లచ్చువమ్మ కాళ్ళకింద తౌడు రేగుతున్నది. సుడిగాలి తీర్గ పొద్దటిసంది గింత ఇరాము లేకుండ ఒకటే తిరుగుతున్నది. సీకట్లనే కోడినీ, ఇంక జరున్నంక సూర్యుడ్నీ నిద్ర లేపింది, అటెనక ఊరు నిద్ర లేసింది.
న్యాల మీదికెల్లి లేసి, పక్క బట్టలు మడ్తవెట్టకుండనే, నోట్లె నీళ్ళువోసుకోని పుక్కిలియ్యకుండనే, పుస్తె బొట్టు కండ్లకద్దుకుంట పటేలింటి తోవవట్టింది. ఇంకా సలి పూరాగ మొదాలే కాలె. గీ నడుమనే జరంత జరంత గీ తెల్లంజావునే మంఖురోలె కురుస్తున్నది. దమ్ము తీస్కుంట నడుస్తున్నది లచ్చువమ్మ. సందులల్ల, గోడల పక్కపోంటి దుమ్ముల గుంతలు తోడ్కోని, అండ్లనే ముదురుకోని పండుకున్న కుక్కలు తలకాయలు మీదికి లేపి సూశి మనోళ్ళేననుకుంట మల్ల ముదురుకొని సదురుకున్నయి.
శంకర్రెడ్డి పటేలింటికొచ్చి పెద్దర్వాజ ముంగల నిలవడి, తలుపు సప్పుడు సేశీ సేశీ, పటేలమ్మను పిల్సీ పిల్సీ, రెట్ట తీపులు వెట్టంగ, కుత్కె పూడుక పోంగ గట్లనే ఆకిట్ల కూలవడ్డంక దర్వాజ తీసింది పటేలమ్మ.
అప్పటిసంది లచ్చువమ్మ ఒంచిన నడుము ఒంగినట్లే ఉన్నది. పొర్కతీసుకొని ఇంతెడల్పు ఆకిలూడిసింది, బర్లకాడ పెండకల్లు తీసి పెంటలేసొచ్చి కొట్టమంత సాపుజేసింది. పక్కకువెట్టుకున్న తట్టెడు పెండ సాంపి గోళెంలేసి, హౌసుల నీళ్ళు గోళెం అంచుదాంక నింపి, మంచిగ చిక్కగ సాంపి కలుపుకొని ఆకిలంత సల్లింది.
మూడొద్దులకు మునుపు ఏనె పక్కపోంటి ఉన్న గుట్టలల్ల ఎర్రగ కుంకుమోలె ఉన్న జాజును తవ్వుకొచ్చి కచ్చ బిచ్చ దంచి పెద్దటికెల ఏస్కోని జరకన్ని నీళ్ళువోస్కోని చిక్కగ కల్పుకొని పిడ్సతోటి ఆకిట్ల, గోడ పోంటి జానెడెడల్పు ఈడికెళ్ళి ఆడిదాంక, బద్దవెట్టి కొల్సినట్లు ముద్దుగ అలికింది. అటెనక పంచపాళిల ఉన్న ముగ్గువిండి, పచ్చవిండి తోటి అలుకుమీద ముగ్గులేసింది, మల్ల ఆకిట్ల ముగ్గేసింది. పెద్దర్వాజ ముంగల చాటడెడల్పు జాజుతోని అలికి ముగ్గేసింది, పొద్దుమూకింతల బతుకమ్మను అండ్లనే పీటేసి కూసోవెడ్తరు. అన్నయినంక ఇంటిముంగల చేతులు నడుముకు వెట్టుకోని నిలవడి ఆమె అలికిన జాజు పట్టెను, ముగ్గును, సాంపిని కండ్లార సూస్కోని మురిసిపోయింది.
తెల్లటి గోడ, దానిపోంటి అలికిన జాజుపట్టె, పచ్చటి సాంపిని సొస్తె అత్త యాదికొచ్చింది లచ్చువమ్మకు.
అత్తమ్మ ఆకిట్ల పరిసే వొంకొలొంకుల వొయ్యారి ముగ్గులు అటెంకల్ల ఏ వాడకట్టులగూడ ఇంత సింగారంగ ఏ అమ్మకూ ఎయ్య రాకపోతుండే. గామె ముగ్గేస్తుంటె గట్లనే కన్లార్పకుండ సూడబుద్దైతది. వొంపులొంపుల ముగ్గులు, నిండుముత్తైద రెట్టకున్న వొంకు తీర్గ, నడుముకు సుట్టుకున్న వడ్డాణెం లెక్క, బాయికాడికి పొయ్యె పిల్లబాట లెక్క ఎన్నెన్ని సుట్లు తిరుగుతుండెనో అని మల్ల మల్ల అత్తనే యాజ్జేస్కున్నది.
ముత్తెమంతసేపు అట్ల నిలవడ్డదో లేదో పటేలమ్మ గొంతు ఇనవడ్డది, “జారట్ల అంట్లు పిలుస్తున్నయి”, అంటాని. దబ దబ అంట్లన్ని ముంగలేస్కోని తోమవట్టింది. “ఇంట్ల ఉన్నది ఇద్దరు మనుసులు, బోకులేమో బండెడు పడ్డయి”, అని గులుగుకుంట తోమవట్టింది.
మూన్నాలుగు దినాలసంది ఒఖటె పనీ, పనీ, పని. లచ్చువమ్మ ముడ్డెనకవడి ఒకటి ఒడ్వకముందే ఇంకోటి, ఇట్ల ఒకదానెనకొకటి, కుదార్తంగ కూసోని ఒక్క ముద్దనన్న గొంతులకు దిగకముందే ఇంకొకటి ఎగదోసుడు. పొయ్యిల కట్టెలు ఎగదోసినట్లె ఎగదోసి మంట రగిలిచ్చేడిది పటేలమ్మ.
అయిదారుసేర్ల బియ్యం కడిగి నీడపోంటి ఆరవోసింది లచ్చువమ్మ. మూడుకిలలంత శెనగపప్పు శెరిగి ఎండకు ఎండవోసింది. జొన్నలు సేసి ఎండవోసింది. అద్దపల్ల సిట్టిముత్యాలు జల్లెడ వట్టింది.
పటేలమ్మ సిన్నాడిబిడ్డె ముర్కులు, సకినాలు ఎర్గక ఏండ్లయ్యిందని, ఆరవెట్టిన బియ్యం గిర్నికి తీస్కపోయొచ్చింది.
పెద్దాడిబిడ్డెకు అరసెయ్యెడల్పు అప్పాలు గావాల్నంట, అండ్లకు నానవెట్టిన శెనగపప్పు, పల్లీలు మల్ల ఇంత మెంతికూరేసి బట్టపేగంత లావున సేస్తెగాని సల్లవడదన్నది.
ఇగ పటేలమ్మ ఒక్కగానొక్క బిడ్డెకు లగ్గంగాంగనే గదేదో తూర్పు దేశమంట, ఏందో ఆస్టీలయ్యనో ఏందో లచ్చువమ్మకు గదెప్పుడు అనరాదు, గా పిల్ల ఆడికివొయ్యి అప్పుడే అయిదేండ్లయ్యింది. ఒక్కపాలిగూడ మల్ల మనదేశం రాలేదు, ఈ త్యాప ఒస్తున్నదంట. ఆడ్నె పుట్టిన మన్మని ఫోట్వ సూపెట్టి మస్తుగ మురిసింది పటేలమ్మ.
బిడ్డె కానుపుకు ఆ దేశం పొయ్యి ఆర్నెల్లు ఆడ్నే ఉండి ఒచ్చిన పటేలమ్మను సూస్తే లచ్చువమ్మకు కండ్లల్ల నీల్లూరినయి. నిగ నిగ మక్కశేను తీర్గ పచ్చగ మెరిసినట్లుండే పటేలమ్మ, రంగెల్శిపోయి, ముడుతలువడ్డ పాతసీరెలెక్క మల్లొచ్చింది. ఆడికి పోయినసంది ఒకటే కడుగుడు, ఉతుకుడు, సేశి సేశి నీళ్ళు లేక జారిపోయిన బీరతీగలెక్క ఒచ్చింది గాయల్ల. ఆమె కొరకు లడ్డు బూంది చేపిచ్చింది.
మల్ల కొడుకేమో ఒకడేనాయె. సిన్నోడు. గార్వాల పోరడు. శంకర్రెడ్డి నోట్లకెల్లి ఊడిపడ్డట్లు కొడ్తడు.
కిందామీదవడి ఆ పడమటి దేశం పొయ్యి మూన్నాలుగేండ్లు అయితుంది. పోయినాయిన పోయిండంటే ఇగ గదే పోకడ. ఈ త్యాప పండ్గకు ఒస్తడంట. పటేలుకైతే ఒక్క తాన కాలు నిలుస్తలేదు. ఇంట్లకు బయటకు ఒకటే ఉర్కులాట. ఇగ గా ఒక్కగానొక్క కొడుకుకు మిర్కపాయె బజ్జీలు పానమంటాని మొన్ననే పట్నంబొయిన పటేలు దొడ్డు మిర్కపాయలు కొనుకొచ్చిండు.
అది అట్లుండంగ శంకర్రెడ్డి పటేలుకు ఒక్కడే అన్న. లచ్చువమ్మ లగ్గమయినంక మెట్టినింటికొచ్చిన సంది ఆ పెద్ద పటేలును ఎన్నడు సూడలే. ఆయనకు తమ్మిని పొడనే పడదంట. ఆల్లిద్దరి నడ్మ గెట్టుకాడి పంచాయితులేంటివో ఉన్నయంట. ఆయనగిట్ల పెండ్లాన్ని ఎంటవెట్టుకోని గీ పెద్ద పండ్గకొస్తడంటాని మురిసిపోతున్నడు పటేలు. అన్న కోసమంటాని విలాయితి సీస తెప్పిచ్చిండు, తుమ్మల మీది గొర్రెపొటేలును తెప్పిచ్చి కొట్టంల కట్టేసిండు.
గీ పటాలమంత ఇయ్యాల్నే దిగుతరని లచ్చువమ్మ ఎంటవడి అన్నీ చేపిచ్చింది పటేలమ్మ.
అంట్లన్ని తోమేట్యాలకు తెట్టుగ తెల్లారింది. ఎంకమల్ల మొత్తుకుంటనే ఉన్నది పటేలమ్మ. “గీ ముత్తెమంత పనికి గింతసేపా, నువ్వు గిట్లనే సుతారం జేస్తే ఊర్లున్న ఆడిగద్దలన్నీ మన శెల్కల్నే మోతాదయితరు, మనకు ఒక్క పువ్వు గిట్ల మిలిగియ్యరు,” అంటాని ఎంటవడ్డది.
ఆడ్నే ఇంత మొకం కాల్జేతులు కడుక్కోని గంప సంకన వెట్టుకోని శెల్క బాట వట్టింది లచ్చువమ్మ.
“ఈడగాదాడగాదు మస్తు దూరముంది శెల్క, రెండు మైల్లు ఉండొచ్చు”, అనుకుంది లచ్చువమ్మ.
శెల్కకొయ్యి గునుగుపూలు తెంపింది, ఎర్ర బంతిపూలు, పచ్చ బంతిపూలు చెండ్లు చెండ్లు ఇంత కాడ తొటే తెంపింది. పూలన్నీ కాడలతొటే ఉంటే బతుకమ్మను ముద్దుగ పేర్వొస్తది, కుదురుగ కుదుర్తది అనుకున్నది. పోకబంతులు తెంపింది, ఉప్పు పువ్వు పీకింది. అట్ల అవ్వన్నింటితోని గంప నింపుకోని మల్ల మల్లేట్యాల్లకు లచ్చువమ్మ ఆడిబిడ్డె ఎదురొచ్చింది. మొకమంత పుచ్చపువ్వులెక్క ఇచ్చుకున్నది లచ్చువమ్మ మొకం. ఇద్దరు ఒకీడోల్లే. ఎన్నడూ ఒదినే, అంటే ఒదినే అంటాని పిల్సుకున్నది లేదు. ఒకర్నొకరు అక్కా అంటే అక్కా అంటాని నోటినిండ పిల్సుకుంటరు.
“ఇంత పొద్దుగాల నువ్వెందుకొస్తివక్కా? జరున్నంక నేనే ఒస్తుంటిగా?” అనన్నది లచ్చువమ్మ.
“ఆల్లింట్ల నీకు ఇంత ఎల్లమే ఇడుస్తరా అక్కా, ఆన్నే ఇంకెంత తన్లాడుతున్నవోనంటాని ఇట్లొచ్చిన,” అన్నది సుగుణమ్మ.
ఆమెకు పటేలంటే, ఆల్ల ఇంట్ల పనంటే మొదాలే నచ్చది. ఆళ్ల జికిరే ఎప్పుడు తియ్యది.
“జానకమ్మనన్న తోలిచ్చేదుండే, ఏం జేస్తున్నది పిల్ల ఇంట్ల, తక్వ దూరమున్నాది, నడిసొస్తివి ఇంత దూరం,” అని ఇదయింది లచ్చువమ్మ.
“ఇంట్ల కూసోని ఏం జెయ్యాలె? ఏ పని ముట్టుకోనియ్యది నీ యారాలు. సప్పుడుజెయ్యక కూసోమంటది. మొత్తం పనంత నెత్తిమీదేస్కోని సేస్తున్నది,” నిష్టూరమయ్యింది సుగుణమ్మ.
“పార్వతేంజేస్తున్నది?” కడుపున పుట్టిన బిడ్డె సంగతి అడిగింది.
“అది సన్నవిల్ల, మొగనితోని వచ్చిందాన్ని, ఇట్ల సెట్లెమ్మటి, పుట్టలెమ్మటి తోలియ్యాల్నా, పుట్టింటికొచ్చినదాన్ని జర ఎత్మినానుగ కూసోనన్నా కూసోనియ్యాలె,” పార్వతిని ఎనకేసుకొచ్చింది.
“నీకు పుట్టిల్లు గాదా, నువ్వు కూసోరాదా,” బాధ పడింది.
“నువ్వు ఊకె రంది వెట్టుకోకక్కా, ఏ పని చెయ్యకుండ కూసోనితినమంటే మనతోని అయితదా? కాల్జెయ్యి ఆడినన్నాళ్ళాడియ్యాలె, లేకపోతే తిన్నదెట్ల పెయ్యికి వడ్తది,” సంజాయించింది.
“సీతమ్మేంజెస్తుంది?”
“ఇగ ఊకో అక్కా, ఇచ్చులుకచ్చకాయలడగవడ్తివి. పట్నంలపెరిగిన పిల్లైనా మొత్తం నెత్తిమీదికెత్తుకోని సేస్తనే ఉన్నది. నీ కసోంటి కోడలు పిల్ల దొర్కుడు నువొద్దె, నువ్వు యాడ్నో పెట్టిపుట్నవు తియ్యి, నీ యారాలు, కోడలు కల్సి ఎవ్వర్ని, ఏ పనిల ఇంత ఏలువెట్టనిస్తలేరు. ఆళ్ళతోని గెల్సుడు నాతోనిగాదని ఇట్లొచ్చిన. బాగున్నది మీ తోని. ఆడ ఇంట్ల ఆళ్ళు నెల్గనిస్తలేరంటాని ఈడికొస్తే, ఈడ నువ్వు నన్ను నెల్గనియ్యకుండ చెయ్యవడ్తివి, ఇంగ నేనేంజేతు?’ అని దీర్గాలు తీసింది సుగుణమ్మ.
మొకమంత ఇప్పారంగ గంప పక్కకువెట్టి సుగుణమ్మను అబ్బలిచ్చుకోని, ఆమె పెయ్యంత నిమిరి సంబరవడ్డది లచ్చువమ్మ.
ఇద్దరు గల్సి శెల్కంత దేవులాడి దేవులాడి తీరొక్క పూలతోని గంపలు నింపుకున్నరు. ఊరుదిక్కు మల్లి బాయికాడింతసేపాగి తామరాకులు, పూలు, చామంతి పూలు, సీతమ్మజడలు ఏరుకున్నరు. ఆముదపు శేన్ల ఆముదపాకులు తెంపుకున్నరు, గుమ్మడి తీగకున్న ఆకులుగూడ ఏరుకొని గంపలు నింపుకోని ఏడింతసేపు కూసోకుండ ఇంటితోవ వట్టిండ్రు.
నిండుగంప తీస్కోని పటేలింట్లడుగుపెట్టేట్యాల్లకు అంబటాలయ్యింది. లచ్చువమ్మ తెచ్చిన పూలగంప బంకుల్లేసిన ఈత సాపమీద దించి, పటేలమ్మకు ఇంటిదాంక పొయ్యొస్తనని చెప్పి ఇంటి దిక్కు మల్లింది.
పటేలమ్మ మొకం సిన్నగ సేస్కున్నది. ఆమె మొకంల గింత కళ లేదు. మెల్లెగ చెప్పింది.
“జల్ది పోయిరా లచ్చువమ్మా, ఇంగ పోరలు ఇప్పుడో, ఇంక జరంతసేపట్లనో ఒస్తనే ఉంటరు. మల్ల బతుకమ్మను పేర్వాలె. నాతోని కూసోని పేర్సుడు గాదు. నువ్వే ఎట్లనో అట్ల పేర్వుదువుగని జల్దిరా,” అని తోలిచ్చింది పటేలమ్మ.
జల్ది జల్ది నడుసుకుంట పెద్ద పెద్ద అంగలేసుకుంట ఇంటికి ఉర్కొచ్చింది లచ్చువమ్మ.
ఇల్లింకింత దూరముండంగనే ఇంటిని సూసి కండ్లిప్పారిచ్చుకున్నయి. జరంతసేపట్ల పాణం సల్లవడ్డది. ఇంటి ముంగల సక్కగ సిక్కగ సాంపి సల్లి ఉంది. గోడపోంటి జాజలికిండ్రు, ముగ్గులేసిండ్రు, కడపలకు పసుపు రాసిండ్రు. బాజులకు మామిడాకులు గుచ్చిండ్రు. బంతిపూలదండలు ఒక్క తీరుగ కుచ్చి బాజులకు కడుతున్నరు. పల్సటి, తెల్లటి ఎండంత ఈళ్ళింటిమీదనే కురిసినట్లు, ఇల్లంత కళకళలాడుతున్నది. యారాలు, కోడలు, బిడ్డె, ఆడిబిడ్డె అందరు ఒకరి సేతుల పని ఒకరందుకుంట అన్ని పన్లు సక్కవెడ్తున్నరు. పిల్లా జెల్లా ముద్దుగ తానాలుజేసి ఉతికిన బట్టలేసుకొని ఇంట్లకు బైటికి కిలకిల నగుకుంట, ఊరవిచ్చుకలోలె లొల్లిసేసుకుంట ఉర్కులాడుతున్నరు. ఇంటినిండ మనుసులు తన్లాడుతుంటే లచ్చువమ్మ గుండె నిమ్మతమయింది, సంబరమంత ఆమె మొకంలనే తన్లాడింది.
కట్టుకున్నోళ్ళు, కడుపునపుట్టినోళ్ళు, తోడపెరిగినోల్లందర్ని కండ్లనిండ సూస్కొని మురిసిపోయింది.
మొకానికి పసుపు రుద్దుకొని, తానంజేసి పెద్దంచు సీర సుట్టుకొని, ఆఠాణ బిళ్ళంత ఎడల్పున కుంకుమ నొసట్న దిద్దుకొని, నెత్తికి చమురంటుకొని పెద్దకొప్పు సుట్టుకొని, అండ్ల పోకబంతి పువ్వు చెక్కుకొని గౌరమ్మలెక్క తయారయ్యి ఇంట్లున్న ఆడివిల్లల చేతిలపని అందుకున్నది. తలా ఒక చెయ్యేసి ఒంటలొండిన్రు. ఇంటిల్లాదులు కల్సి మెల్సి పనిచేసుకుంటే ఎంత పెద్ద పనన్నా ఎంతసేపట్ల అయిపోగొడ్తరు? ఆడుకుంట పాడుకుంట అయిపోగొట్టిర్రు.
ముందుగాల మొగోళ్లను, పిల్లలను బంతిల కూసోవెట్టి బోజనాలు వెట్టిండ్రు, అటెంక ఆడోళ్ళందరు ఒక్కతాన కూసోని మాట్లాడుకుంట, పరాష్కాలాడుకుంట, ఒగర్కొగరు కొసరి కొసరి ఒడ్డిచ్చుకుంట అన్నాలు తిన్నరు.
తిన్నంక ఎక్కడిదక్కడ సదురుకొని నడింట్ల ఈతసాపేసి సుగుణమ్మ తెచ్చిన పూలగంప గుమ్మరిచ్చి, అయిటి సుట్టు సేరిండ్రు.
కొన్నేవున్న పూలను సూసి లచ్చువమ్మ ఇచ్చింతవడి, “గంపనిండ పూలు తెస్తివి గదక్కా ? గియ్యేనా?” అంటడిగింది.
“గాడ చింతకింది సుమతమ్మ బతుకమ్మకు తమాం పూలు లేవంటే జరకన్ని పెట్టొచ్చిన,” నగుకుంట అన్నది సుగునమ్మ.
“మల్ల మనకు తక్వైతయి పూలు, బతుకమ్మకు సరిపోవు గదే,” కోడలుపిల్ల సీతమ్మ అంటుండంగనే నోట్లది నోట్లున్నట్లే అందుకున్నది లచ్చువమ్మ, “ఎందుకు సరిపోవు, మా సరిపోతయి. బతుకమ్మ సిన్నగ పేర్సినా, పెద్దగ పేర్సినా బతుకమ్మ, బతుకమ్మనే, ఆమె దీవెనార్తులు మనెంట ఎల్లకాలం గిట్లనే ఉండాలని మొక్కుకోవాలె. సుమతమ్మింట్ల బతుకమ్మ, మనింట్ల బతుకమ్మ ఏరుగాదు, ఏ ఇంట్ల ఏ బతుకమ్మయినా మనింట్ల బతుకమ్మనే అనుకోవాలె,” అని సీతమ్మ మాట దాటిపిచ్చింది.
కోడలుపిల్ల మాట దాటిచ్చినంక మల్ల ఇంక జరకన్ని మాటలు ముంగల బతికే పిల్లలకు చెప్పాలంటని,”ఉన్నదాంట్ల నల్గురికి ఆసరగావాలె, పెట్టాలె. పెట్టే చెయ్యి ఎల్లకాలం మీదనే ఉంటది, మనకు బర్కతుంటది. మనతాన లేనిది ఏడికెల్లి పంచుతం? ఉన్నప్పుడే పదిమందితోని పంచుకొని బతుకుడే పరమాత్మకు దగ్గెరవుడు,” అని పెద్దిర్కంగ చెప్పింది లచ్చువమ్మ.
ఇంకింతసేపు ఇంట్లనే ఉండి పిల్లలను దగ్గెర్కి తీసుకొని పాణంజేసింది, గార్వం చేసింది, నగింది, నగిపిచ్చింది, ఆటలాడింది, ఆడిపిచ్చి ఆళ్ళ నడ్మ సన్నవిల్లయింది.
ఇంట్లున్నోళ్ళందర్కి అదో ఇదో, సిన్నదో పెద్దదో పనప్పజెప్పింది లచ్చువమ్మ. యారాల్కి, కోడల్కి పెద్దిర్కం సోపింది. ఇగ పొద్దు నడినెత్తిమీదికెల్లి పక్కలకు జరుగుతున్నదని మెల్లెగ పటేలింటి తోవ పట్టింది.
*****
ఫటేలింటి ఆకిట్లకు అడుగువెట్టేట్యాల్లకు లచ్చువమ్మకెందుకో బుగులయ్యింది. పాణం సల్లగయ్యింది. గట్లెందుకయ్యిందో సమజుగాకున్నది.
ఊటగ ఆనొచ్చే ముంగల నల్లగ మొగులయ్యి, సడీసప్పుడు లేకుండ, మనుసుల జాడనే లేనట్లు, యాదో మూసుకొచ్చినట్లు, ఇంకేందో కమ్ముకొచ్చినట్లనిపిచ్చింది లచ్చువమ్మకు.
బంకుల్ల కందిరీగె గుయ్యిమని అనుకుంట ఇల్లంత తిర్గుతున్నది. ఆలుమగలు గాకుండ పిట్టె పీసు ఇంగెవరూ కాన్రాలె.
పీటె మీద కూసున్న పటేలు, రెండు బుజాల నడ్మ తలకాయి ఇరికిచ్చుకొని న్యాలసూపులు సూస్తున్నడు. అవుతలి మూల భవంతుల పడమటింటి గోడకానుకొని కాల్లుసాపుకొని కూసోని, ఇంకేడనో సూపులు తగిలిచ్చింది పటేలమ్మ.
“అన్నాలు తిన్నరా పటేలమ్మా,” అరుసుకున్నది.
యాడ్నో యాలాడేసిన కండ్లను మల్ల తగిలిచ్చుకోని గుడ్లను మిటకరిచ్చింది పటేలమ్మ.
ఈతసాపలున్న పూలను ఒకసారి సూసి పని సుదురాయించుకున్నది. ఉప్పుపువ్వుని కట్టలు కట్టి, కాడలు కత్తిరిచ్చింది. ఆటిని నీలిరంగులు, ఎర్ర రంగులల్ల అద్దింది. గునుగుపూలను కట్టలు కట్టింది. ఒక్కతీరు బంతులను ఒక్కదగ్గెర్కి చేసింది. పెద్ద ఇత్తడి తాంబాళంల బతుకమ్మను పేర్సుడు షురూజేసింది.
అడుగున తామరాకులేసి పెద్ద బతుకమ్మను పేర్వవట్టింది. బతుకమ్మ పొట్టల ఆముదపాకులు, గుమ్మడి ఆకులనేసి సదిరి నింపింది. బతుకమ్మ పొట్ట ఎంత బిగ్గెరగ నింపితే అంత సక్కదనంగ బతుకమ్మ కుదురుతది. వర్సకోరకం పూలు, రకానికో రంగు పూలు ముద్దుగ అమిరింది. రెండు వర్సలకో వర్స సీతమ్మ జడలతోని అల్లింది. తొమ్మిది పూల వొర్సల బతుకమ్మ, సక్కగ అమిరిన బతుకమ్మ, ఇంతెత్తు బతుకమ్మ, నిండు ముత్తైద తీరు బతుకమ్మ, నిలువెత్తు బతుకమ్మ, సక్కదనాల బతుకమ్మ, సొంపైన బతుకమ్మ. పెద్దగ పేర్సిన బతుకమ్మను పూలదారంతోటి బిగ్గెతగ, దగ్గెర్కి బిగిచ్చి కట్టింది. సూసి మురిసింది పటేలమ్మ, చేసి మురిసింది లచ్చువమ్మ.
ఇంకో తప్కుల సిన్న తోడుబతుకమ్మను పేర్సింది. రెండింటి మీద, తామరపూలనువెట్టి ఇంకింత ముద్దుగ తయారుచేసింది.
పక్కింట్ల ఆడుకుంటున్న పోరన్ని ఇంటికి వంపి మరిదిని పిలిపిచ్చింది. దర్వాజలకు, గన్మలకు బంతిపూలు మామిడాకులు కట్టిపిచ్చింది.
యాలపొద్దైతున్నదని పట్టువట్టి పటేలమ్మను మొకం కాల్జేతులు కడిగిపిచ్చి, పట్టుసీర కట్టుకున్నదాంక ఇడిసిపెట్టలేదు లచ్చువమ్మ.
ఆకిలి మల్లొకసారి ఊడ్సినట్లు జేసి నీళ్ళు జల్లింది, పెద్దర్వాజ ముంగల పొద్దుగాల అలికిన దానిమీద మల్లొకపాలి అలికి పచ్చవిండి, ముగ్గువిండితోని ముగ్గులేసి, పీటేసింది, దానిమీద పెద్దబతుకమ్మను, తోడుబతుకమ్మను కూసోవెట్టింది. నైవిద్యం పెట్టింది, మంగళారతులు ఎలిగిచ్చింది, ఊదుబత్తులు ముట్టిచ్చింది. సుట్టుపక్కల పటేలమ్మలను పేరుపేర్నా పిల్సింది బతుకమ్మను ఆడనీకంటాని. సుట్టుపక్కలున్న పిల్ల జెల్లా, చిన్నా చితక, ముసలీ ముతక అందరు ముద్దుగ తయారయ్యి ఒచ్చి పటేలమ్మ ఆకిట్లున్న బతుకమ్మ సుట్టూ సప్పట్లు కొట్టుకుంట పాటలు పాడిండ్రు, ఆటలు ఆడిండ్రు. పటెలమ్మ మొకం ఇంకింత సిన్నవొయ్యింది. ఓ దాపున ఆళ్ళంత ఆడుతుంటే సూస్కుంట నిలవడ్డది లచ్చువమ్మ. అందరితొటి బతుకమ్మ ఆడుతున్న పటేలమ్మను సూస్తే పాణం కిందమీదయింది లచ్చువమ్మకు. ఆమెను ఎట్ల బుల్గరియ్యాల్నో, ఎట్ల సంజాయించాల్నో అర్తం కాలేదు.
రెండు మూడు పాటలు పాడినంక నడూర్ల కచ్చీరు కాడికి కొంచవోయిండ్రు బతుకమ్మలను. ఊరు ఊరంత ఆడ్నే ఉన్నరు. ఆడ ఆడోళ్ళంత సుట్టుజేరి నడ్మ బతుకమ్మలను పెట్టి కలిసి మెలిసి ఆడిపాడిండ్రు.
ఊరంతటికి పెద్ద ముత్తైద రాములక్క, సుట్టుముట్టున్న ఆడివోరల నడ్మ చేరి, బతుకమ్మలతోటి పెద్ద బతుకమ్మ తీర్గ నిలవడి ఎక్కడెక్కడి పాటలో యాజ్జేసుక పాడీ పాడీ, పాటల తీర్గ పాదం దరువు ఏపిచ్చి, అందర్ని ఎగిరిదుంకిపిచ్చి బతుకమ్మ పండ్గను మల్లొకపాలి బతికిచ్చింది.
పొద్దువొయ్యిందాంక అందరు ఆడి ఊరుముంగలున్న ముత్యాలమ్మ కుంటల బతుకమ్మలను సాగనంపి, పలారాలు పంచుకొని ఒచ్చిండ్రు.
మిల్గిన తాంబాళం, తప్కులను పటేలమ్మకు అప్పజెప్పి ఇంటికి మల్లింది లచ్చువమ్మ. పటేలమ్మను గట్ల సూస్తే గుండె చెరువయ్యింది ఆమెకు. మనసు మనసుల లేదు. పండుకున్నప్పుడు తప్ప, పొద్దుందాంక పటేలమ్మతోటే సోపతి. ఇద్దరు ఇంకో ఊరికెల్లి ఈ ఊరికి మెట్టినోళ్ళేనాయె. దగ్గెర దగ్గెర కొంచెం అటూ ఇటూ ఒక్కపాలే లగ్గమయి ఈ ఊర్ల కాలువెట్టిండ్రు. బాధలు పంచుకున్నరు, దాపరికం లేకుండ సుకదుఖాలు ఇచ్చిపుచ్చుకున్నరు.
పటేలమ్మ మొకంల ధుఖం సూడలేకున్నది లచ్చువమ్మ. ఎండసెగకు యాలాడవడ్డ కోయిగూర కాడ తీర్గ కిందమీదయింది. కాళ్ళీడ్సుకుంట, రెప్పలు కిందికి వాలంగ, ధుఖం నెత్తిమీద వెట్టుకోనొచ్చిన లచ్చువమ్మను సూసి ఇంట్లున్నోళ్ళు గూడ ఇదయిండ్రు. ఆమెను సుట్టుముట్టి నగిపిచ్చిండ్రు. జానెడు ఎత్తు పేర్సిన బతుకమ్మ సుట్టు ఎవరెవరు ఎట్లాడిన్రో తీర్లు తీర్లుగ సెప్పి యాది మరిపిచ్చిర్రు.
మొగడు, మరిది, కొడుకు, అల్లుడు, ఆడిబిడ్డె, ఆడివిల్ల, యారాలు, కోడలు, మనుమండ్లు, మన్మరాండ్ల నడ్మ కూసోని ఆళ్ళ మాటలినుకుంట, చ్యాష్టలు సూసుకుంట కండ్లనీళ్ళు కారంగ సంబరవడ్డది లచ్చువమ్మ.
“మనందరం మంచిగున్నం, ఒక్కతానున్నం, గిది పండ్గ చేసుకొనే మోక, గీ మోకల ఎవలన్న గిట్ల కండ్ల నీళ్ళు వెట్టుకోని ఏడుస్తరా,” అంటాని పాయిరంగ మందలిచ్చింది యారాలు. అందరు తలోమాట మాట్లాడి ఆమెను కుదార్తంజేసే ఉపాయం చేసిండ్రు. ఆళ్ళేసే ఏషాలకు కడుపునిండ నగుకుంట అన్నది లచ్చువమ్మ.
“నేను బాగనే ఉన్న, నావోళ్ళంత నా సుట్టే ఉన్నరు, ఇంతకంటేంగావాలె గని, ఆ పటేలమ్మను సూస్తె ఎదమీద బండరాయిని పెట్టుకున్నట్లే గొడ్తది, మెడమీద కాడి మోసినట్లుంటది, పండ్గకు ఆడివిల్ల అల్లుడు రాకపాయె, కొడుకు కోడలు రాకపాయె, ఆడిబిడ్డెలు మల్ల మళ్ళి సూడక పోయిరి, ఆయనన్నదమ్ములు కరువయ్యిరి,” అని దీర్గాలు తీసుకుంట కడవెత్తిపోసుకున్నట్లు కండ్ల నీళ్ళు కార్సింది లచ్చువమ్మ పటేలమ్మను తల్సుకొని.
అప్పటిదాంక ఆకిట్ల అరుగుమీద కూసోని ఇదంత ఇంటనే ఉన్న లచ్చువమ్మ మొగడు ఇంట్లకడుగువెట్టి, గన్మలనే గొంగడేసుకొని దాని మీద ముంగాల్ల మీద కూసోని, “మనందరం ఇట్ల ఒక్కతాన చేరి పండ్గసేస్కుంటున్నమంటే అది మనదృష్టెం. నిజంగ మనదృష్టెం, మనకు భూముల్లేవు, జాయిజాదులు లేవు. గీ భూములకు ధరలొచ్చినంక ఆడిబిడ్డెలు పాలుపంచమని కేసులేస్తున్నరు, ఒక్క కడుపుల పుట్టినోళ్ళు పాలోల్లయ్యిండ్రు, ఆడివిల్ల లేదు మగ పోరడు లేదు అందరు లెక్కలకు లగాయించిండ్రు. మనకు ఆస్తులు లేనందుకే గిట్ల కలిసున్నమేమో, అయినా మనుసులను, మనసులను ఏరుజేసే ఆస్తులు లేకుంటనే నిమ్మలంగున్నది, తిన్నది పెయ్యినవడ్తున్నది,” అనుకుంట మీసాలు తిప్పిండు లచ్చువమ్మ మొగడు.
*
చిత్రం: చరణ్ పరిమి
గొప్ప కథ సర్..చక్కటి జీవద్భాష మీకు సారంగ వెబ్ పత్రకకు శుభాభినందనలు
బతుకమ్మ పండుగ పూట తెలంగాణ మాండలికంలో రాసిన కథ చదివితే కడుపునిండింది. ధన్యవాదాలు సార్
బగ్గ రాశినవ్ అన్నా… లచ్చువమ్మను కండ్లార సూడబట్టినట్టే, కోకాంచు బట్టుకొని బతకమ్మను తిర్గి సుసినాట్టే వుంది…
ఆస్తులున్నంత మాత్రాన పండగ సంబరం ఇంట్లో ప్రత్యక్షం కాదు. కలిసిపోయే మనసులు, పనులందుకునే మనుషులు, కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు… ఇవే నిజమైన ఆస్తులు. ఇవన్నీ లచ్చువమ్మ దగ్గరున్నాయి. అందుకే బతుకమ్మ సందడి ఆ ఇంట తాండవమాడింది. తెలంగాణ తీపిదనాన్ని, బతుకమ్మ సంబరాన్ని కథ పొడవునా పరవళ్లు తొక్కించిన కొట్టం రామకృష్టారెడ్డి గారికి అభినందనలు.