుంటాము కాబట్టి మనకు ఎంత ప్రలోభమో …కాని ‘ ఆయనకు ‘ అంతా సమానమే. చివరకు మిగిలేది ?! ” నిట్టూరుస్తూ అన్నది.
ఆవిడ ‘ మిగిలిందేమిటి ‘ నవలలో …
హీరోయిన్ ఎందుకు అలా ?! అని అడగాలనిపించేది.
కానీ ధైర్యం లేదు.
” జీవితం ఇలాగే ఉండాలి అన్న రూలు లేదు, ఉండదు కూడా ” అనెయ్యగలదు.
ఆవిడ కథనం నాకు చాలా విస్తృత ఆలోచనా సరళి ని నేర్పింది…కానీ ఆ పాత్రల పరిణతి ?!
ఇలా కాక ఆ పాత్ర కొంచెం అలా ఆలోచించి ఉంటే ? అని అప్పుడప్పుడూ అనిపించేది.
కానీ, అనుభవ సముద్రాలు దూకి, ఎదురీది చేసిన అధ్యయనం ఆవిడది…
మోహనవంశి లాంటి అద్భుతాన్ని సృష్టించగలదు..గాలి పడగలు -నీటిబుడగలు లాంటి నవల కోసరం – విజయవాడ మెరక వీధుల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయ విదారక కథలను ధైర్యం గా రాసి తిట్లు తినగలదు…పచ్చిగా, పరుషం గా నిజాలు చెప్పి మాయ తెరలను చించెయ్యగలదు.
మనుష్యుల్ని అర్థం చేసుకోవడానికి – వాళ్ళలో ఉండే సబ్ కాన్షియస్ వీక్ నెస్ లను కూడా ప్రాసెస్ చేసి చెప్పే ధైర్యం …కొన్ని అలాగే రాయగలదు.
తమ అజ్ఞాత ప్రేమలు, నీడల్లో నిలిచిపోయే బలహీనతలు, చెప్పుకోలేని అపేక్షలు, తెలిస్తే సంఘం ఉపేక్షిస్తుందన్న భయాలు …ఇవన్నీ చాలా ఆప్యాయం గా వింటుందని ఆవిడ చుట్టూ చాలా మంది ఆరాధకుల బృందం ఉండేది. కానీ ఆవిడ పులి దృష్టి – ” ఏ ప్రేమను ఎవరు ఎలా దాచుకుంటున్నారు..ప్రాసెస్ చేసుకుంటున్నారు, ‘ వాడుకుంటున్నారు ‘ “ – అని అర్థం చేసుకునేది.
” ఎలా తెలుస్తుంది అత్తయ్యా ? అంత కరెక్ట్ గా ?! ” అంటే ” సరస్వతీ అనుగ్రహం..మన గొప్ప కాదు ” అనేది. కళ్ళు మూసుకుని దణ్ణం పెడుతున్న ఆ బంగారుతల్లి అలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు.
భార్య చెల్లెల్లి మీద ప్రణయాన్ని అలా ‘ వాడుకుంటూ ‘ , రోజూ నమకం చమకం చేసే చిన్నపాటి రచయిత ఈవిడ ఫాన్స్ లో ఒకరు…
ఆయన పాత్ర ఒక నవలలో పెట్టేసింది ఈవిడ. కర్మకాలి ఆ పుస్తకం వాళ్ళావిడ చదివేసింది..
ఆ తరవాత ?! ఆయన పాట్లు భగవంతుడికి ఎరుక. ” లత గారంత…” అని చెప్పి చాలా తిట్లు తిట్టుకుని శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు.
” అందుకు కాదు నా కోపం…” ఫిష్ టాంక్ లో రంగు రంగుల చేపల్ని పరీక్షగా చూస్తూ , అద్దం మీద వేలితో వాటిని ఫాలో అవుతూ …అన్నది.
” మరి ?! ”
” వాళ్ళావిడ రియాక్షన్ చూసి …”
” ఏమైంది ? ఆయనకు పంచాయితీ పెట్టిందా ? ”
” పంచాయితీ కాదు, రేవు….ఉతికేయడమే షోడా పెట్టి ….అది కాదు విషయం – పరిణామం ?! చెల్లెల్ని హాస్టల్ లో చేర్పించి…మొగుడిచేతనాలుగు కాసుల నెక్లెస్ కొనిపించుకుని శాంతించింది …”
ఆ తర్వాత ఆవిడ తో మాట్లాడే ధైర్యం నాకు బొత్తిగా లేదు…
ఇల్లాలితనాల వెనకాల బ్లాక్ మెయిల్స్, అమాయకులను బలి పెట్టడాలు …
” కాఫీ తెస్తాను ” – అని పారిపోయాను.
*
మేమూ మీ బామ్మగారి దర్శనం చేసుకున్నాము.సముద్రమూ… వెన్నెలా… హేమలత గారి నవ్వూనూ. కొన్ని అద్భుతమైన జ్ఞాపకలు మీ వాక్యాల్లో.
As usual. Jalandhar madam Mee gnpakala samdudra tarangala love tadisi midday ayyanu
మీ జీవితమే అయినా చదవాలనిపించే కథలా ఉంది. మీ బామ్మగారి పార్ట్ వరకూ నోస్టాల్జిక్ గా అనిపించింది. మీరు రాసిన శైలి చాలా బావుంది.
Chaalaa baagundi jnaapakaala tumpara
” జీవితం అంటే ఇంతేనే పిచ్చి మొద్దూ!” _/\_ శీర్షిక లాగానే ఈ భాగమంతా ప్రేమగా, సుతారంగా ఉందండీ. జీవితపు బరువంతా అనుభవాల్లో ఇంకిపోయాక మిగిలిన తేలికైన జ్ఞాపకాలు … Thank you Mam !!
నమస్కారం జలందర గారూ.( సెక్యూరిటీ ఉన్నప్పుడు నిష్టూరాలూ నిందలూ ఉండవేమో …ప్రేమ రాహిత్యం ఉన్నప్పుడే ఇవన్నీ బైటకు వస్తాయేమో…)అనుభవ పూర్వకమైన మాటలు ..కదిలిపోయిన కాలాలనుంచి,కరిగిపోని జ్ఞాపకాలు!
అలరించాయి…అభినందనలు ????????????
మా బాల్యం,, అదుపు, ఆప్యాయతలతో మేము పెరిగిన పధ్ధతి, లత గారి ఊహాగానం రచనలు, ఎంత తీయటి జ్ఞాపకాలో. మీరన్నా మీ కథలన్నా నాకెంతో ఇష్టం. మీ కథల్లో మీరు చేసే మనసు విశ్లేషణ నాకెంతో నచ్చుతుంది. మీకు ఆ భగవంతుడు కడదాకా శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రాయడానికి, కాదు,మిమ్మల్ని, అభినందించడానికి..నాకు,పదాలే దొరకడం లేదు.. మేడం.. ఇన్నాళ్లు, మీ రచనలు చదవకుండా, ఎలా, ఉన్నాను తెలియకుండా..నేను మీకు అభివందనలు.!