కుబ్జ రూపుడు, అష్ట వంకరల దేహం గలవాడు అయిన అష్ఠావక్రుడు జనకుడి కొలువులోకి ప్రవేశించగానే అక్కడి సభలోని వారంతా పగలబడి నవ్వారు. అతడు నేరుగా గొప్ప జ్ఞాని అయిన జనక మహారాజు వద్దకు వెళ్లి “నేను మీతో సంవాదం చేయదలచాను” అని చెప్పగానే ఆ సభలోని వారంతా హేళనగా పగలబడి నవ్వారు.
అప్పుడు జనకుడు అష్ఠావక్రుడితో “నువ్వు అంచుల వరకూ తైలం నిండిన చమురు దీపాన్ని శిరస్సుపై పెట్టుకుని, ఒక్క చుక్క తైలం కూడా ఒలికిపోకుండా నగరమంతా తిరిగి రాగలిగితే అప్పుడు నేను నీతో మాట్లాడతాను” అన్నాడు.
గొప్ప ఎరుకతో అసాధ్యమైన పనిని పూర్తిచేసి వచ్చిన అష్ఠావక్రుని గొప్ప జ్ఞానిగా గుర్తించిన జనకుడు స్వయంగా లేచి వెళ్లి సాదరంగా ఆహ్వానించి అతనితో సంవాదాన్ని కొనసాగిస్తాడు. ఆ సంవాదమే గొప్ప తాత్విక గ్రంథమైన అష్టావక్ర గీత. ఆ ఉత్కృష్టమైన సంవాదం ముగిసిన వెనువెంటనే జనకుడు అష్ఠావక్రుడికి శిష్యుడుగా మారుతాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ తాత్విక గ్రంథాలలో ఒకటయిన అష్టావక్రగీత సంభవించింది, సృష్టిలోనే అత్యంత పవిత్ర నదులుగా గౌరవించబడుతున్న గంగ – గందకి నదుల నడుమ విస్తరించిన మిథిల(వైదేహ) సామ్రాజ్యపు రాజధాని అయిన జనకపూర్ లోనే.
శుక్ల యజుర్వేదానికి భాష్యం గా ఉన్న శతపథ బ్రాహ్మణ గ్రంథంలో మైథిలి సామ్రాజ్య నిర్మాత వైదేఘ మాథవ జనకపూర్ రాజధానిగా మిథిల సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పబడివుంది.
గౌతమ బుద్ధుడు, 24వ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుడు జనకపూర్ లో కొంత కాలం నివసించారని అంటారు.
సుగౌలి ఒప్పందం ప్రకారం 1816లో నేపాల్ పాలకులు – బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాచీన మిథిల సామ్రాజ్యపు తూర్పు భాగం జనకపూర్ తో సహా నేపాల్ లో చేరింది. దక్షిణభాగం భారతదేశంలో చేరింది.
1910 లో ఓర్చా రాజ్యపు రాణి వృష భాను ఈ బృహత్ దేవాలయాన్ని సుమారు తొమ్మిది లక్షల నాణేల్ని వెచ్చించి అత్యంత భారీగా నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం కోయిరి హిందూ శైలిలో 15930 చదరపు అడుగుల విస్తీర్ణంలో గొప్ప పనితనంతో నిర్మించబడింది. ఈ దేవాలయానికి ఆనుకుని ఉన్న మంటపం ఉన్న చోట సీతారాముల వివాహం జరిగిందని అంటారు.
గొప్ప ఆకర్షక ప్రదేశంగా ఈ దేవాలయం యునెస్కో గురింపు పొందింది. జానకి మందిర్ లోని సీతారాముల విగ్రహాల ముఖాలలో, కళ్ళలో వివాహపు ఉద్విగ్నతను, ప్రేమను శిల్పి మలచిన తీరు అద్భుతం.
మట్టిలో దొరికినా జనకుడు సొంత కుమార్తెగానే తలచి పెంచాడు కాబట్టి సీత జానకి అయింది. మిథిల సామ్రాజ్యపు యువరాణి కాబట్టి మైథిలి అయింది.
ఇక ప్రాచీన కాలపు గొప్ప తత్వజ్ఞులైన స్త్రీలలో ఒకరైన గార్గి జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞం సమయంలో, సంవాదంలో పంతులందరూ ఓడిపోయినా, యాజ్ఞవల్కుడిని చివరి వరకు ఎదిరించి నిలిచింది జనకుని కొలువులోనే.
గార్గి యాజ్ఞవల్కుడికి సంధించిన రెండవ ప్రశ్న తో ముగిస్తాను.
“ఆకాశం పైన ఉన్నది
భూమి కిందన ఉన్నది
ఆకాశానికి భూమికి నడుమ ఉన్నది
భూత భవిష్యత్తు వర్తమానాలుగా పిలువబడే వాటితో వస్త్రంవలె నేయబడి ఉన్నది
ఏమిటి?”
*
Add comment