అల్జైమర్స్ (ఆంగ్లంలో పలికే పద్ధతి; తెలుగు అచ్చులో అల్జీమర్స్ అని కనిపిస్తూంటుంది) వ్యాధికి గురయినవాళ్ల కంటే వాళ్లని అమితంగా ప్రేమించేవాళ్లకి ఆ బాధ తాకిడి ఎక్కువ. పూర్తిగా మెదడులోంచి జ్ఞాపకాల అజాపజా మాయమయి నప్పుడు ఎంత ఆత్మీయు లయినా గానీ గుర్తుపట్టే ప్రసక్తే ఉండదు. దాదాపు పదిహేడేళ్ల క్రితం నా సహోద్యోగి తల్లిని చూడడానికి కాలిఫోర్నియా వెళ్లొచ్చా నన్నాడు. వయసులో నాకన్నా కనీసం పదిహేనేళ్లు పెద్దవాడు. తెల్లవాడు. ట్రిప్ ఎలా అయింది అనడిగాను. కనిపించేలా నాలుకని కొద్దిగా పెదవుల మధ్యలో ఒక మూలకు నెడుతూ బయటపెట్టి “ఆఁ, ఇట్స్ ఎ వేస్ట్!” అన్నాడు. “మాతృదేవో భవ!” అన్న సూక్తిని రంగరించుకుని పెరిగినవాణ్ణి గనుక ‘అదేమిటి, అలా అన్నాడు?’ అనుకున్నాను. అతను అప్పుడు చెప్పాడు ఆమె అల్జైమర్స్ వ్యాధితో నర్సింగ్ హోమ్ లో పదేళ్లుగా ఉంటున్న దనీ, పిల్లలని ఎవరినీ గుర్తుపట్ట దనీ, ఆమెని అక్కడ చేర్చినప్పుడు ఏడాది కూడా గడవ దన్నారనీ, ఆమె మంచం పక్కన అరగంట కూర్చుని వచ్చాడనీ.
గుర్తుపట్టే శక్తిని మెదడు పూర్తిగా కోల్పోయిందని తెలిసిన తరువాత కూడా ఆ వ్యాధిబాధితులని అంటిపెట్టుకుని ఉంటామని పట్టుపట్టే ఆత్మీయులని ఎవరు తప్పుపట్టగలరు? ఆ వ్యాధి సోకినవాళ్లు తమ బంధనాలని దాటి ఒంటరిగా బయట వీధిలోకి వెడితే వాళ్లని వెదకవలసివచ్చినవాళ్లు! కుటుంబ సభ్యుల మీద పడిన ఆ భారాన్ని విశదంగా కళ్లముందుంచిన సినిమా వాట్ దే హాడ్. తల్లి ఆ వ్యాధి బాధితురాలు. ఆమెని అమితంగా ప్రేమించే తండ్రి జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లోనే ఉంచుకుంటా నని పట్టుబడతాడు. ఊళ్లోనే వేరే ఉన్న కొడుకుకు అతని జీవితమూ, వ్యాపారమూ ఉన్నది. కూతురు, విమానం ఎక్కి రావలసినంత దూరంలో ఉన్నది. తల్లి ఇంట్లోనించీ వెళ్లిపోయిందని ఫోన్ వస్తే ఆమె పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చింది. తల్లిని చూసుకోనందుకు సహోదరుడి మీద కోప్పడుతుంది కూడా! ఇండియాలో ఉన్న కుటుంబాల్లో వినిపించే కథే కదూ?
గుర్తుపట్టే శక్తి క్రమంగా మాయమవుతున్న బాక్‌గ్రవుండ్‌లో చిన్ననాటి ప్రేమని వెదుక్కుంటూ వెళ్లిన వ్యక్తి కథని లివ్ ట్వైస్ లవ్ వన్స్ అన్న స్పానిష్ సినిమాలో చాలా బాగా చూపారు. చిన్నవయసులో ప్రేమించిన వ్యక్తి తనని గుర్తుంచుకున్నదా అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని అల్జైమర్స్ వ్యాధికి క్రమంగా లొంగిపోతున్న ఒకతనికి అనిపిస్తుంది. తల్లి బ్రతికిలేకపోయినా గానీ తండ్రి ఒకప్పుడు ప్రేమించి నామెని గూర్చిన అన్వేషణకి అతనికి సహకరించననే కూతురు మొదట అంటుంది గానీ తరువాత దానికి తన సహాయా న్నందిస్తుంది. ఈ సినిమాకి ఆ వ్యాధి ముఖ్యమే గానీ అదే ప్రధానాంశం కాదు గనుక ప్రేక్షకుల ఆలోచనలు కూడా అతనికి ఆ చిన్ననాటి ప్రేమికురాలు దొరుకుతుందా అన్న అంశం మీదే దృష్టి ఉంటాయి.
ఇండియాలో ఈ అంశాన్ని సినిమాలు ముట్టుకోలేదా అని చేసిన మితమైన పరిశోధనలో నాటకీయత తక్కువగా సహజత్వం ఎక్కువగా కనిపించిన ఒకే సినిమా గోధి బన్న సాధారణ మైకట్టు; కన్నడంలో. వాట్ దే హాడ్ లో లాగానే ఆత్మీయుల బాధ చిత్రణ ఉంటుంది, అది సినిమాకి అవసరమే గానీ, వేరే అంశాల కలగలపు వల్ల ప్రేక్షకుల దృష్టిని ఆ మిగిలిన అంశాల మీదకు తిప్పుతుంది. మతిమరుపు దాదాపు పూర్తిగా కమ్మేసినట్టుగా అనంతనాగ్ నటన ఈ చిత్రానికి ప్రాణం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ఈ నెల పరిచయం చేస్తున్న బాట్మాన్ అండ్ రాబిన్ హావ్ ఏన్ ఆల్టర్కేషన్ కథలోని ముఖ్యపాత్ర కూడా పైన చెప్పిన అనంతనాగ్ పాత్ర పరిస్థితి కలిగినట్టిదే. అదే, ఆ వ్యాధి సోకడం వల్ల మనుషులని గుర్తుపట్టడం దాదాపు ఆ వ్యక్తి చేయి దాటిపోయినప్పటి పరిస్థితి. రచయిత, పరిచయం అవసరం లేని స్టీఫెన్ కింగ్. అల్జైమర్స్ వ్యాధికి గురయిన తండ్రీ, అతని కొడుకు శాండర్సనూ ఈ కథలో ముఖ్యపాత్రలు. తండ్రి ఒకప్పుడు ముడిచమురు దొరికే ప్రదేశాల్లో పనిచేసి రాటుదేలినవాడు – ప్రవర్తన, భాషతో కలిపి. పెళ్లయిన తరువాత చల్లబడి నగల వర్తకు డయ్యాడు. ఇప్పుడు శాండర్సన్ ఆ దుకాణాన్ని నడుపుతున్నాడు.
“క్రాకర్‌జాక్ మానర్” నర్సింగ్ హోమ్ లో ఉన్న తండ్రిని చూడడానికి శాండర్సన్ వారానికి రెండుసార్లు వెడతాడు. బుధవారం తన నగల కొట్టు కట్టేసిన తరువాత ఒకసారి. ఆదివారం తండ్రిని తీసుకుని బయట రెస్టారెంటుకి లంచ్‌కి వెళ్లడానికి రెండవసారి. అతని దుకాణం నించీ ఆ నర్సింగ్ హోమ్ మూడు మైళ్ల దూరం మాత్రమే. వాళ్లిద్దరి మధ్య సంబంధమూ తండ్రికి గుర్తున్నది గానీ, శాండర్సన్ని నలభై అయిదేళ్ల క్రితం పోయిన కొడుకుగా పిలవడం అప్పుడప్పుడు జరుగుతోంది. కొన్ని పాత సంగతులు, కొందరు మనుషులు గుర్తుకొచ్చినప్పుడు వయొలెంట్ గా మారి నర్సింగ్ హోమ్ లో ఆయన పడుకునే మంచాన్ని కూడా తిరగేస్తాడు. అలాంటి సమయాల్లో నాగరీకులు వినలేనట్టి భాష కూడా వాడుతూంటాడు. ఆయన మంచం క్రింద డైనింగ్ హాల్ లోనించీ తెచ్చిన ఫోర్కులూ, స్పూన్లూ, అలాగే అక్కడ ఉండాల్సిన టీవీ రిమోట్ కంట్రోలూ మొదలయినవి కనిపిస్తాయి కానీ అవి అక్కడికి ఎలా వచ్చాయో తనకు తెలియదని ఆయన చెబుతాడు.
ఒక ఆదివారంనాడు తండ్రిని తీసుకుని ఎప్పుడూ వెళ్లే ఆపిల్‌బీ రెస్టారెంటుకు వెళ్లేటప్పుడు కొడుకుతో కలిసి బాట్మాన్, రాబిన్ల ఆట ఆడేవాణ్ణని ఆయన చెబుతాడు. ఒక హాలోవీన్ నాడు ఆ వేషాలు వేసుకుని తండ్రితో కలిసి ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్లడం శాండర్సన్ గుర్తుచేస్తాడు. రెస్టారెంటులో తింటున్నప్పుడు ఆయన బయట ఉన్న పక్షుల గూర్చి అడిగినప్పుడు శాండర్సన్ దృష్టి ఎదురుగా ఉన్న తండ్రి నుంచీ బయటకు మరలుతుంది. తిని బయటకు వచ్చి కారులో వెడుతున్నప్పుడు ఆ హాలోవీన్ వేషాల ప్రసక్తి మళ్లీ వస్తుంది. అవ్వి అంత గొప్ప వేషా లేమీ కాదు. రాబిన్ గ్రే రంగు పైజమా వేసుకుని దాని మీద దుప్పటిని కేప్ గా వాడాడు. బాట్మాన్ గుర్తుని మాజిక్ మార్కర్ తో గీశాడు. తండ్రి వేషమూ అలాంటిదే. వాళ్లు వెళ్లిన ఒక ఇంటిలో తలుపు తీసి మాట్లాడిన వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది, మనసులోతుల్లో నిక్షిప్తమై వుండి, వ్యాధి ప్రభావంవల్ల బయటపడి దగ్గరివాళ్లని ఇబ్బంది పరచే స్వభావం గలది.
తండ్రితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నప్పుడు శాండర్సన్ మరీ అంత అప్రమత్తంగా లేకపోవడంవల్ల అతని కుడిపక్కనించీ వచ్చి, వాళ్ల కారు ముందునించీ వాళ్లుండే లేన్ని దాటి, ఎడమపక్క లేన్‌లోకి మారుతూ ఒక పికప్ ట్రక్కు వాళ్ల కారు డ్రైవర్ సైడ్‌ని డామేజ్ చేస్తుంది. తప్పు తనది కాదని శాండర్సన్ కి తెలుసు. పైగా ఆ డ్రైవర్ని తిడుతూ మధ్యవేలుని కూడా చూపిస్తాడు. తిట్టుకుంటూనే గ్లవ్ కంపార్ట్మెంట్ లోంచి రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ లని తీసుకుని చూస్తే ఆ డ్రైవర్ వేషధారణని బట్టీ, జైలు నించీ వచ్చాడని చెబుతున్న శరీరం మీద ఉన్న టాటూలని బట్టీ అతను ఎలాంటివాడో అర్థమై క్షమాపణ చెప్పడానికి కూడా శాండర్సన్ సిద్ధపడతాడు. ఆరడుగులకి అటుగా కొన్ని అంగుళాల పొడుగు అతనూ, ఆరడుగులకి ఇటుగా కొన్ని అంగుళాలతో బాటు కనీసం నలభై పౌండ్ల తక్కువ బరువుతో శాండర్సనూ. అతను, “నన్ను వెళ్లనీయ లేదు ఎందుకని?” అని తప్పు తనది కాదన్నట్టు బుకాయిస్తాడు కూడా. పైగా, “నీ కారు నువ్వు ఫిక్స్ చేయించుకో, నాది నేను చేయించుకుంటాను,” అని వెనుదిరుగుతాడు. “అలా కుదరదు, తప్పు నీదే!” నంటూ అతన్ని ఆపబోయిన శాండర్సన్ కి జవాబుగా అతను శాండర్సన్ పొట్టలో గుద్దుతాడు. తరువాత మొహంమీద. ఆపైన పక్కగా నడుం మీద. అటుపైన తొడమీద. కింద పడి, తల హబ్కాప్కి తగిలి, చేతుల మీదా, మొహం నిండా రక్తం కారుతూ, లేచి నిల్చోలేని పరిస్థితిలో శాండర్సన్.
ఈపాటికి ఇక్కడ శాండర్సన్ తండ్రి “ఏదో ఒకటి చెయ్యాలే,” అని పాఠకులకి అనిపించడం సహజం. రచయిత ఏమాత్రం పాఠకులని నిరాశపరచడు. పైగా, తండ్రి ఏం చెయ్యగలడో షెర్లాక్ హోమ్స్ పరిశోధనకి సరిపోయేలాగా క్లూలని కథలో వరుసగా అందిస్తాడు. వాటిల్లో ముఖ్యమైనవి: 1) బాట్మాన్ ని ఆల్టర్కేషన్లో పాల్గొనడానికి ప్రేరేపించే అంశాలు – చెడుని అడ్డుకోవడం, ఇంకా ప్రత్యేకంగా, రాబిన్ మీద దండెత్తేవాళ్లకి బుద్ధిచెప్పడం, 2) సంక్రమించిన వ్యాధివల్ల కొన్ని దశాబ్దాల క్రితపు రాటుదేలినతనం వెలికి తన్నుకుని వచ్చేలా ప్రవర్తించడం, 3) తనకు తెలియకుండానే వస్తువులని దొంగిలించడం. అయితే, ఈ క్లూ లన్నీ కథలో భాగంగా సహజంగా ఇమిడిపోవడం, అవి క్లూ లని తెలియకపోవడం, ఇది ఎంత అద్భుత కథనమో తెలియ జెపుతుంది.
ఇలాంటి క్లూలని ఇస్తూ అద్భుతమైన ముగింపు నిచ్చిన ఆర్థర్ సి క్లార్క్ కథ టైమ్స్ ఏరో ని ఇదివరలో పరిచయం చేశాను. అది కాల యాత్ర గూర్చిన కల్పన. ఇది నిజ జీవితానికి సంబంధించిన కథ. అల్జైమర్స్ వ్యాధికి గురయిన వ్యక్తిని గానీ అతని దగ్గరి బంధువులని గానీ దయనీయంగా చూపించడమే ప్రధానంగా పెట్టుకోని కథ. ఆ వ్యాధి లక్షణాలని వాడుకుంటూనే అల్లిన సాటిలేని మేటికథ. అదీ రచయిత అసమాన ప్రతిభ!
రచయిత పరిచయం:
స్టీఫెన్ కింగ్ పరిచయం అవసరం లేని రచయిత అని ఇంతకు ముందు చెప్పాను. భయానక రసానికి ప్రసిద్ది. కథలు, నవలలు, కవితలు రాశారు. కొన్ని నవలలు టీవీ సీరీస్ గానూ, ఎనిమిది సినిమాలు గానూ రూపుదిద్దుకున్నాయి.
Add comment