బల్లపరుపు ఒంటి వేళ
తట్టికొట్టే తలపుల
చదునుకాని వొకానొక
వీపు బొబ్బ
పులకల గెలుపూ
గోటిగొప్పుల సలుపులను
మోసుకొచ్చిన వెన్ను
ఇంతకీ ఆమె వెనకను
ఊడ్చేసిందా…
అరికాళ్ళ ఇసుక అతుక్కున్న
పచ్చబొట్టు సూదులను
….ఇలా కంటిపాపలమీద
గుచ్చుకుంటుందా…
పనిలేని పొద్దు రగులుతూ
ఎందుకు ఈ ఉడుకురవ్వలు
చిమ్ముతాడు
నడిపిమంట రేపి
నిండునెల కూలీ
బతిమాలకుండానే పనివల
విసురుతాడు
కోసిన వరిదుబ్బుల
ఎడమ నెరలూ…
చూరుల వేలాడే
వానతీగలూ…
పచ్చ గరిక మొనమీది
మంచు గుండ్లూ…
మూగకళ్ళను
ముడుచుకుంటాయెందుకో
గుండెకి
పులిపిరిలా
ఆనిక్కాయో…గోరుచుట్టో
కావలించుకొంటే
నిడుపుపలకల ఆవిరూపిర్లే.
***
2
పారాటాలు
ఎప్పుడూ గోడబల్లిపొట్ట
మొగిలు వేలాడాలని
ముంజేయి చాచదు
ఇప్పటికీ పీత
పూడికకన్నాల అలలను అడ్డుకోదు
గూటిపడుగూపేకల చివికిపోయిన
కౌగిలికొక్కేల సాలీడుకి
పిల్లినడకెందుకూ….
నీ సోయిపారాటాల వాయికీ
పెళుసు టపాకాయ నీటిసడికీ
జాలుగా కూరదినుసుచెక్క
విరుగుడు వొత్తంటిస్తాను.
ఎప్పుడప్పుడూ మిరియాలచారు
ఎముకల మూలుగు జుర్రుకుని
బెల్లంమంచవంచున
జోగాట కడతది
చలిచందపు జోరెండలో
వొళ్ళు కాచుకోనీ
మూలతెలివి గరగాడనీ
లోముళ్ళ ఉసురుతెమడ చీమనీ
ఆపై నన్ను తెమలనీ…
నీ నీడలోంచి.
***
చిత్రం: రాజశేఖర్ చంద్రం
బావున్నాయి సర్
మంచి పద్యాలు