ఇరవై పైసలకు నాలుగు జిగ్గులు, జిగ్గులు అంటే కొత్తగా తళతళ మెరిసే గోళీలు . బోకులు అయితే ఆరు గోళీలు కానీ వీటని ‘కొట్టు’లో అమ్మరు, మనతో పాటు ఆడేవాడెవడో ఒకడు అమ్ముతుంటాడు.
ఆరోజు పొద్దున్నే నూకాలమ్మ గుడికాడ కాస్త ఎడంగా చిన్న ‘గుంట’ కాలితో తవ్వి అల్లికాయల ఆట మొదలు పెట్టేస్తున్నారు గుంటలు. రకరకాల గోళీలాటలు లైనాట, గుంటాట ఆడుకుంటున్నారు.
గుండెలు దాకా లుంగీ కట్టిన ఓ బర్మా కాందిశీకుడు వైరుబేగు తీసుకుని కంచరపాలెం బజారుకు బయలుదేరుతున్నాడు. మరొకామె బర్మాకేంపు రేకులషెడ్డు వెనకాతల కర్రతో ములక్కాడలు కోస్తోంది.
నూకాలమ్మ తల్లి పండగకి ‘పోతురాజు’ గౌరవం పొందే గంగ బాబు వాళ్ల తాత సైకిలు నడుపుకుంటూ ‘డూటీ’కి ఎలిపోతున్నాడు. ఆడాళ్లంతా నీళ్ల బిందెలు మోసుకుంటూ కొండలమీద కట్టుకున్న పాకల దగ్గరకు వెళుతున్నారు.
సరైన పని దొరకక బర్మానుంచి తెచ్చుకున్న పళ్లాలు, ఖరీదైన సామాన్లు కంచరపాలెం గవరోళ్లకు తాకట్టుపెట్టడానికి తీసుకెళతున్నాడు అప్పారావు. ఇవేమీ పట్టని మా గుంటలంతా గోళీకాయలాటలో చాలా హడావిడిగా వున్నాము. నలుగురితో మొదలెట్టిన గోళీలాటలో ఒక్కొకరే వచ్చి చేరిపోతున్నారు.
గోళీలు పందాలు కాసుకుని లైనాటలు ఆడుతున్నాము మేము, జత గోళీలు పాములాగా పెట్టి ఒక ఆట, వరుసగా పెట్టి మరొక ఆట ఆడేస్తున్నాము. పందెం కాసుకున్నాక వరుసగా ఒకరి తరువాత ఒకరు ‘బంటు’గోళీతో ‘లైను’కి వెళ్లి తిరిగి అక్కడనుంచి గోళీలు కొడతున్నాము,ముందు అందరికంటే దూరంగా వెళ్లినోడు, వాడు కొట్టలేకపోతే వాడి తరువాత వాడు, లేదా వాడు కొన్ని మాత్రమే కొట్టగలిగితే అవి తీసుకోగా మిగతా వాటిని తరువాత లైనులో ఉన్నవాళ్లు కొట్టడం, ఒకవేళ మొత్తం గోళీలు గెలుచుకుంటే మళ్లీ తలా కొన్ని గోళీలు వేసుకుని మరో ఆట మొదలెట్టడం ఇలా నూకాలమ్మతల్లి గుడి పక్క మా గుంటలతో కళకళ లాడిపోయేది.
నలుగురయిదుగురుమే ఉన్నామంటే గోళీలతో కంచాట ఆడేవాళ్లం..కంచలో గోళీ పడినోడు హీరో.. పడనోడిని గోళీలేసి గెలుచుకుంటూ అటు మంచుకొండ వారి గార్డెన్స్, ఇటు పంతులమ్మ కణాలు, మాధవదార, పాలిటెక్నిక్ వరకూ తీసుకుపోయి అక్కడనుంచి కుంటుకుంటూ తీసుకువచ్చేవాళ్లం. దసరా సెలవులకు బంధువులుండే శ్రీహరిపురం బర్మాకోలనీ కెళ్లినా, స్టీలు ప్లాంటులో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసే చిన్నాన్న ఉండే చిన గంట్యాడ వెళ్లినా, పొద్దున్నే కప్పరాడ బడికి వెళ్లినా గోళీలాటే… ఏ ఊరు వెళ్లినా పిల్లలందరూ తొరగా స్నేహితులయిపోయి కంపచెట్ల కిందో, సిమెంటు రోడ్డు మీదో ఆట మొదలెట్టేసే వాళ్లం.
కప్పరాడ బడిలోగానీ, నూకాలమ్మ గుడికాడ కానీ రోజూ ఎన్ని గోళీలు గెలిచినా వాటిని సాయంత్రం ఎక్కడో ఒకచోట పడేసి ఇంటికి వెళ్లే వాడిని. గోళీలాట ఆడేనని తెలిస్తే మా అమ్మ వీపు చీరేస్తదని భయం.
‘ఆడు బే ‘ ‘ ఎయ్యి బే ‘ ‘తొందరగా పాఠా’లాంటి తూరుపు పదాలన్నీ ఇక్కడే నేర్చుకున్నాను.
మేం గోళీలాడిన నేలంతా, మేం దేకిన నేలంతా , మేం కుంటిన నేలంతా, దొడ్డికెళ్లి ఉచ్చలు పోసిన నేలంతా, బర్మా కాందిశీకులు స్వాభిమానంతో గడిపిన నేలంతా తరువాత్తరువాత బంగారమయిపోయింది. ఎక్కడెక్కడ నుంచో వచ్చినోళ్లంతా ఆ నేల కొనుక్కొని, బర్మా కేంపులో రౌడీలను పోగేసుకుని దందాలు జేసి ‘జిగ్గుల’యిపోయారు. అక్కడే వుండి సెంట్రింగ్ పని, వాచ్ మెన్ పని,పోర్టు, డాక్ యార్డులలో దినసరి లేబర్ పనులు చేసుకునే మూలవాసుళ్లంతా అయినకాడికి నేలమ్ముకుని ‘బోకయిపోయారు’. ఇంకెక్కడనుంచో చిన్నా చితకా జనం చేరి కొండలమీద పాకలేసుకుని పాకుతూనే వున్నారు. ఇప్పుడు గుంటలెవరూ గోళీలాడటం లేదు, కిరాణా కొట్టుల్లో అవి అమ్మటం లేదు, మాలాగా గోళీకాలయలు తయారు చేసే ఫాక్టరీ ఎక్కడ వుందా అని ‘ఇండస్ట్రియల్ ఎస్టేటు’ అంతా కలతిరగటం లేదు, అసలెక్కడా గోళీలాడుకునేందుకు గజం నేల కూడా లేదు.
నూకాలమ్మతల్లి పండగ ఇప్పుడు కూడా జరుగుతూనే వుంది, కేంపు కిందనుంచి పై వరకూ ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫోను మాట్లాడుతున్నట్లు, నల్ల కళ్లజోడు పెట్టుకుని ‘జిగ్గు’మనే మనుషులు ఫ్లెక్సీల మీద అగుపిస్తున్నారు.
అమ్మవారు మాత్రం కళ్లు తెరచుకుని అన్నీ అట్లాగే కళ్లప్పగించి చూస్తావుంది.
*
జిగ్గులు అనే పదం కొత్తగా వింటున్నాను హరి గారూ ! రచన బాగుంది .
బర్మాకాంప్ కధల పరంపరలో రచయిత హరి వెంకటరమణ కలం నుంచి జాలువాలిన జిగ్గులు కధ ఆసక్తిగా సాగింది.చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు రచనలో చూపించడం అభినందనీయం.మరిన్ని రచనలు వారి కాలం నుంచి జాలువాలని ఆశిస్తున్నాం.
కోరాడరాంబాబు,విశాఖపట్నం.
Golikalayala ata bagundhi. Friendship a rojulullo ala undhi. Eppudu antha smart phone.
Apuroopamaipoyina urban space samasyanu suchinchina kadha.Enno yelluga Vishaka lo vuntunna eppudu vinani mandalika padalu ee kadha lo kanipinchayi.
మా మిత్రులు శ్రీ హరి వెంకట రమణ గారు రాసిన కధలు చాలా బాగున్నాయ్ చిన్న నాటి గోలీలాట ల గురించి ఆ మరువలేని ఙ్నాపకాలు గురించి చక్కగా చెప్పారు, ఆ వయసులో అదే లోకం ,మరువలేను ఆ బాల్య సృతులను నేను కూడా నా చిన్నప్పుడు కూడా ఇటువంటి ఙ్నాపకాలు ఉన్నాయి. వాటిని గురించి తలచు కుంటే చాలా సంతోషం వేస్తుంది. ఈ ఙ్నాపకాలు గుర్తు చేసిన మా మిత్రులు శ్రీ హరి గారికీ హృదయ పూర్వక అభినందనలు, 😊👌👌👏🙏🤝😊😊
Hari chala bagundi hari
చాలా చక్కగా తెలిపారు. మీ నుంచి ఇలాంటివి ఎన్నో రావాలని కోరుకుంటూ…
శెలవు.
హరివేంకటరమణగారి క్షేత్రకథానికల సమాహారం ఈ బర్మాక్యాంపు కథలు. ఈ కథాధారలో మిగతా కథల్లాగే ఈ జిగ్గులు కూడా ఒక ఆణిముత్యం. అమాయక క్యాంపు గుంటల ( బాలలు) గోళీలాట వెనక బతికిచెడ్డ బర్మా కాందిశీకుల బడుగుబతుకుల నీలినీడల్ని చూపకనే చూపించిన రచయిత ప్రజ్ఞకి జోహార్లు.
మూడు దశాబ్దాల క్రితం గోళీల ఆట అంటే తెలియని పిల్లలు ఉండకపోవచ్చు కానీ నేటి తరంలో గూగుల్ తప్పు గోళీలు మాట లేదు. జానా, సోబి, రెండోవాడి పక్క, కంగింది లాంటి ఆటకు సంబంధించిన పదాలు తో పాటు సంభాషణలో బే, బోకు, దోబేసాయి లాంటి నాటు పదాలు ఈ ఆటలో పరిపాటి. మాస్ కా బాప్ అంటే గోలీల ఆటే.
హరిగారు ఇలాంటి ఆటలో మీ జ్ఞాపకాలను కధ రూపములో ఎంతో హృద్యముగా మాతో పంచుకున్న0దుకు, మా చిన్ననాటి రోజులు తరచుకునేలా చేసినందుకు మీకు అభినందనలు.
S. కపర్థి