జీవన కాలం ఇక కరుణించదు

విపరీతంగా చదివే అలవాటు ఉన్న ఆయన నలభయ్ సంవత్సరాల క్రితం అప్రయత్నంగా తన చేతిలోకి వచ్చిన ఒక చిత్తు కాగితం లో ఉన్న ఒక కవితను చదివారు . ఆ కవిత ఆయనకు బాగా నచ్చింది . ఎంత బాగా అంటే , ఆ కాగితాన్ని జాగ్రత్తగా మడతపెట్టి , జేబులో పెట్టుకుని , ఇంటికెళ్లి డైరీ లో రాసుకునేంత బాగా . ఆ తరువాత ముప్ఫయి ఏళ్ళ కు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు లో   ” సురభి ” పేరుతొ ఒక సంగీత సాహిత్య సమాలంకృతమైన మాస పత్రిక ప్రారంభించాలని అనుకుని ఆ పత్రికకు సంపాదకత్వం వహించమని ఆయనను కోరింది . అందుకు ఆనందంగా అంగీకరించిన ఆయన , మొదటి సంచికలోనే , మూడు దశాబ్దాలుగా తన హృదయం లో కొలువై ఉండి , ఎన్ని సార్లు చదివినా ఎప్పుడూ కొత్తగా అప్పుడే చదివినట్లు మనసును ఆహ్లాద పరచే ఆ కవితను ప్రచురించారు. ఆ కవిత కింద పై విషయం అంతా రాసి

“ఈ కవి తో మాట్లాడాలని ఉన్నది . కవి స్పందిస్తే బావుండును ” అన్నారు

అదృష్ట వశాత్తు   సురభి మొదటి సంచిక చూసిన ఆ కవి పత్రిక కార్యాలయానికి ఫోన్ చేసి సంపాదకుడు ఫోన్ నంబర్ తీసుకుని ఒక రాత్రి పదిగంటలప్పుడు పలకరించాడు . అటు వైపు నుండి “నువ్వేనా ?” అన్నారు ఆయన ఆనందంగా . ఇటు వైపు నుండి ఆ కవి “సర్ ! మీరేనా ?” అన్నాడు ఉద్విగ్నంగా

“నువ్వేనా? ” అని ప్రశ్నించిన ఆ సముద్రం పేరు గొల్లపూడి మారుతీ రావు

ఉద్విగ్న పడిన పిపీలికం పేరు మోడెస్టీ వదులుకుంటే కవి వంశీకృష్ణ

గొల్లపూడి తన హృదయ పల్లకి లో నాలుగు దశాబ్దాల పాటు ఆనందం ఊరేగించిన ఆ కవిత పేరు “ఒక మాజీ ప్రేయసి ”

ఆ తరువాత అర్ధగంట పాటు ఆయన చాలా విషయాలు నాతొ ముచ్చటించారు . విజయవాడ లో ఖాదర్ మొహియిద్దీన్ అధ్యక్షత న జరిగిన మారుతీయం పుస్తక ఆవిష్కరణ లో మొదటి సారి ఆయనను కలిసాను . ఆ తరువాత ఆయన భద్రాచల వెళుతూ నా కోసమే ఖమ్మం లో గంట సేపు ఆగారు. నేను ఎంతో భద్రంగా గుండెల్లో దాచుకున్న ఆ జ్ఞాపకాన్ని నా “25th ఫ్రేమ్ ” అనే సినీ వ్యాసాల సంపుటికి ముందు మాట రాస్తూ బహిరంగం చేసారు ఆయన . మరాఠీ సినిమా సైలెన్స్ గురించి నేను రాసిన రివ్యూ చదివి అప్పటికప్పుడు ఫోన్ చేసి “ఎదురుగా ఉంటే , నిన్ను గాఢ ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాలని వున్నది ” అన్నారు ఆయన . అది ఆయన సంస్కారం . నాకు ఆస్కార్ ను మించిన పురస్కారం

ఇవాళ మధ్యాహ్నం ఆయన ఇక లేరు అన్న వార్తను మోసుకొచ్చిన సోషల్ మీడియా మీద మొదటిసారి నాకు చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది . అప్పటి నుండీ నేను దుఃఖార్ణవం లో మునిగిపోయాను

2

పధ్నాలుగేళ్ళకు మొదటి కథ రాసి , ఇరవైమూడేళ్లకు డాక్టర్ చక్రవర్తి అనే సినిమాకు రచయత గా పనిచేసి , నలభయ్ రెండేళ్లకు ఇంట్లో రామయ్య వీథిలో కృష్ణయ్య సినిమా ద్వారా నటుడిగా మారి , నలభయి కి పైగా కథలు , పదకొండు నవలలు , తొంభయిమూడు సినిమాలకు రచన , రెండువందల యాభయి కి పైగా సినిమాలలో నటన , వేల కొద్దీ వ్యాసాలు , కేవలం నాటకం చూడటం కోసమే లండన్ ప్రయాణాలు ఎంత వైవిధ్య భరితమైన ఎనభయ్ ఏళ్ళ జీవితం ఆయనది.

జీవితం లో ఆయన ఏదీ ప్లాన్ చేయలేదు . అలా జరిగిపోయాయి అంతే . ఏదీ ఆశించలేదు కనుక అన్నీ ఆయనను వరించి వచ్చాయి . మొదటి సినిమా దుక్కిపాటి మధుసూధనా రావు గారి రూపం లో వెతుక్కుంటూ వచ్చింది . “సినిమాకు రాయడం నాకు అస్సలు తెలీదు “అని దాశరధి దగ్గర నసుగుతుంటే “రాయడం నీకు తెలీకపోతే ఫరవాలేదు . ఎలా రాయించుకోవాలో ఆయనకు తెలుసు “అని దాశరధి ధైర్యం చెప్పాడు . ఆకాశవాణి లో శబ్దాలతో సహస్రావధానం చేయగల గొల్లపూడి కెమెరా ముందు తొట్రు పడితే కెమెరా ను ఎలా పేస్ చేయాలో చెప్పినవాడు చిరంజీవి . అలవోకగా అన్నీ వచ్చినా దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తనదయిన ముద్ర వేయడానికి ఎంత సొంత జీవితం చేయిజారి పోయిందో లెక్కలు వేసుకుంటే క్షణాలు , గంటలు , రోజులు ఏళ్ళు పూళ్ళూ ను

జీవితాన్ని అంత అర్ధవంతంగా గడపగల శక్తి ఆయనకు ఎక్కడినుండి వచ్చింది ? జీవితాన్ని నియమబద్ధంగా , క్రమ శిక్షణ తో గడపడం . ఆయన ఒక సరి ఒక మాట చెప్పారు . ప్రోగ్రాం తొమ్మిదిన్నర కు అంటే తొమ్మిది ఇరవై తొమ్మిది కాదు . తొమ్మిది ముప్పై ఒకటికి కూడా కాదు . తొమ్మిదిన్నరకే . ఆ సమయపాలన వున్నది కనుకే ఆయన నిరంతరాయంగా జీవన కాలం రాయగలిగారు . ఏ విషయాన్ని ఎంత వరకు చెప్పాలో , ఎక్కడ ముగించాలో ఆయనకు తెలిసినంత గా మరొకరికి తెలియదు . అందుకే అంత అవుట్ స్పోకెన్ గా వున్నా కూడా ఎక్కడా ఏ వివాదం లోనికి ఆయన తల దూర్చలేదు . ఆవేశాన్ని పొదుపుగా వాడటం ఆలోచన విస్తరించిన కొద్దీ అలవాటుపడే అరుదైన దినుసు . ఆ దినుసును తన ఆధీనం లో వుంచుకున్నవాడు గొల్లపూడి

ఈ శక్తి ఆయనకు అలవోకగా రాలేదు .పురిపండా , చాగంటి , దేవులపల్లి , విశ్వనాథ , కె. వెంకటేశ్వర రావు , జి కృష్ణ లాంటి ఉద్దండ పండితుల సాంగత్యం ఆయనకు ఒక్కో అంశాన్నీ నేర్పింది .

జుజుమురా లాంటి కథ ఆయన తప్పితే మరొకరు రాయగలరా ?

ఎర్ర సీత , సాయం కాలం అయింది , ఋణం లాంటి నవలలు ఆయన తప్పితే మరొకరు సృష్టించగలరా ?

లావాలో ఎర్రగులాబీ , రాగ రాగిణి ,కళ్ళు లాంటి నాటకాలు ఆయనకంటే బాగా మరొకరు రక్తి కట్టించగలరా ?

“అయితే ! నా ఇంట్లోంచి వెళ్ళిపోరా కుక్కా !” అని ఎడమచేయి విసురుతూ ఒక కంట దుఃఖాన్ని , మరొక కంట ఇలాంటి కొడుకును కన్నానే అనే పశ్చాత్తాపాన్ని మనిషికో చరిత్ర లో ప్రదర్శించగల మరొక నటుడున్నాడా ?

ఒక దటీజ్ సుబ్బారావు అంటే గొల్లపూడి . ఒక సింగిల్ పూరీ శర్మ అంటే గొల్లపూడి . ఒక ఓబులేసు అంటే గొల్లపూడి . పాత్ర ఏదైనా సరే తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ తో అజరామరం చేయగల నటుడు గొల్లపూడి

మెదడు ఖాళీ అవడం మహా ప్రమాదం . తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఖాళీ చేసుకుని , తాను ఏమీ చేయక్కరలేదని జీవితాన్ని శూన్యం చేసుకోవడం ముసలితనం . చెట్టు ఆకుల దగ్గర నుండి వాడి పోతుంది . చెంబెడు నీళ్లు పోయగలిగితే వేరుతో ఇంకా పచ్చగా ఉంటుంది

ఇది గొల్లపూడి అమ్మకడుపు చల్లగా లో రాసుకున్న మాట . అందుకేనేమో ఆయన ఎనభయ్ ఏళ్ళ చిన్న వయసులో వెళ్లిపోయారు అనాలి అనిపిస్తోంది నాకు

వ్యక్తిగతమైన ఆనందాన్ని అది ఏదైనా సరే . దాన్ని అనుభవించడం లో ఒక డిగ్నిటీ అవసరం . దాని కోసం యావ చూపించినా , దేబిరించినా , ఆరోగ్యమూ అనర్ధమూ తరువాతి మాట . మన వ్యక్తిత్వం రాజీ పడినట్టే అని తన జీవన కాలం ఎప్పుడో రాసిన గొల్లపూడి ఎక్కడా రాజీ పడకుండా , వక్తిగా , సమష్టి శక్తిగా తన డిగ్నిటీ కి ఎక్కడా లోపం రాకుండా హుందాగా జీవించి హుందాగా వెళ్లిపోయారు . ఇప్పుడిక ఆయన జీవించడం మొదలు పెడతారు తెలుగు నేల నలుచెరగులా.

వంశీ కృష్ణ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాజీ ప్రేయసి,గురించి, ఎనభై ఏళ్ల పసితనం గురించి, రాసిన మీ write-up, superb సర్!నిజ్జంగా, మీరు రాసిన విషయాలు మాకుతెలియవు కూడా చాలావరకు.. వారికి నివాళి!

  • అద్భుతమైన వ్యాసం అనే కంటే ఆవేదనని పుట్టించే ఎలిజి అనొచ్చేమో…జ్ఞాపకం కాగలగటమే జీవితం ఐతే, గొల్లపూడిగారు అతిపెద్ద జ్ఞాపకం…అందరికి…వంశీగారు బాగుంది…

  • మీరు రాసినది మనసును హత్తుకుంది. పిచ్చి పట్టినట్లు అన్ని ఇంటర్వూలు, వారి గురించి వచ్చిన ఆర్టికల్స్, వారి జీవన కాలం ఆడియోలు వింటున్నాను. ఒక వ్యక్తి ఇంత సాధన చేయవచ్చా! ఇన్ని పనులు చేయవచ్చా! ఆడియోలు వింటూంటే ఆశ్చర్యం,అభిమానం!! మీరు రాసినట్లు ఇకపై ఆయన జీవించడం మొదలు పెడతారు’ 🙏🙏🙏( మాజీ ప్రేయసి ) కవితకూడా పెట్టిఉంటే చాలా సంతోషించేవారము.)

  • Sri Maruthi Rao is a multi-dimensional.In short,he is a wonderful creative human being graced(laced) with encyclopedic knowledge, wit, wisdom and genius.Now ,there is a huge void……

  • Sri Maruthi Rao is multi-dimensional.In short,he is a wonderfully creative human being graced(laced) with encyclopedic knowledge, wit, wisdom and genius.Now ,there is a huge void……

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు